S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అధికారులు మాట వినడం లేదు

నెల్లూరు, జూలై 28: ‘పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. కానీ ఇంతవరకూ ఒక్క మంత్రి కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కానీ, శంకుస్థాపనకు హాజరుకావడం కానీ జరగలేదు. ఇలా ఉంటే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఏమి సమాధానం చెప్పగలము’.. దీనికి సమాధానంగా వేరే ప్రాంతానికి వెళుతూ మంత్రి ఒకసారి నియోజకవర్గానికి వచ్చారు కదా అని నేతలు చెప్పడంతో ‘దారిన పోయే మంత్రులు మాకెందుకు’.. ఇదీ టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులకు, ఆశీనులైన మంత్రులు, నేతలకు మధ్య జరిగిన సంభాషణ.
గత రెండు రోజులుగా నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాల్లో తెలుగు తమ్ముళ్లు తమ గళాన్ని జిల్లా నేతలు, మంత్రుల ఎదుట సవరించుకుంటున్నారు. గురువారం ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా టిడిపి అధ్యక్షుడు బీద రవిచంద్రల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు నియోజకవర్గ, మండలస్థాయి నేతలు తమ బాధను నేతల ఎదుట వెళ్లబోసుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి జరిగిన చర్చలో గూటూరు కన్నబాబు మాట్లాడుతూ కిందిస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఏ అధికారి కూడా తమ పనులు చేసి పెట్టే పరిస్థితి కనిపించడం లేదని, వారి గురించి ఫిర్యాదు చేస్తే జిల్లా నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని పార్టీ నేతలు విస్మరించినట్లు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితన్నారు. ప్రభుత్వ శాఖల్లో పార్టీ కార్యకర్తలు వెళితే కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఆత్మకూరులో లేదని అన్నారు. అటువంటి వారిని బదిలీ చేయించే ఆలోచన చేయాలని ఫిర్యాదు చేయగా బీద రవిచంద్ర బదులిస్తూ బదిలీల మాట వద్దని, వారి చేత పని చేయించుకుందామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం విషయంలోనూ నేతలకు, సభ్యులకు నడుమ తేలికపాటి వాగ్వివాదాలు జరిగాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నియోజకవర్గ పరిధిలో చిన్నస్థాయి నామినేటెడ్ పదవులు కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఉందని, నేతలంటే కార్యకర్తల్లో చులకన భావం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పే మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కార్యకర్తల సమస్యలను వినడానికి మాత్రమే పరిమితం కాకుండా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పలువురు సమన్వయ కమిటీ సభ్యులు కోరారు.
అభివృద్ధిని అందరికీ తెలపండి:శిద్దా
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యతను నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. ఒడిదుడుకుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిపథాన నడిపేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించాలని సూచించారు. జిల్లా టిడిపి అధ్యక్షుడ బీద రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి సోమవారం రెవెన్యూ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే గ్రీవెన్స్‌లకు స్థానిక నేతలు హాజరై ప్రజల పక్షాన అధికారులకు అర్జీలు సమర్పించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు.
నేతల డుమ్మా
గురువారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశాలకు కొందరు నేతలు, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉదయగిరి నియోజకవర్గ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సమావేశానికి మాజీ మంత్రి, ఇటీవల టిడిపిలో చేరిన ఆనం రామనారాయణరెడ్డిలు గైర్హాజరయ్యారు. గురువారం నాటి సమావేశాలకు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, సోమశిల ప్రాజెక్ట్ కమిటి చైర్మన్ రాపూరు సుందరరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.