S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వృద్ధాప్యం

శరీరం క్షీణిస్తుంది, నడక మందగిస్తుంది, దంతాలు ఊడిపోతాయి, చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది, బంధువులు మాట పట్టించుకోరు, భార్య సేవ చేయడానికి ఇష్టపడదు. పుత్రులు శత్రువులుగా ప్రవర్తిస్తారు. అయ్యో! వార్థక్యం ఎంత దుర్భరం. అప్పుడు మృత్యుభయం వెంటాడుతుంది. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, మరణం- ఇవి మానవుడి పరిణామ దశలు, జీవిత చక్రం.
బాల్యంలో ఏమీ అనిపించదు. యవ్వనంలో కనిపించదు. కౌమార్యంలో కాలయాపనతో గడిచిపోతుంది. చివరకు ఒంటరి బతుకు మిగిలిపోతుంది. అపుడు నీటిలో ఉన్న చేప పిల్ల (బుద్ధి) బయటపడుతుంది. బతుకు మృత్యుగాలానికి తగులుకున్నప్పుడు, అప్పుడు దైవం గుర్తుకొస్తాడు. వేదన చెందుతాడు.
మరణం తరువాత ఆత్మ కొత్త శరీరం తీసుకుంటుంది. ఇది అజ్ఞానంతో కప్పబడిన జీవుడికి అర్థంకాదు. మనిషి వృద్ధాప్యంలో నిత్యమూ మృత్యువును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తిరిగి మరచిపోతూ ఉంటాడు. ఈ దశలో మతిమరుపే మందు. ఈ మందు శాశ్వత పరిష్కారం కాదు. దైవ చింతనే అన్ని చింతలకు మందు. ఇది శాశ్వితమైన మందు. మృత్యుంజయ మంత్రం మోక్షం ప్రసాదిస్తుంది. అనాయాస మరణాన్ని కలిగిస్తుంది.
పుట్టిన మనిషి మట్టిలో కలవక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం, గీతావాక్యం. ఒంటిస్తంభంపై కాపురమున్న పరీక్షిన్మహరాజుకే తప్పలేదు. చివరకు భాగవత సప్తాహంతో తరించాడు. ప్రతి మనిషికి మరణం ఏడు రోజులలో ఉంటుంది. వారంలో ఏదో ఒక రోజు మరణం తప్పదు. పుట్టినపుడే మృత్యువు దేహంతో పుడుతుంది. దేహంతో పెరుగుతుంది. అది పెరిగినపుడే దేహం క్షీణిస్తుంది. మరణం సమీపిస్తుంది. అయినా మమకారం చావదు. వృద్ధాప్యంలో ధనాశ, దురాశ, స్వార్థచింతన, భోగలాలస, పదవీ వ్యామోహం, కీర్తి కండూతి వదులుకోవాలి. జిహ్య చాపల్యమును నిగ్రహించుకోవాలి. సత్సాంగత్యం, సద్గ్రంధ పఠనం అమృత ఫలాల వంటివి సేవించాలి. దైవభక్తి, ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజసేవ, పరోపకారం, దానధర్మాలు మొదలగునవి మనశ్శాంతి కలిగిస్తాయి. మన మనసు, మాట, మనుగడ, దృక్పథం, వివేకం అన్ని మార్గదర్శకం కావాలి. మరో జన్మకు మహాత్ములు కావటానికి మన సాధన పనిచేయాలి. పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థించాలి.
ఆయాసం లేని మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షాన్ని ప్రసాదించమని ఆ పార్వతీపతిని కోరుకోవాలని మన పెద్దలు ప్రబోధించడంలో ఎంతో అంతరార్థం వుంది.
సాధారణంగా మరణం ఆసన్నమైనపుడు ఎన్నో యాతనలు కలుగుతుంటాయి. తీవ్రమైన అనారోగ్యము ఏర్పడుతుంది. దానివలన జీవితపు చివరి రోజులలో ఎంతో వేదన పడాల్సి వుంటుంది. కాబట్టి అంత్యకాలములో ఎటువంటి యాతనలు వుండకుండా అకాల మరణం, దుర్మరణం వంటివి లేకుండా అనాయాసంగా దేహాన్ని విడవాలనేదాన్ని మొదటి కోరిక.
ఇక రెండవది దిగులు, అధైర్యం, నిస్సహాయత, ఒత్తిడి, మనసును కృంగదీసే పరిస్థితులు, ఒడిదుడుకులనేవి లేకుండా జీవనాన్ని సుఖంగా సాగేటట్లు చేయమని కోరుకోవడం. మూడవది మోక్షాన్ని కోరుకోవడం. శరీరానికి చివరి గమ్యం మరణం అయినప్పటికీ ఆత్మకు మాత్రం మరణమనేది ఎప్పటికీ గమ్యం కాదు. ఆత్మ నాశనము లేనిది. కాబట్టి అది ఒక దేహాన్ని వదలి మరో దేహాన్ని పొందుతూ, ఒకదాని తరువాత మరొకడిగా ఆయా జన్మలను ఎత్తవలసిందే. కాబట్టి ఈ విధంగా జనన మరణ చక్రములో కొట్టుమిట్టాడకుండా జన్మ రాహిత్యాన్ని ప్రసాదించి శివసన్నిధిలోనే శాశ్వత స్థానాన్ని పొందే విధంగా అనుగ్రహించమని ఆ మృత్యుంజయుణ్ణి వేడుకోవాలి.
ఆ ఆరాధనకు త్రికరణశుద్ధి కావాలి. త్రికరణాలైన మనస్సు వాక్కు, శరీరాలతో ఆ పరమేశ్వరుని అర్చించినపుడే అది ఫలప్రదం అవుతుంది.

- జమలాపురం ప్రసాదరావు