S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జైలే కోర్టు (భగత్‌సింగ్-28)

పరాయి ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా దేశవాసుల నిరసన ప్రకటించటానికి కదా భగత్ బృందం అన్నిటికీ తెగించి చట్టసభలో బాంబులు వేసింది? వారి తెగువను దేశం ఎలా చూసింది? దేశంలోని పెద్దలు, మేధావులు ఆ సాహసకృత్యానికి ఎలా స్పందించారు?
జాతీయ వీరులకు ఘన నీరాజనాలిచ్చే మాట దేవుడెరుగు. కనీసం ఒక మంచి మాటకే తెరువులేదు. చెయ్యకూడని పనిచేసి దేశానికి తలవంపులు తెచ్చారని తిట్టిపోసినవారే పెద్ద మనుషులు దాదాపు అందరూ.
భారతదేశంలో ఆ సమయాన నెంబర్ వన్ విలన్ భగత్‌సింగే!
దిక్కుతోచని గందరగోళంలో ఏప్రిల్ 8న వాయిదాపడ్డ సెంట్రల్ అసెంబ్లీ 11న మళ్లీ కొలువుదీరిన వెంటనే సభాపతి విఠల్‌భాయ్ పటేల్ లేచి -

‘ఒక పెద్ద విషాదపు ఛాయలో ఇవాళ మనం కలిశాం. దేవుడి దయ మన మీద లేకపోయి ఉంటే ఏమయ్యేదో ఊహించటం కష్టం కాదు. ఇంకా తీవ్ర నష్టం వాటిల్లనంత మాత్రాన దారుణ అఘాయిత్యాన్ని గర్హించకుండా, ఖండించకుండా ఉండలేము. ఈ దురాగతాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాలన్నదే ఈ సభ అభిప్రాయమని విశ్వసిస్తూ మీ ముందు ఈ తీర్మానం ఉంచుతున్నాను:
‘ఈ నెల 8వ తేది ఉదయం ఇక్కడ జరిగిన దారుణ అఘాయిత్యానికి ఈ సభ తీవ్ర జుగుప్సను, ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నది. గాయపడ్డ సర్ బొమాన్‌జీ దలాల్‌గారికి, ఇతరులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నది. జరిగిన ఘాతుకాన్ని మనస్ఫూర్తిగా ఖండిస్తున్నది. ఇటువంటి నేరాలు ఇక ముందు జరగకుండా నివారించడానికి అధికారులు తీసుకునే సహేతుకమైన చర్యలన్నిటికీ తన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నది.’

- అని ప్రతిపాదించిన వెనువెంటనే అధికారులు, అనధికారులు... ప్రభుత్వ సమర్థకులు, వ్యతిరేకులు అన్న తేడా లేకుండా అన్ని పార్టీల, అన్ని బాపతుల సభ్యులూ పై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
తాము ఉన్నచోట బాంబు పేలినా తమకు ఏమీ కాలేదు అంటే దేవుడి దయ వల్ల, తమ ఆయుస్సు గట్టిది కాబట్టి ప్రాణగండం తప్పిందనే ఎవరైనా అనుకుంటారు. బాంబు విసిరిన వాడికి తమను చంపే ఉద్దేశం లేదు కనుకే తాము క్షేమంగా బయటపడగలిగామన్న ఆలోచన ఎవరికీ రాదు. బాంబు దాడికి గురి అయిన పార్లమెంటు సభ్యులు ఆ దాడిని దారుణ దురాగతమని కసితీరా ఖండించటం సహజమే.
కాని వారందరూ ప్రాణాలు దక్కించుకోగలిగింది దాడి చేసిన వారి దయవల్ల కూడా! ఆ సంగతి పగవాడు అయిన వైస్రాయ్‌కి అర్థమైంది. దుర్ఘటన జరిగిన వెంటనే లార్డ్ ఇర్విన్ ఒక స్పెషల్ స్టేట్‌మెంటు జారీ చేశాడు. ఎవరూ చావకుండా ‘ఇద్దరు దుండగులు’ తగు జాగ్రత్తలు తీసుకున్నారు; కావాలనుకుంటే వారు భయానక విధ్వంసం చేయగలిగేవాళ్లే; వారు గురిపెట్టింది ‘వ్యవస్థ’ మీదే తప్ప వ్యక్తుల మీద కాదు - అని ఆ ప్రకటనలో వైస్రాయి అంతటివాడే అంగీకరించాడు. మరి జరిగినదంతా గమనించిన జాతీయ పత్రికలు ఏమన్నాయి? విప్లవకారుల సాహసానికి ఎలా స్పందించాయి?
