S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరివంశం 195

ఆ ప్రమథ గణాలు భయదసత్త్వులు, భీషణాకారులు, సింహ శార్దూల చర్మ వసనులు, త్రిశూలధారులు. భయంకర శస్త్రాస్తధ్రరులు. అనేక నేత్రులు, అనేకోదరులు, అతిరౌద్ర స్వభావులు. వీళ్ళ అండ చూసుకొని బాణాసుర సైన్యం కూడా మళ్లీ యుద్ధ రంగాన చెలరేగారు.
వీళ్ళను చూసి మాటిమాటికీ తన శార్ఞ్గ్ధనువు అల్లెత్రాటిని మోగిస్తూ గరుడారూఢ విలాస సుందరుడై శ్రీకృష్ణదేవుడు కూడా సమరోన్ముఖుడైనాడు. ఇట్లా ఉమాపతి, రమాపతీ యుద్ధ సన్నద్ధులై ఎదురెదురుగా నిలవటం సమస్త లోకాలను సంచలింపజేసింది. భూమి కుంగిపోయింది. పర్వతాలు అణిగిపోయినాయి. ఉత్తుంగ శృంగాలు ఊడిపడ్డాయి. దిక్కులలో గగనతలంలో పెనుమంటలు పొడకట్టాయి. లెక్కకు మిక్కిలి ఉల్కలు రాలిపడ్డాయి. మేఘాలు లేకుండా ఉరుములు ఉరిమాయి. గాలి స్తంభించిపోయింది. సూర్యకాంతులు మాసిపోయినాయి. ఆకాశంలో విమానాలు చిందరవందరై కిందుమీదైనాయి. దేవతలు, ఋషులు, భయం భయంగా గగనచారులై ఈ రణరంగాన్ని విలోకిస్తున్నారు.
అప్పుడు రుద్రుడు శౌరిమీద నూరు బాణలు ప్రయోగించాడు. నారాయణుడు మహేశ్వరుడిపై మహేంద్రాస్త్రం ప్రయోగించాడు. ఈ ఐంద్రాస్త్రం నుంచి వేల వేల అంబకాలు పుట్టి త్రయంబకుడి రథం కప్పివేశాయి. పురాంతకుడలిగి నారాయణుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. అందులోనుంచి సహస్ర జ్వాలలు ఎగిసి విష్ణువు ప్రయోగించిన బాణాలను కబళించి గరుత్మంతుడి చుట్టూ వలయాలుగా విజృంభించి బలరామ, ప్రద్యుమ్న, శ్రీకృష్ణులను దావ దహన జ్వాలలవలె చుట్టుముట్టాయి.
ఈ దృశ్యం చూసి ప్రమథులు, బాణసైన్యాలు కోలాహలంగా కేకలు, బొబ్బలు వెలువరించారు. బాణుడికి విజయం లభించినట్లు కేకలు వేశారు. అప్పుడు మురాంతకుడు వారుణాస్త్రం ప్రయోగించగా ఆగ్నేయాస్త్రం చప్పగా చల్లారిపోయింది. బాణుడి సైన్యాలు తెల్లమొగం వేశారు. ప్రమథ గణాలు గుక్కిళ్ళు మింగారు.
త్రిపురాంతకుడు కినుక బూని పైశాచం, రాక్షసం, రౌద్రరాక్షసం, ఆంగిరసం అనే బాణాలు క్రమంగా హరిమీద ప్రయోగించాడు. మురాంతకుడు అందుకు ప్రతీకారంగా వాయవ్యం, సావిత్రం, సమ్మోహనమనే అస్త్రాలు శివుడిమీద ప్రయోగించాడు. ఆ తరువాత వైష్ణవాస్త్రం అభిమంత్రించి ప్రయోగించాడు. సురసిద్ధ సాధ్య గంధర్వులు గడగడ వణికిపోయినారు. బాణుడి సేనలు మళ్లీ కకావికలమైపోయినాయి. సమస్త భూతజాలం ఆక్రోశించింది. ఈ అస్తప్రు ధాటికి శివుడి రథమే ఊగులాడింది. సారధితోపాటు, రథ్యాలు మంటలలో చిక్కుకున్నారు. ఇక బాణుడు స్వయంగా మంత్రవేత్తలచే మంగళాచరణం గావించుకొని ఇంకా ఎందరో మహారథులు తనకు వలయంగా కూడి రాగా యుద్ధ్భూమికి వచ్చి ధనుఃస్ఫాలనం చేశాడు. సదాశివుడికి ఆగ్రహం కలిగి త్రిపుర దహనవేళ ప్రయోగించిన బాణాన్ని వింటి సంధించటానికి పూనుకోబోతుండగా శిఖిపించ లాంఛనుడు ఆయన ప్రయత్నం నివారించటానికి జృంభక బాణం శశివౌళిపై ప్రయోగించాడు. ఎప్పుడైతే కృష్ణుడు జృంభకాస్త్రాన్ని ఆయనపైకి వదిలాడో శివుడికి ఆవులింతలు ఎడతెగకుండా ప్రారంభమైనాయి. శరీరం జడమైపోయింది.
నిద్ర కూరుకొని వచ్చింది. ఆయన చేతిలోనుంచి విల్లు, బాణమూ జారిపోయినాయి. దేహం స్తంభించిపోయింది. ప్రమథులందరూ ఇది చూసి ప్రగాఢాశ్చర్యం పొందారు. బాణాసురుడు ఆయన దగ్గరకు వచ్చి కొంత ప్రబోధం కలిగించాడు. అప్పుడు పరమేశ్వరుడు యోగదృష్టితో జరిగిన విషయాలను గుర్తుచేసుకున్నాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు