S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నెమ్మదిగా ఖరీఫ్ నాట్లు

రాజమహేంద్రవరం, జూలై 26: తూర్పులో ఖరీఫ్ నాట్లు మందగమనంలో సాగుతున్నాయి. జూలై 15కల్లా నాట్లు పూర్తయితే అక్టోబర్ చివరి వారానికి కోతలు పూర్తికావాల్సి వుంది. ఈ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ఖరీఫ్ వ్యవసాయ పనులు పూర్తిచేసుకుంటే.. తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చని వ్యవసాయ ప్రణాళిక. జూన్ ఆరవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాకు కాటన్ బ్యారేజి నుంచి కాల్వలకు నీరిచ్చారు. జూన్ 15న తూర్పు గోదావరి జిల్లాలోని ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టా కాల్వలకు సాగునీరు విడుదల చేశారు. సకాలంలో సాగునీరు విడుదల చేసినప్పటికీ ఈ డెల్టాల్లో రైతులు నారుమళ్లు వేయడంలో ఆలస్యం చేశారు. నీరు సమృద్ధిగా వున్నప్పటికీ సెంట్రల్ డెల్టాలో అనాసక్తి కన్పించింది. మెట్టలో అయితే నీరు అందక నిర్దేశిత షెడ్యూల్‌కు 15 రోజులు ఆలస్యమైంది. గత నెలలో కురిసిన వర్షాలకు మెట్టలో కూడా ఖరీఫ్ దమ్ములు మొదలుపెట్టి ఏరువాక సాగించారు. అదే సమయంలో అధిక వర్షాలకు ఇటు ఈస్ట్రన్ డెల్టా, అటు సెంట్రల్ డెల్టాల్లో ఆకుమడులు మునిగిపోయి రైతులు పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి దాపురించింది. వ్యవసాయ శాఖ ఖరీఫ్‌కు సకాలంలో రైతులతో నాట్లు వేయించలేకపోయిందని చెప్పొచ్చు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం కూడా కన్పించింది. ఎందుకంటే.. రైతులకు, కౌలు రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు అందించలేకపోయింది. దీంతో నారుమడులు ఆలస్యమయ్యాయి. జూలై 15 నాటికే జిల్లాలో మొత్తం నాట్లన్నీ పూర్తికావాల్సి వుండగా ప్రస్తుతం 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కనీసం నెలాఖరుకైనా నాట్లు పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ రైతులను సమాయత్తం చేస్తోంది. అయితే ఆగస్టు 15 నాటికి కూడా నాట్లు పూర్తయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఖరీఫ్ దాదాపు నెల రోజుల పాటు ఆలస్యమయ్యేలా వుంది. జూలై 15కల్లా నాట్లు పూర్తయి అక్టోబర్ చివరి వారానికి కోతలు పూర్తయితే మేలైన దిగుబడులు సాధించేందుకు అవకాశం వుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో నవంబర్ నాటికి గానీ కోతలు పూర్తయ్యేలా కన్పించడం లేదు. నవంబర్‌లో ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడుకోవాలంటే వ్యవసాయ శాఖ నిర్దేశిత కాలక్రమం ప్రకారం ఖరీఫ్ పనులు పూర్తికావాల్సి వుంది.