పత్రికలు పార్లమెంటు కంటే తీవ్రంగా తిట్టిపోశాయి.
‘ఈ నేరాన్ని రాజకీయ నేరం అనడానికి ఎంత మాత్రం వీలులేదు. ప్రతి పార్టీకి చెందిన ప్రతి మనిషీ దీనిని గర్హించాలి. ఎందుకంటే ఇది విచ్చలవిడిగా ప్రాణాలు తీయడానికి ఉద్దేశించినట్టది. పిరికిపందలు చేసిన అకృత్యమిది... దీని వెనక హింసాత్మకమైన పెద్ద కుట్ర ఏదో ఉండి ఉండవచ్చు. అదే నిజమైతే ఈ పెను సవాలును తగురీతిలో ఎదుర్కొనవలసిందే. నిర్దాక్షిణ్యంగా అణచివేయవలసిందే. హంతకుల పన్నాగాన్ని ఎంత మాత్రమూ సాగనివ్వరాదు’ అంటూ ‘ది స్టేట్స్‌మన్’ దినపత్రిక మండిపడింది.
‘్భరతదేశాన్ని ఎల్లకాలం పరాధీనంగా ఉంచడానికే వీళ్లు కంకణం కట్టుకున్నట్టుంది. ఇటువంటి దురాగతాల వల్ల వ్యతిరేక శక్తులు ఇంకా బలపడతాయి. రాజ్యాంగబద్ధంగా స్వాతంత్య్రం కోసం పాటుపడుతున్న పార్టీకి పరిస్థితి ఇంకా సంక్లిష్టమవుతుంది. పార్లమెంటులో బాంబు వేయటం ద్వారా ప్రభుత్వాన్ని పెళ్లగించగలనని భావించిన వాడికి లోకజ్ఞానం లేదు. చరిత్ర తెలియదు. రాజకీయ వివేకం బొత్తిగా లేదు’ అని చడామడా దులిపేసింది జాతీయ దినపత్రిక ‘ది ట్రిబ్యూన్’.
‘సంస్కరణల కోసం పని చేస్తున్న మాలాంటి వాళ్లకి ఇలాంటి పిచ్చి పనులు చెడ్డపేరు తెచ్చిపెడతాయి’ అని చిరాకు పడింది అనీబిసెంటమ్మ. దేశమంతటా రాజకీయ వాదులు, పత్రికల వారు, మేధావులు అందరిదీ ఒకటే మాట! సెంట్రల్ అసెంబ్లీలో బాంబులేయటం నిష్కృతిలేని నేరం; మతిమాలిన మహాపాపం - అని.
అసెంబ్లీ బాంబు ఘటనకు ముందు భగత్‌సింగ్ ఎవరో దేశం ఎరుగదు. అంతవరకూ అతడు చేసినవన్నీ రహస్య కార్యకలాపాలు. వాటికి ప్రచారం వస్తే ప్రమాదం. కాబట్టి దగ్గరి వారికి, తోటి విప్లవకారులకు మాత్రమే అతడేమిటో తెలుసు. అసెంబ్లీలో బాంబుతో యావద్భారతం ఉలిక్కిపడేలా ఉన్నట్టుండి భగత్ జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఇక తరవాత జరిగింది చరిత్ర. నమ్మశక్యం కాని అద్భుతలీల. భగత్‌సింగ్ నోరువిప్పాక తిట్టిననోళ్లు మూతపడ్డాయి. దుందుడుకు దుండగీడు అని తెగనాడిన వాళ్లే అతడిని మించిన దేశభక్తుడు లేడని నోరార పొగిడి నెత్తిన పెట్టుకున్నారు. ‘లోకజ్ఞానం లేని, చరిత్ర తెలియని, రాజకీయ అవివేకి, దేశానికి ప్రమాదకారి’ అని మొదట దూషించిన ‘ట్రిబ్యూన్’ పత్రికే రెండు సంవత్సరాలు తిరగకుండా భగత్‌సింగ్ ఉరికంబమెక్కినప్పుడు అతడి ఘనకీర్తిని ఇలా ప్రస్తుతించింది:
The name of Bhagat Singh... became a household
word over a large part of the country, and for months, "Bhagat Singh Zindabad' became a common cry in the mouths of tens of thousands of people, including even small children who had just stepped out of the cradle.
(దేశవంతటా భగత్‌సింగ్ పేరు ఇంటింటా మారుమోగింది. ‘్భగత్‌సింగ్ జిందాబాద్’ నినాదం లక్షల మంది నోట వినిపించింది - పాలబుగ్గల పసివాళ్లతో సహా.)
దానిదేముంది? మన కాలాన పార్లమెంటు మీద బాంబు దాడికి దిగిన అఫ్జల్‌గురుకు కూడా దేశంలో పెద్ద భక్త బృందం, అభిమాన గణం పోగయ్యాయి కదా - అని సందేహించకండి. ఈ కాలపు ‘గురు’్భక్తులు మతిచెడ్డ మేధావులు. కల్తీలేని జాతి వ్యతిరేక శక్తులు. భగత్‌సింగ్‌ని పటం కట్టి పూజించిన వారు నిండయిన దేశభక్తులు. అతడికీ, అఫ్జల్‌గురుకూ నడుమ మేరు పర్వతానికీ, పెంటకుప్పకూ ఉన్నంత తేడా ఉంది.
బ్రిటిషు దొరతనం కక్షగట్టి కాలరాయజూసినా భగత్‌సింగ్ పగవారి కళ్ల ముందే ఎంతలా ఎదిగిపోయాడో ఆ కాలపు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారి H.W.Hale చెబుతాడు వినండి:

Bhagat Singh... became a national hero and his exploits were freely lauded in the nationalist press; so that for a time, he bade fair to oust Mr.Gandhi as the foremost political figure of the day. His photograph was to be met with in many homes, and his plaster bust found a large market.
[Political Trouble in India, 1917-37, H.W.Hale, p.64]

(భగత్‌సింగ్ జాతీయ వీరుడు అయిపోయాడు. అతడి ఘనతను జాతీయవాథ పత్రికలు ధారాళంగా పొగిడాయి. ఎంతగా అంటే, ఒక సమయాన దేశంలోని అత్యంత ప్రధాన రాజకీయ మూర్తిగా పలుకుబడిలో అతడు గాంధీగారినే మించిపోయాడు. అతడి ఫొటో ఇంటింటా కనిపించింది. ప్లాస్టరుతో తయారైన అతడి బస్ట్‌సైజ్ విగ్రహానికి పెద్ద మార్కెట్ ఉండింది.)

1929 ఏప్రిల్ 8న అరెస్టయింది లగాయతు 1931 మార్చి 23న ఉరితీయబడేదాకా పక్షం రోజులు తక్కువగా రెండు సంవత్సరాలు భగత్‌సింగ్ జీవితమంతా జైళ్లలోనే గడిచింది. కోర్టుల చుట్టూ తిరగడంతోటే సరిపోయింది. ఆ నిర్బంధిత కాలమే భగత్ కీర్తి కిరీటానికి కలికితురాయి అయింది. యమ సదనాల్లాంటి కారాగారాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో, అమానుషమైన పోలీసు అత్యాచారాలను ఎదుర్కొంటూ, రాజ్యహింసను అహింసాత్మకంగా ప్రతిఘటిస్తూ, విదేశీ పాలకుల గుండెలదిరేలా జాతి జనుల హృదయాలు ఉప్పొంగేలా విప్లవవాణిని ఎలుగెత్తి వినిపిస్తూ భగత్‌సింగ్ సాగించిన ధీరోదాత్త పోరాటం జాతీయ వీరుల అగ్రశ్రేణిలో, ప్రపంచ విప్లవకారుల పాలపుంతలో అతడిని ధ్రువతారగా నిలబెట్టింది.
రాజకీయ వాదులు, పత్రికా వ్యాఖ్యాతలు, తక్కుంగల మేధావులు భగత్‌సింగ్ దేశభక్తిని, త్యాగనిరతిని పోల్చుకోవటంలో మొదట తొట్రుపడ్డారు. కాని సామాన్య ప్రజానీకానికి అతడి విషయంలో ఏనాడూ అపోహ లేదు. తెల్లవాళ్లు తమ అడ్డగోలు వలస దోపిడీకి చట్టబద్ధత, విశ్వసనీయత ఆపాదించుకోవటానికి పుట్టించిన పేరుగొప్ప చట్టసభ మీద సాధారణ జనానికి భ్రమలు లేవు. విశేష గౌరవ భావమూ లేదు. తెల్లరాకాసులకూ, వారి తైనాతీలకూ గుండెలదిరేలా మనవాళ్లెవరో సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేశారన్న కబురు విని ప్రజలు పులకించిపోయారు. ఆ అపూర్వ సాహసానికి తెగించిన వీరుల మీద అభిమానం, సంఘీభావం జనంలో వెల్లువెత్తింది. వారిని కళ్లారా చూడాలని, వారు చెప్పేది వినాలని ఎక్కడెక్కడివారూ ఉవ్విళ్లూరారు.
బ్రిటిషు ప్రభుత్వం ఆ సమయాన అసలే బెంబేలెత్తింది. గట్టి కాపలా ఉండే సెంట్రల్ అసెంబ్లీకి దుండగులు నిర్భయంగా చొరబడటమేమిటి? బరితెగించి బాంబులేయడమేమిటి? తరవాతయినా పారిపోవాలని చూడకుండా పోలీసులు వచ్చేదాకా అక్కడే నిలబడి, తమంతట తాము అరెస్టు కావటమేమిటి? ఇది ఎటువంటి కుట్ర? దీని వెనుక ఎవరున్నారు? ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు? ఏరికోరి పట్టుబడ్డవారు ఇంకే దుస్సాహసానికి ఒడిగట్టదలిచారు? ఆ కూపీలు లాగాలని భగత్‌సింగ్, బి.కె.దత్‌లను చెరో చోట నిర్బంధించి, నానావిధాల హింసించి, శతవిధాల వేధించారు. అయినా పిసరంత సమాచారం రాబట్టలేకపోయారు. ఈ నిస్సహాయతకు తోడు, ప్రజల్లోనూ విప్లవకారుల మీద అభిమానం కట్టలు తెంచుకుంటున్నట్టు కబుర్లందటంతో తెల్లవాళ్లు ఇంకా కంగారు పడ్డారు. విప్లవకారులను చూసి జనాలు రెచ్చిపోయి ఏ ఉపద్రవం తెచ్చిపెడతారోనన్న భయంవల్ల చట్టప్రకారం నిందితులను వెంటనే కోర్టులో హాజరుపరచడానికి కూడా పాలకులకు ధైర్యం చాలలేదు. ఢిల్లీ జిల్లా జైలులోనే మేజిస్ట్రేటు కోర్టు నెలకొల్పారు. బయటివారు రాకుండా తలుపులు బంధించి, భారీ బందోబస్తుతో విచారణ మొక్కుబడికి ఉపక్రమించారు.
1928 ఏప్రిల్ 22న విప్లవకారులిద్దరినీ ఢిల్లీ జైలుకు మార్చారు. అది తెలిసిన వెంటనే భగత్ తండ్రి కిషన్ సింగ్ కొడుకును చూడబోయాడు. ఎంత బతిమిలాడినా అధికారులు అతడికి అనుమతి ఇవ్వలేదు. 26న భగత్‌సింగ్ తండ్రికి ఉత్తరం రాశాడు: ‘‘నువ్వు ఇక్కడికి వచ్చినా అధికారులు నన్ను కలవనివ్వలేదని తెలిసి బాధపడ్డాను. ఈ జైలులోనే కోర్టు విచారణ జరుపుతారట. నువ్వేమీ భయపడకు. అంతా సవ్యంగానే జరుగుతుంది. నా తరఫున వాదించటానికి లాయరు అవసరం లేదు. కాని కొన్ని విషయాల్లో లీగల్ ఒపీనియన్ తీసుకుందామనుకుంటున్నాను. అవేవీ అంత ముఖ్యమైనవి కాదనుకో. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు తిలక్ ‘గీతారహస్యం’, నెపోలియన్ జీవిత చరిత్ర, కాసిని ఇంగ్లిషు నవలలు తీసుకురాగలవు. ద్వారకాదాస్ లైబ్రరీలో మంచి నవలలు దొరుకుతాయి. పెద్దలకు నా నమస్కారం, చిన్నలకు ఆశీస్సులు తెలియజేయగలరు’’ అంటూ.
భయపడాల్సిన అవసరం లేదని భగత్‌సింగ్ నిబ్బరంగా ఉన్నా బ్రిటిషు సర్కారు అతడి అంతు చూడటానికే నిశ్చయించుకుంది. భగత్‌సింగ్ చేతలను, వైఖరిని చూస్తే తెల్లవాళ్లకు 1909 నాటి మదన్‌లాల్ ధింగ్రా ధిక్కారం గుర్తుకొచ్చింది. లండన్‌లో సర్ విలియం కర్జన్ విల్లీని కాల్చి చంపిన ధింగ్రా కోర్టులో తన తరఫున లాయరును పెట్టుకునేందుకు, తన వాదన వినిపించేందుకు నిరాకరించాడు. దేశభక్తులైన ఎందరో యువకులను అమానుషంగా ఉరితీసినందుకు, ఎందరికో యావజ్జీవ ఖైదును అన్యాయంగా విధించినందుకు ప్రతీకారంగానే తాను ఇంగ్లిషు వాడి ప్రాణం తీసినట్టు లండన్ ‘డైలీ న్యూస్’ పత్రికలో ధింగ్రా స్టేట్‌మెంటు ఇచ్చాడు. ‘ఇప్పుడు ఇండియా నేర్చుకోవలసింది ఎలా మరణించాలన్నదే. దాన్ని నేర్పాలంటే ముందు మేము మరణించి చూపాలి.
దేశం విముక్తమయ్యేంతవరకూ మళ్లీ ఇదే తల్లి కడుపున పుడుతూ ఇలాగే మళ్లీ మరణించాలన్నదే నా కోరిక’ అంటూ అతడిచ్చిన ఉదాత్త సందేశం అప్పట్లో పెద్ద సంచలనం. భగత్‌సింగ్ కూడా ఇలాగే కోర్టు విచారణను తన ప్రచార వేదికగా వాడుకుంటాడేమోనని ప్రభుత్వం భయపడింది. జైలుకు వెళ్లే దారులన్నీ దిగ్బంధం చేసి, ఎల్లెడలా మఫ్టీ పోలీసులను, సిఐడిలను మోహరించి, అతి ముఖ్యమైన వారిని మాత్రమే అది కూడా నిలువెల్లా సోదా చేశాకే అనుమతించి, పత్రికల వారినీ సాధ్యమైన మేరకు గెంటేసి నానా తంటాలు పడింది.
దుండగులు వాడింది ప్రాణాలకు ముప్పుతేని తేలికరకం బాంబులు అని సాక్షాత్తూ వైస్రాయే ఒప్పుకున్నా పోలీసులు విప్లవకారుల మీద ఐ.పి.సి. 307 సెక్షను కింద హత్యాయత్నం కేసు మోపారు. భగత్‌సింగ్ తనంతట తానే లొంగిపోయి, జేబులోని పిస్టలును స్వచ్ఛందంగా పోలీసులకు ఒప్పగించినా అతడు రివాల్వరును ఝళిపిస్తూ తమను బెదిరించినట్టు, తామే సాహసించి అతడి చేతిలోని రివాల్వరును లాక్కుని బలవంతంగా అరెస్టు చేసినట్టు పోలీసులు కథ అల్లారు.
బాంబులు పేలి నెల నిండుతుండగా 1929 మే 7న ఢిల్లీ జైలులో విచారణ మొదలైంది. ఎఫ్.బి.పూల్ అనే అడిషనల్ డిస్ట్రిక్టు మేజిస్ట్రేటును అభియోగాల నిర్ధారణకు నియమించారు. పబ్లిక్ ప్రాసిక్యూటరు రాయబహుదూర్ సత్యనారాయణ ప్రభుత్వ పక్షాన కేసు నడిపాడు. తనకు న్యాయవాది అక్కర్లేదని భగత్ అన్నా తండ్రి లక్ష్యపెట్టకుండా యువ కాంగ్రెసు న్యాయవాది అసఫ్ అలీని తమ పక్షాన కుదిర్చాడు. భగత్‌సింగ్ తలిదండ్రులను, పినతండ్రి భార్యను కోర్టులోకి అనుమతించారు.
భగత్, దత్‌లు ఆది నుంచీ ధిక్కార ధోరణి కనపరచారు. కోర్టులోకి ప్రవేశిస్తూనే పిడికిళ్లు బిగించి, ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్య ముర్దాబాద్ అని దిక్కులు మారుమోగేలా నినాదాలు చేశారు. మేజిస్ట్రేటు వాళ్ల చేతులకు సంకెళ్లు వేయించాడు.
మొదటి రోజున ప్రాసిక్యూషన్ తరఫున పదకొండు మంది సాక్షులను ప్రవేశపెట్టారు. తాను భగత్‌సింగ్ చేతిలోని పిస్టలును లాక్కుని అరెస్టు చేసినట్టు సార్జంటు టెర్రీ బొంకాడు. భగత్, దత్‌లు బాంబులు విసురుతుండగా తాము చూశామని ఇంకొందరు సాక్షుల చేత చెప్పించారు. అభియోగాల తీరు, తప్పుడు సాక్ష్యాల తెన్ను బట్టి బ్రిటిషు ప్రభుత్వం తనకు కఠిన శిక్ష వేయించేందుకు ఎంతకైనా తెగిస్తుందని భగత్‌కి అర్థమైంది. తరవాత తన కన్నవాళ్లు కలిసినప్పుడు ఆమాటే చెప్పాడు. విచారణ ఖైదీలందరిలాగే తమకు జైలులో వార్తాపత్రికలు అందజేయించాలని భగత్ కోర్టును కోరాడు. మేజిస్ట్రేటు అది కుదరదు పొమ్మన్నాడు.
మరునాడు కూడా విప్లవకారులు కోర్టులోకి వస్తూనే గొంతెత్తి నినాదాలు చేశారు. మేజిస్ట్రేటు భగత్‌సింగ్ పేరు, ఊరు, ఇతర వివరాలు అడిగాక ‘ఏప్రిల్ 8న అసెంబ్లీ గ్యాలరీలో నువ్వు ఉన్నావా?’ అని ప్రశ్నించాడు. ‘ఈ దశలో నేనేమీ చెప్పదలచలేదు. సమయం వచ్చినప్పుడు స్టేట్‌మెంటు ఇస్తాను’ అని భగత్ బదులిచ్చాడు.
మేజిస్ట్రేటు బటుకేశ్వర్ దత్‌నూ అలాంటి ప్రశ్నలే అడగబోయాడు. నేను చెప్పేదేమీ లేదు. మా నాయకుడు భగత్‌సింగ్ మా పక్షాన చెప్పాల్సింది ఏదైనా అతడే మాట్లాడతాడు’ అని దత్ అన్నాడు.
సాక్షుల సాక్ష్యాలు, ముద్దాయిల మాటలు విన్నాక మేజిస్ట్రేటు-
భగత్‌సింగ్, బి.కె.దత్ అనే వీరు మనుషులను చంపే ఉద్దేశంతోటే అసెంబ్లీలో బాంబులు విసిరి సర్ జార్జి షుస్టర్ సహా ఐదుగురి తీవ్ర గాయాలకు కారకులయ్యారు ; ఐపిసి 307 సెక్షను కింద యావజ్జీవ శిక్ష వరకూ వారు శిక్షార్హులని అభియోగాలు నిర్ధారించి, తన వంతు పాత్రను పోషించాడు.
రంగం సెషన్సు కోర్టుకు మారింది.
*

రాజ్‌గురు ఉదంతం
దేశానికై అసువులు బాసిన త్యాగమూర్తి ‘రాజ్‌గురు’ ఉదంతం చదివాం. పోలీసులు పెట్టే చిత్రహింసలకు తట్టుకోవడానికి రిహార్సల్‌గా తానే ఛాతీ మీద వాతలు పెట్టుకొన్న సంఘటన చదివి కళ్లలో నీళ్లు తిరిగాయి. వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం ఏమైనా ఉపకారం చేస్తున్నదా? ఉరికంబాన్ని సైతం లెక్కచెయ్యకుండా నిర్భయంగా ప్రాణ త్యాగానికి సిద్ధపడిన అమరవీరులకు జోహార్లు. ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలను పాఠక లోకానికి అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు.
-కాకుటూరి సుబ్రహ్మణ్యం (కావలి)

ఎం.వి.ఆర్.శాస్ర్తీ