S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తుపాకుల్ని నాటించిన వంశం

భగత్‌సింగ్‌ -3
=========
భగత్‌సింగ్‌కు అప్పుడు నాలుగో ఏడు.
స్వగ్రామం బంగాలో అతడి తండ్రి కిషన్‌సింగ్ కొత్తగా మామిడికాపు మొదలెట్టాడు. మిత్రుడెవరో వస్తే తన పనితనం చూపించటానికి తోటకు తీసుకెళ్లాడు. భగత్ కూడా వారి వెంట ఉన్నాడు.
స్నేహితులిద్దరూ తోటంతా తిరుగుతూ కబుర్లలో పడ్డారు. కాసేపటికి పిల్లవాడు గుర్తుకొచ్చి చూస్తే చుట్టుపట్ల ఎక్కడా జాడలేడు. కంగారుపడుతూ వెతుకుతూపోతే తోట అవతల దుక్కిదున్ని ఉన్న పొలంలో బోలెడు చితుకులు ముందేసుకుని ఒక్కొక్కటీ నేలలో పాతుతూ కనపడ్డాడు. పెద్దవాళ్ల రాకను గమనించలేదు. తండ్రి దగ్గరకెళ్లి తలనిమిరి ఏమి చేస్తున్నావురా కన్నా అని అడిగితే-
‘తుపాకుల్ని నాటుతున్నా’ అని తలతిప్పకుండానే చెప్పి మళ్లీ పనిలో పడ్డాడు కుర్రవాడు.
వెంబడి ఉన్నాయనకు ఆశ్చర్యం వేసింది. ‘పొలంలో ఏదైనా నాటితే దానికి చాలా రెట్లు పంట వస్తుంది కదా బిడ్డా. మరి అన్నేసి తుపాకులను ఏమి చేసుకుంటావ్?’ అని అడిగాడు - ఏమంటాడో చూద్దామని.
‘వాటితో నేను తెల్లవాళ్లను దేశం నుంచి వెళ్లగొడతాను’ అన్నాడు భగత్ తడుముకోకుండా.
నాలుగేళ్ల పసివాడు అంత మాట అన్నాడంటే ఇవాళ మనం ఆశ్చర్యపోతాం. కాని భగత్‌సింగ్ పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. ఉగ్గుపాలతో బాటే అతడికి దేశభక్తీ ఒంటబట్టింది.
జాతీయోద్యమంలో ఒక మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ గురించి వినే ‘ఆహా! ఎంతటి దేశభక్తుల వంశం!’ అని కాంగ్రెసు భక్తులు ఓవరైపోతారు. నెహ్రూల్లా శ్రీమంతులు కారు; బహు సామాన్య కుటుంబీకులు; అయినా భగత్‌సింగ్ తండ్రి, తాతలే కాదు. ముత్తాత కూడా వెరపెరుగని దేశభక్తుడే.
సర్దార్ ఫతేసింగ్ 1830ల దశకంలో పంజాబ్ మహారాజు రంజిత్‌సింగ్ కొలువులో సైన్యాధికారి. తమ రాజ్యాన్ని కబళించబూనిన బ్రిటిషు వారి ప్రలోభాలకు మిగతా సర్దార్లలా లొంగకుండా, గెలిచే ఆశ లేదని తెలిసీ శత్రుసేనతో హోరాహోరీగా పోరాడాడు. అందువల్ల తెల్లవారి ఆగ్రహానికి లోనయ్యాడు. ధిక్కారానికి శిక్షగా అతడి భూములు జప్తు అయ్యాయి. 1857నాటి చరిత్రాత్మక స్వాతంత్య్ర యుద్ధ కాలంలో పంజాబ్ భూస్వాములను తమవైపు తిప్పుకోవాలని ఆంగ్లేయులు ప్రయత్నించారు. వెనక లాక్కున్న భూములను తిరిగి ఇచ్చెయ్యటమేగాక, తమకు సహకరిస్తే అదనపు కమతాలనూ బహూకరిస్తామని ఆశపెట్టారు. సర్దార్ ఫతేసింగ్ లొంగలేదు. హక్కుల కోసం పోరాడేవారి పక్షాన నిలబడి అవసరమైతే ప్రాణాలను ధారపోయాలని ఖాల్సా పంథ్‌కు గురుగోవింద్ సింగ్ నిర్దేశించిన మార్గం నుంచి తాను తొలగేది లేదు; దేశభక్తులను అణచేందుకు సహకరించేది లేదు - అని పర్యవసానాలకు బెదరక ఖండితంగా చెప్పాడాయన.
