S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజ్యాంగమే రాచబాట..

ప్రపంచంలో ఏ రాజ్యాంగానికీ లేని విశిష్టత భారత రాజ్యాంగానిదే.. అందర్నీ కలుపుకుపోయే శక్తిని రాజ్యాంగమే ప్రసాదించింది. దేశ ప్రజల అఖండతను పరిరక్షిస్తూ, భారతీయులు సవాళ్లను ఎదురొడ్డి నిలిచేటట్టు తీర్చిదిద్దింది కూడా మన రాజ్యాంగమే. జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లుకాబోతోంది. ఈ సందర్భంగా మరోమారు రాజ్యాంగం గురించి విస్తృతమైన చర్చ మొదలైంది. దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య ఎవరు గొప్ప అనే సంఘర్షణ తలెత్తిన ప్రతిసారీ భారత రాజ్యాంగం స్పష్టమైన సమాధానం చెప్పింది. దేశానికి రాజ్యాంగమే సుప్రీం.. అదే పవిత్ర గ్రంథం. ప్రతి ఒక్కరూ దానిని అనుసరించాల్సిందే.. అనుకరించాల్సిందే.. అమలుచేయాల్సిందే.. విభిన్నమైన వైరుధ్యాలున్న ఈ దేశాన్ని సమ్మిళితంగా, సమిష్టిగా నడిపిస్తోంది రాజ్యాంగ ఔన్నత్యమే..
దేశవ్యాప్తంగా ఈ మధ్య పౌరసత్వ సవరణ చట్టంపై విస్తృతమైన చర్చ జరిగింది. ఈ చట్టాన్ని అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు స్పష్టం చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు అసెంబ్లీని సమావేశపరిచి చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేశాయి. కేంద్రం చేసిన చట్టాన్ని కాదనే అవకాశం మనదేశంలో ప్రత్యేక సందర్భాల్లో తప్ప రాష్ట్రాలకు లేదు.
దేశంలో ముందు ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో రాజ్యాంగ నిర్మాతలు ఏడు దశాబ్దాల క్రితమే ఊహించి రాజ్యాంగ రూపకల్పనలో అన్ని రకాలుగా జాగ్రత్తలూ తీసుకున్నారు. పార్లమెంటు చేసే శాసనాలకు, రాష్ట్రాల శాసనసభలు చేసే శాసనాలకు మధ్య ఉన్న వ్యత్యాసం, వైరుధ్యాన్ని కూడా రాజ్యాంగం వివరించింది. ఇంత స్పష్టత ఉన్నా కొన్ని రాష్ట్రాలు ఎడ్డమంటే తెడ్డమంటున్నాయి..
రాజ్యాంగమే సుప్రీం
విభిన్న జాతులు, సంస్కృతులు, ప్రాంతాలు, మతాలు, కులాలు, భాషల సంక్లిష్ట సమాజం భారతదేశం. ఏదో ఒక అంశంలో ఎపుడూ కేంద్రంతో రాష్ట్రాలు ఏదో ఒక ఘర్షణకు దిగుతుంటాయి. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, రాష్ట్రాలు ఎదురుతిరిగేందుకు అవకాశం లేకుండా రాజ్యాంగంలోనే పకడ్బందీ ఆంక్షలు కూడా పొందుపరిచారు. ముందుగా రాష్టప్రతి, గవర్నర్ అనుమతి లేకున్నా శాసనం చెల్లుబాటు అయ్యే అవకాశం అధికరణం 255లో ఉంది.. అంతే కాదు అధికరణం 256లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు, 257లో రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ గురించి కూడా ఉంది. జీఎస్‌టీ అమలు చేయాలని అప్పట్లో కేంద్రం నిర్ణయిస్తే చాలా రాష్ట్రాలు తొలుత వ్యతిరేకించాయి, తర్వాత అన్ని రాష్ట్రాలు గాడిలో పడ్డాయంటే దానికి కారణం రాజ్యాంగంలో సంలీనంగా ఉన్న ఆదేశ సూత్రాలేననేది సుస్పష్టం. రాజ్యాంగంలోని 11వ విభాగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వచించారు. అధ్యాయం -1లో శాసనాధికారాల విభజన గురించి ఉంది. అధికరణం 245లో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధి గురించి వివరించారు. అధికరణం 246లో కేంద్ర జాబితాను, రాష్ట్రాల జాబితానూ వివరించారు. అధికరణం 249లో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు చేసే అధికారాన్ని కూడా కల్పించారు.
