S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాశనం కానిది జీవాత్మ

మన పరంగా ‘ఆత్మ’ అంటే జీవ ఆత్మ, పర ఆత్మ.
దేహాన్ని ఆశ్రయించి ఉన్నంతకాలం జీవాత్మ.
దేహాన్ని చాలించిన తర్వాత పరమాత్మ.
- ఈ విషయం చాల చిన్నదిగానే అనిపిస్తుంటుంది. విషయం తెరచిన పుస్తకంలా కనిపిస్తుంటుంది. యుగాలు గడుస్తున్నా ఈ ఆత్మతత్వం ‘సరియైన’ రీతిన అర్థం కావటంలేదు... ఒక పట్టాన వొంటబట్టడం లేదు. నిజానికి వివేకశీలురం కాగలిగితేనే ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోగలం. సాధన తీవ్రమైతే తప్ప ఆత్మతత్వం అనుభవానికి, అనుభూతికి అందిరాదు. సాధ్యం కానప్పుడు జీవాత్మ పంచేంద్రియాలను, మనస్సును ఆశ్రయించి వాటి ద్వారానే శబ్దాది విషయాలను అంటే ఐహిక భోగాలను అనుభవిస్తున్నట్లనిపిస్తుంటుంది.
‘ఉత్క్రామంతం స్థితం వాపి భుఙ్ఞనం వా గుణాన్వితమ్
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞాన చక్షుషః’
జీవాత్మ దేహంలో స్థితమై ఉన్నప్పుడు కానీ, దేహంతో భోగిస్తున్నప్పుడు కానీ, దేహాన్ని వీడినా కానీ వివేక శూన్యత్వం వల్ల దాని ఉనికి, విలువ తెలియదంటుంది భగవద్గీత. అవును, జ్ఞాననేత్రం విచ్చుకుంటేనే ఆత్మజ్ఞానం కలిగేది. అంటే జ్ఞాన వికాసం వల్లనే ఆత్మదర్శనం.
మన జీవాత్మను స్వస్వరూప దర్శనం అయ్యేది జ్ఞాన ప్రకాశనంతోనే. అంతఃకరణ శుద్ధి ప్రాప్తిస్తేనే ఆత్మ యోగం అందివచ్చేది. యోగ సాధన తీవ్రంగానే కాదు శుద్ధంగాను సాగినప్పుడే స్వస్వరూప దర్శన సంప్రాప్తి.
నిజానికి నాశనం కానిది జీవాత్మ. ఆత్మ నశించదు కానీ సకల ప్రాణులూ, జీవులూ నశించేవే. నశించనిది ఆత్మ కాబట్టి కూటస్థం. ఆత్మ కాలంతోపాటు ప్రయాణిస్తుంటుంది. కాలంలో స్థితమై ఉంటుంది. ఇహ పర ప్రస్థానం ఆత్మవర్తనం. ఒకసారి పరాన్ని వీడిన ఆత్మ మళ్లీ పరాన్ని చేరేలోపు ఎనభై నాలుగు లక్షల రూపాలను ఆశ్రయిస్తూ వస్తుంది. అంటే ఆత్మ పదార్థ జగతిలో పదార్థ సమ్మిళితంగా ఎనభై నాలుగు లక్షల జన్మలను చవి చూస్తుంది.
ఈ జన్మజన్మల పరిణామంలో ప్రతీ జన్మా పూర్వజన్మ కంటే ఉత్తమమైందే.. ఉన్నతమైందే. చివరిది మానవజన్మ! మానవ శరీరం! అంటే మానవ జన్మ లేక సంపూర్ణ అస్తిత్వ పరిణామానికి ఒక ఎస్సెన్స్-స్తత్వం. ఈ అవగాహనతో మానవ జన్మలోని జీవాత్మ ఈ దేహాన్ని వదిలిన వెంటనే పరమాత్మగా ప్రకాశించే తీరుతుందన్న ఆత్మజ్ఞానం మనకవసరం.
అసలు మానవ జన్మకు రాక పూర్వం లక్షల దేహాలను మారుస్తూ వచ్చిన ఆత్మవర్తనం అత్యంత ఆశ్చర్యకరం. మానవ దేహాన్ని చేరిన తర్వాతనే పరమాత్మ అన్న అవగాహన, స్వస్వరూప అవగాహన ఏర్పడుతోంది. మన దేహంలోని డెబ్బై రెండువేల నాడులలో ఆత్మ స్పందించగలిగితే తప్ప స్వస్వరూప దర్శనం సాధ్యంకాదు... పరమ పథం అంది రాదు. ఈ ఆత్మ జాగృతి ఒక్క మానవ జన్మకే ప్రత్యేకం. యోగ సాధనలో డెబ్బై రెండు వేల నాడులలో కలిగే స్పందనలే మానవత్వంలో దివ్యత్వాన్ని నింపుతున్నాయి. ఈ ఆత్మజ్ఞానంతో అందివచ్చేదే బ్రహ్మజ్ఞానం. ఇలా బ్రహ్మర్షి కావటం అంటే పరమాత్మగా పరిణమించటమే!
మన మానవ జన్మ జ్ఞాన ప్రపూర్ణత్వానికి ప్రతీక. మానవజన్మకు పూర్వం జరిగిన ప్రయాణమంతా ఎంతో కొంత అజ్ఞానంతోనే. అలా కొన్ని లక్షల జన్మలలో కొంత కొంతగా అజ్ఞానాన్ని వదిలించుకుంటూ మానవజన్మకు చేరుకునేటప్పటికి జ్ఞాన జాగృతి సాధ్యమైంది. ఈ ఆత్మజ్ఞానం ప్రజ్ఞానంగా పరిణమించి బ్రహ్మజ్ఞానంగా భాసించటమే ఆత్మయోగం. నిజానికి ఆత్మ జాగృతం కానంతవరకు మానవజన్మను సుఖదుఃఖాల చట్రంలోనే చూస్తుంటాం. అలా చూడటమూ ఒక విధమైన అజ్ఞానమే. అంటే ఇంకా ఆత్మజ్ఞానానికి చేరువ కాలేకపోవటమే!
మనం ఆత్మస్వరూపులమే! దేహరూపులమే! జీవ, హృదయ, ప్రాణ స్పందనలమే! దేహానికి, జీవానికి, హృదయానికి, ప్రాణానికి ‘ఆత్మ’నే ఆలంబనగా అనిపిస్తున్నప్పటికి దేహమే ఆత్మ కాదు... జీవమూ ఆత్మకాదు.. హృదయమూ ఆత్మకాదు.. ప్రాణమూ ఆత్మ కాదు. ఆత్మ ఆత్మనే. ఆత్మ అద్వితీయం. ఆత్మ అంటే సంజ్ఞ, ఆజ్ఞ, ప్రజ్ఞల సమ్మేళనం.
అందుకే ‘దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్వ’ దేహాన్ని ఆశ్రయించి ఉన్న ఆత్మ వధింప శక్యం కానిది అని అంటుంది భగవద్గీత. అంటే ఆత్మను నాశనం చేసే సమర్థత ఏ జీవికీ, ప్రాణికీ లేదని. పైగా ‘యదా తే మోహ కలిల బుద్ధిర్వతి తరిష్యతి’ - బుద్ధి మోహం అనే ఊబి నుండి బయటపడితే తప్ప ఆత్మజ్ఞానం స్వంతం కాదు - అని నిర్ద్వంద్వంగా చెప్తుంది.
‘శ్రుతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా
సమాధావ చలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి’
బుద్ధి పరమాత్మపై స్థిరమై ఉంటేనే ఆత్మయోగం సిద్ధిస్తుంది. అంటే ఆత్మ ద్వారా ఆత్మ సంతుష్టత సాధ్యం కావాలి. ఆత్మ సంతుష్టి వల్లనే స్థిత ప్రజ్ఞతా సాధ్యవౌతుంది. ఇంద్రియాలను వశపరచుకొనటం, జ్ఞాన విజ్ఞానాలతో పుట్టుకొచ్చే మోహాలకు లొంగకుండటం స్థితప్రజ్ఞతే!
‘ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః’
శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ బలమైనవి. ఆత్మ చరించేది మానవ దేహంలో కాబట్టి ఆత్మ లౌకికం అనే అనిపిస్తుంటుంది. ఇహలోక ఆత్మ అనిపిస్తుంటుంది. నిజానికి ఆత్మ అలౌకికం... నిర్మలం. దాని వర్తనమంతా దేహపరంగానే అయినప్పటికీ ఆత్మ కర్మలన్నీ దివ్యాలే.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946