S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పౌరోహిత్యానికి ధర నిర్ణయిస్తారా?

విజయవాడ, జూలై 29: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న కొద్దీ అదే స్పీడ్‌లో వివాదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరానికే దాదాపు మూడు కోట్ల మంది పైగా యాత్రికులు తరలి వస్తారనే అంచనాతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి పురోహితులు కూడా విజయవాడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుంటే జూన్ 30తోనే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిందంటూ కొత్తగా దరఖాస్తులు స్వీకరించబోమని దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు చెబుతున్నారు.
గోదావరి పుష్కరాలు సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ జరగ్గా ఈ దఫా విజయవాడ, గుంటూరు, కర్నూలులో మాత్రమే దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ జరిగింది. ఒక్కో జిల్లాలో మూడువేలు చొప్పున 9వేల దరఖాస్తులు రాగా ఐడి కార్డులు జారీ చేసేందుకు అధికారులు వడపోత కార్యక్రమం చేపట్టారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఐడి కార్డులు ఇవ్వడమే కాకుండా గోదావరి పుష్కరాల్లో ఏర్పాటు చేసినట్లు తత్కాల్ కౌంటర్లు కూడా ఏర్పాటుచేసి అప్పటికప్పుడు వచ్చేవారిని కూడా అనుమతించాలని బ్రాహ్మణ, పురోహిత సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా గోదావరి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో పురోహితులు వస్తుంటే వారి నుంచి దరఖాస్తులు తీసువడం లేదు. ఏ ఘాట్‌కు ఎంతమంది అవసరమో అంచనా వేసామని, అసలు విజయవాడలో ఉన్న వారందరినీ అనుమతించడమే కష్టంగా వుందని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నట్లుగా బ్రాహ్మణ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది సూరంపూడి కామేష్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. పుష్కర స్నానాలకు గోదావరి జలాలు పనికి వస్తాయి కాని ఆ ప్రాంత పురోహితులు పనికిరారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాము దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును సంప్రదించగా అనుమతించే విషయంలో సానుకూలంగా స్పందించారన్నారు. ఈ విషయమై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణను సంప్రదించగా కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం లేదని, ఏ ఘాట్‌కు ఎంతమంది అవసరమో అధికారులు నిర్ధారించారని, మరో నాలుగు రోజుల్లో ఐడి కార్డుల పంపిణీ చేపడతామన్నారు.
ఇదిలా వుంటే ప్రభుత్వం పురోహితులకు పూజా చార్జీలు నిర్ణయించడంపై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. పిండ ప్రదానాలకు రూ.500లు, నోములు, వాయనాలకు రూ.300లు, సంకల్పం, ఇతర విధులకు రూ.200లుగా నిర్ణయించారు. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో ఒక్క పురోహితుల సేవలకే వెల నిర్ణయించారు కాని, ఇతర కులవృత్తిదారులకు, ప్రధానంగా ఆటోలు, లాడ్జీలు, హోటళ్లలో తినుబండారాలకు మాత్రం ధరలు నిర్ణయించకుండా దోపిడీని ప్రోత్సహిస్తారా అని ఎపి బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ ప్రశ్నించారు.