S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దళితుల అభివృద్ధికి రూ. 1,100 కోట్లు మంజూరు

నెల్లూరు, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద దళితులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు 1,100 కోట్లతో దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మంగళవారం స్థానిక కస్తూరిదేవి గార్డెన్ హాలులో షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్నరీతిలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నట్లు చెప్పారు. షెడ్యూల్డ్ కులాల వారిని బలోపేతం చేసేందుకు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎస్‌సి కార్పొరేషన్ అధికారులు, బ్యాంకు అధికారుల సమన్వయంతో నిర్దేశించిన రుణాలను మంజూరుచేయుటలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయలలో 60 వేలు సబ్సిడీ పోగా మిగతా 40 వేలు బ్యాంకు రుణం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బ్యాంకు అధికారులు కేవలం ధనికులకు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నారని, అలాగే పేదలకు ఇచ్చే తక్కువ మొత్తంలో ఇచ్చే రుణం వారి జీవితాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎస్‌సి లబ్ధిదారులకు మంజూరు చేసిన పథకాలు మధ్యదళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పేద దళితులకు అందించే ఆర్థిక సహాయం మంజూరు చేయుటలో బ్యాంకు అధికారులు ముందుకు రావాలన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 100 కోట్లతో 5 వేల మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టిందన్నారు. ఎస్‌సి నిరుద్యోగ యువకులకు వారి వారి అర్హతనుబట్టి అవసరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూమి లేని పేద దళితులకు భూమి కొనుగోలు పథకం కింద దాదాపు 5 లక్షలతో ఒక ఎకరం మాగాణి లేదా రెండు ఎకరాల మెట్ట భూమిని కొని అందించి వారికి పూర్తి ప్రయోజనం కల్పించబడుతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ కింద అదనంగా 250 కోట్లు వెచ్చించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 శాతం దారిద్య్రరేఖకు దిగువన దళిత వర్గాలు ఉన్నాయని, వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి వర్గాల అభివృద్ధికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలుచేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాల వారికి ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుచేసి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో తరచుగా సమీక్ష నిర్వహించి సమర్ధవంతంగా నిర్ధేశించిన లక్ష్యాల పనులు పూర్తిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద బలహీన వర్గాల వారికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయుటలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎస్‌సి వర్గాల వారికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద దళిత వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలుచేసి వారిని ఆదుకుంటుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి అమలుచేస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మారెప్ప, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, ఎం శ్రీ్ధర్‌కృష్ణారెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి వర్గాల వారికి అమలుచేస్తున్న కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 30 కోట్ల విలువకలిగిన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సమావేశానికి జెసి-2 ఆర్‌ఎస్ రాజ్‌కుమార్ అధ్యక్షత వహించారు. తొలుత సమావేశంలో బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి జ్యోతి ప్రజ్వలనతో అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, ఎస్‌సి వర్గాల సంఘ ప్రతినిధులు స్వర్ణా వెంకయ్య, జయరాజ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ ఎస్‌సి వర్గాల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.