S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కలంగా నీళ్లు

రాజమహేంద్రవరం, జూలై 29: నదుల అనుసంధానం ప్రయోజనం ఈ ఏడాది కృష్ణా పుష్కరాలకు పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో స్నానాలకు అనువుగా నీటి మట్టాన్ని కొనసాగించడానికి అధికార్లు విపరీతమైన కసరత్తు చేయాల్సివచ్చింది. సీలేరు నుండి సైతం జలాలను విడుదలచేయించి, గోదావరి ఘాట్లలో స్నానాలకు అనువుగా నీటిమట్టాన్ని నిర్వహించారు. అయితే ప్రస్తుతం పట్టిసం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తుండటంతో ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు నీటి సమస్య ఎదురుకాకపోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో గోదావరితో పోల్చితే కృష్ణాకు నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయిన సంగతి విదితమే. కనీసం తాగునీటికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. అయితే పట్టిసం ఎత్తిపోతల పథకం ప్రారంభమవ్వడం, ఇటీవలే గోదావరికి వరదలతో నీటి లభ్యత పెరగడం కృష్ణా పుష్కరాలకు కలసివచ్చే పరిణామంగా మారింది.
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి వద్ద గేట్లన్నీ మూసేసి, నీటి మట్టాన్ని 14 అడుగుల మేర నిర్వహించగలిగితే ప్రస్తుత నీటి లభ్యతను బట్టి పట్టిసీమ ద్వారా కృష్ణా పుష్కరాలకు పుష్కలంగా నీటిని తరలించవచ్చని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజీ నుండి నిత్యం రెండు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు. గేట్లను మూసివేసి, ఈ నీటిని సముద్రంలోకి విడిచిపెట్టకుండా నిలువరిస్తే, ఇటు గోదావరి ఘాట్లలో అంత్య పుష్కరాల స్నానాలు ఆచరించడానికి, కృష్ణాకు కూడా సర్దుబాటు చేసేవిధంగా వెసులుబాటు కలుగుతుంది.
ఇక గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఇంకా ఒక కొలిక్కిరాలేదు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులంతా హాజరై ఒకేసారి పుష్కర స్నానాలు ఆచరించి, అంత్య పుష్కరాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికార్లు చెబుతున్నప్పటికీ, అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు కన్పించడంలేదు. ఆదివారం నుండి అంత్య పుష్కరాలు ప్రారంభమై పనె్నండు రోజుల పాటు కొనసాగుతాయి. శనివారం ట్రయల్ రన్ నిర్వహించాల్సివుంది. వాస్తవానికి అధికారుల కార్యాచరణ ప్రకారం ఏర్పాట్లన్నీ శుక్రవారానికి పూర్తికావాల్సివుంది. స్నాన ఘట్టాలను శుభ్రం చేయడమే పెద్ద పనిగా మారింది. ఎప్పటికపుడు నిర్వహణ లేకపోవడంవల్ల బురదతో అధ్వాన్నంగా మారిన ఘాట్లను శుభ్రం చేయడానికే చాలా సమయం పట్టేస్తోంది. నదిలో యాత్రికులకు రక్షణగా నిర్మించిన ఇనుప ఫెన్సింగ్ ఎక్కడిక్కడ శిథిలమైంది. దీంతో కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్‌లలో బారికేడింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నది నీటి మట్టాన్ని బట్టి ఈ ఫెన్సింగ్ రక్షణ కవచాన్ని స్నాన ఘాట్‌లలో నావల వరసకు ముందు నిర్మించాల్సి వుంది. ప్రస్తుతం బురదతో ఊబిగా మారిన ఘాట్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పుణ్య స్నానం చేయాలంటే ఘాట్లలో ఇసుకను నింపాల్సి వుంది. స్నానఘట్టాల్లో షక్కింగ్ విధానం ద్వారా బురదను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈ విధంగా బురద తొలగించిన తర్వాత ఇటు పుష్కర ఘాట్, అటు కోటిలింగాల ఘాట్‌నునూ ఇసుకతో నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్‌లో బురదలోకి దిగకుండా మెట్లపైనే స్నానాలు ఆచరించాలంటే నీటి లోతు అధికంగావుండాలి. స్నానఘట్టాల వద్ద ఆర్ఘ్యం చెప్పుకుని ముక్కు మూసుకుని మునగగలిగే విధంగా నీరు ఉండాలంటే ధవళేశ్వరం బ్యారేజి వద్ద 13.9 అడుగుల నీటి మట్టం నిర్వహించాల్సివుంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో అంత్య పుష్కరాల సమయంలో వరద లేకపోతే మాత్రం బ్యారేజివద్ద అన్ని గేట్లను పూర్తిగా మూసివేసి దాదాపు 14 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇక ఘాట్లలో తాత్కాలికంగా దుస్తులు మార్చుకునేందుకు నెలకొల్పుతున్న గదుల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ప్రధానంగా కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్‌లపైనే దృష్టి కేంద్రీకరించారు. ఒడిస్సా యాత్రికులందరికీ వచ్చినవారిని వచ్చినట్టుగా కోటిలింగాల ఘాట్‌కు తరలించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఆయా ప్రయాణ మార్గాలను బట్టి మిగిలిన ఘాట్లలో సర్దుకునే విధంగా ఏర్పాట్లుచేస్తున్నారు.