S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అడవి రాముడు

ఏభై ఏళ్ల పళ్ల డాక్టర్ అలెగ్జాండర్ పిలివట్రిక్ తన వృత్తిలో చాలా సంపాదించాడు. ఇతను చెక్ రిపబ్లిక్‌లో టిప్లైస్ అనే ఊళ్లో పేరు పొందిన డెంటిస్ట్. ఐతే ఇతను సెర్బియా పౌరుడు. చెక్‌లో కాని, సెర్బియాలో కాని చట్టరీత్యా ఉండలేక పదిహేనేళ్లపాటు చెక్ రిపబ్లిక్‌లోని కృస్నాగోపా అనే అడవిలో దాక్కుని ఒంటరిగా గడిపాడు!
తరచూ సమీపంలోని టిప్లైస్ నగర శివార్లలోని ఓ దుకాణానికి వెళ్లి కావాల్సినవి కొనుక్కునేవాడు. పీటర్ సిల్వా అనే జాగ్రఫీ, ఇంగ్లీష్ ప్రొఫెసర్ తరచు బేక్‌పేక్‌తో వేగంగా నడిచి వచ్చి ఎవరితో మాట్లాడకుండా వెళ్లే ఇతన్ని గమనించేవాడు. క్రమంగా అతనితో మాటలు కలిపాడు. చెక్ భాషలో మాట్లాడితే అతనూ చక్కటి చెక్ భాషలో జవాబు చెప్పాడు. తను సెర్బియన్ అని చెప్పాడు. బిచ్చగాడిలా కనిపించినా అతను బాగా చదువుకున్న వాడని ఆ మాటలనిబట్టి ప్రొఫెసర్ గ్రహించాడు. అతను ప్రొఫెసర్‌కి తన కథని చెప్పాడు.
అలెగ్జాండర్ తన తొమ్మిదో ఏట తల్లిదండ్రులతో సెర్బియా నించి చెక్ రిపబ్లిక్‌కి వలస వచ్చాడు. ప్రాగ్‌లో స్కూల్ చదువు పూర్తయ్యాక డెంటల్ మెడిసిన్ చదివాడు. తర్వాత ప్రాగ్‌లోని మోటోల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో డెంటిస్ట్‌గా పని చేయసాగాడు. అతను టిప్లైస్‌కి బదిలీ అయాక సమస్య ఆరంభమైంది. అతని తల్లిదండ్రులు అప్పటికే మరణించారు. 1990లలో చెక్ రిపబ్లిక్ సెంటర్లని మార్చడంతో అతని ఉద్యోగం పోయింది. అలెగ్జాండర్ చెక్ పౌరుడు కాడు కాబట్టి ప్రభుత్వ క్వార్టర్స్‌ని ఖాళీ చేయమని కోరారు. దాంతో ఇల్లు లేని బీదవాడయ్యాడు. తొమ్మిదో ఏటనే సెర్బియా నించి తల్లిదండ్రులతో వలస రావడంతో అతనికి తను సెర్బియన్ పౌరుడని ఎలా రుజువు చేసుకోవాలో తెలీలేదు. చేసుకుంటే స్వదేశానికి వెళ్లచ్చు. అతను అవివాహితుడు. కాబట్టి భార్య వైపు మద్దతు కూడా లేకపోవడంతో విధిలేక, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎవరూ చూడకుండా అడవిలోకి వెళ్లి తల దాచుకున్నాడు. అతను సెర్బియన్ భాషకన్నా చెక్ భాషని బాగా మాట్లాడుతాడు.
ఏడాదిపాటు ప్రొఫెసర్ సిల్వా అడవిలో అలెగ్జాండర్ దాక్కున్న చోటికి అతనికి కావాల్సిన వస్తువులని తీసుకువెళ్లేవాడు. విద్యుత్, నీరు, పైకప్పు సౌకర్యాలు లేని శిథిలమైన ఓ ఇంట్లో అతను నివసిస్తున్నాడు. ఈలోగా సెర్బియాలోని అతని సవతి సోదరి అతను మరణించాడని, కాబట్టి తండ్రి ఆస్థి తనకే చెందాలని కోర్టులో వ్యాజ్యం వేసింది. అది పెండింగ్‌లో ఉంది. ఇది తెలియని సిల్వా అలెగ్జాండర్ గురించి వివరిస్తూ అతనికి సహాయం చేయమని సెర్బియన్ ఎంబసీకి ఈమెయిల్ పంపాడు. సెర్బియన్ అంబాసిడర్ సానుభూతిగా వ్యవహరించడంతో 2015లో అలెగ్జాండర్ స్వదేశం అయిన సెర్బియాలోని బెల్‌గ్రేడ్ నగరానికి చేరుకున్నాడు.
