S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమస్యలు పట్టవా!

అనంతపురంటౌన్, జూలై 22:వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బెడద ఒకవైపు, తాగునీటి కాలుష్యం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పాలకవర్గానికి, అధికారయంత్రాంగానికి అభివృద్ధి పనులపై ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి కాలుష్యనివారణపై కానరావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి మత్తులో జోగుతున్న పాలక, అధికారవర్గాలకు ప్రజల గోడు పట్టకపోవటంలో వింతేమి లేదని నగరవాసులు ధ్వజమెత్తుతున్నారు. ప్రజలకు వౌలిక వసతులు కల్పించటం ఎంత అవసరమో అదే సమయంలో అంతకన్నా ముందు ప్రజాసమస్యలు తీర్చటం ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించాలని పాలకవర్గం, అధికారయంత్రాంగానికి వారు మొరపెట్టుకుంటున్నారు. సాక్షాత్తూ కలెక్టర్ కోనశశిధర్ పారిశుద్ధ్య పనుల నిర్వహణ తదితర అంశాలపై కార్పొరేషన్ అధికారయంత్రాగం పనితీరును తూర్పారబట్టటం ప్రజాభిప్రాయానికి అద్దం పట్టేలా ఉంది. కమిషనర్, మేయర్‌లు రోజూ డివిజన్లలో పర్యటిస్తున్నా, హెల్త్ఫాసర్, శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇనస్పెక్టర్లు, మేస్ర్తిలు, వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా డివిజన్లలో పారిశుద్ధ్య పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. దీనికితోడు మేయర్, ఎమ్మెల్యే, కమిషనర్లు రోజూ గంటల తరబడి సమీక్షా సమావేశాలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశాలకన్నా ముందు డివిజన్లలో సమస్యల పరిష్కారానికి ప్రజారోగ్య, వాటర్‌వర్క్స్ యంత్రాంగాన్ని సమాయత్తపరచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారవర్గాలు, ప్రజలు కోరుతున్నారు. రోజూ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఎక్కడో ఒకచోట సమావేశాలతోనే కాలం సరిపోతోందని, దీనితో ఫీల్డ్‌లో పనుల పర్యవేక్షణ పడకేసిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరంలో ప్రతిరోజు ఏదో ఒకచోట రంగుమారిన నీటికితోడు, మురుగునీరు పైపులలో సరఫరా అవుతోందన్న ఫిర్యాదులు వినవస్తున్నాయి. ఇటీవల స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో మేయర్‌కు ఫిర్యాదీదారు ఫోను చేసి చెప్పేవరకూ వాటర్‌వర్క్స్ అధికారులకు తెలియకపోవటం వింతగొలిపే విషయం. వాటర్ వర్క్స్‌లోని ఇంజనీరింగ్ అధికారులు, ఫీల్డ్ స్ట్ఫా ట్యాప్ ఇనస్పెక్టర్లు, ఫిట్టర్లు, హెల్పర్స్, వర్కర్స్, వాల్వ్ ఆపరేటర్లు డివిజన్లలో తిరగటం జరుగుతుంది. నీటి కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులు సిబ్బంది దృష్టికి వచ్చినా వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. సిబ్బంది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం మినహా తాము చేయగలిగిందేమి లేదంటున్నారు. స్వయానా కార్పొరేటర్లు నీటి కాలుష్యం గురించి ఫిర్యాదులు చేసినా అధికారయంత్రాంగంలో స్పందన రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంజనీరింగ్ అధికారుల బదిలీలు జరగటంతో ఉద్యోగులు రిలీవ్‌కావటం, కొత్తవారు వచ్చి జాయిన్ కావటం జరుగుతోంది. ఈ క్రమంలో బదిలీపై వచ్చి కొత్తగా విధులలోకి చేరినవారికి విధుల కేటాయింపుజరగకపోవటం కూడా విశేషం. దీనితో వాటర్ వర్క్స్ విధుల నిర్వహణపై అయోమయ పరిస్థితి నెలకొంది. దోమల బెడదతో సతమతమవుతున్న ప్రజలకు తాగునీటి కాలుష్యంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కాలుష్యం వలన అతిసార వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ మినరల్ వాటర్ కొనుగోలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మైకులతో ప్రైవేటు వ్యక్తులు ఊదరగొడుతూ తాగునీటి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. వీటిని నిరోధించాల్సిన అధికారయంత్రాంగం చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోమలు, చెత్తచెదారం, పందులు, కుక్కలు, కోతుల బెడద వంటి సమస్యలు నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అధికారపార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సిందిపోయి తమలో తాము కీచులాడుకుంటూ ప్రజాసమస్యలు గాలికొదిలేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో నెలకొంది. ప్రజాభిప్రాయాలకన్నా ఆధిపత్యపోరులో తమ పంతమే నెగ్గాలన్న నేతల వైఖరి ప్రజలను ఇక్కట్లు పాలుచేస్తోందని వాపోతున్నారు. పందులను నగరానికి దూరంగా తరలించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పాలకవర్గం ఏర్పడిన తొలినాళ్ళలో ఎం.పి జె.సి.దివాకరరెడ్డి, మేయర్ స్వరూపలు నడుం బిగించారు. అయితే అధికారపార్టీలోని మరోనేత తెరవెనుక మంత్రాంగం నడపటంతో పందుల తరలింపుకు బ్రేక్ పడింది. అదే సమయంలో ఎం.పి జె.సి.దివాకరరెడ్డితో మేయర్ స్వరూప విబేధించి ఎమ్మెల్యే వర్గంలో చేరిపోవటంతో పందుల తరలింపుఅటకెక్కింది. దీనిపై విమర్శలు రావటంతో గత కొన్నిరోజుల క్రితం పందుల తరలింపుప్రక్రియను పోలీసు పహారాలో చేపట్టారు. అయితే పెంపకందారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పందుల తరలింపును స్థానికంగా అడ్డుకునే బదులు తరలింపుసమయంలో కర్నాటక రాష్ట్ర ప్రాంతంలో శానిటరీ సూపర్‌వైజర్ గంగిరెడ్డి, పందులను తరలిస్తున్న బృందంపై కేసులు పెట్టారు. దీనితో పందుల తరలింపుకు తిరిగి బ్రేక్ పడింది. దోమల నివారణకై ఫాగింగ్ చేపట్టటానికి సైతం మీనమేషాలు లెక్కిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. దోమలు విజృంభిస్తుండటంతో వైరల్‌ఫీవర్స్‌తో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టటానికి అధికారులు చర్యలు చేపట్టే పరిస్థితి కానరావటం లేదు. దీనితో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలన్న ప్రజల గోడు అరణ్యరోదనగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ప్రకటనలతో కాలం వెళ్ళదీయకుండా యుద్ధప్రాతిపదికన దోమలనివారణ, తాగునీటి కాలుష్యానికి అడ్డుకట్టవేసి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని వారు వేడుకుంటున్నారు.