S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వర్ణ బార్ మద్యంలో సైనైడ్ .. ఫోరెన్సిక్ నివేదికలో నిర్ధారణ

విజయవాడ, జూలై 22: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ బార్ మద్యం మరణాల కేసులో ఫోరెన్సిక్ నివేదిక బహిర్గతమైంది. బార్‌లో మద్యం సేవించి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా.. మద్యం శాంపిల్స్‌ను పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్ మద్యంలో సైనెడ్, ఇథైల్ ఆల్కాహాల్ కలిసినట్లు నిర్థారించింది. ఇందుకు సంబంధించి నివేదిక సిఐడి చేతికి అందడంతో కుట్ర కోణంలో దర్యాప్తు షురూ అయినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించిన వారిలో ఐదుగురు మృత్యువాత పడగా పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బార్ నిర్వాహకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు మరి కొందరిని అరెస్టు చేశారు. అయితే మద్యం మరణాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐజి మహేష్ చంద్ర లడ్హా నేతృత్వంలోని సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో పాటు బార్‌లోని మద్యం శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బార్ మద్యంలో కల్తీ జరిగినట్లు ఆరోపణలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు ఎలాంటి కల్తీ జరగలేదని, కేవలం కుట్రలో భాగంగా తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకే బురద జల్లుతున్నారంటూ విష్ణు వాదిస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో తాజాగా వెలువడిన ఫోరెన్సిక్ నివేదిక బట్టి చూస్తే కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించలేదని తెలుస్తోంది. మద్యం శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు గత ఏడాది డిసెంబర్ 30న పంపారు. దీంతో పరీక్షల అనంతరం మద్యంలో సైనెడ్‌తోపాటు, ఇథైల్ కలిసినట్లు నిర్థారిస్తూ వెల్లడైన నివేదిక సిఐడికి చేరడంతో మద్యంలో ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా సైనెడ్ కలిపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ దిశగా సిఐడి అరా తీస్తోంది. సిఐడి చేతికి సమగ్ర నివేదిక చేరిన క్రమంలో బయట నుంచే ఈ కుట్ర జరిగి ఉంటుందని భావిస్తూ కుట్ర కోణంలో కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. తాజా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోర్టుకు సమర్పించాల్సి ఉంది.