S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యవసాయాభివృద్ధికి సూచనలు

ఏలూరు, జూలై 26 : వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని తొలగించేందుకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సుస్థిర వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ తగు సూచనలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ రాధాకృష్ణ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని నూతన సమావేశ మందిరంలో మంగళవారం సుస్థిర వ్యవసాయాభివృద్ధిపై ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ అనుబంధరంగాలైన వ్యవసాయం, ఉద్యానవనాలు, ఆక్వా, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక రంగాలకు చెందిన రైతుల నుండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన సౌకర్యాలు, విదేశీ ఎగుమతులు, ప్రభుత్వ విధానాలు, తదితర అంశాలపై రైతుల నుండి సూచనలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాకలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 80 శాతానికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారని, భూ యజమాని, కౌలు రైతులకు న్యాయపరమైన లీజు అగ్రిమెంటు లేని కారణంగా వారికి ఎటువంటి న్యాయపరమైన హక్కులు లభించడం లేదన్నారు. జిల్లాలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 5200 కోట్ల రూపాయలు పంట రుణాలు లక్ష్యానికి గాను కౌలు రైతులకు కేవలం వంద కోట్ల రూపాయలను మాత్రమే పంట రుణాలుగా అందించామన్నారు. జిల్లాలో మూడు లక్షలకు పైగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించామని, వీరిలో కేవలం అయిదు వేల మందికి మాత్రమే పంట రుణాలు అందించడం జరిగిందన్నారు. బ్యాంకు రుణాలు, బీమా పరిహారం, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోయిన పంటకు ఇన్‌ఫుట్ సబ్సిడీ వంటివి నేరుగా భూమి యజమానులే పొందుతున్నారన్నారు. పంట రుణాలు అందించే బ్యాంకు మేనేజర్లు క్షేత్రస్థాయిలో ఎవరు సాగు చేస్తున్నారు, ఏ పంటలు వేస్తున్నారనే విషయాన్ని పరిశీలించి పంట రుణాలు అందించే దిశగా చర్యలు తీసుకోవలసిన అవసరం వుందన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు, బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివి అందించి ఆదుకున్నప్పుడే ఇటువంటి వేదికల లక్ష్యం నెరవేరుతుందన్నారు. జెసి-2 షరీఫ్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాధమిక రంగాల మిషన్‌గా గుర్తించి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో సంవత్సరానికి మూడు పంటలు వేసే విధంగా పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. భూసార పరీక్షల కార్డులను రైతులకు అందించి ఎరువులు వాడకాన్ని నియంత్రించామన్నారు. సంచార ల్యాబ్‌ల ద్వారా భూసార పరీక్ష ఫలితాలను రైతుల వద్దకే తీసుకువెళ్లామన్నారు. రైతులకు ఇ-పాస్ విధానం ద్వారా ఎరువులను అందించి సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు గిట్టుబాటు ధర పెంచాలని, ఉపాధి హామీ పధకం కారణంగా కూలీల కొరత ఏర్పడి సాగు మరింత భారంగా మారిందని తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన ఆంజనేయరాజు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. వలసల కారణంగా వ్యవసాయ కూలీల కొరత వుందని, భవిష్యత్తులో వ్యవసాయం కనుమరుగు అయ్యే అవకాశం వుందన్నారు. పెదవేగి జడ్పీటిసి విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో వరి, అపరాల సాగుకు విత్తనాలను స్థానికంగా అభివృద్ధి చేసుకునే వ్యవస్థ ఉండాలని, అపరాలకు డిమాండ్ ఉన్నందున రెండవ పంటకు రైతులకు అపరాల సాగుకు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. టుబాకో బోర్డు మాజీ ఛైర్మన్ గద్దే శేషగిరిరావు మాట్లాడుతూ అపరాల పంటలను కూడా బీమా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. మెట్ట ప్రాంతంలో పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా అపరాల సాగు చేపట్టేందుకు రైతులలో అవగాహన కలిగించాలన్నారు. విస్సాకోడేరుకు చెందిన మేళం దుర్గారావు మాట్లాడుతూ రైతు యాజమాన్య చట్టంను అనుసరించి భూ యజమానులు యాజమాన్యం హక్కులు కోల్పోకుండా కౌలు రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. పంజాబ్, హర్యానాలలో మాదిరిగా రైతుల కల్లాల నుండే పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దెందులూరునకు చెందిన సతీష్‌బాబు మాట్లాడుతూ ఆయా ప్రాంతాలకు అనుకూలమైన వాతావరణానికి తగిన విధానాలను రూపొందించాలన్నారు. 1990 సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల వేతనాలు 150 రెట్లు పెరగగా, వరి గిట్టుబాటు ధర 51 రూపాయల నుండి 1470 రూపాయలకు 29 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితులను అనుసరించి గిట్టుబాటు ధర నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు మండలం చాటపర్రుకు చెందిన వి రంగారావు మాట్లాడుతూ ఆయిల్‌పాం ఉత్పత్తిలో పశ్చిమ గోదావరి జిల్లా దేశంలోనే ప్రధమస్థానంలో వుందన్నారు. ఆయిల్‌పాం రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పాం పై దిగుమతి సుంకాన్ని తగ్గించి టన్నుకు మూడు వేల రూపాయలను దిగుబడి ప్రోత్సాహకంగా రైతులకు అందించాలన్నారు. మాగంటి సీతారామదాసు మాట్లాడుతూ రైతుల భూయాజమాన్య హక్కులను పరిరక్షించాలని, రైతులు ఎంతో ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కొల్లేరు గ్రామానికి చెందిన ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ కొల్లేరులో గొలుసుకట్టు ఇంకుడుగుంతలు తవ్వించాలన్నారు. కొల్లేరు మత్స్యకారుల జీవనోపాధికి వలలు అందించాలన్నారు. కొల్లేరులో అయిదు అడుగులు నీరు ఉండి, చేపలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 131 మత్స్యకారుల సొసైటీలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆచంట గ్రామానికి చెందిన నెక్కంటి రూప సత్య వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 40 సంవత్సరాలు దాటిన వారే వ్యవసాయ రంగంలో వున్నారని, యువతను కూడా వ్యవసాయ రంగంలోనికి తీసుకురావాలన్నారు. రైతులకు రూపాయికే ఎరువులను సరఫరా చేయాలని కోరారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆలపాటి రామచంద్రరావు మాట్లాడుతూ ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆన్‌లైన్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పాలకొల్లుకు చెందిన జి వీరభద్రరావు మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల నుండి సేకరించవద్దని, ఎఫ్‌సి ఐ లేదా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. నల్లజర్లకు చెందిన కె సత్యనారాయణ మాట్లాడుతూ పంటల బీమా పధకాన్ని గ్రామం యూనిట్‌గా కాక రైతువారీ యూనిట్‌గా అమలు చేయాలని, ప్రతీ రైతుకు పది లక్షల రూపాయలు మూడు శాతం వడ్డీకే పంట రుణాలుగా మంజూరు చేయాలని కోరారు. మేధినరావుపాలెంనకు చెందిన రైతు పి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులలో వున్న పట్టు పరిశ్రమను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంకుష్ గోశాల వ్యవస్థాపకులు బిబి రాజు మాట్లాడుతూ ఉత్తమ పాడి ఆవుల ఉత్పత్తికి సబర్మతి నుండి సబ్సిడీపై సెమెన్ అందించాలని కోరారు. సమావేశంలో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు. కార్యక్రమంలో కమిషన్ కన్వీనర్ - సభ్యులు ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి, సభ్యులు ప్రొఫెసర్ డి నరసింమారెడ్డి, ప్రొఫెసర్ ఎస్ గాలబ్, ప్రొఫెసర్ ఎస్‌కె వి ఎస్ రాజు, ప్రొఫెసర్ పిపి రెడ్డి, ప్రొఫెసర్ కె ఎస్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ బి మిశ్రా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై సాయి లక్ష్మీశ్వరి, ఉద్యానవనాల సహాయ సంచాలకులు దుర్గేష్, విజయలక్ష్మి, పశుసంవర్ధక శాక సంయుక్త సంచాలకులు డాక్టర్ జ్ఞానేశ్వరరావు, డి ఆర్‌డి ఏ పిడి పి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.