S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ ‘ముఖాముఖి’ మధురస్వప్నం! (93)

అధే కనుక ఫ్లాప్ అయితే అటు తర్వాత అపారంగా నాకు, నా కెరీర్ మీద ఏర్పడ్డ కాన్ఫిడెన్స్ నీరుగారిపోయి ఉండేది. డైలీలో కూడా, దురదృష్టవశాత్తు, అది ఆగిపోయేదాకా, వీక్లీలో కన్నా ఎక్కువకాలం, అహర్నిశలూ పనిచేసినా, నా మీద పాఠకులలో ‘వీక్లీ’ ముద్రయే మిగిలింది!
1964, ఏప్రిల్‌లో ఆరు రోజులు.. ఇంటా, బయటా, సెట్స్ మీదా సాగిన ఆ ఇంటర్వ్యూలో ఎన్.టి.ఆర్. చెప్పిన ముచ్చట్లు అన్నీ ఇన్నీ కావు. వాటిని మేము రెండు వారాల పాటు రికార్డు చేసి పత్రికలో ప్రత్యేక ఫొటోలతో వేశాము. నాకే ఆశ్చర్యంగా ఉంది.. ఆ మొత్తం చదువుతూంటే.. అయితే క్లుప్తంగానే అందులో నుంచి కొన్ని అంశాలను ఇక్కడ ఉటంకిస్తాను.
చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంటి నిండా కంబరామాయణం మొదలు వాల్మీకి రామాయణం వరకూ ఎన్నో గ్రంథాలు.. ‘మనదేశం’ సినిమాతో తెరపైకి వచ్చి- మనదేశంలో ప్రేక్షక ఆదరణ దోచుకుని శిఖరాగ్ర నటుడైన రామారావుతో సాగిన ‘ముఖాముఖీ’ని పాఠకులకు అందించాము. నేను కొన్ని ఫొటోలు అభ్యర్థిస్తూ సూచనలు ఇస్తూ ఉంటే.. ఆ మహానటుడు నన్ను తన బెడ్‌రూములో శయ్యమీద ఎదురుబొదురుగా పరుండి తన రామాయణ స్క్రిప్టును చర్చించుతూ, ఫొటోలు తీయించుకున్నాడు. రామ, రావణ పాత్రలను విశే్లషించిన ఎన్.టి. ఆర్. తెలుగు వాళ్లకే కాదు.. అందరికీ.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మాత్రమే కాదు.. రావణ బ్రహ్మ కూడా అయినాడు. తాను వెయ్యిరూపాయలు(నాటికి అది చాలా ఎక్కువ)తో.. కొనుక్కున్న కుర్చీలో దర్జాగా పోజులిస్తూంటే.. ఫొటోలు తీశాము గానీ, అదే కుర్చీమీద నన్ను కూర్చోబెట్టి.. ‘బ్రదర్! స్టడీ! నేను తీస్తాను స్నాప్’ అంటూ ఫొటో తీశాడాయన నాకు.
అదో సింహాసనం కుర్చీ. ఓ మూలకి వచ్చాను. నేను అంతలో అక్కడికి మహా దర్శకుడు బి. ఎన్. రెడ్డిగారొచ్చాడు. ఆయన ప్రక్కనే, నన్ను ‘యిలా’ చేరదీసుకుని కూర్చోబెట్టుకుంటే ఎన్.టి. ఆర్... ప్రభాకర్ చేతిలోంచి కెమెరా తానందుకుని ఫొటోలు తియ్యడం, మరపురాని మధురమైన జ్ఞాపకంగా వెంటాడుతోంది నన్ను.
సరే! ముఖాముఖీ నుంచి కోట్ చేస్తాను. తెల్లవారుజామున కోడి కూతకు ముందస్థుగా లేస్తే.. అర్ధరాత్రికి ఆహ్వానం పలికేవరకూ పనిచేసే ఈ హీరో మొహం నిగనిగలాడుతూ కళకళలాడుతూండడాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ఇంటి ముందు కార్లు ఆగడం అపురూపం కాదుగానీ.. ఎక్కువగా టూరిస్టు బస్సులు వచ్చి వాలుతూ ఉంటాయి. ఆ రోజు పాతిక నుంచీ యాభై దాకా ఉన్న ‘బృందాలు’ అటు బెంగళూరు నుంచి, యిటు శ్రీకాకుళం దాకా గల ప్రాంతాలకు చెందినవారు.. తమ అందాల నటుడిని చూసి పోదామని గడియారాలు చూడకుండా ఏ సమయపాలన లేకుండా వచ్చారు.
వాళ్ల రాముడు, వాళ్ల కృష్ణుడు, వాళ్ల అభిమాన నటుడూ అయిన ఈ అర్జునుడ్ని చూడటంతో, వాళ్ల మొహాల్లో తృప్తి వెలిగింది! ‘నందమూరి హవుస్’లో మొట్టమొదట మనల్ని ఆకర్షించేవి ఇంటి ముందు ఆవరణలోని మొక్కలు, దీపస్తంభాలు, వాటి మధ్య పిల్లలాడుకునే చిన్నపార్కు!
‘‘తీరిక సమయాలలో మీ హాబీ ఏమిటి?’’ అని అడిగితే.. ‘‘అసలు తీరికెక్కడ? ఉదయం మూడున్నర గంటలకు లేవడం, వ్యాయామం చేయడం, తైలమర్దనం, చన్నీళ్ల స్నానం, దైవ ధ్యానం, అక్కడ్నుంచి (సూర్యుడు లేచేసరికి) మేకప్‌కి వెళ్లిపోవడం. తిరిగి వస్తూనే ఉదయం 8.30 గంటలకే ఫక్తు శాకాహారం, పప్పు, పెరుగు, కూర, అన్నం మొదలైన మెనూతో భోజనం చేయడం, సెట్స్‌కి వెళ్లిపోవడం..
శ్రీ రామారావు వ్యాయామం, ఆసనాలు గట్రా వేసే గదిలో, ఇంతెత్తు ‘జాడీ’లు రెండున్నాయి. ఒకదానిలో కచ్చోరాలు, బావంచాలు, వట్టివేళ్ళు లాంటి ఘుమ్మైన వ్యవహారం తాసేసిన తైలం ఉంది. రెండోదాన్లో అసలు సిసలు పుట్టతేనె ఉంది. ఇది ఓసారి.. అది ఓసారి ఆఘ్రాణించేసరికి.. ‘మస్త్ మస్త్ బిన్‌పియే’గా కాస్త ‘నిషా’గా అనిపించింది నాకు. ‘తేనె’ అతని ముఖ్య ఆహారపదార్థాలలో ఒకటి. దానికి జోడు నిమ్మరసం.. ఈ రెండూ ప్లస్ క్రమశిక్షణాయుక్తమైన వ్యాయామం, దినచర్య మొదలైనవీ.. వెరసి పచ్చని నిండైన రుూ నటుని విగ్రహం అనుకుంటాను.
‘‘ఒకప్పుడు టీ తాగేవాణ్ని.. తాగడంలోనూ ఎక్కువగా.. అసలు ‘టీ’ తాగితేనే ఝామ్మని హాయిగా నిద్రవచ్చేది. కానీ ఇప్పుడు మానేశాను.. మూడు కప్పులు. అదీ గరిష్ట ప్రమాణం’’ అన్నాడాయన. కాఫీ తాగకపోవడం ఆయన దురలవాటు. ఏం చేస్తాం? పదహారు, పద్దెనిమిది సంవత్సరాల సంసారయాత్ర, నూట పాతిక చిత్రాల దిగ్విజయ యాత్ర గడిచిన.. రుూ వనె్న తరగని నటుని ‘అందం’లో యింకా ఏమైనా రహస్యం ఉండకపోతుందా? లేక.. మే 28, 1923.. అనే పుట్టినరోజు అబద్ధమేనా కాకపోతుందా.. అనే సంశయంతో.. ‘‘చిల్లరతిళ్లేమీ తినరా?’’ అనడిగాను. ‘‘మధ్యాహ్నం ఇంటికి వచ్చి.. రెండు సుఖా రొట్టెలు, కాస్త మాంసాహారం.. ఆ తర్వాత రాత్రి మరింకేమీ తినను’’.. తెల్లగా, నిండుగా నవ్వేశాడాయన. ‘‘సరే! మీ హాబీ తేనె కలెక్ట్ చెయ్యడమా?’’ అన్న ప్రశ్నకు.. ‘‘అది కూడా అనుకోండి.. కానీ నాకు ముఖ్యమైన హాబీ సినిమా స్క్రిప్టు రాయడం.. అది చేస్తున్నప్పుడు మస్తిష్కం కాస్త వేడెక్కి, శరీరం అలిస్తే.. అలా కాస్త నిద్రాదేవి ఒడిలో ఒరగడం’’ అని చెప్పాడు.
ప్రజాదరణ, ప్రభుత్వ ప్రశంసలు పొందిన ‘సీతారామ కళ్యాణం’ తీర్చిదిద్దడంలో రావణ బ్రహ్మగా తాను జీవించినంత శ్రమా, కృషీ.. రెండూ శ్రీ రామారావు ధారపోశాడు. ఉత్తమ దర్శకునిగా, శ్రీరామారావును.. సీతారామకళ్యాణం నిరూపించింది. శ్రీ రామారావుకి ఇవాళ క్షణం కూర్చుని.. ‘ఈ క్షణం నాది’ అనుకోగల విశ్రాంతి లేదు. ఆ సంగతి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన నాకు నమ్మకంగా తెలుసుకోగల అవకాశం కలిగింది!
‘వేంకటేశ్వర మహాత్మ్యం’లో, అసంఖ్యాక ప్రజానీక హృదయాలలో మనోజ్ఞమూర్తిగా విలసిల్లే ‘వేంకటేశ్వర స్వామి’ రూపాన్ని ధరించి, భక్తిశ్రద్ధలతో ఆ బాధ్యతను నిర్వహించి.. ప్రేక్షకుల మన్నన పొందిన శ్రీ రామారావు ‘కెరీర్’లో అటు తర్వాత కూడా ‘జారుడు మెట్లు’ లేవు. అంతా విజయమే ఆయన్ను వరిస్తూ వచ్చింది. ఆ దిన తోటరాముడై.. ‘కోట’కెగబ్రాకుతున్నప్పుడు ‘ఈలలు’ వేసి, తమ హర్షామోదాలు వెలిబుచ్చిన ప్రేక్షకులు దరిమిలా ‘అగ్గిరాముడు’గా, ‘శభాష్ రాముడు’గా, తమ అందాల నటుని చూసి ఆనందించారు. ఈలోగా రామారావు చిత్రయాత్రలో దిగ్విజయ ఘట్టాలు కొన్ని గడిచి ‘కోట’లో పాగా వేశాడు. శ్రీనివాసుడు, వాల్మీకి భీష్ముడూ, అర్జునుడు అయి ప్రశంసలందాడు.
‘పల్లెటూరి పిల్ల’లోనే.. శ్రీ ఎ.ఎన్.ఆర్., శ్రీ ఎన్.టి.ఆర్.లిద్దరూ ఒకే ఫ్రేములో ప్రేక్షకులకు అగుపించారు. అది శతదినోత్సవం చేసుకుంది. ఆ తర్వాత ‘సంసారం’లో వీళ్లిద్దరినీ పాతిక వారాలు చూశారు. తెనుగు చిత్ర పరిశ్రమలో ఆనాటికీ ఒక ‘పాత’.. ఒక ‘కొత్త’ నాయకులు అయిన ఇద్దరి తెర జీవితంలో బహు అపురూపమైన ‘మలుపు’గా, ఈ ‘సంసారాన్ని’ చిత్ర చరిత్రకారులు చెప్పుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత శ్రీ రామారావు పురోగతి రేసుగుర్రంలాగే పుంజుకుంది.
ఐతే, శ్రీ రామారావుకి ‘పాతాళ భైరవి, మల్లీశ్వరి’ చిత్రాలు రెండూ.. రెండు బంగారు సోపానాలే కాదు.. రెండు ఉత్తమ విద్యా పీఠాలు, తిరుగులేని సర్ట్ఫికెట్లు కూడాను. అదే శ్రీ ఎన్.టి.ఆర్. అంటారు.. ‘‘నాకవే అవకాశాలు మహాప్రసాదాలు అయ్యాయి’’ అని. మహానుభావుల శిక్షణ నాడు దొరకడమే మహా భాగ్యం కదా! మనదేశంలో రామారావుని తెచ్చిన దర్శకుడు.. శ్రీ యల్.వి. ప్రసాద్.. మల్లీశ్వరి లాంటి కళాఖండంలో.. ఈ పాలరాతి బొమ్మలాంటి యువకుణ్ని ప్రతిభావంతుడైన నటునిగా రాణింపజేసింది శ్రీ బి.ఎన్. ‘పాతాళ భైరవి’ ‘మ్యాటనీ ఐడల్’గా ప్రజల నోట ‘తోటరాముని’గా వాళ్ల హృదయాల ఆనందరామునిగా నిలిపిన ఖ్యాతి.. శ్రీ కె.వి.గారిది. తర్వాత ‘జగదేక వీరుడు’.. ఆంధ్రుల అభిమాన నటుని గా పరిణితినొంది రాణిస్తున్నాడు.
