S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్షణక్షణం.. భయం భయంగా...!

కరీంనగర్, జూలై 26: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో గోదావరి నది ప్రవాహం పెరగడం.. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడం.. ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల చెంతకు చేరుతుండటం వెరసి.. ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలు తమ గ్రామాలను ఏ రాత్రి ముంచెత్తుందోననే ఆందోళనతో క్షణక్షణం.. భయం భయంగా గడుపుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస కాలనీల్లోకి వెళ్లిపోయి ఉందామనుకుంటే అక్కడ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. కనీసం వౌలిక వసతులు లేవు. దీంతో అటు పునరావాస కాలనీలకు వెళ్లలేక, ఇటు గ్రామాలను వదలలేక ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు మదనపడుతూ, గోదారి ఏ రాత్రి ముంచుతుందోననే భయంతో మాత్రం అనుక్షణం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గోదావరి నదిపై ఎల్లంపల్లి వద్ద 20.175 టిఎంసిల సామర్థ్యంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని 2004లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లాలోని రామగుండం, వెల్గటూర్ మండలాల పరిధిలోని 11 గ్రామాలు పూర్తిగా, 10 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. ఇందులో రామగుండం మండలం పరిధిలోని ముంపు గ్రామాలకు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించిన అధికారులు వెల్గటూర్ మండలంలోని ముంపునకు గురయ్యే తాళ్లకొత్తపేట, ఉండేడ, చెగ్యాం, ముక్కట్రావుపేట, కోటిలింగాల నిర్వాసితులకు మాత్రం పరిహారం చెల్లింపులు అందించలేదు. దీంతో వారు పునరావాస కాలనీలకు వెళ్లేందుకు అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ప్రవాహాం పెరిగిపోయి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్థి స్థాయి సామర్ధ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 11.482 టిఎంసిల నీరు ఉంది. నీటి మట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 144.92మీటర్ల నీటి మట్టం ఉంది. ఈ క్రమంలో ఉండేడ, చెగ్యాం, ముక్కట్రావుపేట, కోటిలింగాల గ్రామాల చెంతకు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. అయితే, తాళ్లకొత్తపేట గ్రామ నిర్వాసితులు మాత్రం సుమారు 95 శాతం పునరావాస కాలనీలకు తరలిపోగా, ఉండేడ, చెగ్యాం, ముక్కట్రావుపేట, కోటిలింగాల నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మాత్రం నిండితే ఉండేడలోని 15 ఇళ్లు, చెగ్యాంలోని 184 ఇళ్లు పూర్తిగా నీట మునుగుతాయి. చెగ్యాంలో 1250 ఇళ్లు, ఉండేడలో 450 ఇళ్లు ఉన్నాయి. రెండు మాసాల క్రితం ఇళ్ల పరిహారం చెల్లించగా, ఈ పరిహారం కూడా అందరికి అందలేదు. పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరిహారం అందుకున్న వారు మాత్రం నిర్మాణాలు చేపడుతున్నారు. రోజురోజుకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న క్రమంలో వెంటనే ఇళ్ళు ఖాళీ చేయాలని అధికారులు కోరుతున్నా.. పరిహారం విషయమై తేల్చితేనే పునరావాస కాలనీలకు తరలివెళ్తామంటూ నిర్వాసితులు చెబుతున్నారు. లే అవుట్ చేసి, పునరావాస కాలనీల్లో వౌలిక వసతులు కల్పించడంతో పాటు పరిహారం చెల్లించాలని, అప్పుడే పునరావాస కాలనీలకు వెళ్తామని ఉండేడ గ్రామానికి చెందిన నిర్వాసితుడు గంధం రవి ‘ఆంధ్రభూమి’తో చెప్పాడు. పునరావాస కాలనీల పనుల్లో నాణ్యత లోపించిందని, 18యేళ్లు నిండిన యువతకు పరిహారం చెల్లించాలని, పునరావాస కాలనీలకు కంపౌడ్ వాల్ నిర్మించాలంటూ ముక్కట్రావుపేటకు చెందిన ప్రభాకర్ ‘ఆంధ్రభూమి’తో అన్నారు. ఏదిఏమైనా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల చెంతకు చేరుతుండటంతో చెగ్యాం, ఉండేడ, కోటిలింగాల, ముక్కట్రావుపేట గ్రామాల ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.