తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Published Thursday, 28 July 2016హైదరాబాద్: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి, మరట్వాడ దానికి ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణ, రాయలసీమల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు.