S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇది బయటిశక్తుల కుట్ర

హైదరాబాద్, జూలై 25: బయటి నుంచి వచ్చిన శక్తుల కుట్ర వల్లనే మల్లన్నసాగర్ సంఘటన చోటు చేసుకుందని తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి సిపిఎం, టిడిపి పార్టీలకు చెందిన వారు వచ్చి రాళ్లు రువ్వి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేట్టు చేశారని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. బయటి నుంచి వచ్చి రైతులను రెచ్చగొట్టడమే కాకుండా వెనుక నుంచి పోలీసులపై, రైతులపై రాళ్లు విసిరి హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేట్టు చేశారని, ఇలా చేసిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని తెలిపారు. హింసాత్మక ఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం జిల్లా బంద్‌కు విపక్షాలు పిలుపు ఇస్తే జనం తిరస్కరించారని, బంద్ విఫలం అయిందని అన్నారు. తమకు కావలసింది ప్రాజెక్టులే కానీ పంచాయితీలు కాదని బంద్‌ను తిరస్కరించడమే బంద్ విఫలానికి కారణమని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ప్రాజెక్టులు నిర్మిస్తామని, కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతుండగా, వాటిలో ఆరు గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు.
ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ప్రతిపక్షాలు ఇటీవల ఏ టెంట్ కింద దీక్షలు చేశారో అదే టెంట్‌కింద రైతులు ఆనందంగా భూములు ఇస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. మిగిలిన రెండు గ్రామాల్లో కూడా ఒకటి రెండు రోజుల్లో భూసేకరణ సమస్య పరిష్కారం అయితే ఇక తమ పని అయిపోయినట్టేనని భావించిన టిడిపి, సిపిఎం నేతలు హైదరాబాద్ సంగారెడ్డిల నుంచి తమ కార్యకర్తలను తరలించి రాజీవ్ రహదారిపై హింసాత్మక ఘటనకు వ్యూహరచన చేశాయని హరీశ్‌రావు ఆరోపించారు. 2013 చట్టం లేదా 123 జీవోల్లో దేని ప్రకారమైనా భూసేకరణ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టులకు వెళుతున్నారని తెలిపారు. నదులు లేని దగ్గర రిజర్వాయర్లు అవసరమా? అని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారని, నదులు లేకపోయినా ఆంధ్ర ప్రాంతంలో వలిగొండ, అవుకు, అలుగునూర్ తదితర రిజర్వాయర్లను ఎందుకు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు.
కృష్ణా డెల్టాలో మూడవ పంట కోసం ఖమ్మం జిల్లాలో 800 గ్రామాలను ముంచి వేస్తూ పోలవరం ప్రాజెక్టును కడుతున్నారని, నల్లగొండ జిల్లాలో వందలాది ఎకరాలు ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టారని తెలిపారు. తెలంగాణలో కనీసం రెండవ పంట గురించి రిజర్వాయర్లు కట్టుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగును ఇచ్చేలా ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇవ్వని రీతిలో నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని అన్నారు. ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని, అదే విధంగా నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పారు. విలేఖరుల సమావేశంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.