S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిధుల జాతర.. నాణ్యతకు పాతర..

గుంటూరు, జూలై 25: కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు విడుదల చేసింది. రెండు జిల్లాల్లో వందల కోట్ల రూపాయలకు టెండర్లు పెట్టారు. గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. పుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటికీ ఘాట్ల నిర్మాణం.. రోడ్ల విస్తరణ పనులు ఇంకా పూర్తికాలేదు. తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి సీతానగరం వరకు ఒకే ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అమరావతి, ధరణికోట, ఉండవల్లి ప్రాంతాల్లో కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేయటంతో పాటు గతంలో ఉన్న వాటి విస్తరణ పనులు చేపట్టారు. జిల్లాలో దాదాపు రెండువేల కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఇటీవల సీతానగరం ఘాట్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత కాంట్రాక్టర్ ను అరెస్టుచేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అయినా ముఖ్యమంత్రి హెచ్చరికలు బేఖాతరు చేస్తూ పనుల్లో కాంట్రాక్టర్లు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరవైంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కృష్ణా పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం గుంటూరు నగరంలో రూ. 170 కోట్లతో రోడ్ల విస్తరణ చేపట్టారు. ఏటుకూరు- పర్చూరు రోడ్డు, అమరావతి- గుంటూరు, హైవేకు అనుసంధానంగా ఉన్న మార్కెట్ - పేరేచర్ల రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. గత కొద్దిరోజుల క్రితం మంత్రుల సమీక్ష సందర్భంగా పనుల్లో జాప్యం.. నాణ్యతా ప్రమాణాలపై అధికారులకు చీవాట్లుపడ్డాయి. అయినా రోడ్ల విస్తరణ పనులు ముందుకు సాగటంలేదు..వికాస్ నగర్, విద్యానగర్, బృందావన్ గార్డెన్స్ రోడ్ల విస్తరణపై ఉన్న శ్రద్ధ ఏటుకూరురోడ్డు, ఇతర మార్గాలపై చూపడంలేదనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పుష్కర పనుల్లో భాగంగా గతంలో చేసిన పనుల స్థానే కొత్తగా మరోసారి చేపడుతున్నట్లు సమాచారం. అరండల్ పేట వంతెన ఫుట్ పాత్ ఫ్లోరింగ్ పనులు గతంలోనే పూర్తిచేశారు. ఇప్పుడు అలంకరణ పేరుతో మరోసారి ఉన్న టైల్స్‌ను తొలగించి కొత్తవి పేర్చడం ద్వారా దుబారా ఎక్కువ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. పుష్కరాలు కాంట్రాక్టర్లు, అధికారులు.. కొందరు ప్రజాప్రతినిధులకు అందివచ్చిన వరంగా మారాయనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.