S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరివంశం 196

శ్రీకృష్ణుడు కైలాసానికి వచ్చి తన అనుగ్రహం కోరి తపస్సు చేయటం, తాను ఆయనకు వరప్రదానం చేయటం, పూర్వం ద్వారావతీ నగరంలో తాను కృష్ణుడికి ప్రత్యక్షమై ఆయనకు మేలు చేయటం ఆయన మదిలో మెదిలాయి. అందువల్ల హరుడు యుద్ధ విముఖుడై నిర్లిప్తంగా ఉండిపోయినాడు. ఖండపరశుడిట్లా స్తబ్ధుడై ఉండిపోవటంతో గోవిందుడు పాంచజన్యం పూరించాడు. ప్రమథులు దీనిని సహించలేక ప్రద్యుమ్నుణ్ణి చుట్టుముట్టి సంఖ్యాతీతమైన శస్త్రాస్త్రాలు అతడిపై ప్రయోగించారు. బాణుడి రాక్షస సేన కూడా ప్రద్యుమ్నుడితో మాయా యుద్ధానికి తలపడ్డారు. ఇంతలో రుద్రుడి ఆవలింతలనుంచి అగ్నికీలలు వెలువడి యుద్ధ రంగాన్నంతా వ్యాపించటం మొదలైంది. భూతజాలమంతా భీతి చెందింది ఈ అగ్నిజ్వాలలను చూసి. భూదేవి తల్లడిల్లిపోయింది. తన ఉనికి ఏమైపోతుందోనని భయపడింది. బాగా కుంగిపోయింది. సముద్రాలన్నీ కలిసిపోయి ఏకార్ణవమై ప్రళయం సంభవించనున్నది అని ఆర్తి చెందింది. సృష్టికర్త దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది.
ఇక నేను ఏమీ నీకు విన్నవించుకొనే స్థితిలో లేను అని అంగలార్చింది. ఆమెను ఓదార్చి చతుర్ముఖుడు హుటాహుటి ఈశ్వరుడి సన్నిధికి వచ్చి ఆయనకు ప్రణమిల్లాడు. మహాదేవా! రాక్షసులనుంచి జగత్తును రక్షించటమే నేను మొదటినుంచీ సంకల్పిస్తూ వచ్చాను కదా! ఇపుడు రాక్షసులను కాపాడాలనుకొని వారి తరఫున యుద్ధం చేయడం భావ్యమా! రాక్షస సంహారం జరగనిది లోకాలకు క్షేమం ఎక్కడిది? అదికాక హరిహరులలో భేదం ఎక్కడిది? మీకు అద్వైత సిద్ధి కదా! మీరే స్పర్థిస్తే ఈ లోకాలు ఏమి కావాలి? ఈ సృష్టి ఎలా నిలవాలి? అని విజ్ఞాపన పూర్వకంగా మహేశ్వరుడి కోపాన్ని ఉపశమింపజేశాడు.
నీవే ఆత్మ విస్మృతి చెందితే ఈ లోకాలన్నీ ఏమి కావాలి? నీకూ హరికీ భేదం ఎక్కడిది. ప్రసన్నుడవు కావలసింది అని బ్రహ్మ పురాంతకుణ్ణిప్రార్థించాడు. ప్రసన్నుడై మహేశ్వరుడు ‘నేను యుద్ధం చాలించాను’ అని చతురాననుడికి హామీ ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు మహేశ్వరుడి సన్నిధికి వచ్చాడు. శివుడూ కృష్ణుడు గాఢంగా పరిష్వంగం చేసుకున్నారు. ఒకరినొకరు ప్రసన్నం చేసుకున్నారు. ఇక అక్కడనుంచి శివుడు తిరోహితుడైనాడు. మార్కండేయ మహర్షి, ఇతర దివ్యర్షులు రూపించిన హరిహరాద్వైతాన్ని సిద్ధులు గానం చేస్తుండగా చతుర్ముఖుడు కూడా నిజ నివాసం చేరుకున్నాడు.
ఇది చూసి కుమారస్వామికి అప్రియం కలిగింది. వెక్కసం కలిగింది. శంకరుడు బాణాసురుణ్ణి పట్టించుకోకుండా వదిలిపెట్టి పోతే మరి అతడి రక్షణ బాధ్యత ఎవరు వహిస్తారు? కృష్ణుడితో నేను యుద్ధం చేస్తానని స్కందుడు యుద్ధరంగానికి వచ్చి సంరంభించాడు. షడాననుడికి కుంభాండడు సారథ్యం వహించగా తీవ్ర కోపాటపంతో కార్తికేయుడు యుద్ధ రంగానికి తరలివచ్చాడు. వస్తూ వస్తూనే గరుత్మంతుడిపై, బలరామ, కృష్ణులపై, ప్రద్యుమ్నుడిపై నిశిత శర పర ప్రయోగించి వారి దేహాలు రక్తరంజితం చేశాడు. ఇందుకు ప్రతిక్రియగా వారు ముగ్గురూ త్రేతాగ్నులుగా అగ్నిసంభవుడిపై విజృంభించారు. శార్గ్ధనువునుంచి వెలువడుతున్న బాణాలను సహించలేక దర్పించి శిఖివాహనుడు వాళ్ళపై బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రయోగించాడు. ఆకాశం నిండా ఆర్తనానాదలు చెలరేగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మశిరోస్త్రాన్ని నిలువరించటానికి తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. బ్రహ్మ శిరం మబ్బులు కమ్మిన సూర్యుడిలా అయిపోయింది. తన ప్రయత్నం భంగం కావటంతో దేవసేనాపతికి ప్రచండమైన ఆగ్రహం కలిగింది. సకల సుర రక్షాకవచమైన మహాప్రభావమైన తన శక్తి ఆయుధాన్ని మురారిపై ప్రయోగించాడు కుమారస్వామి.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు