S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమ గురించి ప్రేమగా..

రెండు అక్షరాల ప్రేమ.. ఆ రెండు అక్షరాలే రెండు గుండెలనూ ఊపేస్తాయి. పగలే వెనె్నల కురిసినట్లు.. ప్రపంచమంతా పూలు విరిసినట్లు.. ఆకాశమంతా వేనవేల రంగులు అద్దుకున్నట్లు.. ఏదో తియ్యని భావన నిలువనీయదు.. నిద్దుర రానీయదు.. మెలకువగా ఉన్నా స్వప్నాలే.. నిద్దురలో ఉన్నా కలల కలవరాలే.. ఆకలి వేయదు.. దాహం తీరదు.. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనే.. ఇవన్నీ ప్రేమ ఉదయించేటప్పుడు కనిపించే లక్షణాలే.. మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి సందర్భంలోనూ ఈ ప్రేమ ఏదో ఒక రకంగా ‘నేనున్నాను’ అని పలుకరిస్తూనే ఉంటుంది. అంతలోనే దోబూచులాడుకుంటూ ఆడుకుంటుంది. కొందరి జీవితాలను చిందర వందర చేస్తుంది. మరికొందరిని పూల పల్లకీ ఎక్కిస్తుంది. ఆ తరువాత అమాంతం అగాథంలోకి తోసేస్తుంది. అసలు ఈ మాట వింటేనే మనసుల్లో ఎందుకో అంత ఉద్విగ్నత.. దీని కోసం ఎందుకో అంత పాకులాట.. పరితాపం.. అందుకేనేమో దీనికోసం ప్రత్యేకంగా ఒక రోజును ఏర్పాటు చేసుకొని వేడుకలను చేసుకుంటున్నాం.. ఎన్ని సంవత్సరాల నుంచో మదిలో పదిలంగా దాచుకున్న మాటను ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించే సమయమే ప్రేమికుల దినోత్సవం. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ‘వాలెంటైన్స్ డే’.. ఇప్పుడు పల్లెలకు కూడా విస్తరించింది. ప్రేమికుల దినోత్సవం వస్తోందంటే అన్ని చోట్లా ఒకటే సందడి.. ఏ కానుకను కొని ప్రేమికుడికి/ప్రేమికురాలికి బహుమతిగా ఇవ్వాలి..? ఎన్నాళ్ల నుంచో మదిలో దాచుకున్న ఊసులను ఎలా పంచుకోవాలి? ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రేమించే వ్యక్తికి, ఈ రోజున తమ ప్రేమను తెలియజేసి వారు ఒప్పుకుంటే జీవితాంతం ఒకటిగా జీవించాలనే తాపత్రయం.. ఇలాంటి ఊహలతో ప్రేమికులను ఒకచోట నిలువనీయదు ప్రేమ.. తరతరాలుగా ఈ ప్రేమ గుండె గుండెకూ జలపాతంలా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఎన్ని తరాలు, స్వరాలు మారినా ప్రేమ అమృతంలా మిగులుతోంది.
ప్రేమంటే..
ఈ భూమిపై ఎవరైనా సరే.. ఎంతటి గొప్పవారైనా సరే.. కోరుకున్నప్పుడు ప్రేమను పొందడం.. ప్రేమించేలా చేసుకోవడం సాధ్యం కాదు.. దాన్ని కొనలేరు.. అమ్మలేరు.. అది రావాలనుకున్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే వచ్చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఎవరిని వారు ప్రేమించుకోవడం తెలుసుకోవాలి. ప్రేమంటే బంధించడం కాదు.. ప్రేమంటే స్వేచ్ఛను ఇవ్వడం.. అవతలి వ్యక్తిని ఆమోదించడం.. అప్పుడే అందులోని మాధుర్యం అర్థమవుతుంది. ప్రేమను అర్థం చేసుకోవడం మొదలుపెడితే జీవితం మొత్తం కొత్త అనుభూతులను పంచుతూ తోడుగా వస్తుంది. జీవితం మొత్తం సంతోషం కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక చోట ఆగిపోవడం అంటూ ఉండదు. అది మన చుట్టూనే ఉంటుంది. దాన్ని పొందడం, అందుకోవడంలోనే అంతా ఉంటుంది. ప్రాణవాయువైన ఆక్సిజన్ మన చుట్టూ ఆవరించి ఉండి ఎలా కాపాడుతుందో ప్రేమ కూడా అంతే.. నిత్యం మనల్ని అంటిపెట్టుకుని కాపాడుతూ ఉంటుంది. దాన్ని గ్రహించే సమయమే ఉండదు.