అలెగ్జాండర్ గురించి తెలుసుకున్న వేలాదిమంది సెర్బియన్లు అతనికి స్వాగతం చెప్పారు. అతని వెంట సిల్వా కూడా వెళ్లాడు. రైలు దిగాక అలెగ్జాండర్ మీడియా వారికి ఇలా చెప్పాడు.
‘నేను అడవుల్లో చాలాకాలం జీవించాను. ఆ అడవుల్లో సైనికులు కూడా ఉన్నారు. వారు నన్ను చూడకుండా జాగ్రత్త పడేవాడిని. ఎందుకంటే వారు నన్ను చూస్తే ఎలా స్పందిస్తారో తెలీదు. ఆహారం కోసం రోజుకి ఇరవై కిలోమీటర్లు నడిచేవాడిని’
‘అలెగ్జాండర్ ప్రయాణం అంతా రైలు కిటికీలోంచి చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అడవిని వదిలి రావడం దిగులుగా ఉందని చెప్పాడు’ బెల్‌గ్రేడ్ రైల్వేస్టేషన్‌లో సిల్వా పత్రికా విలేకరులకి చెప్పాడు.
అతను పదిహేనేళ్ల తర్వాత నగర జీవితానికి అలవాటు పడటానికి కొంచెం కష్టపడ్డాడు. వాషింగ్ మెషీన్, స్టవ్ లాంటివి ఉపయోగించడం మర్చిపోయాడు. తన తండ్రి ఆస్థిలో భాగం అవసరం లేదని దాన్ని సవతి సోదరికే వదిలేశాడు. తిరిగి డెంటిస్ట్‌గా పనిచేసే అవకాశం కోసం అతను డెంటల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్‌గా చేరాడు.
టెలిగ్రాఫ్, నౌ అనే రెండు న్యూస్ ఏజెన్సీలు అతన్ని మొదటగా ఇంటర్వ్యూలు చేశాయి. అతను నివసించిన ప్రదేశం ఫొటోలు, జీవన విధానానికి చెందిన ఆర్టికల్స్‌ని ప్రచురించాయి.
‘నేను సెర్బియన్ దేశస్థుడ్నే అయినా నాకు సెర్బియా గురించి ఏదీ తెలీదు. దినపత్రికల్లో కూడా ఆ దేశం గురించి రాసేవారు కారు. బెల్‌గ్రేడ్‌లోని సౌస్కీ వెనక్ అనే ప్రాంతం నాకు కొద్దిగా గుర్తుంది. 1974లో మా నాయనమ్మ రాడా మరణించడం కూడా గుర్తుంది. మా తాతయ్యతో కలిసి కాల్‌మి మెగ్దాన్ అనే అడవికి వెళ్తూండేవాడిని. దారిలో అడవి గురించి తాతయ్య చాలా చెప్పేవాడు. బెల్‌గ్రేడ్ బాగా మారిపోయింది. నేను తిరిగి సెర్బియా చేరుకునేందుకు సహాయం చేసిన ప్రొఫెసర్ పీటర్ సిల్వాకి, సెర్బియన్ ఎంబసీకి సదా కృతజ్ఞుడ్ని. అలాగే బెల్‌గ్రేడ్ పౌరులకి కూడా. వారివల్లే నాకు పురపాలక సంఘం వసతిని ఏర్పాటు చేసింది’ అతను చెప్పాడు.
తండ్రి అపార్ట్‌మెంట్‌ని సవతి సోదరికి వదిలేశాడని తెలిసిన బెల్‌గ్రేడ్‌లోని ఓ డెంటిస్ట్ తర్వాత అతనికి ఓ అపార్ట్‌మెంట్‌ని గుప్తదానం చేశాడు.