భగత్‌సింగ్ తాత అర్జున్‌సింగ్. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో తెల్లవారికి హడలు పుట్టించిన నామ్‌ధారి (కూకా) ఉద్యమంలో ఆయన చిన్నతనానే చురుకుగా పాల్గొన్నాడు. ఖాల్సా మార్గాన సిక్కులను కూడగట్టి గోవధకు వ్యతిరేకంగా పోరాడి, పంజాబ్ విమోచనకు భీషణ సమరం సాగించి, ఒక దశలో కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వానే్న నడపగలిగిన గొప్ప కదలిక అది. అర్జున్‌సింగ్ పంజాబ్, హిందీ, సంస్కృతం, పర్షియన్, ఉర్దూ భాషల్లో ప్రవీణుడు. సిక్కు మతగ్రంథాలపై సాధికారికంగా మాట్లాడగలిగిన దిట్ట. గురుద్వారా సంస్కరణలకు క్రియాశీలంగా తోడ్పడ్డాడు. సిక్కు మతస్థుల్లో చీలికలు తెచ్చి, కేశధారులు - కేశధారులు కానివారు అంటూ తంపులు పెట్టించి, ఒక వర్గం కొమ్ముగాసి, ‘సింగ్ సభ’ పేరిట బ్రిటిషువారు జరుపుతున్న కుతంత్రాలను ఆయన ధైర్యంగా వ్యతిరేకించాడు. ఆ కాలాన సామాజిక దురాచారాలను, మూఢ మత విశ్వాసాలను ఖండించి, దేశవాసులను విశాల ప్రాతిపదికన ఏకం చేసేందుకు స్వామి దయానంద సరస్వతి మొదలెట్టిన ఆర్యసమాజ్ ఉద్యమానికి దగ్గరయ్యాడు. సిక్కువై ఉండీ హిందువుల్లో చేరడమేమిటని సాటివారు వారించినా ఆయన లెక్కచెయ్యలేదు. స్వయానా దయానందస్వామే ఆయనకి ఆర్యసమాజ్ దీక్షనిచ్చి, యజ్ఞోపవీత ధారణ కావించాడు. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో జాతిజనుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి, జాతీయ భావాలను ముమ్మరంగా వ్యాప్తి చేసిన ఆర్యసమాజ్ కార్యకలాపాల్లో అర్జున్‌సింగ్ పాలుపంచుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ, యునానీ వైద్యం చేస్తూ, ప్లీడరు గుమాస్తాగా పనిచేస్తూ జీవయాత్ర సాగిస్తూనే బానిసత్వపు సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని నిరంతరం తపించాడు. జాతీయ కాంగ్రెసు కార్యక్రమాలలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నాడు. 1893లో దాదాభాయ్ నౌరోజి అధ్యక్షతన జరిగిన లాహోర్ కాంగ్రెసు సభలో రైతు ప్రతినిధిగా పాల్గొని తన వేషభాషలతో దాదాజీని ఆకట్టుకున్నాడు. అంతలా రాజకీయ చైతన్యం, జాతీయ నిబద్దత ఉన్నాయ కాబట్టే తన ముద్దుల మనవడు భగత్‌సింగ్‌కి ఆర్యసమాజ్ పద్ధతిలో యథావిధిగా యజ్ఞోపవీత ధారణ చేయించిన సందర్భంలో ‘ఈ నా వారసుడిని దేశమాత సేవకు పవిత్ర అగ్నిసాక్షిగా అంకితం చేస్తున్నాను’ అని సర్దార్ అర్జున్‌సింగ్ ఎలుగెత్తి ప్రకటించాడు. భగత్‌సింగ్ బాల్యమంతా తాత దగ్గరే గడిచినందువల్ల అతడి వ్యక్తిత్వ వికాసంలో ఆయన ప్రభావం, ఆర్యసమాజ్ ప్రభావం చాలా ఉన్నాయ.
అర్జున్‌సింగ్‌కి ముగ్గురు కొడుకులు: కిషన్‌సింగ్, అజిత్‌సింగ్, స్వరణ్‌సింగ్. ముగ్గురూ ముగ్గురే. అన్నివిధాల తండ్రి, తాతలకు తగిన వారసులే. పెద్దకొడుకు (్భగత్‌సింగ్ తండ్రి) కిషన్‌సింగ్ పంజాబ్‌లోనేగాక మధ్యప్రదేశ్, గుజరాత్, కాశ్మీర్ లాంటి దూర ప్రాంతాల్లోనూ వరదలు, కరవులు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా రివ్వున వెళ్లి, నలుగురినీ కూడగట్టి సహాయక చర్యలను ముమ్మరంగా సాగించేవాడు. సామాజిక సేవ సాగిస్తూనే రాజకీయాల్లోనూ చురుకుగా తిరిగాడు. జాతీయ కాంగ్రెసులో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలోని తీవ్రవాద వర్గంలో తమ్ముళ్లతో కలిసి క్రియాశీల పాత్ర వహించాడు. 1905లో దేశాన్ని ఊపేసిన బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో ముందుండి పోరాడాడు.
1857 ఉపద్రవాన్ని తట్టుకోవడానికి పంజాబ్‌లో మంచి పంటలు పండే భూములను బ్రిటిషు ప్రభుత్వం ఉదారంగా భూస్వాములకు పంచిపెట్టి కాలనీలను ఏర్పాటు చేసింది. తిరుగుబాట్లను అణచి, తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకున్నాక తన అసలు రంగు బయటపెట్టి, 1907లో అడ్డగోలు చట్టమొకటి తెచ్చిపెట్టింది. దాని ప్రకారం కొత్తగా ఏర్పాటైన కాలనీల్లోని భూకామందుల పెద్దకుమారుడికి మాత్రమే వారసత్వపు హక్కు ఉంటుంది. అతడి తదనంతరం ఆ భూమి, ఆస్తి ప్రభుత్వ పరమవుతాయి. తమకు కేటాయించిన భూమిలో ఎవరూ చెట్టును కొట్టరాదు. ఏ కట్టడమూ నిర్మించరాదు. ఈ ఆంక్షను అతిక్రమించిన వారి భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనపరచుకుంటుంది. పూర్తిగా తమ దయాధర్మం మీద ఆధారపడి బతికే జమీందారుల తెగను పెంచి, స్వతంత్రంగా తలఎగరేసే వారిని వెళ్లగొట్టడమే ఈ దుర్మార్గపు చట్టం ఉద్దేశం. పంజాబ్‌లో తీవ్ర అలజడి రేపిన ఈ దుష్ట శాసనానికి వ్యతిరేకంగా లాలా లాజపత్‌రాయ్‌తో కలిసి కిషన్‌సింగ్ బాహాటంగా పోరాడాడు. బాధిత రైతులను కూడగట్టటంలో ఇద్దరు తమ్ముళ్లూ అతడి వెంట ఉన్నారు. సూఫీ అంబాప్రసాద్, లాలా హరదయాళ్ ప్రభృతులతో కలిసి కిషన్‌సింగ్ ‘భారత మాత సొసైటీ’ని స్థాపించాడు. ఉర్దూలో ‘భారతమాత’ అనే పత్రికను నడిపాడు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో దేశాన్ని విముక్తి చేసేందుకు సాయుధ సంగ్రామానికి విఫలయత్నం చేసిన ‘గదర్’ పార్టీని కిషన్‌సింగ్ బలపరచి, శాయశక్తులా తోడ్పడ్డాడు. బ్రిటిషు ప్రభుత్వం అతడిని సామ్రాజ్యానికి ప్రమాదకారిగా భావించి ఎన్నో కేసులు మోపింది. పలుమార్లు ఖైదులో పెట్టింది. జైలులో ఉండగా అమానుషమైన నిబంధనలను, ఖైదీలను చిత్రహింసలను నిరసిస్తూ కిషన్‌సింగ్ నిరాహారదీక్ష సాగించాడు. (తండ్రి దిద్దిన ఒరవడినే అనంతరకాలంలో భగత్‌సింగ్ అత్యద్భుతంగా కొనసాగించి, చరితార్థుడయ్యాడు.)
సర్దార్ కిషన్‌సింగ్ మీద బ్రిటిషు ప్రభుత్వం మొత్తం 42 కేసులు పెట్టింది. రెండున్నర సంవత్సరాలపాటు జైలుశిక్ష విధించింది. అతడి కదలికల మీద రెండేళ్లపాటు గట్టి నిఘా పెట్టించింది. అయినా బెదరకుండా కిషన్‌సింగ్ గదర్ విప్లవకారులతో రహస్య సంబంధాలను కొనసాగించాడు. లోకమాన్య తిలక్ సూచనపై తమ్ముళ్లతో కలిసి ఫిరోజ్‌పూర్, రావల్పిండి, సియాల్‌కోట, ల్యాల్‌పూర్‌లలో ఉవ్వెత్తున స్వదేశీ ఉద్యమాన్ని నడిపి పంజాబ్ అంతటా స్వాతంత్య్ర జ్వాలను రగిలించడానికి గొప్ప కృషి చేశాడు.
ఇక భగత్‌సింగ్ పినతండ్రి అజిత్‌సింగయితే అచ్చమైన చిచ్చరపిడుగు. అతడిదీ ఆర్యసమాజ్ ఒద్దికే. అన్నతో కలిసి మొదటిసారి వెళ్లినప్పుడే లోకమాన్య తిలక్ అతడి నాయకత్వ లక్షణాలను, పోరాట పటిమను గుర్తించి ముగ్ధుడయ్యాడు. కాని కాంగ్రెసు సంస్థకు ఉన్న పరిమితుల్లో అతడి నాయకత్వ ప్రజ్ఞను అక్కడ చూపించటానికి సావకాశం లేకపోయింది. 1903లో లార్డ్ కర్జన్ నిర్వహించిన ‘రాజదర్బారు’లో సంస్థానాధీశుల చేత 1857 తరహా తిరుగుబాటు చేయించటానికి 22 ఏళ్ల వయసులోనే అజిత్‌సింగ్ రహస్య వ్యూహం పన్నాడు. కాని కాలం కలిసి రాలేదు. 1907నాటి పంజాబ్ రైతు అలజడిలో ‘భారతమాత సొసైటీ’ పేరు మీద అజిత్‌సింగ్ నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలను ప్రచురించి, ‘పీష్వా’ లాంటి పత్రికలు నడిపి, జనాన్ని ఉర్రూతలూపే ప్రసంగాలు చేసి ప్రజల్లో అతడు గొప్ప కదలిక తెచ్చాడు. దేశభక్తిని ప్రబోధిస్తూ అతడు చెప్పేది వినడానికి కంటోనె్మంట్లలోని సైనికులు విరగబడేవారు.
ఓ రోజు లాహోర్‌లో భారతమాత సొసైటీ వారి సభ జరుగుతున్నది. పోలీసులొచ్చి దాన్ని చెదరగొట్టారు. అంతటితో ఆగక దారినపోయే పాదచారులను కూడా లాఠీలతో చితకబాదసాగారు. అది చూసి అజిత్‌సింగ్‌కి ఒళ్లు మండింది. దగ్గరుండి లాఠీచార్జి చేయిస్తున్న యూరోపియన్ డి.ఎస్.పిని పట్టుకుని చితకగొట్టాడు. పోలీసులు అతడి మీద దొమీ కేసు పెట్టి అరెస్టు చేశారు. ప్రజల హృదయాల్లో మాత్రం అజిత్‌సింగ్ హీరోగా నిలిచాడు.
‘బహిరంగ సభల్లో అజిత్‌సింగ్ చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు. వ్యవసాయ తరగతులలోనేగాక సాయుధ సేనల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా రెచ్చగొడుతున్నాడు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అది చేయి దాటిపోక ముందే అతడినీ, లాలా లజపత్‌రాయ్‌నీ నిర్బంధించడం అవసరం’ అని పంజాబ్ లెఫ్టినెంగ్ గవర్నరు డెంజిల్ ఇజ్బెస్టన్ భారత ప్రభుత్వానికి రిపోర్టు పంపాడు. అదే సమయంలో భారత సైన్యాధిపతి లార్డ్ కిచ్‌నర్ కూడా ‘అజిత్‌సింగ్‌నూ, లాజపత్ రాయ్‌నీ వెంటనే అరెస్టు చేయకపోతే భారత సైనికులను సామ్రాజ్యానికి విధేయులుగా ఉంచటం కష్టమవుతుందని మొత్తుకున్నాడు.
The Lientenant Governor held that some of the leaders looked to driving the British out of the country either by force or by the passive resistance of the people as a whole... He considered the whole situation exceedingly dangerous and urgently demanding remedy. The remedy adopted was the arrest and deportation of Lajpat Rai and Ajit Singh, the Hindu and Sikh leaders of the Movement'
-Sedition Committee Report
[Quoted in Shaheed Bhagat Singh, Omesh Saigal, p.31]

భ్రిటిషు వాఠిని బలవంతంగానో, సాత్విక ప్రతిఘటన థ్వారానో దేశం నుంచి వెళ్లగొట్టాలని కొందరు నాయకులు చూస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నరు అభిప్రాయపడ్డాడు... అత్యంత ప్రమాదకరంగా ఉన్న పరిస్థితికి తక్షణ నివారణ కావాలని ఆయన తలచాడు. నివారణ చర్యగా హిందూ, సిక్కు ఉద్యమ నాయకులైన లాజపత్‌రాయ్, అజిత్‌సింగ్‌లను అరెస్టు చేసి ద్వీపాంతరానికి పంపేశారు - అని నాటి స్థితిగతులను అధికారికంగా మదింపు చేసిన ‘సెడిషన్ కమిటీ’ నివేదికలో చెప్పినదాన్ని బట్టే అజిత్‌సింగ్ స్థాయి, తెల్లవారికి అతడు పుట్టించిన హడలు ఎంతటివో అర్థమవుతాయి.
పరిస్థితి అదుపు తప్పుతోందని బెంబేలెత్తి తెల్లదొరతనం పంజాబ్ కేసరి లాలాజీ, అజిత్‌సింగ్‌లను 1907 జూన్‌లో నిర్బంధించి బర్మాలో సముద్రం మధ్య ఉన్న మాండలే జైలుకు తరలించింది. సర్కారీ దమనకాండపై బ్రిటిషు పార్లమెంటులో ప్రతిపక్షం పెద్ద దుమారం లేపింది. ప్రతికూల ప్రజాభిప్రాయానికి తలఒగ్గి ఆ సంవత్సరం నవంబరులోనే వారిని విడిచిపెట్టారు. ఆ తరవాతా భారతమాత సొసైటీ ద్వారా అజిత్‌సింగ్ ముమ్మరంగా పని చేశాడు. కక్ష గట్టిన ప్రభుత్వం అతడిని కుట్ర కేసులో ఇరికించడానికి వలపన్నింది. ఆ సంగతి తెలిసి, అన్న కిషన్ సింగ్ సలహా మీద అజిత్‌సింగ్ 1909లో దేశం వదిలిపోయాడు. ఇరాన్, టర్కీ, మధ్యఆసియా, జర్మనీ, ఫ్రాన్సు, స్విట్జర్లాండ్, ఇటలీ, బ్రెజిల్ దేశాల్లో విస్తృతంగా తిరిగి దేశ స్వాతంత్య్రానికి ఏకదీక్షగా పాటుపడ్డాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘ఆజాద్ హింద్‌ఫౌజ్’ ఏర్పాటుకు అతడి సహకారమూ ఉంది. దీర్ఘకాల ప్రవాసం తరవాత సహచరుల పూనిక వల్ల భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేరోజున మాతృభూమికి అజిత్‌సింగ్ తిరిగి వచ్చాడు. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి బ్రిటిషు పతాకం అవనతమవడాన్ని కళ్ళారా చూసిన కొద్ది గంటలకే ఆయన అంతిమ శ్వాస వదిలాడు.
భగత్‌సింగ్ ఇంకో బాబాయి స్వరణ్‌సింగ్ కూడా స్వాతంత్య్ర యోధుడే. కాలనీ దుష్ట చట్టాలకు వ్యతిరేకంగా అజిత్‌సింగ్‌తో కలిసి అతడూ గట్టిగా పోరాడాడు. అజిత్‌సింగ్ నిర్బంధం తరవాత పెద్దన్న కిషన్‌సింగ్‌తో కలిసి భారతమాత సొసైటీ కార్యభారమంతటినీ చక్కగా నిభాయించాడు. జాతీయవాదులకు తలలో నాలుకలా మెలిగాడు. అందుకు శిక్షగా 1909లో లాహోర్ సెంట్రల్ జైలు పాలయ్యాడు. చెరసాలలో అతడి మెడకు కాడిని తగిలించి ఎద్దులా గానుగ ఆడించేవారు. క్రూరమైన చిత్రహింసలవల్ల అతడి ఆరోగ్యం పాడై క్షయవ్యాధి పట్టుకుంది. జైలు నుంచి విడుదలయ్యాక కొద్దికాలానికే 23 ఏళ్ల పిన్నవయసులో స్వరణ్‌సింగ్ కన్నుమూశాడు.
ఇటువంటి విప్లవకారుల వంశంలో పుట్టిన భగత్‌సింగ్, పూర్వీకుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని జగద్విఖ్యాత విప్లవవీరుడుగా చరిత్ర కెక్కడం వింతకాదు.
తన వెంటపడిన బ్రిటిషు ప్రభుత్వం కళ్లుగప్పి, అరెస్టును తప్పించుకునేందుకు కిషన్‌సింగ్ ఒకసారి రహస్యంగా నేపాల్ వెళ్లేటప్పటికి ఆయన భార్య విద్యావతి గర్భవతి. ప్రవాసానికి ముందు ఓ రోజు స్వరణ్‌సింగ్ అడిగాడట ‘అన్నయ్యా! నీకు కొడుకు కావాలా? కూతురా?’ అని.
‘నాకైతే మీ వదినలాంటి చక్కదనాల గుణవంతురాలు పుట్టాలనే ఉందిరా! కాని దేశానికి ధైర్యశాలి, త్యాగశీలి అయిన కుమారుడు అవసరం. వాడి శౌర్యం, సాహసం తెల్లవాళ్లకు కునుకు లేకుండా చేయాలి. ప్రజల్ని తిరగబడేట్టు చేయాలి. నా సొంత ఇష్టం కంటే జాతి అవసరమే ముఖ్యం. ప్రపంచంలో మన కుటుంబానికి కీర్తి తెచ్చే కొడుకే పుట్టాలిరా’ అని జవాబిచ్చాడట కిషన్‌సింగ్.
[The Life and Times of Bhagat Singh,
Mahesh Sharma, p.17]
*

-ఎం.వి.ఆర్. శాస్త్రి