రాజ్యాంగమే భారతదేశానికి భగవద్గీత, బైబిల్, ఖురాన్. అసలు రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అవసరం ఈ దేశానికి ఏమొచ్చింది? రాజ్యాంగం లేకుంటే ఏం జరుగుతుంది? రాజ్యాంగాన్ని అందరూ ఎందుకు ఆమోదించాలి? ఎందుకు పాటించాలి? అనే అనుమానాలు ఎవరికైనా ఇట్టే కలుగుతాయి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి, రాజ్యాంగానికి ఉన్న అనుబంధం ఏమిటనే అనుమానాలు కూడా కలుగుతాయి. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలి. అర్థం చేసుకోవాలి, లోగుట్టును తెలుసుకోవాలి.
దేశ జనాభా, కాలమాన పరిస్థితులు, ప్రాదేశిక, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా దేశాలు రాజ్యాంగాలు రూపొందించుకుంటాయి. రాజ్యాంగం అంటే దేశ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన చట్టాలు, నియమనిబంధనలతో కూడిన లక్ష్యపత్రం. వివిధ సంస్థలకూ, ప్రభుత్వానికీ, శాసనవేదికకు, న్యాయవ్యవస్థకూ, కేంద్రానికి, రాష్ట్రానికీ, స్థానిక సంస్థలకూ సంబంధాలను నిర్వచించి, నిర్ధారించేది రాజ్యాంగమే..
శతాబ్దాల పూర్వమే..
రాజ్యాంగం అనేది చాలా దేశాల్లో వౌఖికంగానూ, అఖితంగానూ కొనసాగుతోంది. మరికొన్ని దేశాల్లో కేవలం ఆచారాలు, ఆదేశాల ఆధారంగానే కొనసాగుతోంది. అత్యంత స్పష్టంగా, లిఖితపూర్వకంగా ఉన్న రాజ్యాంగం మనదే.. నైతిక విలువలు, కట్టుబాట్లు పరివర్తన చెంది రాజ్యాంగంగా రూపాంతరం చెందడానికి పెద్ద చరిత్రే ఉంది.
క్రీస్తుపూర్వం 2300 సంవత్సరంలోనే అప్పటి సమాజానికి ఒక నైతిక మార్గదర్శకం ఉండేదని ఆధునిక ఇరాక్‌లో జరిగిన తవ్వకాల్లో బయటపడింది. లాగాస్ నగరంలో సుమేరియన్ రాజు ఉరుకగిన ఈ నైతిక మార్గదర్శకాన్ని అమలుచేశారని పురావస్తు నిపుణుడు ఎర్నెస్టు డీ సార్జక్ నిర్ధారించారు. ఆ రోజుల్లో వితంతువులకు, నిర్భాగ్యులకు పన్ను విధించేవారు, అలాగే ధనవంతుల నుండి పేదవారిని కాపాడేందుకు నిబంధనలు ఉండేవి. లిఖిత పూర్వకంగా స్మృతిని రచించింది, అత్యంత పురాతనమైనదీ అని చెప్పాలంటే కోడ్ ఆఫ్ ఉర్ నమ్ము, కోడ్ ఆఫ్ లిపిత్ ఇస్తార్, బాబిలోనియాకు చెందిన కోడ్ ఆఫ్ హమ్మురబి. ఎథెన్స్ నగరానికి చెందిన పౌరకట్టుబాట్లును చిత్రలేఖకుడు డ్రాకో క్రీపూ 620లో తయారుచేశారు. క్రీపూ 6వ శతాబ్దంలోనే ఎథెన్స్ రాజు సోలన్ తన పేరిట సోలన్ రాజ్యాంగాన్ని రూపొందించారు. తర్వాత అనేక చట్టాలు వచ్చినా క్రీశ 430లో రోమన్ చట్టాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాతి అశోకుడు, వౌర్య రాజుల శాసనాలు అమలులోకి వచ్చాయి. మనస్మృతి తర్వాతి కాలంలో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి ఇతర భాషల్లోకి అనువదించబడింది. ఇంగ్లాండ్, జపాన్, అరబ్ దేశాల్లో అనేక రూపాల్లో శాసనాలు వచ్చాయి. 1017లోనే నేటి ఉక్రైయిన్‌లోని రాజు ప్రావ్దా ఎరోస్లావా రాజ్యాంగాన్ని రూపొందించారు. వాటన్నింటికీ క్రమానుగతం లేదు. ఆధునిక కాలంలో తొలి రాజ్యాంగం ఉత్తర అమెరికాలో 1639లో రూపొందించారు. ప్రజాస్వామిక రాజ్యాంగం అనో, జ్ఞానంతో రూపొందించిందనో చెప్పాలంటే ఉక్రెయిన్, క్రయోషియా దేశాలు రూపొందించాయి. 1788, జూన్ 21న అమెరికా రాజ్యాంగం రూపొందింది. పోలండ్‌లో రాజ్యాంగం 1791, మే 3 నుండి అమలులోకి వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్ 3 నుండి ఫ్రెంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1812లో స్పానిష్ రాజ్యాంగం, 1814 తర్వాత నార్వే, బ్రెజిల్, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్‌లలో రాజ్యాంగం ఏర్పాటైంది. 1867లో కెనడా సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ఇన్ని దేశాలు ముందుగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం వల్ల వీటిలో ఉన్న లోపాలను సరిచేసుకునే మహత్తర అవకాశం భారత్‌కు దక్కిందని చెప్పాలి.
ప్రజాస్వామ్యం అర్థవంతంగా, సుస్థిరంగా ప్రయోజనకరంగా నెలకొనడానికి, రాజ్యాధికారం దుర్వినియోగం కాకుండా ఉండటానికి విశిష్టతతో కూడిన రాజ్యాంగం తప్పనిసరనే సిద్ధాంతం శతాబ్దాల క్రితమే పాశ్చాత్య దేశాల్లో ప్రాబల్యం పొందిందని అర్థమవుతోంది.
రాజ్యాంగ నిర్ణయ సభ
బ్రిటిష్ పాలనను నిరసించి, భారత స్వాతంత్య్రం కోసం సుదీర్ఘపోరాటం జరిపి, అశేష త్యాగాలతో, అనుపమాన దీక్షతో, తిరుగులేని సంకల్పబలంతో పరాయి పాలన నుండి విముక్తి సాధించుకున్న ప్రజాబాహుళ్యం, భారత రాజ్యాంగ నిర్ణయ సభ సుదీర్ఘ చర్చల అనంతరం రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ దానిని సాధికార శాసనంగా చేసి తమను తాము అంకితం చేసుకున్న మహత్తర సన్నివేశం 1949, నవంబర్ 26న జరిగింది. భారత రాజ్యాంగం 1950, జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.
స్వాతంత్య్రాన్ని సాధించి, ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతర ప్రజాస్వామిక దేశాలను అనుసరించి మన నాయకులు, పాలకులు దేశానికి చక్కని రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం. ప్రభుత్వానికి మూల చట్టం. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఆచరణాత్మకమైన, సలక్షణమైన రాజ్యాంగాన్ని నిర్మించడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రపంచంలోని ప్రజాస్వామిక రాజ్యాంగాలను అన్నింటినీ అధ్యయనం చేసి వాటిలో మన దేశ పరిస్థితుకు సరిపడే అంశాలను జోడించి వాటిని మన రాజ్యాంగంలో తగిన చోట పొందుపరిచారు.
అనేక దేశాల సంప్రదాయాలు
ఏక పౌరసత్వాన్ని, పార్లమెంటరీ విధానాన్ని, స్పీకర్ పదవిని బ్రిటన్ నుండి, ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం అమెరికా రాజ్యాంగం నుండి, ఆదేశిక సూత్రాలు, రాష్టప్రతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల వివరాలను ఐర్లాండ్ నుండి, ప్రాథమిక విధులను రష్యా నుండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుండి, అత్యవసర పరిస్థితిని వైమర్(జర్మనీ)నుండి ఉమ్మడి జాబితా, పీఠికలో వాడిన భాషను ఆస్ట్రేలియా నుండి, గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్ నుండి దత్తత తీసుకున్నారు.
రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు
రాజ్యాంగం అమలులోకి రాకముందు, రాజ్యాంగ రూపకల్పనకు పెద్ద కసరత్తే జరిగింది. భారతదేశానికో రాజ్యాంగం ఉండాలని 1914లోనే గోపాలకృష్ణ గోఖలే డిమాండ్ చేశారు. 1934లో ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను వివరించారు. 1935లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ ఈ అంశాన్ని తీర్మానించింది. రాజ్యాంగ పరిషత్‌ను స్థాపించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1940లో అంగీకరించింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా 1946లో తొలిసారి రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. రాష్ట్రాల శాసనసభల నుండి 292 మంది, సంస్థానాల నుండి 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల నుండి నలుగురికి చోటు దక్కింది. మొత్తం 389 మందితో ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. వౌంట్ బాటెన్ 1947 జూన్‌లో చేసిన దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సంఖ్య 299కు తగ్గిపోయింది. ఫ్రెంచి నమూనాను అనుసరించి 1946 డిసెంబర్ 6న రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. రాజ్యాంగ సభ తొలి సమావేశం నేటి ఢిల్లీలోని పార్లమెంటు భవనం సెంట్రల్ హాలులో 1946 డిసెంబర్ 9న జరిగింది. సభను ఉద్దేశించి జేబీకృపలాని తొలి ప్రసంగం చేశారు. మొత్తం 211 మంది సభ్యులు హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలున్నారు. వారంతా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, వౌలానా అబుల్ కలాం అజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపలానీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్ట్భా సీతారామయ్య వంటి వారు ఈ సభలో సభ్యులు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగానూ, హెచ్‌సీ ముఖర్జీని ఉపాధ్యక్షుడిగానూ, బీఎన్ రావును రాజ్యాంగ న్యాయ సలహాదారుడిగా నియమించారు. అదే ఏడాది డిసెంబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాలను వివరించారు. తర్వాత అదే రాజ్యాంగానికి ప్రవేశికగా మారింది. 1947 జూలై 22న జాతీయ పతాకాన్ని నిర్ధారించారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించిన వెంటనే ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని నియమించారు. ఆ కమిటీలో మహ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, ఖైతాన్, మిట్టర్‌లు సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుమారు 60 దేశాలు పర్యటించి, అక్కడ ఉన్న రాజ్యాంగాలను అధ్యయనం చేసి అందులోని అంశాలను వడపోసి భారత రాజ్యాంగానికి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత ఎన్నో చర్చలూ, వాదనలు అనంతరం రాజ్యాంగం ఒక రూపాన్ని సంతరించుకుంది. అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షడిగా వ్యవహరిస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి, భారతీయుడు బెంగాల్ నర్సింగరావు (బీఎన్‌రావు) సేవలను కూడా రాజ్యాంగ రూపకల్పనలో తీసుకున్నారు.
ముసాయిదా కమిటీలు, సబ్ కమిటీలు
రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా 19 కమిటీలను కూడా నియమించారు. రాజ్యాంగ సారథ్య సంఘానికి, స్ట్ఫా- ఫైనాన్స్ కమిటీకి, జాతీయ జండా అడ్‌హక్ కమిటీకి, నియమనిబంధనల కమిటీకి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, ముసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ సలహా సంఘానికి , ప్రాథమిక హక్కుల కమిటీకి, అల్పసంఖ్యాక వర్గాల కమిటీకి, రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి జేబీ కృపలానీ, కేంద్ర రాజ్యాంగ కమిటీకి, కేంద్ర అధికారాల కమిటీకి జవహర్‌లాల్ నెహ్రూ, సుప్రీంకోర్టు సన్నాహక కమిటీకి వరదాచారి, బిజినెస్ కమిటీకి కేఎం మున్షీ, ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి గోపీనాథ్ బోర్డు లాయిడ్, హౌస్ కమిటీకి భోగరాజు పట్ట్భా సీతారామయ్య, పార్లమెంటరీ నియమనిబంధనావళి కమిటీకి జీవీ వౌలాంకర్ చైర్మన్లుగా వ్యవహరించారు.
వేల ప్రతిపాదనలు
స్వతంత్ర భారతా రాజ్యాంగ నిర్మాణానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ 11మార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగ రాతప్రతిపై వెచ్చించింది. రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2437 ప్రతిపాదనలను పరిశీలించి చర్చించి పరిష్కరించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న 284 మంది సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు చేశారు. రాజ్యాంగంపై సంతకాలు చేసిన రోజున బయట చిరుజల్లు పడుతూనే ఉంది. దీనిని శుభశకునంగా భావించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952 జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు తర్వాత కొత్తగా పార్లమెంటు ఏర్పడినంత వరకూ ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.
రాజ్యాంగ నిర్మాణ సభ చిహ్నం ఏనుగు. అంటే ఏనుగు మాదిరే మన రాజ్యాంగం సైతం చాలా విస్తృతమైంది. ఆనాటి దేశ రాజకీయ సాంఘిక పరిస్థితులు పెద్ద రాజ్యాంగానికి దారితీశాయి. భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, భాషలు, సాంఘిక, రాజకీయ వ్యవస్థల సమన్వయాన్ని సాధించడం రాజ్యాంగ నిర్మాతలకు లక్ష్యం కావడంతో రాజ్యాంగం విస్తృత రూపాన్ని పొందక తప్పలేదు.
