S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శని వల్లనే మనం కర్మయోగులం

చీకటి వెలుగుల సంయోగ గ్రహం శని. కాబట్టే యోగ సాధకులమైన మనం శనిగ్రహంతో స్నేహించే విషయంలో అత్యంత పట్టుదలతో సాధన సాగించవలసి ఉంటుంది. భౌతికం నుండి దృష్టి మరలితేనే శని విషయంలో సాధన మునుముందుకు సాగేది. భౌతిక ఒత్తిడులకు తలవంచకుండా తల ఎత్తుకు తిరగగలిగితేనే శని యోగ సాధనలో మనకు చేరువ అయ్యేది.
సర్వసాధారణంగా శని భౌతిక ఆసక్తులను వేటినీ కాదనడు. ఇంకా చెప్పుకోవాలంటే వాటి విషయంలో మరికొంత ఆశను పెంచుతాడు. ఒక విధమైన పట్టుదలను పెంచుతాడు. ఇటువంటి శని ప్రభావానికి ప్రతి ఒక్కరం లోనుకావలసిందే. ఇదే మనల్ని యోగపరంగా ముందుకు నెడుతుంది. ఒక విధంగా ఒంటరితనానికి, ఏకాంత వాసానికి చేరువ చేస్తుంది. ఇలా శని మనల్ని కర్మయోగుల్ని చేస్తుంది.
మన జాతకంలో శని సరైన స్థానంలో ఉంటే భౌతిక బంధాల నుండి సులభంగా మరలగలుగుతాం. దృఢ స్వభావం కలిగి ఉంటాం. ఇటువంటి స్వభావం కలిగి ఉండటం వల్ల పట్టుదలగా అనుకున్నది సాధించగలం... బంధాలు బాధించవు కాబట్టి లక్ష్యాలను చేరుకోగలం.
సామాన్యంగా శని దశలో ఆలోచనలు భౌతిక బంధాల నుండి తప్పించుకునే వైపు సాగుతుంటాయి... కారణం మరింతగా శ్రమించవలసి రావటమే. లేదా ఎక్కడికయినా పారిపోవాలని ఆలోచించటమూ సహజమే. అంటే శని ప్రభావం వల్ల ఒంటరితనాన్ని కోరుకుంటామన్న మాట. ఈ ఒంటరితనమే ఆథ్యాత్మిక వాకిలిలో నిలుపుతుంది... యోగభూమికల గుమ్మంలో నిలబెడుతుంది. ఒక్కసారి ఆ తలుపులను తెరవగలిగితే చాలు చక్కగా అక్కడే స్థిరనివాసం సాధ్యమవుతుంది. భౌతిక బంధాల పైన ఏవగింపు కలగదు... సంయమనంతో వర్తించటం సాధ్యమవుతుంది. సాధనకు సంసారాన్ని త్యజించవలసిన అవసరం లేదని తెలిసొస్తుంది.
కొత్తకోణాల ఆవిష్కర్త
నిజానికి మనల్ని మనం సమీక్షించుకోవటానికి, గతాన్ని నెమరేసుకోవటానికి, భవిష్యత్తును వర్తమానంతో ముడిపెట్టుకోవటానికి అవకాశం దొరుకుతుంది. అంటే శని ఇలా మన కల్లు తెరిపిస్తాడన్న మాట. జీవితంలో మనం పట్టించుకోని కోణాల్ని చూపించేది శని మాత్రమే. శని నెమ్మదస్తుడు కావటం వల్ల మనం దేనికీ తొందరపడం. పైగా ఆలోచించుకునేందుకు కావల్సిన సమయం దొరకటం వల్ల చక్కగా ఆచి తూచి అడుగులు వెయ్యగలం. అంటే చక్కటి ప్రణాళికతో, నిర్మాణాత్మకంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
ఇలా శని ప్రభావంతో ఉన్నతిని సాధించాలంటే మనం చేయవలసింది మంత్రాలు తంత్రాలు, గ్రహ శాంతులు, పూజలు పునస్కారాలు, దానాలు ఇవ్వటాలు కాదు. ఉంగరాలలో ఖరీదైన రాళ్లను పొదివి ధరించటం కాదు చేయాల్సింది... శనితో స్నేహించాలి. చేతిలో చెయ్యి వేసో, భుజంపై చేతులు వేసో నడక సాగిస్తేనే కదా పడ్డ అడుగులు బలపడేది... స్నేహం విరబూసేది.
ఎప్పుడయితే శని మనకు అర్థమవుతాడో, సన్నిహితమవుతాడో గురువులా మనకు మార్గదర్శి అవుతాడు. ముందుచూపుతో వర్తించేలా చేస్తాడు. భౌతిక బంధాలకు ఒక రక్షణ రేఖను గీసే వాడవుతాడు. అంటే భౌతిక జీవితానికున్న హద్దులు తెలిసొచ్చేలా చేసేవాడు శని. అలా ప్రాపంచిక సుఖ భోగాల నుండి విముక్తం చేసేవాడు శని. అంటే బాధలకు నివారణోపాయం చూపేవాడు శని.
శనికి సన్నిహితులు సాధువులు, సాధకులు
అన్నట్టు శనికి సన్నిహితులు సాధువులు, సాధకులు. అలా సాధక మండలిలో మనకు స్థానం దక్కాలంటే మనమూ మన అహంకారాన్ని పక్కనపెట్టి సాత్వికులం కావలసిందే. భౌతిక కామనలపై చిన్న చూపు ఏర్పడవలసిందే. పరంపై దీర్ఘ దృష్టి పడవలసిందే. అసలు ఇతర గ్రహాలకు శనికి ఉన్న వ్యత్యాసం మనకు అవగతం కావాలి. ఇతర గ్రహాలు మన దృష్టిని ప్రాపంచిక ఆసక్తుల వైపు మళ్లిస్తుంటే, శని మాత్రం భౌతిక ఆసక్తులకు అత్యల్ప ప్రాముఖ్యతనిస్తాడు. వివేకంతో వర్తించేలా చేస్తాడు. కష్టానికి తగ్గ ఫలితాన్నిస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని ఇస్తాడు. అవును, శని గురువులకే గురువు.
శని మనల్ని రాకుమారుల్ని చేయడు... కలల్లో విహరింపచేయడు... సినిమా హీరోల్ని చేయడు... కోరికల గుర్రాలను ఎక్కించడు.. కనకపు సింహాసనం పైన కూర్చోపెట్టడు. నీ కుర్చీ నువ్వే వేసుకుని కూర్చునేలా చేస్తాడు. అది నీ బలం.

-విశ్వర్షి 93939 33946