S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
అమరావతిలో పని చేయడానికి ఉద్యోగులకు ఒక ట్రైన్ ఏర్పాటు చేశారంట. ఈ రైలు ఉ.10.30కి గుంటూరు చేరితే, ఉద్యోగులు 11 గంటలకు ఆఫీసుకు చేరతారు. 11 గంటలకు విజయవాడ చేరితే 11.30కి ఆఫీసుకు చేరుకుంటారు. సాయంత్రం రైలు విజయవాడలో 5 గంటలకు కాబట్టి 4.30కల్లా స్టేషన్‌లో ఉండాలి. అంటే సగానికి పైగా కాలం రైల్లోనే గడిచిపోతుంది. ఇంత మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగారిని, రైల్వే సహాయమంత్రి ప్రభుగారిని అభినందించాల్సిందే. మీరేమంటారు?
చేసే పనేదో రైల్లోనే చేసుకోమంటారేమో చూడాలి.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
కృష్ణా పుష్కరాల ముహూర్తం విషయంలో కంచిపీఠం ఒక లెక్క, శృంగేరీ పీఠం మరో లెక్క విభేదాలు! దాంతోపాటు శ్రీశైలం దేవస్థానం ఒక లెక్క, తిరుమల దేవస్థానం మరో లెక్క! దీన్నిబట్టి తెలుగు పంచాంగకర్తలకు ఎక్కాల బుక్కు చదవడం కూడా సరిగ్గా రాదని తెలుస్తోంది!
అలా చులకన చేయటం తప్పు. పంచాంగాల లెక్కల తేడాకు అనేక కారణాలున్నాయి. ఎవరి గణితం ప్రకారం వారి లెక్క రైటే. వేర్వేరు గణితాలను సమన్వయం, క్రమబద్ధం చేసి దేశమంతటికీ ఏక రూప పంచాంగం తయారుచేయించటం తలచుకుంటే కష్టం కాదు. ఆ పని పీఠాధిపతుల, దేవస్థానాల వల్ల కాదు. దానికి భారత ప్రభుత్వమే పూనుకోవాలి. ఎప్పుడో అరవై ఏళ్ల కింద క్యాలెండర్ రిఫార్మ్స్ కమిటీని వేసి, అరకొరగా పని ముగించిన తరవాత మళ్లీ ప్రభుత్వం ఆ దిక్కు చూడలేదు. చూడమని అడిగినవారు లేరు. ఇప్పుడైనా పంచాంగకర్తలని తిట్టటం మాని అందరూ కలిసి మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. నిజానికి రాష్ట్రీయ పంచాంగంతో సహా ఇప్పుడు దేశంలో 90 శాతం పంచాంగాల లెక్కలు సరికాదు.

వరిగొండ కాంతారావు, హనుమకొండ
కె.ఎల్.రెడ్డిగారిని గురించి మీ పత్రికలో వచ్చిన వ్యాసమూ, అందుకుగాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందన అభినందనీయాలు. ఆదర్శవంతమైన పత్రిక పనితీరుకూ, ప్రభుత్వ పాలనకూ ఈ సంఘటన మచ్చుతునక.
సంతోషం.

యామా జనార్దన్, సూర్యాపేట
మోటార్‌బైక్ కాని, కారు కాని లీటరు పెట్రోలుకు ఇంత ‘మైలేజి’ ఇస్తుందని రాస్తూ, ఇన్ని కిలోమీటర్లు వస్తుందని కంపెనీ వాళ్లు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. మైలేజి అంటూ కిలోమీటర్లలో లెక్క చేయడం ఏమి పద్ధతి? మైళ్ల లెక్క పోయి కిలోమీటర్ల వాడకం వచ్చి చాలా సంవత్సరాలైనది. ఇంకా మైలేజి అనే పదం వాడటం యేమిటండి?
అందరికీ అలవాటై పోయింది. మోటారు కంపెనీలు ఉన్నది కస్టమర్లను ఆకట్టుకుని వ్యాపారం చేసుకోవటానికి. భాష స్వచ్ఛతను కాపు కాయటానికి కాదు (అలాంటి పదాలు ఇంకా మన వాడుకలో చాలా ఉన్నాయి.)

పి.ప్రభాకర్, సికిందరాబాద్
వడ్డించేవాడు మనవాడైతే సాంస్కృతిక సారధులకు రోజూ వేదికే కదండీ?
వడ్డించేవాడు కాదు ఎక్కించేవాడు.

టి.ప్రసాద్, హైదరాబాద్
సభా వేదికలపై ఆహ్వానితులుగా ఎక్కువ శాతం వృద్ధులే ఉంటారేంటి?
ఆహూతులూ ఎక్కువగా ఆ బాపతువారే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ప్రజాభీష్టం మేరకు ప్రజల సేవకు పార్టీ మారుతున్నామంటున్నారు...
ఆ మాట ఎన్నుకున్న ప్రజల ముందు చెప్పే దమ్ముందా?

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ చేయాలనే సంకల్పం ఉంటే తెలంగాణలోనే అది తుడిచిపెట్టుకుపోయింది. బాబుగారి కల సాకారమయ్యేనా?
ఇంకో కలలో.

తెలంగాణలో టి.డి.పి.ని రేవంత్, రమణలే కాపు కాస్తున్నారు. వీరికి టి.ఆర్.ఎస్. తీర్థం ఇష్టం లేదేమో. అంతేనంటారా?
నో ఛాన్స్.

భుజంగనాథ్, వక్కలంక
గ్రామాలు, పట్టణాలలోని ‘మురికివాడ’లలో వుండే ప్రజలకు ‘దివ్య దర్శనం’ పేరిట ఉచిత దేవాలయ దర్శనాలు చేయిస్తారుట. పథకం రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ‘మురికివాడ’లలోనే ప్రజలు ఉంటున్నందుకు సిగ్గుపడాల్సింది పోయిలాంటి పథకాలు రచిస్తున్న ప్రభుత్వం ఎలాంటిది?
మురికిది.

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
ఆర్థిక నేరస్థులను సత్వరం శిక్షించే చట్టాలులేకనా, లేదా రాజకీయ నేతల జోక్యం వలననా తీవ్ర జాప్యం జరుగుతున్నది? దీన్ని నివారించే ఉపాయం లేదా? లేదా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటుంటే ప్రేక్షకుల్లా ప్రజలు గుడ్లప్పగించి చూచుటేనా? ఇది ఎంతకాలం?
దొంగలని పట్టాల్సిన వాళ్లు నిద్రపోతుంటే మధ్యలో ప్రజలు ఏం చేస్తారు? ఇందులో చట్టాల లోపం కూడా ఉంది. కోర్టులు అయిన దానికీ కాని దానికీ చక్రం అడ్డు వేయటమూ నేరస్థులకు అలుసైంది.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులు వారు నిర్వహించే శాఖల్లో పరిజ్ఞానం లేకపోయినా ఆ పదవులు నిర్వహించవచ్చు. కాని ఆర్.బి.ఐ గవర్నరు పదవి, అల్లాటప్పా కాదు. ఆర్థిక విధానాలపై కాక వ్యక్తిగత ద్వేషాలతో సుబ్రహ్మణ్య స్వామి (బిజెపి) గవర్నర్ రాజన్‌ని తొలగించాలని ఆరోపణలు చేస్తూ, మోదీకి లెటర్ రాయడం హేయమైన పని కాదా? స్వయంకృతంగా రాజన్ తానే నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడంపై దేశ, విదేశాల ఆర్థిక శాస్తవ్రేత్తలు, నిపుణులు, చివరకు అమర్త్యాసేన్ కూడా ‘ఇది దేశానికి అపశకునం’ అంటూ, 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసికట్టిన ఘనత రాజన్‌దే అని ప్రశంసల వర్షం, దేశ వ్యాపార దిగ్గజాలతో సహా ఘోషిస్తున్నారు కదా?
రాజన్‌ని ఎవరూ తొలగించలేదు. ఆయనకు యు.పి.ఎ. హయాంలో ఇచ్చిన మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. ఆ స్థానంలో ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం ఇష్టం. అమెరికా వాళ్లకు, అమర్త్యసేన్లకు నచ్చారు కాబట్టి రాజన్‌నే కొనసాగించాల్సిన అవసరం లేదు. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com