S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘కాలం - అదో ఇంద్రజాలం’!

సీ॥ ధనము కావలసిన దంభము ల్మోసము
క్సేవ లిచ్చకములు సేయ వలయు
కామ సంతృప్తికై కాంతలకున్ లొంగి
కాని గడ్డెల్లను ఁగఱువ వలయు
స్వకుటుంబ వృద్ధికై వ్యయము ప్రయాసంబు
బడి యాత్మ సౌఖ్యంబు వదల వలయు
పేరొందుటకుఁ బెద్ద వేషంబులం బెక్కు
దేశంబులం దిమ్మ దిరుగవలయు
అల దిగంతపు రేఖ యట్టులను మదికిఁ
జేరువై తోచి సంతుష్టి దూరమగును
దుఃఖమే మిగిలియుండును ఁదుదకు మనకు
గాన నిహ భోగముల పయి ఁగాంక్ష తగదు
జీవితసారమంతా ఈ పద్యంలో ఉంది.
ఈ పద్యంలో వివరణ యిస్తే గానీ, అర్థం కాని మాటలంటూ లేవు. పైగా మీకు తెలియని విషయాలూ కావు. హరికథా పితామహుడైన అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగారి పద్యమిది.
మా నాన్నగారు, తరుచుగా తన హరికథా గానంలో పాడుతూండేవారు. పాడిస్తూండేవారు.
అర్థం తెలియకపోయినా ఆయన చెప్పింది చెప్పినట్లు చిలకపలుకల్లా పాడేస్తూండేవాళ్లం. అప్పుడు రాగానందం కాస్త మాత్రమే తెలిసేది. ఇప్పుడు కాస్త అర్థం తెలిసిన తర్వాత నారాయణదాసుగారి ప్రతిభను మనసులోనే దాచుకుంటూ, మీతో పంచుకోవాలనిపించింది.
లోకంలో మన కంటే, మనతో మాట్లాడేవారికే తెలివితేటలెక్కువంటూండేవారు నా తండ్రిగారు.
ఏమి ఉన్నా, లేకపోయినా ‘ప్రపంచ జ్ఞానం మాత్రం మనిషికి తప్పనిసరిగా ఉండాలి. అవతలి వారి మెప్పుల కోసం సమాజంలో ముఖస్తుతి చేసే వారెక్కువ.
నూటికి కనీసం 40 శాతం ఈ బాపతే. స్వీయ రక్షణకు ఇదో సులభ మార్గం. కలిగిన వాడికి దయ పుట్టాలంటే లేని వాడు చాతక పక్షిలా ఎదురుచూడవలసినదే.
మనసు కరిగేదెప్పుడో? మన మాట వినేదెప్పుడో? ఎన్ని కోట్ల మంది జనమో అనే్నసి మనస్తత్వాలు. లోకంలో పశుపక్ష్యాదుల రూపు రేఖల్లో ఏ మార్పూ ఉండదు.
ఏ తేడా ఉండదు.
వాటి స్వభావమే నడిపిస్తుంది.
తిరకాసంత కోపం మనిషిలోనే ఒక్కోసారి కుటుంబంలోనే ఒకరి మాట మరొకరికి నచ్చదు. పొంతన కుదరదు. భార్య కానివ్వండి, భర్త కానివ్వండి. కడుపున పుట్టిన పిల్లల క్షేమం భార్యాభర్తలిద్దరూ ఒక్కోసారి మాయ మాటలు చెప్పే పరిస్థితి రావచ్చు. పాండవుల తల్లి కుంతి, కొడుకుడొక్కడికీ ఎవరి కంటా పడకుండా అన్నం పెట్టేదట.
ఒకే ఇంట్లో ఉన్నా మనుషుల రుచుల్లోనూ వారి వారి అభిరుచుల్లోనూ తేడా, ఇనే్నసి వైవిద్యాలున్న సంసార శకటాన్ని నడిపేందుకు ప్రజ్ఞ కావాలి.
ఏ సంసార రథమైనా ఒంటరిగా ఏ ఒక్కరి భుజస్కంధాలపైనా నడవడు.
నీటిలోనే ప్రయాణం చేయాలి. కానీ నీరు ఒక్క చుక్కైనా నావలోకి రాకూడదు.
తెలిస్తే మోక్షము, తెలియకున్న బంధము
కలవంటిది బతుకు ఘనునికి
అంటాడు తాళ్లపాక అన్నమయ్య
జీవితమొక నాటకమనీ, అందరూ
ఈ జగన్నాటక రంగస్థలంపై కదిలే
నటీనటులన్నాడు. ఆ నటన ఎలా ఉంటుందో
భద్రాచల రామదాసు కూడా చెప్పాడు.
తా జేసిన మేలు దైవమెరుగవలె
తా చెప్పుకోవలెనా
తన మనసును వశము చేసుకున్న చాలు
కాశీకి పోవలెనా? ॥ చేసిన॥

1. కలకాలము తల్లి కరుణ భోజనమిడు
కాలమందు చూ‘డుడీ!
కులుకుచు పెంచిన కొడుకుల గుణముల
కోడలొచ్చిన చూడుడీ ॥
2. ప్రేమ కలిగినట్టి పెండ్లాము గుణమెల్ల
పేదరికమున చూడుడీ
కామించి బంధువుల కరుణా రసం బెల్ల
కలసి మెలసి చూడుడీ॥ తా
3. అలరుచు తిరిగేటి అన్నల గుణమెల్ల
అవిభక్తులు చూడుడీ
చెలగుచు తిరిగేటి చెలికాని గుణము
లేమి కలిగిన జూడుడీ॥ తా
4. జన్మము కలిగి జన్మరాహిత్యమునకు
గుణము కలిగితె మంచిది
ధనము కలిగితేను దనమునకు తగినట్లు
ధర్మమున్నను మంచిది॥ తా
5. హరిదాసుల నెల్ల నాదరించిన యట్టి
ఆనందమిదె చూడుడీ
వరరామ దాసుని వాగ్వైఖరి విన్న
వారలకే ఫలితము మనసా॥
తాజేసిన మేలు దైవమెరుంగవలె
తా జెప్పుకోవలెనా?
తన మనసును వశము చేసికొన్న చాలు
కాశీకి పోవలెనా?
సామాన్యంగా భద్రాచల రామదాసు కీర్తనలన్నీ భగవంతుడి గుణగణాలు వల్లించే విధంగానే కనిపిస్తాయి తప్ప,
నీతి బోధ చేస్తున్నట్లుగా ఉండేవి తక్కువ. వాడుకలో లేని కీర్తనలను ఎంపిక చేసే ప్రక్రియలో నాకు లభించిన అరుదైన కీర్తన ఇది. రామదాసుపై భక్తి ప్రపత్తులున్న వారెవరో కొన్ని పాటలు రాసేసి ఆ కీర్తి రామదాసుకే రావాలనుకున్న సందర్భాలూ లేకపోలేదు.
కానీ ఈ కీర్తన మాత్రం రామదాసుగారిదే. రామభక్తుడైనా ఆయన కూడా ఓ సంసారే గదా?
లౌకిక బాధలు ఆయనకు తెలియవా?
లోకంలో మనుషుల ప్రవృత్తిని అందులో చూపించాడు.
నా చిన్నతనంలో మా అమ్మమ్మ మా అమ్మతో చెప్తూండేదట.
మా తాతగారిపై జాలితో ఎవరో ఓ భూసామి పిలిచి ఇదిగో సూరయ్యా?
పిల్లలు గల వాడివి. అంత పెద్ద సంసారాన్ని ఎలా ఈడుస్తావు. చూడు ఊరుకి ఉత్తరాన, మెరక మీద ఓ ఎకరం పొలం నీకు రాశిస్తాను. నీకు సమ్మతమేనా? అనడిగితే
మహాప్రభో దానంగా, స్వీకరించ లేను. కొనే శక్తి లేదు. నేనంతటి ధనికుణ్ని కాదు.
పరిగ్రహణ దోషం నాకెందుకని, సున్నితంగా తిరస్కరించి ఇంటికొచ్చి అదేదో ఘనకార్యం చేసొచ్చినట్లు మా అమ్మమ్మతో చెప్పాడుట.
అదిగో! సత్యకాలపు రోజులంటే అవి.
కష్టపడి సంపాదించి కూడబెట్టుకుని కొన్నదానికే ఎసరు పెట్టి కబ్జా చేసే రాబందులున్న ఈ రోజుల్లో, భూమిని దానమివ్వగల పుణ్యాత్ములెవరు? ఆర్థిక నేరాలు దర్జాగా చేసేసి చిరునవ్వులతో నమస్కరిస్తూ అభివాదాలు చేస్తూంటారు. ఋణాలిచ్చినప్పుడూ తీసుకున్న ఋణాలు మాఫీ చేస్తున్నప్పుడు అట్టహాసంగా ఫొటోలు తీయించుకుని పత్రికా ముఖంగా ప్రకటనలూ, ఫోజులిచ్చే రాజకీయ నాయకులను చూ స్తూనే ఉన్నాం.
ఉమ్మడి కుటుంబాల్లో నెలకొన్న ప్రేమాభిమానాలు, విడిపోయి వేరు కాపురాలు పెడ్తే లభిస్తాయా? ఎంతటి యోగ్యులైన మగపిల్లలున్నా వారి భార్యల ప్రవేశంతోనే వాతావరణం కాస్తా తారుమారై జీవిత చిత్రాల రంగులే మారిపోతాయి. బాహాటంగా పైకి చెప్పుకోనూ లేరు.
లోపల దాచుకోనూ లేరు. మాయదారి మనసు కాబట్టి, ఇతరులను మార్చటం మన చేతకాని పని.
మనలను మనం మార్చుకోగలగటం మన వల్ల మాత్రమే అయ్యే పని.
ఏ మాత్రం తన మనసును కాస్త వశపరచుకున్నా చాలు.
అదొక్కటే కిటుకు.
మనసు బాగోలేదని
ఏ పుణ్యక్షేత్రాలూ తిరగవలసిన అవసరం లేదనే మాట నిత్య సత్యం.
మాయంతా మాయదారి మనసుకే కాబట్టి.

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656