S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళానికి..

అనంతపురం, జూలై 25: సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పాతాళానికి చేరుకుంటోంది. ఏటా జూన్ నుంచి మే (వచ్చే ఏడాది) వరకు వాటర్ ఇయర్ (నీటి వార్షికం)గా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో 120.9 మీ.మీ. సాధారణ వర్షపాతం నమోదైంది. తద్వారా 81.6 టి ఎంసిల వర్షం నీరు లభ్యమైనట్లు జిల్లా భూగర్భ జల శాఖ నిర్ధారించింది. ఇందులో 9.79 టి ఎంసిల నీరు భూగర్భ జలంగా మారిందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నెలలో సగటున 20 మీటర్లకన్నా పైబడి భూగర్భ జల మట్టం 39 మండలాల్లో నమోదైంది. ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 26 మండలాలకు పడిపోయింది. ఈ లెక్కన 13 మండలాల్లో 20 మీటర్ల కన్నా తక్కువ లోతుకు చేరుతున్నాయి. ఈ ఏడాది జూన్, జూలై జిల్లాలో 49.2 టిఎంసిల వర్షపు నీరు భూగర్భ జలంగా మారినట్లు అంచనా వేశారు. అలాగే హంద్రీ నీవా కాలువకు నీటి విడుదల ద్వారా 1.55 టి ఎంసిల నీరు భూగర్భ జలం మారడంతో దాదాపు 7వేల బోర్లు రీచార్జ్ కావడం వల్ల, పరోక్షంగా 23 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలతో అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చిందని అంచనా. జిల్లా వ్యాప్తంగా వాస్తవ నీటి మట్టం సేకరణకు 150 ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో సోమవారం లెక్క ప్రకారం 35 ఫీజో మీటర్లలో నీటి మట్టం పెరిగింది. మరో 48 ఫీజో మీటర్లలో నీటి మట్టం స్థిరంగా ఉండే అవకాశం ఏర్పడింది. కాగా ఈ ఏడాది రబీ సీజన్‌లో నీటి వాడకం వల్ల మే నెలలో 19.23 మీటర్లకు భూగర్భ జల మట్టం పడిపోయింది. జూన్‌లో 17.84 మీటర్లకు నీటి మట్టం తగ్గిపోయింది. జూలైలో 19.14 మీటర్లుగా నమోదైంది. గత ఏడాది జూలైలో 22.37 మీటర్లు కాగా, ఈ ఏడాది జూలైతో పోలిస్తే 3.23 మీటర్లు పెరుగుదల కనిపిస్తోంది. కానీ గత నెల కన్నా ఈ నెలలో మాత్రం నీటి మట్టం 1.30 మీటర్లు తగ్గడం విశేషం. నెల రోజులుగా గాలి చినుకులు మినహా. వానలు కురవడం లేదు. దీంతో వర్షాధారంగా వేసిన ఖరీఫ్ వేరుశెనగ పంట ఎండుతోంది. జూన్ నెలలో కురిసిన వర్షం తప్ప తర్వాత వాన జాడ లేదు. దీంతో భూగర్భ జలాలు కూడా పెరగక పోగా ఉన్నవి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఈ నెలాఖరు, లేదా ఆగస్టు నెలలో తొలి వారం రోజుల్లోనైనా వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో జూన్, జూలై నెలల్లో 131.3 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 63.9 మి.మీ. కాగా, మొత్తం 94.5 మి.మీ. వర్షం కురిసింది. దీంతో 47.9 శాతం వర్షపాతం అధికంగా నమోదైంది. ఈ నెల(జూలై)లో 67.4 మి.మీ. సాధారణ వర్షపాతానికి గానూ ఇప్పటి వరకు కేవలం 56.6 మి.మీ. మాత్రమే కురిసింది. ఇది సగటున 26.3 మి.మీ.మాత్రమే. సోమవారానికి జిల్లాలోని 63 మండలాల్లో 17 మండలాల్లో వర్షపాతం ఊసే లేదు. 2.5 మి.మీ. వరకు 32 మండలాలు, ఆపైన 5.0 మి.మీ. వరకు 5, 10.0 మి.మీ. వరకు 4, ఆపైన 5 మండలాల్లో వర్షం కురిసింది. నీటి వనరుల సంరక్షణకు రైతులు తమ పొలాల్లో స్ట్రక్చర్లు (గట్లు) వేసుకోవడం, ఆరుతడి పంటలు, పండ్ల తోటలు వేసుకోవడం, ఫారంపాండ్లు నిర్మించుకోవడం, బోర్లు లేని వారు తమ పొలాల చుట్టూ ట్రెంచులు ఏర్పాటు చేసుకోవడం చేయాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.17 లక్షల బోర్లలో నీరున్నట్లు(లైవ్) అధికారులు తేల్చారు.
