S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్య, పోడు సమస్యలపై ప్రశ్నల వర్షం

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 24: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో జడ్పిటిసి, ఎంపిపి, శాసనసభ్యులు జిల్లాలోని స్థానిక సంస్థల్లోని సమస్యలపై అధికారులను నిలదీశారు. సమావేశంలో ప్రగతి నివేదికలను చదివి వినపించడమేకాని అవి అమలు జరుగుతున్న విధానంలో లోపాలను సరిచేయకపోవడంపై పలువురు ప్రజాప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా పరిషత్‌లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలో విద్యా, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ, హరితహారం కార్యక్రమాలపై జిల్లా అధికారులు ప్రగతి నివేదికలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో లోటుపాట్లపై, ప్రజల సమస్యలు, అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నలవర్షం కురిపించారు. ప్రధానంగా జిల్లాలో విద్యాశాఖ అవలంభిస్తున్న విధానాలపై జడ్పిటిసిలు జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, కస్తూర్బా పాఠశాలల్లో వసతుల సమస్యలు, పాఠ్యపుస్తకాలు తదితర సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అధికారులను వివరణ కోరారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన కొన్ని రోజుల వరకు పాఠ్యపుస్తకాలు, యూనిపాంలు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులు భోజనం చేయలేకపోతున్నారని, నాణ్యతప్రమాణాలు పాటించకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో కడుపుమాడ్చుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జిల్లాలోని పిహెచ్‌సిల్లో వైద్యుల కొరత నెలకొని ఉన్నదని, దీంతో ప్రజలకు వైద్యం అందడం లేదని సభ్యులు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు కాలం కావడంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, దీనిపై అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా జిల్లాలోని 2వ ఏఎన్‌ఎంలు తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేస్తుంటే వారిని పట్టించుకోవడంలేదని, వారు విధుల్లో లేకపోవడంతో పిహెచ్‌సిల్లోని రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 41 మండలాలకు గాను 24 అంబులెన్స్‌లు మాత్రమే ఉన్నాయని, ప్రమాదాల సమయంలో అంబులెన్స్‌ల కొరతతో ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని, వెంటనే అంబులెన్స్‌ల కొరతను నివారించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా జిల్లాలో ఏజెన్సీప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పోడుసాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారికి వ్యవసాయసాగుకు అనుమతులు ఇవ్వడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారన్నారు. దశాబ్దాల కాలంగా పోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్న ఆ ప్రాంత వాసులపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయని, వెంటనే వాటిని ఆపివేయాలని భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య సమావేశంలో పేర్కొన్నారు. పట్టా భూముల్లో వ్యవసాయం సాగు చేసుకోకుండా అటవీ, పోలీస్ అధికారులు అడ్డుపడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఈ చర్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయకుండానే అనర్హులైన రైతులకు యంత్రాలను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటి వరకు బ్యాంక్‌ల నుండి రైతులకు రుణాలు ఇవ్వలేదని, దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారని సభ్యులు పేర్కొన్నారు. వెంటనే బ్యాంక్‌ల నుండి రుణాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసకోవాలన్నారు.