బ్రిటిష్ చట్టాలే తొలి ఆధారం..
బ్రిటిష్ పాలనా కాలంలో అమలులో ఉన్న చట్టాలు యథాతథంగా కొత్త రాజ్యాంగంలోకి వచ్చాయి. 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా భాగాలను కొత్త రాజ్యాంగంలో పొందుపర్చడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు. దానికి సమాధానంగా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్ 1935 చట్టం నుండి తీసుకున్న విషయాలు, పాలనా వివరణకు సంబంధించినవి కనుక దానికి విచారించాల్సిన పనే్లదని చెప్పారు. సాధారణంగా పాలనా వ్యవహారాలను రాజ్యాంగంలో పొందుపర్చడం జరగదు. పాలనా వివరాలు ఆచరణలో ధృడంగా ఉండటం మంచిది. రాజ్యాంగ నిర్మాణ సమయంలో ప్రజల్లో సాంఘిక స్పృహ, రాజకీయ చైతన్యం తక్కువ స్థాయిలో ఉండటంతో పాలనా పద్ధతులను కూడా వివరంగా పేర్కొనాల్సి వచ్చింది. ప్రజాస్వామిక వ్యవస్థలో అనుభవం లేని దేశంలో పాలనా పద్ధతులను తమ ఇష్టానుసారం శాసనసభలు రూపొందించకుండా ఉండటం కోసం పాలనాపద్ధతులను వివరంగా పేర్కొన్నారు. ఎవరి పరిమితులు ఏమిటనేది స్పష్టం చేశారు.
లౌకికవాదం, సామ్యవాదం
భారతదేశం రిపబ్లిక్ విధానాన్ని అనుసరించి సర్వసత్తాక ప్రజారాజ్యంగా జాతి, మత, కుల, వర్ణ వివక్ష లేక సమాన హక్కులున్న ప్రజలతో కూడిన రాజ్యాంగంగా ఏర్పడింది. ప్రజల శ్రేయస్సు కోసం ప్రజాభిమానాన్ని అనుసరించి ప్రజల యోగక్షేమాలను పెంపొందింప చేసే పరిపాలనా విధానాన్ని ఏర్పరచే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, సామ్యవాదం అనే మాటలు ఇందులో చేర్చారు. అంటే ప్రస్తుతం దేశం సర్వసత్తాక సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అని అర్థం. సర్వ సత్తాక అనడంలో మన దేశం మీద ఏ ఇతర రాజ్యానికీ ఎలాంటి అదికారం లేదని స్పష్టం చేయడం. ఇతర దేశాల్లో సాధారణంగా ఉండే సంబంధ బాంధవ్యాల వల్ల మన దేశ సర్వస్వామ్యానికి ఎలాంటి నష్టం, కష్టం కలగదని స్పష్టం చేయడం. రాజ్యాధికారం రాజు చేతిలో లేని రాజ్యం కనుక మనది ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం. పరిమిత కాలం పాటు రాజ్యాన్ని పాలించే పాలకులను ప్రజలే ఎన్నుకుంటారు పాలకులను ప్రజలు తొలగించాలనుకుంటే శాంతియుతంగా ఎన్నికల ద్వారా తొలగించి వారి స్థానంలో ఇతరులను ఎన్నుకుంటారు. పాలకుల చర్యలను స్వేచ్ఛగా విమర్శించగల హక్కు ప్రజలకు ఉంది. ప్రాథమిక హక్కుల ద్వారా వ్యక్తి వికాసానికి, సంఘ శ్రేయస్సుకు అవసరమయ్యే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ప్రజలకు ఇచ్చారు.
భారత రాజ్యాంగంలో కొన్ని వౌలిక లక్షణాలున్నాయి. సర్వస్వామ్యంతో కూడిన ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా కొనసాగడం, లిఖితపూర్వక రాజ్యాంగం, సమాఖ్య రాజ్యాంగం, బాధ్యతాయుతమైన ప్రభుత్వం, శ్రేయోరాజ్యం, లౌకికరాజ్యం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు వంటి స్పష్టమైన విధి విధానాలను రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం.