కొంతమంది మాత్రం ఎక్కడో ఉన్నదాని కోసం వెంట పడుతూ.. పక్కనే ఉన్న ప్రేమను నిర్లక్ష్యం చేస్తారు. అది గ్రహించేలోపే దూరమైపోయిందని పొర్లిగింతలు పెడతారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. అవసరమైతే ఎదుటివారిని చంపాలని చూస్తారు.. నేటి పరిస్థితి ఇదే కదా.. చావకపోతే మళ్లీ మళ్లీ వారిని విసిగిస్తారు.. మరోరూపంలో వెతుకుతున్న ప్రేమ మనకు కనిపించదా? అంటే కనిపించదు అనే సమాధానమే వస్తుంది.. ఎందుకంటే ఇంతవరకూ వారికి తెలిసిన ప్రేమ అది నేర్పించలేదు. నేటి ప్రేమకు, ప్రేమికులకు అసలు ఆ విషయమే తెలియదు.
ప్రేమను ఎవ్వరూ వెతకక్కరలేదు. అది మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అదేదో సినిమాలో డైలాగ్‌లా.. వైఫైలా.. ఏదోవిధంగా దగ్గరయ్యేందుకు తన తంటాలు తాను పడుతూ ఉంటుంది. అమ్మ చేతి గోరుముద్దలా దగ్గరికి వచ్చినప్పుడు వద్దంటూ వెనక్కి వెళ్లిపోతూ ఏడిపిస్తూ మారాం చేసే పిల్లాడిలా.. నాన్న చేతి బహుమతిలో మనం కోరుకున్నది లేదంటూ అలిగే బుజ్జాయిలా ప్రేమ ఎప్పుడూ గారాలు పోతూంటుంది. ఇలాగే చాలాకాలం వరకు అమ్మప్రేమను, నాన్న ప్రేమను, సోదర సోదరీమణుల ప్రేమను కానీ అజ్ఞానంతో అర్థం చేసుకోకుండా వదిలేస్తాం. ఇతర హంగులకు పరిమితమై దానిలోని అంతర్లీనపు ప్రేమను వదిలేస్తాం. తీపి జ్ఞాపకాలను మనసు మూలాల్లోకి నెట్టేస్తాం. దగ్గరగా ఉన్నదాన్ని గ్రహించలేక ఆకాశం వైపు చూస్తూ గాలిలో చేతుల్తో రాస్తూ అదేలోకంలా బతికేందుకు ఇష్టపడతాం. ఇవన్నీ చిన్నప్పుడు అంటే తెలిసీ తెలియని వయసులో చేసే ప్రేమ గుర్తులు. అసలు ప్రేమ పుట్టేది వయసుకు వచ్చినప్పుడే అంటున్నారు నేటితరం ప్రేమికులు. ఒక అమ్మాయిని, అబ్బాయిని చూసిన వెంటనే పుడుతుంది. వారికిచ్చే బహుమతుల్లో పెరుగుతుంది. తిరిగే తిరుగుళ్ళలో ఆటలాడుతుంది. కన్నవారిని బాధపెడుతూ పరుగులు తీస్తుంది. దూరంగా పోయి దాక్కుంటుంది. ఏడుస్తుంది.. ఏడిపిస్తుంది.. చేతకానితనంతో ఓడిపోతుంది.. అంతగా ఆశపెట్టిన ప్రేమ.. దూరం అవుతుంది. చిరాకులు.. పరాకులు.. కలిగించి చివరకు మాయం అవుతుంది. ఇలాంటి ప్రేమలు అంతే.. ఇలాంటి వారు ప్రేమ వారి మనసుకు నచ్చినట్లే ఉండాలి అనుకుంటారు. ప్రేమ దాన్ని సహజత్వాన్ని కోల్పోయి అచ్చం వారిలా కనిపించాలి అనుకుంటారు. అంటే వారు నవ్వితే ప్రేమించినవారు నవ్వాలి.. ఏడిస్తే ఏడవాలి.. వెళ్లిపొమ్మంటే వెళ్లిపోవాలి.. చచ్చిపొమ్మంటే చచ్చిపోవాలి.. ఇందులో ప్రేమ ఎంతగా నలిగిపోయినా ఫర్వాలేదు. వారి మనసు మెచ్చినట్లు ఉంటే చాలు.. అదే ప్రేమ.. చివరికి తన రూపు కోల్పోయి.. ఆ పరిమళాన్ని వదిలి.. ఆహ్లాదాన్ని విడిచి జీవచ్ఛవంలా సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం మనం నిత్యం చూస్తున్న ప్రేమలు ఇవే.. మనం కోరుకుంటున్న ప్రేమ ఇదే అయితే ఎప్పటికీ అసలైన ప్రేమలోని ఆనందాన్ని రుచి చూడలేం. ప్రేమ కేవలం ఆనందమే కాదు.. బాధ్యత కూడా.. అవతలి వ్యక్తి మనోభావాలను గౌరవిస్తూ జీవితాంతం సాగించాల్సిన సమయం..
ప్రేమికుల దినోత్సవాన్ని ప్రతి ఫిబ్రవరి 14న జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఎందుకంటే ఈ ప్రేమికుల రోజు కోసం చాలామంది యువత వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది. తమ జతకు ఎప్పుడెప్పుడు ప్రేమను వెల్లడిద్దామా అని.. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర, దాని సంస్కృతి గురించి ఎన్నిసార్లు వివరించినా ఈ సందర్భంగా మరొక్కసారి స్మరించుకోవాల్సిందే..
చరిత్ర
ఈ ప్రేమికుల రోజు వెనుక చాలా కథలే ఉన్నాయి. ఇటలీలో ముగ్గురు వాలెంటైన్స్‌కు సంబంధించిన కథలున్నాయి. ఇందులో ఏది నిజమో ఎవరికీ తెలియదు. ఈ ముగ్గురు వాలెంటైన్స్‌లో ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవారు. మరో వాలెంటైన్ రోమ్ రాజు అయిన గ్లాడియస్ సైన్యంలో సైనికుడు. ఇక మూడో వాలెంటైన్ రోమ్‌లో ఒక సాధారణ పౌరుడు. ఈ ముగ్గురికి సంబంధించిన కథలు
చాలానే
ఉన్నాయి. అందులో ఏ వాలెంటైన్‌ను స్మరించుకుంటూ ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారో ఎవరికీ తెలీదు.
రోమ్ రాజు గ్లాడియస్, సైనికులెవ్వరూ పెళ్లిచేసుకోకూడదనే నిబంధన పెట్టాడు. అలా చేసుకుంటే సైన్యం పూర్తిగా దెబ్బ తింటుందని అతని విశ్వాసం. అయితే వాలెంటైన్ అనే సైనికుడు తన తోటి సైనికులకు పెళ్లిళ్లు చేసేవాడు. ఈ విషయం
రాజుకు తెలిసి అతన్ని చంపేశాడు. ఇక మూడో వాలెంటైన్ మామూలు పౌరుడు. అతను ప్రేమ కోసం ప్రాణాలే విడిచాడు. ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ప్రేమికుల దినోత్సవం వెనుక మరో ఆసక్తికరమై కథ కూడా ఉంది.
ప్రాచీన రోమన్ పూజించే దేవతలలో ‘జూనో’ దేవత ఒకరు. ఆ దేవత ‘స్ర్తిలకు, పెళ్లిళ్లకు సంబంధించిన దేవత’ అని వారి నమ్మకం. ఆమెను పూజిస్తే ఆడవారికి కోరుకున్న వాడితో పెళ్లి అయ్యేలా చేస్తుందని రోమ్ మహిళల నమ్మకం. జూనో దేవతను భక్తితో కొలిచి, పెద్ద ఉత్సవం నిర్వహించుకునేందుకు పూర్వం రోమ్‌లో ప్రతి ఏటా ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించేవారు. ప్రేమను వేడుకగా చేసుకునే రోజుగా ఏటా ఫిబ్రవరి 14న రోమ్‌లో నిర్వహించే పండుగను చూసి తాము కూడా అలాంటి వేడుకను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు అందరూ. అలా ఫిబ్రవరి 14న అమెరికాలోని ప్రేమికులు తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజుగా నిర్వహించుకోవచ్చని అక్కడి ప్రభుత్వం సూచించింది. దీంతో అక్కడ కూడా ఏటా ఫిబ్రవరి 14న పండుగ వాతావరణం నెలకొనేది. అంతేకాదు అక్కడ కొన్ని పక్షులు ఆ తేదీన ప్రేమాతిశయంతో జతలు కట్టేవని ప్రాచీన రోమన్ చరిత్రకారులు రాసుకున్నారు. ఇక ఫిబ్రవరి 15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఇన్ని విధాలుగా ఫిబ్రవరి 14వ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది. అనంతర కాలంలో ఈ రోజును తెలుసుకున్న అమెరికన్ పౌరులు తమ పరస్పర ప్రేమల్ని తెలియపరుచుకోవడానికి ఆ రోజున ప్రేమ కార్డులను పంచి పెట్టుకోవడం మొదలెట్టారు. అప్పటి నుంచి వాలెంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రేమికుల రోజుగా పేరుగాంచింది.
ప్రేమికుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? అని కొన్ని తరాల తర్వాత ప్రజలకు అనుమానం కలిగింది. అప్పుడు రోమ్‌లో చనిపోయిన వాలెంటైన్స్‌కు సంబంధించిన కథలని తెరపైకి తీసుకువచ్చారు. వాళ్లను స్మరించుకుంటూ మనం కూడా వాలెంటైన్స్ డేని జరుపుకుంటున్నాం. అమెరికా వాళ్ళు కూడా ఇదే చెబుతున్నారు.
జూనో దేవతను కొలిచే వేడుక కాస్తా ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. వాస్తవానికి వారికి, ప్రేమికుల దినోత్సవానికి సంబంధం లేదు. కానీ రోమ్‌లో జరిగే జూనో దేవత ఉత్సవాన్ని కొన్ని దేశాలు ఇలా మార్చేశాయి.
ఆధునిక కాలంలో..
1797, బ్రిటన్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రీటింగ్ కార్డులను మొదటిసారిగా ముద్రించారు. అనంతరం 19వ శతాబ్దంలో వాలెంటైన్స్ డే కార్డులకు క్రమక్రమంగా డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఫ్యాన్సీ వాలెంటైన్‌లను లేసులు, రిబ్బనులతో అందంగా తయారుచేయడం ప్రారంభించారు. అమెరికా, యూరప్ దేశాలలో నేడు వాలెంటైన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతి ఏటా లక్షలాది కార్డులు ఈ సందర్భంగా విక్రయిస్తారు. ఆసియాలో, ఆసియా ఖండంలో వాలెంటైన్స్ డే వేడుకలను ముందుగా సింగపూర్, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో నిర్వహించేవారు. దక్షిణ కొరియాలో యువతులు ప్రేమికుల దినోత్సవం రోజున తమకు నచ్చిన యువకులకు చాక్లెట్లను బహుమతిగా ఇచ్చేవారు. చైనా సంస్కృతిలో భాగంగా వాలెంటైన్స్ డేను ‘ద నైట్ ఆఫ్ సెవెన్’గా జరుపుకునేవారు. ఇక జపాన్‌లో ప్రేమికుల దినోత్సవాన్ని తనబతా పేరిట కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటూనే ఉన్నారు.
మధ్య ప్రాచ్య దేశాల్లో..
ఈజిప్ట్‌లో సైతం ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డేను జరుపుకుంటున్నారు. దీన్ని ఈద్ ఎల్ హాడ్ ఎల్ మస్రీ పేరిట నవంబర్ నాలుగో తేదీన నిర్వహిస్తున్నారు. ఈ రోజున అక్కడి ప్రేమికులకు ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలను బహుమతులుగా ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. ఇజ్రాయల్‌లో జ్యుయిష్ వాలెంటైన్స్ డేను ‘తు బిఎవి’ పేరుతో జరుపుకుంటున్నారు. ఇక సౌదీ అరేబియాలో దేశంలో 2002 నుండి 2008 మధ్య కాలంలో పోలీసులు వాలెంటైన్స్ డే ఐటమ్స్ విక్రయాలను బ్యాన్ చేశారు. ఇరాన్‌లో సైతం ఇటీవల వాలెంటైన్స్ డేను జరుపుకోకూడదని నిషేధం విధించారు. వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులు, బహుమతులు, టెడ్డీబేర్లను విక్రయించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రేమంటే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, ఆ రోజున సన్నిహితంగా గడపడమే అనే భావనకు ఆధునిక యువత వచ్చినట్టు కనిపిస్తున్నది. ఆ రోజున ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుని తమదెంత ‘విలువైన’ ప్రేమో యువత చాటుకుంటున్నప్పటికీ అది వారి జీవితకాలం నిలుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రేమంటే.. ఆకర్షణ మాత్రమే కాదన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం.. *
ఆ రోజు ఎనె్నన్నో వేడుకలు..

మనిషి పొందే ప్రతి అనుభూతికీ అక్షరాలుంటాయేమో కానీ ప్రేమకు మాత్రం ఉండవు అనేది చాలామంది భావన. కొన్నిసార్లు, కొందరి విషయంలో ఇది నిజం కావచ్చు. ఇటువంటివారి కోసమే ఏడాదిలో వీరికంటూ ఓ రోజును కేటాయించారు. వాస్తవానికి ప్రేమలో ఉన్నవారికి రోజూ పండుగే.. ఇంకా చెప్పాలంటే ఈ ప్రేమికుల దినం భారతీయ సంప్రదాయమే కాదు. ఇదో పాశ్చాత్య పండుగ. ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాల కంటే ఎక్కువగా భారతదేశంలోనే జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఆస్వాదించేవాళ్లు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకించేవాళ్లు అంతకంటే ఎక్కువే.. ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని మొన్నా మధ్య ఓ సర్వేలో వెల్లడైంది. ఇది యథార్థమని ఎన్నోసార్లు రుజువైంది కూడా. 2012లో ఉత్తర ప్రదేశ్ సీఎంగా అఖిలేశ్ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న ‘మాతృ పితృ పూజ’ నిర్వహించాల్సిందిగా ఆదేశాలను జారీ చేశాడు. నిజానికి ఈ ప్రతిపాదన ఆశారాం బాపూది. అప్పటి నుంచి ప్రతి ఏడాదీ యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాశ్చాత్య పోకడల నుంచి యువతను రక్షించి తల్లిదండ్రులపై ప్రేమ పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రోజున ప్రతి పాఠశాలల్లోనూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను పూజిస్తారు.
శివసేన మాత్రం ప్రేమికుల దినోత్సవాన్ని ‘బ్లాక్ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్‌సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్‌సింగ్‌కు శిక్ష పడిన ఆ రోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలని శివసేన అభిమతం.
ప్రేమికుల రోజున స్వేచ్ఛగా తిరగాలని ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. ఇందుకు చాలామంది యువత కళాశాలనే ఇష్టమైన ప్రదేశంగా ఎంచుకుంటారు. కానీ లక్నో విశ్వవిద్యాలయంలో ఈ పప్పులు ఉడకవు. ఆ రోజున ఏ ఒక్క విద్యార్థీ కాలేజీ ఆవరణలో తిరగడానికి వీల్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికుల దినోత్సవం రోజున అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పొచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తారు.
భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లయిపోవడం తప్పదు. సదరు ప్రేమికులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం జరిపించేస్తారు. అంతేకాదు.. కాలం మారుతున్న కొద్దీ వీరు అనుసరించే పెళ్లి పద్ధతుల్లో కూడా మార్పులొచ్చాయి. గత సంవత్సరం భజరంగ్ దళ్ సభ్యులు వారి వెంట పూజారిని కూడా వెంట బెట్టుకుని తిరిగారు.
ప్రేమికుల రోజుకి అసలు సిసలు బద్ధశత్రువులు పాకిస్థాన్‌లో ఉన్నారు. పాకిస్థాన్‌లో ఏకంగా ఆ రోజున ‘సిస్టర్స్ డే’గా నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్‌లోని ఒక విశ్వవిద్యాలయం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న సిస్టర్స్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ రోజున విద్యార్థినులకు అబ్బాయిలు స్కార్ఫ్‌లు, బురఖాలను కానుకగా ఇస్తారు. దీనితో పాటు వారికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని హామీ కూడా ఇస్తారు. ఈ తంతు ఆ విశ్వవిద్యాలయ వీసీ పర్యవేక్షణలో జరుగుతుంది.

ఆ ప్రేమతత్త్వం జగతికి ఆదర్శం..

ప్రేమించమని అర్థించటం, వేధించటం కంటే ఆత్మగౌరవ హీనత మరొకటి లేదు. ఎదుటివారు మనల్ని ఇష్టపడేట్లు మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఇతరులకు కష్టాన్ని కలిగించకూడదు. ఆదర్శంగా వుండాలి. మార్గదర్శకంగా ఉండాలి. ప్రేమికులు ఎప్పడూ పరస్పరం పోట్లాడుకోకూడదనే అనుకొంటారు. నిజమైన ప్రేమలో తాత్కాలిక కలహాలు సహజం. కానీ ఇవి శాశ్వతం కాదు. మనం ఒకరికిచ్చే ప్రేమ మళ్లీ మనకు ప్రేమను ఇస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకోవడం ఎంతో మహత్తరమైన కార్యం. ఈ భూమిపైకి స్వర్గం దిగివచ్చినంత పవిత్రమైన కార్యం.
ఏది ఏమైనా అప్పటికీ ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్ర్తిమూర్తి రాధ. ఇంకెవ్వరికీ ప్రేమంటే తెలియదు. తెలుసని భ్రమిస్తారు అంతే.. లోకంలో ఉన్నవి కామమూ, స్వార్థమూ మాత్రమే.. ప్రేమనేది ఈ లోకంలో లేనేలేదు. లోకులెవ్వరికీ ప్రేమ అనేది తెలియనే తెలియదు. తెలుసనుకుంటే అది పిచ్చి భ్రమ మాత్రమే.. కొంతమంది స్నేహాన్ని ప్రేమనుకుంటారు. కొందరు కోరికను ప్రేమనుకుంటారు. మరికొందరు అభిమానాన్ని ప్రేమనుకుంటారు. ఇంకొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు. అవసరాన్ని ప్రేమనుకునేవారు ఎందరో ఉంటారు. ఎక్కువమంది మాత్రం కామాన్ని ప్రేమగా భావించి మోసపోతారు. నిజానికి వీటన్నింటి వెనుకా ఉండేది మాత్రం స్వార్థమే.. సిద్ధిస్తున్నది.
రాధాకృష్ణులు అనే పదం అవిభాజ్య పదం.. జంట.. రాధ అనే పదం ఉంటే కృష్ణుడు ఉన్నట్లే.. కృష్ణునికి అష్ట్భార్యలు, 16 వేల మంది గోపికలున్నా రాధ మాత్రమే కృష్ణుడి ప్రేమ సామ్రాజ్ఞి.. ఇప్పుడంటే ప్రేమికుల దినోత్సవాలు వంటివి వచ్చాయ కానీ కృష్ణ ప్రేమతత్త్వం మాత్రం ద్వాపరయుగం నాటిది. ఇప్పటి ప్రేమికులు శాశ్వతంగా అలాగే మిగిలిపోతారో, ఐక్యమవుతారో తెలీదు కానీ రాధాకృష్ణుల ప్రేమ మాత్రం అజరామరం.. అమలినం.. వారిరువురి బంధం మనసుకే పరిమితం.. కృష్ణుడు రాధ ప్రేమతత్త్వం అయితే.. కృష్ణుని యొక్క సర్వగతచైతన్యం రాధ.. రాధాకృష్ణుల రాసలీలలు మోక్షానికి ఉద్దేశించినవే.. ఆమె హృదయ స్పందనలోనూ నందబాలుడే గోచరమవుతాడు.. విరహం వేధిస్తున్నా రాధమ్మ కృష్ణుడ్ని బాధించదు.. ఆమెకు తెలుసు, కన్నయ్య తనకే కాక, ఈ సర్వ జగత్తుకూ నాథుడని, జగన్నాథుడని.. ఒకరిలో ఒకరు లీనమైన ఆ జంటకు విరహమనేదే లేదు.. ఎందుకంటే.. వారిరువురిదీ ఒకటే తత్త్వం.. ఏకత్వం.. ప్రేమతత్త్వం.. కృష్ణుని స్మృతుల్లో రాధకు మనసు పులకాంకితమైతే, రాధను తలచుకున్న వెన్నదొంగకు మేను రోమాంచితమవుతుంది.. పొన్నలు నిండిన బృందావనం, వెనె్నల రాత్రులు, మురళీనాదం, యమునాతీరం.. వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు.. కృష్ణుని యశోదా తనయునిగా, రేపల్లె ముద్దుబిడ్డగా, పాండవోద్ధారకునిగా, రాయబారిగా, అర్జునుని మార్గదర్శకునిగా, రథసారథిగా, మహామహిమాన్వితమైన గీతోపదేశకునిగా.. ఎన్ని తీరుల్లో మనం ఆరాధించినా కృష్ణప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే ప్రేమిక ‘‘రాధ’’. వారి ప్రేమతత్త్వం జగతికి ఆదర్శం.. తరతరాలూ మరువలేని కావ్యం..

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి