S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డయేరియాతో వణుకుతున్న బండపోతుగల్

కౌడిపల్లి, జూలై 28: గత నాలుగు రోజులుగా డయేరియాతో కౌడిపల్లి మండలం బండపోతుగల్ గ్రామస్థులు వణికిపోతున్నారు. బుధవారం కలెక్టర్ రోనాల్డ్ రోస్ గ్రామాన్ని సందర్శించి తాగునీటి కలుషితంతో డయేరియా వ్యాప్తి చెందిందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా తాగునీటి సరఫరా విభాగం ఎస్‌ఈ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ కిషన్‌ల బృందం గ్రామంలోని అన్ని వీధులలోని తాగునీటి పైపులైన్ల, రక్షిత మంచినీటి ట్యాంకు, కట్‌వాల్వులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మూడు చోట్ల లీకేజిలతో తాగునీరు కలుషితమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కలుషిత నీరు తాగడం వల్లే అతిసార వ్యాధి ప్రబలిందన్నారు. తాగునీటి పైపులైన్ల లీకేజిల వద్ద సంబంధిత అధికారులు మరమత్తు పనులను చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వెద్యశిబిరాన్ని సందర్శించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న రోగులను అధికారుల బృందం పరిశీలించింది. డయేరియాను అదుపులోకి తేవడానికి స్థానిక మెడికల్ ఆఫీసర్ విజయశ్రీ, వైద్యురాలు దివ్యజ్ఞలతో పాటు దౌల్తాబాద్, చింతల్‌చెరువు గ్రామాలకు చెందిన డాక్టర్లు విద్యావతి, నేత్రావతి, కౌడిపల్లి, శివ్వంపేట, హతూర్న, కొల్చారం మండలాలకు చెందిన సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు అక్కడే ఉండి ఏర్పాటు చేసిన శిబిరంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. బుధవారం 48 మంది రోగులు శిబిరంలో చికిత్సలు పొందుతుండగా, గురువారం 36 మంది డయేరియాతో బాధపడుతున్న వారు శిబిరంలో చేరారు. గురువారం 118 మంది ఆవుట్‌పేషంట్ రోగులను పరిశీలించామని, డయేరియాతో తీవ్రంగా బాధపడుతున్న 17 మంది బాధితులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశామని వైద్యులు తెలిపారు. నర్సమ్మ అనే మహిళ (65) పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వైద్యశిబిరంలో 15 సంవత్సరాల వయసు లోపువారు 15 మంది వాంతులు విరేచనాలతో బాధపడుతున్న వారున్నారు. జిల్లా అధికారులతో పాటు ఎంపిపి పద్మనర్సింహ్మరెడ్డి, ఎంపిడిఓ శ్రీరాములు, తహశీల్దార్ నిర్మల, సర్పంచ్ విఠల్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మాజీ జడ్పీటీసీ సభ్యులు రామగౌడ్, నర్సింహ్మరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విఠల్, ఉన్నారు.
బాధితులను పరామర్శించిన ఎంపిపి
డయేరియాతో భాదపడుతున్న బాధితులను ఎంపిపి పద్మనర్సింహ్మరెడ్డి గురువారం పరామర్శించారు. గ్రామంలో వాంతులు, విరేచనాలు పూర్తిగా తగ్గే వరకు వైద్యశిబిరం కొనసాగుతుందని, గ్రామస్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడానికి జిల్లా అధికారులు, స్థానిక వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం అందరం కలిసి కృషి చేస్తామన్నారు.
చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి
గ్రామానికి చెందిన మందపురం చెన్నమ్మ (70) సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి మృతి చెందింది. వారం రోజుల నుండి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న చెన్నమ్మ మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లింది. మృతి చెందిన చెన్నమ్మ అంత్యక్రియలు గురువారం గ్రామంలో జరిగాయి.