బ్రిటిష్ పాలనా వ్యవస్థతో మనకున్న విస్తృత అనుభవం, అవినాభావ సంబంధ బాంధవ్యాల వల్ల మన రాజ్యాంగంలో ముఖ్యమైన భాగాలు బ్రిటిష్ రాజ్యవిధానాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, సమాఖ్య రాజ్య పద్ధతులకు మూలం అమెరికా రాజ్యాంగం. సమాఖ్య రాజ్యాన్ని కెనడా రాజ్యాంగం అనుసరించి, రాష్ట్రాల యూనియన్‌గా ఏర్పరచడంలో దక్షిణాఫ్రికాను అనుసరించడం జరిగింది. ఆదేశ సూత్రాలు, రాష్టప్రతి ఎన్నిక, రాజ్యసభ నామనిర్దేశం మొదలైన అంశాల్లో స్పెయిన్, ఐర్లాండ్ రాజ్యాంగాలు మార్గదర్శకాలయ్యాయి. జర్మనీ రాజ్యాంగం అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాల రూపకల్పనను ప్రభావితం చేసింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగ పద్ధతిని రాజ్యాంగ సవరణకు సూచనగా తీసుకోవడం జరిగింది.
భారతదేశానికి రాజ్యాంగ రీత్యా అధిపతి రాష్ట్రపతి , దేశానికి రాష్టప్రతి అధిపతి అయితే రాష్ట్రాలకు గవర్నర్లు అధిపతులు. రాష్టప్రతికి ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం, పార్లమెంటు వ్యవహరిస్తాయి. కేంద్రంలో ప్రధానమంత్రికి ఉన్న స్థానం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్టప్రతి, గవర్నర్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వారి ఎన్నిక, విధులు, బాధ్యతలతో పాటు పార్లమెంటు,
ఇతర చట్ట సభలు , సుప్రీంకోర్టు, హైకోర్టులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్ సర్వీసు కమిషన్లు, రాజ్యాంగ సంస్థలు గురించి రాజ్యాంగంలో సవివరంగా పొందుపరిచారు.
వౌలిక స్వరూపమే వెన్నుముక
దేశంలో ఏ చట్టమైనా రాజ్యాంగ వౌలిక స్వరూపానికి లోబడి రూపొందించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో సుస్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు పలు అంశాల్లో విబేధించినపుడు తదనుగుణంగా రాజ్యాంగంలోనే సవరణలు చేసుకుని దానిని సుప్రీంకోర్టు ముందు తమ వాదనలను వినిపించి ఆమోదించుకోవల్సి ఉంటుంది. దేశానికి సర్వోన్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు సైతం సుప్రీం దేశ రాజ్యాంగం.
రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నందున పాలనవ్యవస్థలోని ప్రతి ఒక్కరూ మినహాయింపు లేకుండా పాలకుల నుండి ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి ఉద్యోగి వరకూ ఈ రాజ్యాంగ లక్ష్యాలను, ఆదర్శాలను అనుసరించాల్సి ఉంటుంది. అనునిత్యం ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాల ముసాయిదాలు తయారుచేసే ప్రక్రియలో ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవుతారు. కనుక భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
కాలానుగుణంగా సవరణలు
ప్రతి ఏటా లక్షల రిట్లు వివిధ కోర్టుల్లో దాఖలవుతున్నాయి. అందులో 90 శాతం రిట్లు ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేవని పేర్కొన్నవే. రాజ్యాంగం గురించి అవగాహన ఉంటే శాసనాల రూపకల్పనలో తమదైన అనుభవాన్ని జోడించి శాసనాలను నిర్దుష్టంగానూ, నిర్దిష్టంగానూ తయారుచేయడానికి వీలవుతుంది. అందుకు ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ పరిజ్ఞానం అవసరం. తొలుత 392 అధికరణాలున్న రాజ్యాంగం గత 69 ఏళ్లలో ఎన్నో మార్పులు చేర్పులకు నోచుకుంది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో కొన్ని రాజ్యాంగ సవరణలు జరుగుతుంటాయి. మరికొన్ని రాజ్యాంగ సవరణలు సగానికి పైగా రాష్ట్రాలు సైతం ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణలు జరిగినా కొన్ని చట్టాలుగా రూపొందవు. అంటే రాజ్యాంగ సవరణలు సంఖ్య, రాజ్యాంగ సవరణల చట్టాల సంఖ్య ఒకే మాదిరి ఉండవు. దీనిపై ఎలాంటి అయోమయం అవసరం లేదు. 101వ రాజ్యాంగ సవరణ జీఎస్‌టీకి సంబంధించింది. 102వది బీసీ నేషనల్ కమిషన్‌కు ఉద్దేశించింది. 103వ సవరణ ఈడబ్ల్యుఎస్‌కు సంబంధించి చేసింది. ఇంత వరకూ 127 రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించారు. రాజ్యాంగం 22 విభాగాలుగా, 395 అధికరణాలతో 12 షెడ్యూళ్లుగా విస్తృతం అయ్యింది. రాజ్యాంగ సవరణలు జరిగినా కొన్ని చట్ట రూపాన్ని సంతరించుకోలేకపోయాయి. రాజ్యాంగంలో తొలి సవరణకు 1951 జూన్ 18న రాష్టప్రతి ఆమోదం లభించింది.
పార్లమెంటరీ పద్ధతులు
అమెరికా అధ్యక్ష పద్ధతిని, స్విట్జర్లాండ్‌లోని కాలేజీయేట్ ప్రభుత్వ పద్ధతిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత రాజ్యాంగ నిర్మాతలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతులను ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో కారణం 1919 నుండి కొంత వరకూ, 1935 తర్వాత చాలా వరకూ పార్లమెంటరీ పద్ధతిలోనే దేశ పాలన సాగడంతో ఆ విధానానికే పాలకులు, ప్రజలు అనుభవం పొంది ఉండటం మరో కారణం. అధికార నిర్వహణలో రాష్టప్రతికి సలహా ఇవ్వడానికి సహాయ పడటానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండే మంత్రివర్గం అందుబాటులో ఉంటుంది. మంత్రివర్గం లేకుండా మంత్రివర్గం సలహా లేకుండా రాష్టప్రతి ఏ పనీ చేయలేరు. ఒకవేళ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. మంత్రివర్గం పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్‌సభలో అధిక సంఖ్యా బలం ఉన్న పక్షానికి నాయకుడే ప్రధానమంత్రి అవుతారు. మంత్రులను తన పక్షం నుండి ప్రధానమంత్రి నియమిస్తారు. అధిక సంఖ్యాబలం ఉన్నంత వరకే ప్రధానమంత్రి, ఇతర మంత్రులు అధికారంలో కొనసాగగలుగుతారు.
ప్రపంచంలో రాజ్యాంగాల్లో భారతరాజ్యాంగం చాలా పెద్దదని, అమెరికా రాజ్యాంగం చాలా చిన్నదని అంటారు. అలాగే కేవలం ఆచారాలు, సంప్రదాయాలపైన ఆధారపడి లిఖిత రూపంలో కాకుండా అలిఖిత రాజ్యాంగం ఉన్న దేశం ఇంగ్లాండ్ ఒక్కటే. సామాన్య చదువు సంధ్యలున్న వాళ్లు కూడా తేలికగా అర్థం చేసుకుని స్వయంగా వాదించుకోవడానికి వీలయ్యేది స్వీడిష్ రాజ్యాంగం అని నిపుణులు చెబుతుంటారు. అమెరికా రాజ్యాంగాన్ని అనేక ఇతర దేశాల రాజ్యాంగాలు అనుసరించినా, క్లుప్తీకరణలో అవి విఫలమయ్యాయి. ఫ్రెంచివాళ్ల మధ్య ఒక జోకు ప్రచారంలో ఉంది. నెపోలియన్ ఫ్రాన్స్‌కు అధినేతగా ఉన్నపుడు తన ప్రసిద్ధ రాజకీయ సలహాదారుడైన టెలీరాండ్‌తో మాట్లాడుతూ ఫ్రాన్స్‌కు రాజ్యాంగం అవసరం అయితే అది చాలా చాలా క్లుప్తంగా ఉండాలని అన్నాడనే జోకు ప్రచారంలో ఉంది. అయితే అందుకు టెలిరాండ్ జవాబిస్తూ దేశవాళీ చమక్కుతో అయ్యా, నిజానికి రాజ్యాంగం అంటే కొండవీటి చాంతాడంత పొడవుగా, అస్పష్టంగా ఉంటే తప్ప మన పనులు జరగవు అని చెప్పాడంట. ఆయన ఏమని చెప్పాడో కానీ భారత్‌లో జరుగుతున్నది అదే...
ప్రవేశికే హృదయం
రాజ్యాంగం తొలి పుటలోనే ప్రస్తావన ఉంటుంది. ‘‘్భరతదేశ ప్రజలైన మేము.. 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని మాకు మేమే సమర్పించుకుంటున్నాం... ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామిక గణతంత్రంగా ప్రకటిస్తున్నాం, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కింది సౌలభ్యాలను కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది- సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటే స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో దేశ సమైక్యతను, అఖండతా భావాన్ని , సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం కొసం ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం’’ అని పేర్కొని ఉంటుంది. మొత్తం రాజ్యాంగాన్ని రంగరించి, వడపోస్తే వచ్చే వ్యాఖ్యలివి. ఇందులో అర్థం మొత్తం ఉంది.
నందాలాల్ బోస్ స్వీయ లిఖిత గ్రంథం
రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగాన్ని ప్రజలు తమకు తామే సమర్పించుకున్న దరిమిలా విశ్వభారతిలోని శాంతినికేతన్ కళాకారులు ప్రముఖ చిత్రకారుడు నందాలాల్ బోస్ నేతృత్వంలో చక్కని రాతప్రతిని సిద్ధం చేశారు. రాష్టప్రతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రధాన జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఆనాటి నేతలు ఆ ప్రతిపై తమ చేతిరాతతో సంతకాలు చేశారు.
ఘనకీర్తి
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ, విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ఉన్న ఘనకీర్తి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఖ్యాతి చెందిన భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని, తమకు నచ్చిన నేతనే ఎన్నుకునే మహద్భాగ్యం ఈ రాజ్యాంగంతోనే వచ్చింది. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం, ప్రభుత్వానికి మూల చట్టం.
వ్యక్తుల్లో ఆదర్శాలుండాలి
రాజ్యాంగ లక్ష్యాల ప్రాశస్త్యం అనేది దానిని అమలుచేసే పాలనావ్యవస్థల మీద, అంటే అమలుచేసే మనుష్యుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని డాక్టర్ అంబేద్కర్, పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అనేక మార్లు నొక్కి వక్కాణించారు. ఈ నూతన రాజ్యాంగం కింద పరిస్థితులు వక్రమార్గం తొక్కాయంటే ఆ అపరాధం రాజ్యాంగానిది కాదు, రాజ్యాంగాన్ని అమలుచేసే వ్యక్తుల వల్ల మాత్రమేనని అంబేద్కర్ పేర్కొన్నారు. రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే అది నవనవోనే్మషంగా ఉండాలి. దేశ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా వొదిగేదిగా ఉండాలి. సరళంగా ఉండాలి. మార్పులకు సిద్ధంగా ఉండాలి. సమాజ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాజ్యాంగం కూడా మారాలి. తగిన మార్పులకు సిద్ధంగా ఉండాలని ఆనాడే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్ణయ సభ సమాపక సమావేశంలో సభాధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ ‘‘రాజ్యాంగం అనేది ఎలా ఉన్నా.. అది దేశాన్ని పాలించే వ్యక్తులపై, దాన్ని పాలించే తీరుతెన్నులపై ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఆ వ్యక్తులు నిజాయితీపరులై ఉండాలి, వారికి దేశ ప్రయోజనాలు తప్ప మరో యావ ఉండరాదు’’ అని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆ మాటలను మననం చేసుకుంటేనే అంతా సన్మార్గంలో వెళ్లేందుకు, భారతదేశానికి దివ్యమైన భవిష్యత్‌ను అందించేందుకు, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను సాక్షాత్కారం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆ దిశలోనే ప్రభుత్వాలు కదలాలనీ, కదులుతాయని.. సగటు భారతీయుడి ఆశ. *
*
ముసాయిదా కమిటీలు
*
ప్రాధమిక హక్కులు సర్దార్ వల్లభాయి పటేల్
రాష్ట్రాల కమిటీ సర్దార్ వల్లభాయి పటేల్
నిబంధనల కమిటీ డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
స్టీరింగ్ కమిటీ డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
ప్రాధమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపలానీ
డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్
ఈశాన్య రాష్ట్రాల కమిటీ గోపీనాధ్ బార్డోలీ
మైనార్టీల కమిటం ఎస్ వరదాచారి
కేంద్ర రాష్ట్రాల అధికారాలు,
కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్‌లాల్ నెహ్రూ
ఆర్ధిక , సిబ్బంది కమిటీ బాబూ రాజేంద్ర ప్రసాద్
జాతీయ పతాకంపై అడ్‌హాక్ కమిటీ రాజేంద్ర ప్రసాద్
ప్రాధమిక హక్కులు వల్లభాయిపటేల్
రాజ్యాంగ సభ పరిమితులు జీవీ వౌలాంకర్
సభా కమిటీ భోగరాజు పట్ట్భా సీతారామయ్య
ఆర్ధిక అంశాలపై సబ్ కమిటీ నళినీ రంజన్ సర్కార్
లింగ్విస్టిక్ ప్రావినె్సస్ ఎస్ కే థార్

- బి.వి. ప్రసాద్ 9963345056