S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యాశాఖ మొద్దు నిద్ర!

వరంగల్, జూలై 26: సర్కారీ స్కూళ్లను బలోపేతం చేయాలని అనేక సంస్కరణలు చేపట్టినా పలితం లేకుండా పోతోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోవడం లేదు. కెజి టు పిజి మాట దేవుడెరుగు కనీసం ఉన్న పాఠశాలలైనా సక్రమంగా నడువక విద్యావ్యవస్థ బ్రష్టుపడుతోందనే విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కడియం శ్రీహరి సొంత జిల్లా వరంగల్‌లోనే ఈ పరిస్థితి నెలకొంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే విద్యావ్యవస్థ ఈ స్థితికి చేరుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు 20 శాతం పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అందలేదు. అధికారులు నిద్రావస్ధలో ఉండటం వల్లే ఉపాధ్యాయుల్లో సమయపాలన కొరవడింది. ఉపాధ్యాయులు షటిల్ సర్వీస్ చేస్తూ సమయపాలన పాటించడం లేదు. ఈ విషయంపై డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పలుమార్లు ఉపాధ్యాయులను హెచ్చరించినప్పటికీ వారిలో తీరు మారడం లేదు. కాగా, టీచర్ల డుమ్మాకు చెక్ పెట్టేందుకు పాఠశాలలో బయోమెట్రిక్ విదానాన్ని ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా కూడా అమలుకు నోచుకోలేదు. జిల్లాలో 51మండలాలకు గాను 49 మండలాల్లో ఎంఇఓ పోస్టులు ఖాళీగా ఉండగా ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతున్నారు. హెడ్‌మాస్టార్లే ఇన్‌చార్జి ఎంఇఓలుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా నలుగురు డిప్యూటీ డిఇఓలకు గాను ఒక్క వరంగల్ డివిజన్‌లోనే డిప్యూటీ డిఇఓగా వాసంతి కొనసాగుతుండగా ములుగు, మహబూబాబాద్, జనగామ డివిజన్‌లలో ఇన్‌చార్జిల పాలనే కొనసాగుతోంది. ఇన్‌చార్జి డిఇఓలుగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్స్ కొనసాగుతున్నారు. ఇప్పటికే జిల్లాలో మొత్తం 749 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని అనేక పాఠశాలలో ఒక్క అంకె విద్యార్థులు ఉన్నారు. కొన్ని పాఠశాలలో అరడజను విద్యార్థులకు అదే సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లాలో బడిబాట కార్యక్రమం ఒక వైపు జరుగుతున్న సర్కార్ బళ్లో చేర్చించేందుకు మక్కువ చూపడం లేదు. ఇదిలా ఉండగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా సత్పలితాలు ఇవ్వడం లేదని కొందరు ఉపాధ్యాయులే అంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తన సొంత జిల్లాలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని విద్యార్థుల తల్లి, దండ్రులు కోరుతున్నారు.