‘విజయ-వాహిని’ సంస్థ చేయూత ‘బంగారు పళ్లేనికి గోడ చేర్పు’ అయింది. ఆ మార్కులన్నీ వచ్చాయి. శ్రీయుతులు చక్రపాణి, నాగిరెడ్డి.. ఇతని ఉజ్జ్వల భవిష్యత్తును ముందుగానే పసిగట్టారన్నమాట. అందమైనవాడి ప్రతిభ ఆవిధంగా పెద్దవాళ్ల చెప్ప చేతల్లో ‘సానబెట్టిన రత్నం’లా రాణించింది. గనుకనే, దరిమిలాన అది బంగారానికి తావి అబ్బినట్లు.. ‘దాసి’ చిత్రంలో ఒక రకంగానూ.. ‘అగ్గిరాముడు’లో మరోరకంగానూ, ‘గుడిగంటలు’లో మరింతగానూ ప్రేక్షకుల ప్రశంసలందుకుంది.
కరచాలనం చేస్తున్నప్పుడు కుడి మోచేతి మీద కృష్ణుని మూర్తి.. పచ్చబొట్టుగా కనబడింది. నాకు ‘మాయాబజార్’ జ్ఞాపకం వచ్చింది.. నాతో ఒకసారి, రైల్లో ఒక ప్రేక్షకుడన్నమాటలు.. ‘మాయాబజారులోని కృష్ణుడు ద్రౌపదికి మానభంగం జరగకుండా తన అభయహస్త ముద్రతో.. కాపాడిన సీను కోసం.. చిత్రాన్ని నేను పదే పదే చూశాను’’ అన్నాడు. శ్రీ రామారావు హస్త‘ముద్ర’లు, ‘నర్తనశాల’లోనూ, ‘వేంకటేశ్వర మహత్యం’లోనూ కూడా ఇలాగే ప్రేక్షకులనాకర్షించాయి. పురాణ పురుష పాత్రధారికి భూషణాలకన్నా వాటికనువైన భుజాలు, చేతులు ముఖ్యం. అవి శ్రీరామారావు సొంతం. పకడ్భందీ అయిన ‘కోట’లాంటి విగ్రహం గలవాడు రుూ నటుడు. ‘మాయాబజార్’లో కృష్ణుడి పాత్రను నిజంగా ఒక ఛాలెంజ్‌గా తీసుకుని అహర్నిశలూ దానికై శ్రమించానని చెప్పాడు.
పదహారు సంవత్సరాల చిత్ర యాత్రలో శ్రీ రామారావు జీవం పోసిన పాత్రలన్నీ ఒక ఎత్తూ, లంకాధిపతి రావణుని పాత్ర ఒక ఎత్తు. రావణాసురుని, వెండితెరకు వెలలేని కానుకగా తన నిరంతర తపస్సుతో ప్రసాదించిన రామారావు నిస్సందేహంగా మహానటుడు. భూకైలాస్ చిత్రంలో యితన్ని చూసిన, అనేకులు రావణాసురుణ్ని తమ అభిమాన పాత్రగా ఎంచుకున్నారు అంటే అతిశయోక్తి లేదు. నాకు కూడా ఆ పాత్ర చాలా యిష్టం!
రామ, రావణులలో ఎవరు? ఎవరు? అనిపించేటంత దక్షతతో, విశిష్టంగా ఈ రెండు పాత్రలను పోషించిన శ్రీ రామారావు ఒక చారిత్రాత్మకం కాగల చిత్ర నిర్మాణానికి పూనుకోనున్నారు. రావణుని పాత్రను హుందాగా, దర్పంగా, సృష్టించి రాక్షసత్వాన్ని, రసికతను, అహంకారాన్ని, భక్తి తత్పరతను, ఆత్మవిశ్వాసాన్ని, శత్రుద్వేషాన్నీ మేళవించి ఒక వినూత్న పాత్ర చిత్రణకు పూనుకుని శ్రీ ఎన్.టి. ఆర్. సంపాదించిన పేరు ప్రఖ్యాతి.. అదే రామారావు.. నిగ్రహమూర్తి, ఏకపత్నీవ్రతుడు, ప్రజాభిరాముడూ అయిన రఘురాముని పాత్రను అంత నిగ్రహంతోనూ పోషించి.. ఆ కీర్తిని మరింత ఇనుమడింపజేసుకున్నారు.
నియమాలు, నిబద్ధత కాచి వడబోసిన ఎన్.టి.ఆర్. ఏడుకొండల వెంకన్నగా నటించి వెండితెర వేలపయినాడు. శ్రీనివాసునిగా తెరమీద నిలిచిన ఎన్.టి.ఆర్.కి ఇష్టదైవం ఏడుకొండలవాడే. శనివారం నాడు పాన్పుమీద పడుకోవడం, నీచు తినడం, అశ్లీల పదజాలం అనడం.. లాంటి పనులేవీ చేయనన్నారు. అతని భక్తి ఆత్మవిశ్వాసపూరితంగా ఉన్నది!
పురాణ పురుషుల వేషం వేస్తున్నప్పుడు.. నడక, చూపు, మాట, ఉచ్ఛారణ మొదలైనవన్నీ మారిపోతాయి. మరొక అలౌకికమైన అనుభూతికి, వాతావరణానికి దగ్గరగా వెళితే కానీ అది సాధ్యం కాదు. ‘‘మహా పురుషుల పాత్రకు రూపకల్పననిస్తున్నప్పుడు.. అందుకనే నేను మామూలు కన్నా ఎక్కువ నియమం, నిష్ట పాటిస్తాను. మరింత నిర్మల హృదయంతో వీటిని స్వీకరించి నిర్వహిస్తాను’’ అంటాడాయన.
శ్రీ రామారావులోని గ్లామర్ చాలావరకూ భగవంతుడిచ్చినదే. అందగాడని అందరూ అనుకునే ఈ నటుడు.. ‘పిచ్చి పుల్లయ్య’లోనూ, ‘కలిసి ఉంటే కలదు సుఖం, దాసి’ చిత్రాలలో వేసిన పాత్రలు గానీ.. ‘రాజు-పేద’లో వేసిన పాత్రగానీ, సంకోచం లేకుండా ‘శభాష్’ అనిపించుకొన్నాడు. ఈ పాత్రలు ఇతని స్థాయిని పతాక స్థాయికి అందించాయి. ‘మల్లీశ్వరి, దాసి, పాతాళభైరవి, వాల్మీకి, భట్టి విక్రమార్క, భీష్మ, ఇంటిగుట్టు, కలిసి ఉంటే కలదు సుఖం’ వంటి జంట చిత్రాలను జ్ఞాపకం తెచ్చుకోండి. శ్రీ రామారావు ఎంతటి విభిన్న తత్త్వాలు గల పాత్రలకు ఎంతటి సమర్థతతో జీవం పోసం.. ఔననిపించుకున్నాడో సుళువుగా తెలుస్తుంది!
‘మీరు చలన చిత్ర రంగంలో అడుగెట్టినప్పటికంటే ఇవాళ కొత్త ‘టాలెంట్’కి అవసరం ఉందంటారా?’ అని అడిగితే.. ‘‘కొత్త టాలెంట్‌కి అవసరం ఎప్పుడూ ఉంది. అదెప్పుడూ ఉంటుంది’’ అన్నాడు ఆయన. ఎన్.ఎ.టి. సంస్థ వహీదా రెహ్మాన్, బి. సరోజాదేవి వంటి వాళ్లను వెలుగులోకి తెచ్చిన సంగతి ఇక్కడ పేర్కొనడం అప్రస్తుతం కాదేమో!?
ఒక రకంగా చూస్తే 64 నాటికే ఆయన నట జీవితంలో అనితర సాధ్యమయిన రికార్డు సాధించాడు. తానో లెజెండ్ అనిపించుకున్నాడు.. ఔను!
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 92900 99512 veeraji.columnist@gmail.com