S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫోన్ ముందు పెట్టుకుని

మల్టీమీడియా అని ఒక మాట ఉంది. అక్షరాలు, అంటే పుస్తకాలు, లేఖలు ఇలాంటి దస్తావేజులు అన్నీ కంప్యూటర్‌లో ఉంటాయి. ఆడియో అంటే ధ్వని కూడా కంప్యూటర్‌లోనే ఉంటుంది. నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్‌లో రికార్డ్ చేసిన అంశాలను నా బ్లాగ్‌లో కూడా వినిపించాను అంటే అందులో ముక్క కూడా అబద్ధం లేదు. రికార్డ్ చేసిన మాట పాట ఏదైనా అందులోని నాణ్యత పెంచడం అనవసరమైన ధ్వని లేదా ఇతర అంశాలను తీసివేయడం, అది ఒక విద్య. మీడియాలో మూడవ అంశంగా వీడియో గురించి చెప్పుకోవాలి. వీడియో ఎడిటింగ్ కష్టమవుతుంది కానీ అసాధ్యం మాత్రం కాదు. అందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉండాలి. అదొక్కటే కష్టం. ఇక చిత్రాల సంగతి! రకరకాల బొమ్మలను, రకరకాలుగా మార్చి, చేర్చి పంచుకోవడం కంప్యూటర్‌లో పిల్లల ఆటగా జరుగుతున్నది. ఈ మధ్యన ప్రతి స్మార్ట్ఫోన్ ఒక కెమెరాగా మారిన తర్వాత ఫోటోగ్రఫీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. నేను దశాబ్దాల నాటి ఫోటో ఎడిటింగ్ కూడా చేశాను. అంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మొత్తానికి మల్టీమీడియా నాకు బాగా చేతనవును అని సగర్వంగా చెప్పగలను.
కంప్యూటర్ గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంటర్నెట్ అన్న మాట ఒక్కసారి కూడా రాలేదు. ఇంటర్నెట్ లేనప్పుడు కంప్యూటర్ ఒక పద్ధతిగా ఉంటే అది వచ్చిన తరువాత కంప్యూటర్ పద్ధతి పూర్తిగా మారిపోయింది. ప్రపంచమంతా ఒకటే అయిపోయింది.
గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచం సర్వనాశనం అయింది అని చాలామంది అంటూ ఉంటారు. నాకు ఆ మాట నచ్చదు. గ్లోబలైజేషన్ కారణంగా వచ్చిన కొన్ని అంశాలను మనం నేర్చుకుని వాడగలిగితే ఈ ప్రపంచం అంతా మన అరచేతిలోకి వస్తుందని అనుభవపూర్వకంగా చెప్పగలరు. ఇవాళ భక్తి, మతం, దేశం మొదలు ఎన్ని సంగతులు అయినా సరే కంప్యూటర్ ద్వారా అందరికీ అందుతున్నాయి. అయితే ఆయా విశేషాలను నాలాంటి ఎవరో ఒకరు కంప్యూటర్లకు అందించాలి. ఇంటర్నెట్ తనకు తానుగా కంటెంట్ అనే సమాచారాన్ని సేకరించలేదు. తయారుచేయడం అంతకన్నా చేతకాదు. చేతనైన వాళ్లు సమాచారాన్ని అందిస్తూ ఉంటే అది ప్రపంచంలో అందరికీ అందుతుంది.
ఈ కాలంలో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అందరూ ఒక ఫోన్ ముందు పెట్టుకుని అందులో ఏదో వీడియో చూస్తూ ఉంటారు. మంచాన పడి ఉన్న ఒక ముసలమ్మ గారు తనకు వాట్సాప్ ఉండే ఫోన్ కావాలి అని అడిగింది. నాకు మళ్లీ ముఖంలో సుడులు తిరిగాయి. అంటే ఫ్లాష్ బ్యాక్ అని అర్థం.
ఇంటర్నెట్ మొదలైనప్పుడు ఒక మిత్రునితో వెళ్లి యాహూ అనే మాట నేర్చుకొని వచ్చాను. ఆ తర్వాత సత్యం కంపెనీ వాళ్లు సి.డి.ల ద్వారా ఇంటర్నెట్ సమయం అమ్మేవారు. కంప్యూటర్‌కు టెలిఫోన్ తీగ తగిలించి ఆ సీడీలు పనిచేయిస్తే రెండు మూడు గంటలు ఇంటర్నెట్ వ్యవధి దొరికేది. ఉన్న సమయం తక్కువ కనుక చూడవలసిన పేజీలను సేవ్ చేసుకుని, కనెక్షన్ కట్ చేసి ఆ తర్వాత చదువుకునే వాళ్లం.
చెబితే నమ్మరు. ఇవాళ రౌటర్ పేరున ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్న ఒక పరికరాన్ని మా మిత్రులు కొందరు హైదరాబాద్‌లోనే తయారుచేశారు. ఆ యంత్రాన్ని పూణేలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో మేము అప్పటి కేంద్ర మంత్రి, సిద్ధ వైద్య నిపుణుడు ఎం.జి.కె. మీనన్ గారి చేత ఆవిష్కరింపజేశాము.
నెమ్మదిగా రోజులు మారాయి. ఇంటర్నెట్ తీరు కూడా మారింది. ఇవాళ ఇంటర్నెట్ లేకపోతే బ్రతుకులు గెలవలేని పరిస్థితి వచ్చింది. మొత్తం వ్యాపారం ఇంటర్నెట్ ఆధారంగా జరుగుతుంది. బ్యాంకుల వ్యవహారాలు ఇంటర్నెట్ మీదనే జరుగుతాయి. క్రెడిట్ కార్డులు, ఎ.టి.ఎం.లు లాంటివన్నీ నిత్యావసరాల కిందికి మారిపోయాయి. ప్రభుత్వాలు కూడా పల్లెపల్లెకు ఇంటర్నెట్ ఇస్తామని పరుగులు పెడుతున్నారు. ఇస్తున్నారు కూడా.
కొంత కాలం ఇంటర్నెట్ కంప్యూటర్‌కు మాత్రమే పరిమితమై ఉండేది. పరీక్ష ఫలితాలు వచ్చాయి అంటే అందరూ వెబ్‌కేఫ్‌ల వైపు పరుగులు పెట్టే వారు. స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా చాలా తగ్గిపోయాయి. కానీ బాగా అలవాటు అయిన తరువాత ఇప్పుడు మళ్లీ ధరలు పైకి పెరుగుతున్నాయి. వాట్సప్ లేనిదే, ఫేస్‌బుక్ లేనిదే ఎవరికీ రోజు గడవడం లేదు. మత్తుమందులాగా అవి అలవాటయిపోయాయి. స్క్రీన్ టైం అని ఒక మాట వచ్చింది. మనుషులతో మాట్లాడే కన్నా ఒక స్క్రీన్ కళ్లముందు పెట్టుకుని బతికే సమయం బాగా ఎక్కువైపోయింది. ఇంట్లో పిల్లలను భోజనానికి పిలవాలంటే అరిచి లాభం లేదు. వాళ్లు బహుశా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు. కనుక వాళ్లకు మెసేజ్ పంపిస్తే భోజనానికి వస్తారు! పరిస్థితి అక్కడికి వచ్చింది. కొంతకాలం ఇంటర్నెట్ కనెక్షన్ గురించి రకరకాల పద్ధతులను అందించడానికి చాలా కంపెనీలు ప్రయత్నించాయి. అప్పట్లో ఒక కంపెనీ వారు హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఆఫీసు పెట్టి తీగల అవసరం లేకుండా ఇంటర్నెట్ ఇస్తాము అన్నారు. ఆ రంగంలో తలమునకలుగా పనిచేస్తున్న మేము కూడా ఆశ్చర్యపోయాము. ఇవాళ చిన్న, పెద్ద కంపెనీల వాళ్లు పోటీ పడి ఇంటర్నెట్ సర్వీసులు అందజేస్తున్నారు. ఒకే తీగలో టెలిఫోన్, టెలివిజన్, ఇంటర్నెట్ సౌకర్యాలను అందజేస్తున్నారు. ప్రపంచం పనిచేస్తున్న తీరు మారిపోయింది. కొంతకాలానికి ప్రపంచాన్ని గూగుల్ అంటారు అని ఈమధ్యనే ఎవరో చమత్కరించారు. నాకు చటుక్కున ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఇంట్లో ఎందుకో జీన్ పాంట్స్ గురించి చర్చ వచ్చింది. ఎవరు కనుగొన్నారో కానీ అని ఒక మాట వినిపించింది. మా అమ్మాయి చటుక్కున లేచి లోపలికి వెళ్లింది. ఇదంతా జరిగి చాలా కాలం అయింది అని చెప్పడం మరిచాను. ఆమె బయటికి వచ్చి లీవైస్ స్ట్రౌస్ గురించి చెప్పింది. ఈ కాలంలో ఏ పని కావాలన్నా ఇంటర్నెట్ సాయంతో చాలా సులభంగా జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్లండి బయలుదేరితే ఎవరిని దారి అడగనవసరం లేదు. జి.పి.ఎస్. ఉంటే చాలు. నేరుగా వెళ్లవలసిన చోటికి వెళ్లిపోవచ్చు. ఎంత దూరం తర్వాత ఎటు వెళ్లాలి అన్న సలహాలు కూడా వినిపించే వీలు ఉంది. అందరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సంగతులను గురించి నేను ఇక్కడ కొత్తగా చెప్పడం నాకే నచ్చడం లేదు.
కొంత కాలం క్రితం ఒక మిత్రుడు ఇంటికి వచ్చాడు. నేను కూడా కంప్యూటర్ కొనాలని అనుకుంటున్నాను అన్నాడు. దాన్ని ఏ రకంగా వాడాలి అనుకుంటున్నారు అని నేను అడిగాను. నేను కాదు, మా అబ్బాయి వాడుకుంటాడు అన్నాడాయన. నాకు నిజంగా ఆ మనిషి మీద జాలి వేసింది. కంప్యూటర్ వాడడం నేర్చుకుంటే ఈమధ్య నా బ్రతుకు సులభం అవుతుంది. మాయావిడ గారు మెడికల్ కాలేజీలో తాము చెప్పే పాఠాలను ఇంట్లో ప్రజెంటేషన్‌లుగా తయారుచేసుకుని, వాటిని అక్కడ చూపిస్తూ పాఠాలు చెబుతున్నారు. ఆమెగారికి నిజానికి కంప్యూటర్ మీద పట్టు దొరకలేదు. కానీ, నా వంటి ఒక భర్త దొరికాడు. మధ్య రాత్రి వచ్చి ఏదో కావాలని ఆవిడ అడుగుతారు. నేను చికాకు పడుతూనే ఆ పని చేసి పెడతాను. కంప్యూటర్ కారణంగా ఆవిడ పనితనం మరింత మెరుగవుతుంది అన్నది నాకు ఆనందం కలిగించే విషయం.
ఒకప్పుడు నేను పెద్ద వాళ్ల కోసం ఒక కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్ర మహిళా సభ వారికి సూచించారు. పెద్దవాళ్లకు ఈమెయిల్ వాడడం నేర్పించాలి. కంప్యూటర్‌లో పుస్తకాలు వెతికి చదవడం నేర్పించాలి. పాటలు, సినిమాలు చూడడం నేర్పించాలి. ఇక వాళ్లకు రేడియో, టెలివిజన్, పుస్తకాలు వెతికి చదవడం నేర్పించాలి. పాటలు, సినిమాలు చూడడం నేర్పించాలి. ఇక వాళ్లకు రేడియో, టెలివిజన్, పుస్తకాలు అందులోనే అందుతాయి. ఒక చిన్న లాప్‌టాప్, లేదా ఒక టాబ్లెట్ సంపాదించుకుంటే చాలు, వాళ్ల బతుకులు సంతోషంగా గడుస్తాయి. ఎవరిమీదా ఆధారపడవలసిన అవసరం ఉండదు. పిల్లలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్లతో ప్రతినిత్యం కూడా మాట్లాడుకోవచ్చు. ఈ విషయం ఇంకా చాలామందికి అర్థం కావడం లేదు.
సాంకేతిక శాస్త్రం వస్తుంది. దాన్ని వాడుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ సాంకేతిక శాస్త్రం వచ్చిన మొదలు దాన్ని చెడు సంగతులకు వాడుకుంటారు అన్నది అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. అచ్చు యంత్రం వచ్చిన తరువాత మొదట బైబిల్ అచ్చు వేశారు. అచ్చు వేసిన రెండవ పుస్తకం బూతు కథలు. కెమెరా వచ్చిన తర్వాత అనవసరమైన బొమ్మలన్నీ అందులోకి ఎక్కాయి. వీడియో కెమెరాలు వస్తే అందులో మరింత ఎక్కువగా ఎక్కింది. లేకపోతే వెలుతురు తక్కువగా ఉన్నా పనిచేసే కెమెరాలో అవసరం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
కంప్యూటర్ వచ్చిన తరువాత మాత్రం, ముందుగా చాలా ఎక్కువ విషయాలు ఉపయోగకరమైనవి వచ్చాయి. నెమ్మదిగా అందులో కూడా అనవసరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. వాటితో సమస్యలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఈ ప్రపంచంలో పువ్వులు ఉన్నచోటే ముళ్లు కూడా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ మొక్కలు, ఆకులు, పువ్వులు మొదలైన అందాలను మనం అందుకోగలిగారు. కంప్యూటర్ వాటర్ నాకు తెలియదు అన్న వారంతా ఒకసారి తమని తాము ప్రశ్నించుకోవాలి. ఇవాల్టి ప్రపంచంలో కంప్యూటర్ తెలిస్తే ఎంతో వెసులుబాటు ఉంటుంది అన్నది అనుమానం లేని సత్యం.

-కె.బి.గోపాలం