గుంభనంగా..!
అనంతపురం కల్చరల్, జూలై 25: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమీక్ష సమావేశాలు అంతా లోలోపలే అన్న చందంగా ఆ పార్టీ నేతలు గుంభణంగా నిర్వహించారు. సోమవారం నగరంలోని కమ్మ భవన్ వేదికగా ఈ సమావేశాలు నిర్వహించారు. అయితే గతంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాలకు భిన్నంగా ప్రస్తుత సమావేశాలు నిర్వహించారు. గతంలో బహిరంగంగా సమావేశాలు నిర్వహించిన సందర్భంలో కొందరు నేతల మధ్య గల విభేదాలతో కార్యకర్తల నడుమ ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో బహిరంగంగా నిర్వహించినట్లయితే పార్టీలోని విభేదాలు బయటపడతాయని భావించిన నాయకులు అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశాలు మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ పతాకావిష్కరణతో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి, జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి, ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణల సమక్షంలో నియోజకవర్గ సమన్వయ సమీక్షలు నిర్వహించారు. ఈ సమావేశాలు రాత్రి వరకు జరిగాయి. త్వరలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన దృష్ట్యా పార్టీలో కొందరు నేతల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తపడటానికే నాయకులు ఈ విధమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం, సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరే విధంగా చూడటం, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల బలోపేతం గురించి సమన్వయ కమిటీలో చర్చించినట్లు నాయకులు తెలిపారు. అదేవిధంగా పార్టీ కేడర్, ప్రజా ప్రతినిధులకు మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించి, గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో పార్టీ విజయపతాకం ఎగరేయడమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో సమావేశాలు నిర్వహించినట్లు పార్టీ పరిశీలకులు తెలిపారు. ఈ సమావేశాలకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నియోజకవర్గంలోని మండల సమన్వయ కమిటీ నాయకులు హాజరయ్యారు.
ముఖ్యనేతలు డుమ్మా!
* జిల్లా టిడిపిలో సమసిపోని విభేదాలు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జూలై 25: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల సమీక్ష సమావేశానికి ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. దీంతో పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపిల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు బయటపడినట్టయింది. అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డితో పాటు హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ, కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తదితరులు గైర్హాజరయ్యారు. బాలకృష్ణ విషయంలో పరిస్థితి వేరుగా ఉన్నా, జెసి సోదరులు, అనంతపురం ఎమ్మెల్యే వి.ప్రభాకరచౌదరి, మేయర్ మదమంచి స్వరూప మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్న విషయం విదితమే. ఇటీవల రామనగర్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, నగరంలోని డివైడర్ల ఏర్పాటు, పాతూరులో రోడ్డు విస్తరణ తదితరాల విషయంలో ఇటు జెసి సోదరులకు, ఎమ్మెల్యే, మేయర్ వర్గంతో విభేదాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన నియోజకవర గ సమీక్ష సమావేశాలకు జెసి సోదరులు డుమ్మా కొట్టారు. అదే విధంగా కదిరి నియోజకవర్గంలో సమన్వయకర్త కందికుంట వెంకటప్రసాద్‌కు, స్థానిక ఎమ్మెల్యే ఇటీవలే టిడిపిలే చేరిన అత్తార్ చాంద్‌బాషా మధ్య సయోధ్య మిథ్యగా మారింది. దీంతో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా గైర్హాజరయ్యారు. అలాగే పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి, హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్ప అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పెనుకొండ నియోజకవర్గం నుంచి కూడా చెప్పుకోదగ్గ రీతిలో మండల స్థాయి నాయకులు హాజరు కాలేదు. పుట్టపర్తిలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యతిరేక వర్గీయులు కూడా గైర్హాజరయ్యారని సమాచారం. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడు నుంచి చెప్పుకోదగ్గ రీతిలో మండల స్థాయి నాయకులు హాజరయ్యా రు. ఇతర నియోజకవర్గాలకు సంబంధించి మండల స్థాయి నాయకులు సమీక్ష సమావేశాలకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో వర్గ విభేదాలు బహిర్గతం కాకుండా నేతలు కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, టిడిపి జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, సునీత, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఈసారి జాగ్రత్త పడ్డారు. అంతర్గత సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. జిల్లాలో సి ఎం పర్యటనను విజయవంతం చేయాలని, విభేదాలు బహిర్గం కాకుండా, రచ్చకెక్కకుండా ఉండాలని సూచనలు చేసినట్లు సమాచారం.
సాగునీటిని స్వాహా చేశారా!
గార్లదినె్న, జూలై 25:తుంగభద్ర జలాశయం నుండి మన జిల్లాలోని రిజర్వాయర్లకు వస్తున్న 22 టిఎంసిల నీటిని, అలాగే సమాంతర కాలవ కింద మరో 10 టిఎంసీల నీటిని తెప్పిస్తున్నామని గొప్పలు పలికే టిడిపి నేతలు ఆనీటిని ఎం చేశారో బహిర్గతం చేయాలని వైకాపా నాయకుడు మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో పొలాలన్ని బీళ్లుగా మారుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకోని టిడిపి నేతలు, మంత్రులు తుంగభద్ర జలాశయం నుండి వచ్చే 32 టిఎంసీల నీటిని స్వాహా చేశారా, లేక ఇతర జిల్లాలకు తాకట్టు పెట్టారా అనే అంశాన్ని స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైకాపా శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త జొన్నలగడ్డ పద్మావతి, ఇన్‌చార్జి సాంబశివారెడ్డి, మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి మాజీ ఎంపి అనంతవెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజా తీర్పును బహిర్గతం చేయడాని వైకాపా అధినేత జగన్మోహన్ పిలుపు మేరకు గడపగడపకు వైకాపా కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఏ ఇంటివద్దకు వెళ్లిన ప్రజలు ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేయలేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి తదితర అంశాలపై ప్రశ్నించే ఎమ్మెల్యేలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ నుండి బయటకు పంపించే పరిస్థితి నెలకొందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఆయకట్టుకు రావలసిన నీటిని బలమున్న నాయకులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించే సాహసం చేయలేదన్నారు. పార్టీలు ఏవైనా, కులమతాలు ఏవైనా ప్రజల అభివృద్ధి కోసమే ప్రభుత్వాలు పాటుపడాలని హితువు పలికారు. మండల పరిధిలోని మర్తాడు గ్రామం లో తీవ్ర తాగునీటి సమస్య ఉన్నప్పటికి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదన్నారు. అలాగే ప్రభు త్వ సంక్షేమ పథకాలు అమలు కూడా జన్నభూమి కమిటీల పేరుతో టిడిపి నాయకులుకు, కార్యాకర్తలకు లబ్ధిచేకూర్చేలా నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రజల పక్షాన పోరాడటానికి వైకాపా సిద్ధంగా ఉందన్నారు. సాగునీటి విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చంద్రబాబునాయుడిని కనీసం ప్రశ్నించే సాహసం చేయలేదన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల పక్షాన పోరాడడానికి వైకాపా మున్ముందు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. స్థానిక సమస్యలపై చర్చించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం పార్టీలు పూర్తి మద్దతు తెలిపాయి. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు వై.నారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి, జంబులదినె్న సింగల్‌విండో అధ్యక్షులు సుబ్బిరెడ్డి, ఉపాధ్యక్షులు బ్యాళ్ల ఈశ్వరయ్య, ఎంపిటిసిలు జగ్గాల రవి, బంగారువీరంజనేయులు, గట్టురామకృష్ణారెడ్డి, కోటంక తాతిరెడ్డి, సిపిఐ నాయకులు ప్రసాద్, రాజశేఖర్‌శెట్టి, సిపిఎం నాయకులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సహకారంతోనే గ్రామాభివృద్ధి
* ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి
పెద్దవడుగూరు, జూలై 25:పెద్దవడుగూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తాడిపత్రి ఎమ్మె ల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్దవడుగూరు గ్రామంలో పర్యటించి నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణమండపం పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దవడుగూరు గ్రామాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాలంటే అధికారులు సహకరించాలి. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆర్థికంగా తోడ్పాటును అందించాలని తెలిపారు. పంచాయతీరాజ్ మండల సర్వేయర్‌కు గ్రామంలో ఎక్కడ మట్టి రోడ్డు ఉండడానికి వీలులేదని, గ్రామాన్ని పూర్తిగా సర్వే చేసి అవసరమైన రోడ లకు ప్రతిపాదనలు పంపాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పథకంలో రుణమాఫీ కాని రైతుల వివరాలు తెలియజేసి ప్రభుత్వానికి ఎందుకు వివేధిక ఇవ్వలేదని ఎఓ రూపస్‌రోనాల్డ్‌ను నిలదీశారు. త్వరగా ఉన్న సిబ్బందితో కలసి గ్రామాల్లోని రుణమాఫీకాని రైతుల వివరాలు సేకరించి తమకు తెలియజేయాలని సూచించారు. అనంతరం జడ్పీ పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉన్న అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలపై ప్రశ్నలు వేశారు. పిల్లలు సమాధానం చెప్పలేక పోవడంతో ఉపాధ్యాయులపై మండిపడ్డారు. విద్యార్థులకు క్రమశిక్షణ కలిగిన విద్యను అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న అపరిశుభ్రతను పరిశీలించారు. రహదారులు అపరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలుతాయని, చెత్తాచెదారం రోడ్లపై వేయకుండా చెత్తబుట్టలో వేసి దూరంగా ఉంచాలని ప్రజలకు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న గుత్తి రోడ్డును పరిశీలించి గుత్తిరోడ్డు సర్కిల్ వెడల్పు పెంచాలని అధికారులకు సూచించారు. పేట శివాలయానికి వెళ్లే దారిని అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు. ఎంపిపి లీలావతి, తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిడిఒ వెంకటాచలపతి, ఎంఇఒ డేనియల్, నాయకులు కొండూరు కేశవరెడ్డి, సూర్యప్రభాకర్‌రెడ్డి, గంగరాజు, హరినాథ్‌రెడ్డి, అవలంపల్లి కేశవరెడ్డి, రమణారెడ్డి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
31న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ
* పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి
మడకశిర, జూలై 25:మడకశిర పట్టణంలో ఈ నెల 31న జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నీలకంఠాపురంలో ఆయన అగళి, గుడిబండ, రొళ్ళ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యులు జైరాం రమేష్ ఈ నెల 31న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ముఖ్యంగా జైరాం రమేష్ తన నిధుల ద్వారా మడకశిర, పెనుకొండ, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో సిమెంటు రహదారులు, కమ్యూనిటీ భవనాల మరమ్మతుల కోసం రూ.10 కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. దీంతో ఆయన్ను సన్మానించేందుకు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు మడకశిరలో, మధ్యాహ్నం 3 గంటలకు పెనుకొండల్లో బహిరంగ సభలు జరుగుతాయన్నారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాగా సోమవారం రఘువీరారెడ్డి తల్లి నరసమ్మ మూడో వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కెటి శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.