S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొల్లేరు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

ఏలూరు, జూలై 25 : దశల వారీగా కొల్లేరు ప్రాంతాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం ఏలూరు మండలం పత్తికోళ్ల లంక గ్రామంలో సోలార్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కొల్లేరు ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస వౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడం, రహదారులను అభివృద్ధి చేయడం, సంక్షేమ పధకాలను అర్హులకు అందజేస్తామన్నారు. ఇప్పటికే రేషన్ కార్డులు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో వున్న రేషన్‌కార్డులో రెండుమూడు కుటుంబాలు కలిసి వుంటే వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే సంక్షేమ పధకాలు అన్ని పేద కుటుంబాలకు వర్తిస్తాయన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య లక్ష్యాలను సాధించేందుకు ప్రతీ కుటుంబం కూడా సహకరించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఇప్పటికీ నిర్మించుకోని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని, నిర్మించుకున్న వారు కూడా వాటిని వినియోగించుకోవాలని, స్టోర్ రూమ్‌గా వాడవద్దని సూచించారు. దళిత వాడల్లో సిసి రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ తెలుపు రంగు కార్డు కలిగిన వారికి గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని, తెలుపు కార్డు వుండి గ్యాస్ కనెక్షన్ లేని వారి పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపిపి రెడ్డి అనురాధ, జడ్పీటిసి మట్టా రాజేశ్వరి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మోరు హైమావతి, టిడిపి నాయకులు నేతల రవి, మట్టా సుబ్బారావు, మోరు సుబ్బారావులతోపాటు పలు శాఖల ఉద్యోగులు కొల్లేరు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతమనేనికి పూల గజమాలలతో ఘన సత్కారం చేశారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేళతాళాలు, భాజాభజంత్రీలు, తీన్‌మార్ వాయిద్యాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
నేడు టాస్క్ఫోర్స్ కమిషన్ సభ్యుల బృందం రాక
ఏలూరు, జూలై 25 : ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర వ్యవసాయాభివృద్ధికై ప్రభుత్వం ప్రొఫెసర్ రాధాకృష్ణ అధ్యక్షతన వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ కమిషన్ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రొఫెసర్ గాలబ్ అధ్యక్షతన టాస్క్ఫోర్స్ కమిషన్‌ను నియమించారు. ఈ టాస్క్ఫోర్స్ కమిసన్ బృంద సభ్యులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ జూలై 26వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాను సందర్శించనున్నారు. ఈ టాస్క్ఫోర్స్ కమిషన్ వ్యవసాయ, అనుబంధ శాఖలైన ఉద్యాన, పశుసంవర్ధక, పాడి, పట్టు, మత్స్యరంగాలు, పెట్టుబడి రంగాల రైతులు, వాటాదారులను కలుసుకుని ఆయా ఉత్పత్తుల ఉత్పత్తి, శుద్ది, రవాణా, మార్కెటింగ్‌లో సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుంది. జూలై 26వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లోని నూతన సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ రంగాల రైతులు, పెట్టుబడిదారులతో టాస్క్ఫోర్స్ బృందం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, బ్యాంకింగ్ రంగ అధికారులు పాల్గొంటారు. కావున జిల్లాలోని వ్యవసాయ, అనుబంధ రంగాల రైతులు, పెట్టుబడిదారులు, ఆయా రంగాలలో రైతులు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుపోవాలనుకున్న వారందరూ ఈ సమావేశంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ భాస్కర్ తెలియజేశారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి:కలెక్టర్
ఏలూరు, జూలై 25 : ప్రతీ జిల్లా అధికారీ రోజూ మీ-సేవ, మీ-కోసం, ఇ- ఆఫీస్‌లో వచ్చిన అర్జీలను ఉదయం కొద్ది సమయం కేటాయించి వారి శాఖ వారి పెండింగ్ ఉన్నవన్నీ పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఉదయం కొత్త సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రతీ వారం శాఖాపరంగా సమీక్షించినప్పటికీ కొన్ని శాఖల అర్జీలు పరిష్కారం కావడం లేదని అధికారులు అడిగితే కమిషనరేట్లో లేదా వారి పై అధికారుల వద్ద పెండింగ్ ఉన్నాయని చెబుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. జిల్లాలో ఇప్పటికే 99.96 శాతం అర్జీలను మీ-సేవ, మీ-కోసంలలో పరిష్కరించామని దానిని నూరుశాతం పరిష్కరించుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు పరిష్కరించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదని వాటిని పై అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. సివిల్ సప్లయిస్, మత్స్యశాఖ, పరిశ్రమలు, గనులు, ల్యాండ్ సర్వే, పోలీసు, వ్యవసాయ శాఖలకు చెందిన అర్జీలు మీ-కోసంలో పెండింగ్‌లో ఉన్నాయని అర్హులైతే అనుమతివ్వాలని లేదా అర్హులు కానిచో వారికి అర్హులు కారని స్పష్టంగా చెప్పవలసిన అవసరం వుందన్నారు. సివిల్ సప్లయిస్‌కు సంబంధించి గడువు దాటినవి 2267 అర్జీలున్నాయని డి ఎస్‌వో శివశంకర్‌రెడ్డి చెప్పగా వాటిని ఆగస్టు 2వ వారం కల్లా పరిష్కరించాలన్నారు. లేకుంటే అపరాధ సొమ్ము చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఇక ముందు ఫైళ్ల పరిష్కారంలో ఎంత వరకు సంతృప్తికరమైన చర్య తీసుకుందీ కూడా సమీక్షించడం జరుగుతుందన్నారు. ఇ- ఆఫీస్‌పై సమీక్షిస్తూ ఇప్పటి వరకూ లక్షా 55 వేల ఫైళ్లను జిల్లాలో నమోదు చేసామని నెలాఖరుకల్లా రెండు లక్షల ఫైళ్లు అయ్యేటట్లు చర్యలు చేపట్టాలని కలెక్టరు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. అన్ని మున్సిపాల్టీల నుంచి వచ్చే వారం కల్లా ఇ- ఆఫీస్‌లో నమూనా ఫైలు పంపాలని మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బస్సులో పొగలు: ప్రయాణీకులు బేజారు
బుట్టాయగూడెం, జులై 25: జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన దొరమామిడి బస్ సాంకేతిక లోపం కారణంగా ఇంజన్‌లో పొగలు వచ్చి, ప్రయాణీకులను ఆందోళనకు గురిచేసింది. దొరమామిడి నుండి సోమవారం ఉదయం సుమారు 11గంటలకు బుట్టాయగూడెం చేరిన బస్ ఇంజనలో అకస్మాత్తుగా పొగలు రాడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురై బస్ డోర్ నుండే కాక కిటికీల నుండి కూడ దూకేశారు. దీనిని గమనించిన రోడ్డుపై ప్రజలు కూడ పెద్దసంఖ్యలో గుమికూడి, చిన్నపిల్లలను కిటికీల నుండి అందుకుని దింపేశారు. తీరా చూస్తే బ్యాటరీకి సంబంధఙంచిన వైర్లు షార్టయి, పొగలు వచ్చినట్లు తెలియడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకుని, అదే బస్‌లో తిరిగి ప్రయాణం కొనసాగించారు.
గంగిరెడ్ల అభివృద్ధికి కృషి:ఎమ్మెల్యే గన్ని
భీమడోలు, జూలై 25 : గంగిరెడ్ల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హామీ ఇచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి విచ్చేసిన గంగిరెడ్ల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉంగుటూరు ఎమ్మెల్యే వీరాంజనేయులకు భీమడోలులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం అందజేస్తున్న పలు పధకాలను తమకు అందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వపరంగా గంగిరెడ్ల అభివృద్ధికి పలు పధకాలను ప్రారంభించేలా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చారు.
28నాటికి అంత్యపుష్కరాల ఏర్పాట్లు పూర్తిచేయాలి
సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్
నరసాపురం, జూలై 25: గోదావరి అంత్య పుష్కరాల ఏర్పాట్లను అన్నిశాఖలు ఈనెల 28నాటికి పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఎఎస్. దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరి అంత్య పుష్కరాల నిర్వాహణ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్న అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటుచేయాలన్నారు. పురపాలకశాఖ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్వాహణ, శానిటేషన్, షామియానాల ఏర్పాటు, మంచినీటి సరఫరా తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, సిసి కెమెరాల ఏర్పాట్లు, కంట్రోల్ రూమ్, అత్యవసర సమాచారం యాత్రీకులకు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయితీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో నరసాపురం డివిజన్‌లోని గోదావరి నది తీరప్రాంత గ్రామాల్లో పుష్కర ఘాట్‌లను పరిశీలించి భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల నిర్వాహణ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన ప్రాంతాల్లో పడవలను ఏర్పాటుచేయాలన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అంత్య పుష్కరాల యాత్రీకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు సూర్యనారాయణరెడ్డి, గురుప్రసాదరావు, కె. రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ పి. రమేష్, డిఎంహెచ్‌ఒ కె. సుచిత్ర, డిసిపిఒ జి. శ్రీరాములు, ఆర్‌అండ్‌బి డిఇ కనకరాజు, ఫైర్‌స్టేషన్ అధికారి బోస్‌బాబు, ఆర్టీసీ డిఎం ప్రసాదబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ అనంతరాజు పాల్గొన్నారు.