S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాయబారం

రాయబారాలు రాచరికాలు కట్టబెట్టడానికి, ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టడానికి జరిగేవి. ఆ కాలంలో వ్యక్తులే కాక, పక్షులు కూడా రాయబారాలు నడిపేవి. రాయబారికి కావలసింది ఎదుటివాణ్ణి నొప్పించే మాట కాదు, ఎదుటివాణ్ణి మెప్పించే మాట.
మహాభారతంలో సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం ప్రసిద్ధమైనవి. ధృతరాష్ట్రుడు పాండవుల వద్దకు సంజయుణ్ణి పంపుతాడు. సంజయుడు తెలివైనవాడు. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల నైపుణ్యం గలవాడు. కాని ధర్మరాజు ఆవులించి సంజయునికి ఆ అవకాశం ఇవ్వడు. కౌరవుల ఆక్రోశాన్ని వాళ్ల వద్ద వ్యక్తంచేస్తుంటాడు. ఆ రాయబారం పూర్తికాదు. రాజ్యం పాండవులకు ఇచ్చేది ఇవ్వనిది తేలదు.
కౌరవుల నుంచి వాళ్ల రాజ్యం ఇమ్మని అడగడానికి పాండవులు శ్రీకృష్ణుడుని రాయబారిగా పంపారు. అతని రాయబారం సంధికో, సమరానికో తెలియదు. పాండవుల వీరత్వాన్ని ఏకరువు పెట్టి కౌరవులను రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. శ్రీకృష్ణునిపై కోపంతో బంధించబోతారు కౌరవులు. అతడు విశ్వరూపం ధరించి కళ్ళు లేని ధృతరాష్ట్రుని కళ్లను ఇచ్చి కనిపిస్తాడు. కౌరవుల బారినుంచి బయటపడతాడు. శ్రీకృష్ణుని రాయబారం చివరికి యుద్ధానికి దారితీస్తుంది. యుద్ధానికి కౌరవులకు సైన్యాన్ని అందిస్తే, పాండవులకు తానే అందుబాటులో ఉంటాడు.
భారతంలోనే కాక శృంగార నైషధం, ప్రభావతి ప్రద్యుమ్నం వంటి కావ్యాలలో హంస ప్రేమ రాయబారాలు కనిపిస్తాయి. ఒక హంస నల చక్రవర్తి చేతికి చిక్కగా దానిని చంపబోతాడు. నలునికి దమయంతిపై ఉన్న ప్రేమను తెలిసిన ఆ హంస ‘‘దమయంతికి నీ ప్రేమను వ్యక్తం చేసి మీ ఇద్దరికి వివాహం కుదురుస్తాను’’ నన్ను విడిచిపెట్టమంటుంది నలునితో. దానికి అంగీకరించి హంసను విడిచిపెడతాడు. అన్నట్లుగానే హంస వారికి పెళ్లి కుదురుస్తుంది. ఈ హంస రాయబారం గురించి శ్రీనాథుని ‘శృంగార నైషథం’ కావ్యం చెబుతుంది.
ఇంద్రుడి పెంపుడు హంస శుచిముఖి. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని కుమారుడు. ప్రభావతి వజ్రనాభుడనే రాక్షస సంతతి వాని కుమార్తె. ప్రభావతికి ప్రద్యుమ్నుని సౌందర్యాన్ని తెలిపి అతనిపై ప్రేమను కలిగిస్తుంది. ప్రభావతికి ప్రద్యుమ్నునికి మధ్య రాయబారం నడిపి పెళ్లి కుదురుస్తుంది. పింగళి సూరన ‘ప్రభావతి ప్రద్యుమ్నం’ కావ్యం వ్యక్తం చేస్తుంది.
భారతంలో రాయబార ఘట్టాన్ని అంత అందంగా తెనిగించిన తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవిగా, మంత్రిగా ఉండేవాడు. మనుమసిద్ధిచే మామ అని పిలిపించుకున్నాడు తిక్కన. రాజ్యం కోల్పోయిన మనుమసిద్ధి కోసం కాకతీయ గణపతి దేవ చక్రవర్తితో రాయబారం జరిపాడు. తన వాక్చాతుర్యంతో మనుమసిద్ధికి రాజ్యాన్ని సంపాదించాడు. భారత రచనను ఓరుగల్లులోనే పూర్తిచేశాడు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రముఖ తత్వవేత్త, గొప్ప విద్యావేత్త, భారతదేశ రెండో రాష్టప్రతి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ ఆచార్య పదవిని అందుకున్నవాడు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కోరిక మేరకు సోమియట్ రష్యా రాయబారిగా వెళ్లాడు. అపుడు ఆ దేశ ప్రధానిగా స్టాలిన్ ఉన్నాడు. ఏ దేశ రాయబారికి ఇంటర్వ్యూ ఇవ్వని అతను రాధాకృష్ణన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ విషయం అంతర్జాతీయ వార్తలలోకి ఎక్కింది. అది రాయబారి వాక్చాతుర్యం.
హంసలు పాలు నీళ్లను వేరేచేసే గుణమే కాక, పాలు నీళ్ల వంటి ప్రేమికులను కలిపేవి. ఇది నేటి రాయబారులకు ఎంతైనా అవసరం. పార్లమెంటరీ పాలనలో విధానంలో కూడా రాయబారులు దేశాలకు మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పుతున్నారు.
...............................................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- వై.సత్యనారాయణ