S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం

మహబూబ్‌నగర్, జూలై 30: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అధికారులకు సూచించారు. బార్ కేడింగ్ స్టాల్స్ కోసం వేసే టెంట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా రవాణ, రహదారి నియంత్రణ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై క్లస్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సంఘాల ద్వారా పూజ సామాగ్రి విక్రయించేందుకు పూజ సామాగ్రితో పాటు రేట్లను కూడా తక్షణమే నిర్ణయించి సమర్పించాలని డిఆర్‌డిఏ పిడికి సూచించారు. ఘాట్‌లో కొబ్బరి కాయలు కొట్టకుండా చూసుకోవాలని ప్రతిరోజు పుష్కర స్నానాలు ముగించిన తర్వాత కృష్ణానదికి హరతీ ఇవ్వాలని హరతీలో కేవలం నెయ్యి, పిండి వంటి వాటినే వాడాలని తెలిపారు. కృష్ణా పుష్కరాల విధులకు నియమించే సంబందిత అధికారులతో డివిజన్‌స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆర్టిఓలను ఏ జెన్సీని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా జాతీయ రహదారి అధికారులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు. భారి కేడ్లతో పాటు పార్కింగ్ సైన్ బోర్డుల ఏర్పాటును ఆర్ అండ్ బి అధికారులు వెంటనే చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ టెంట్‌లు, బార్‌కేడింగ్‌లు ఏర్పాటు చేసే సంబందిత ఎజెన్సీలతో కూడా మాట్లాడారు. సమావేశానికి హజరైన రైల్వే అధికారులు మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా మూడు రైళ్లు నడుపుతామని రెండు సికింద్రాబాద్ వైపు నుండి మరోకటి కర్నూల్ వైపు నుండి నడుస్తుండగా 8 రైళ్లకు కొత్తగా హాల్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ రైళ్ల సమయాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ నుండి ఆయా ఘాట్లకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసి ఆర్‌ఎంను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, ఎజెసి బాలాజీరంజిత్ ప్రసాద్, ఎఎస్పీ కల్మేశ్వర్, జడ్పీ సిఇఓ లక్ష్మీ నారాయణ, డిఆర్‌ఓ భాస్కర్, పిడి, ఎన్‌ఈ పాల్గొన్నారు.

జూరాలకు స్థిరంగా వరద
* గేట్లు మూసివేత * ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి
గద్వాల, జూలై 30: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద శనివారం స్థిరంగా ఉంది. సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.23 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగవ ప్రాంతం నుంచి 30వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దిగువకు 43,415 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి 40వేల క్యూసెక్కులు, సమాంతర కాలువకు వెయ్యి క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, కుడి, ఎమడ కాలువకు 600, కోయిల్‌సాగర్‌కు 317 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 15,420 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతుంది. అక్కడి విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు 15వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి జలాశయంలో 123.81 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నారాయణపూర్ జలాశయంలో 491.30 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 15,229 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 9,412 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 31.777 టి ఎంసిల నీరు నిల్వ ఉంది.
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి...
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జెన్‌కో అధికారులు ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రాజెక్టు నుంచి 40వేల క్యూసెక్కులను వినియోగించుకొని ఐదు యూనిట్లలో 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

అధికారుల్లో టెన్షన్...టెన్షన్
* మిగిలింది పనె్నండు రోజులే..
* పెరిగిన హడావిడి.. నాణ్యత హుష్‌కాకి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జూలై 30: మహబూబ్‌నగర్ జిల్లాలో పుష్కరాల పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఓ పక్క అధికారుల్లో...మరోపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. పుష్కర పనులపై మంత్రులు సైతం అధికారులపై ఒత్తిడి పెడుతున్నారు. కృష్ణానది పుష్కరాల ప్రారంభానికి కేవలం పనె్నండు రోజులు మాత్రమే మిగిలివున్నా పుష్కర ఘాట్ల పనులు మాత్రం ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయి. పుష్కరాల ఏర్పాట్ల పనుల్లో జాప్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు, కాంట్రాక్టర్లు హడావిడిగా పనులు చేస్తూ నాణ్యతను హుష్‌కాకి చేస్తున్నారు. జిల్లాలో 32 మేజర్ పుష్కర ఘాట్లకు భక్తుల తాకిడి ఉంటుందని అధికారులు ముందస్తుగానే గుర్తించారు. ఈ ఘాట్ల పనులను జూలై 15 లోపు పూర్తి చేయాలని నిర్దేశించారు. కానీ జూలై 30వ తేదీ దాటినప్పటికీ పనులు ఇంకా కొనసాగుతుండడం, సమయం దగ్గరపడుతుండడంతో ఇదే అదనుగా భావిస్తున్న కాంట్రాక్టర్లు హడావిడిగా పనులు చేస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల, సోమశిల ( ఐపి) మంచాలకట్ట, మల్లేశ్వరం, ఆమరగిరి, జటప్రోలు, చల్లెపాడు, పెద్దమారూరు మేజర్ పుష్కరఘాట్లుగా ఉన్నాయి. సోమశిల పుష్కరఘాట్‌కు రూ.4.68 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మంచాలకట్ట ఘాట్‌కు రూ.2.88 కోట్లు, మల్లేశ్వరం రూ.55 లక్షలు, ఆమరగిరి రూ.87 లక్షలు, పెద్దమారూర్ ఘాట్ నిర్మాణానికి రూ.1.15 కోట్లు, చల్లెపాడుఘాట్‌కు రూ.1.67 కోట్లు, జటప్రోలు ఘాట్ నిర్మాణానికి రూ.1.44 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పాటు పైన పేర్కొన్న ఘాట్ల రోడ్లకు, విద్యుదీకరణకు, మంచినీటి సౌకర్యం , భక్తులకు వౌలిక వసతులకై రూ.10 కోట్లకుపైగా నిధులను మంజూరు చేసింది. కానీ నిధులు వచ్చిన పనులు ఆశించిన స్థాయిలో మాత్రం కొనసాగడం లేదనే విమర్శలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు పలుఘాట్ల దగ్గర మంచినీటికి సంబంధించిన ట్యాంక్‌లను ఏర్పాటు చేపట్టలేకపోయారు. ఘాట లకు వెళ్లే రోడ్ల వెంట విద్యుదీకరణ కూడా పూర్తిస్థాయిలో అమర్చలేదు. పార్కింగ్ స్థలాలను గుర్తించినప్పటికీ వాటికి కావల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయలేకపోయారు. చల్లెపాడు, జటప్రోలు దగ్గర ఇంకా ఘాట్ నిర్మాణం పనులే పూర్తి కాలేదు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఒక్కో ఘాట్ దగ్గర ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఘాట్ల దగ్గర రేకులతో మరుగుదొడ్లను బిగిస్తుండగా వాటికి కుండీలుగానీ, పైపులైన్లు గానీ బిగించలేదు. ప్రతి పుష్కరఘాట్ దగ్గర పనులు ఇంకా కొనసాగుతుండడంతో అవి ఎప్పుడు పూర్తవుతాయోనని అధికారుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని పుష్కరఘాట్ల నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ వాటికి టైల్స్ బిగించకపోవడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు పుష్కర ఘాట్ల పనుల్లో అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రతి పుష్కర ఘాట్ దగ్గర భక్తుల విడిది కోసం షెడ్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటి ఊసే ఎత్తడం లేదు. కొన్ని ఘాట ల(మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి) దగ్గర మాత్రమే షెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. రంగాపూర్ పుష్కరఘాట్ దగ్గర షెడ్ నిర్మాణం తయారు అయినప్పటికీ వాటి పైకప్పు అమర్చలేదు. జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుండి వరద ప్రవాహం పెరుగుతుండడంతో జూరాల ఎగువ ప్రాంతంలోని మక్తల్ మండలంలోని కొన్ని పుష్కరఘాట్ల పనులు జరుగుతున్న సందర్భంలోనే నీటమునిగిపోయాయి. అధికారులు పనులను వేగవంతంగా చేయించి ఉంటే పుష్కరఘాట్లు మునిగేవి కావని బహిరంగంగానే జనం చర్చించుకుంటున్నారు. పనె్నండు రోజుల వ్యవధిలో మిగిలిన ఏ మేరకు పూర్తి చేస్తారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు పుష్కర ఘాట్ల దగ్గర పనులను పరిశీలించినట్లు అయితే మరో వారం రోజుల పాటు పనులు జరిగే అవకాశం ఉంది. ఇలాగైతే నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడమే కాకుండా సిమెంట్ కాంక్రీట్‌తో నిర్మించిన పనులు క్యూరింగ్ అయ్యే ఆస్కారమే ఉండదని, కోట్ల రూపాయలు వృథా అయ్యే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

సంగంబండ రిజర్వాయర్‌కు
నీటి తాకిడి

మక్తల్, జూలై 30: భీమాలో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్‌లో ఎగువ కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు నీరు వచ్చి చేరుతుండటంతో రెవెన్యూ అధికారులు అప్రమయ్యారు. శనివారం మక్తల్, ఊట్కూర్ తహశీల్దార్లు ఓంప్రకాష్, అమరేందర్‌లు పాతగార్లపల్లిలో నివాస ముంటుంన్న కుటుంబాలను ఖాళీ చేయించి కొత్తగార్లపల్లికి తరలిస్తున్నారు. వీటికై 6ట్రాక్టర్లను పెట్టి అక్కడి కుటుంబాలవారి సమాగ్రిని తీసుకొస్తున్నారు. రెండు రోజుల్లో పాతగార్లపల్లిలోని అన్ని కుటుంబాల వారిని కొత్తగార్లపల్లికి తరలించడం జరుగుతుందని తహశీల్దార్లు తెలిపారు. పాత గార్లపల్లిలో మొత్తం 240 కుటుంబాలు ఉన్నాయని, వీటిలో ఇది వరకే 80 కుటుంబాల వరకు వచ్చారని మిగతా వారిని తరలించడం జరుగుతుందని తహశీల్దార్లు తెలిపారు. పునరావాస కేంద్రంలో 83 ఇండ్లు పూర్తిగా కట్టుకోవడం జరిగిందని, 120 ఇళ్లు చివరి దశలో నిర్మాణంలో ఉన్నాయని, 30 ఇళ్లు బేస్‌మెంట్ లేవల్‌లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాగా చాలా మంది వలసలు వెళ్లడంతో ఇళ్లను నిర్మించుకోలేక పోయారని, నిర్మించుకున్న వారందరిని పాత గ్రామాం నుండి తరలిస్తామన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని వారిని పాఠశాలలో కానీ ఖాళీ ఇళ్లలోగానీ నివాసం ఉండేందుకు ఏర్పట్లను రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. గతంలో తాగునీటికి చాలా ఇబ్బందులు ఉండటంతో గ్రామస్తులు రాలేక పోయారని, ప్రస్తుతం గ్రామంలో నీటి బోరు వేయడంతోపాటు, ఉప్పర్‌పల్లి గ్రామ రహదారి వద్ద బోర్ డ్రిల్‌చేయించి అక్కడి నుండి నీటి పైపులు కూడా వేయడం జరిగిందని అట్టి నీటిని పునరావాస కేంద్రంలోని నీటి క్యాంకును నింపి ప్రజలు వాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఏదిఏమైన రెండు మూడు రోజుల్లో పాతగార్లపల్లిలోని అన్ని కుటుంబాలను పూర్తిగా ఖాళీ చేయించి కొత్తగార్లపల్లికి మార్చడం జరుగుతుందని మక్తల్, ఊట్కూర్ మండలాల తహశీల్దార్లు ఓంప్రకాష్, అమరేందర్‌లు తెలిపారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు బోల్తా
ఇద్దరు మహిళలు మృతి
శ్రీశైలం ప్రాజెక్టు, జూలై 30: నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో దోమలపెంట సమీపంలో శనివారం రాత్రి కారు బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన ఒక కుటుంబం శ్రీశైలం మల్లన్న దర్శనానికి కారు (ఎ09బిఎక్స్ 8287)లో బయలుదేరారు. దోమలపెంటకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సీతాఅగర్వాల్ (30), సిఖాఅగర్వాల్ (27) అక్కడికక్కడే మరణించారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని చూసిన కొందరు వ్యక్తులు ఈగలపెంట పోలీసులకు సమాచారం అందించారు. శ్రీశైలం ఘాట్‌రోడ్డులో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న అమ్రాబాద్ సిఐ శ్రీనివాసులు, ఈగలపెంట ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను అమ్రాబాద్‌కు తరలించి క్షత గాత్రులను హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఈగలపెంట ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

నులిపురుగులతో పిల్లలకు అనారోగ్యం
*కలెక్టర్ శ్రీదేవి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జూలై 30: నులిపురుగుల వల్ల పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం ఉందని కలెక్టర్ శ్రీదేవి అన్నారు. నులిపురుగుల వల్ల రక్తిహీనత, కడుపునొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటివి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇవి రాకుండా ఉండాలంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు నులిపురుగులను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఒకటి నుండి రెండేళ్లలోపు చిన్నారులను అల్బెండజోల్ మాత్ర సగం ఇవ్వాలని రెండు సంవత్సరాలపై బడిన పిల్లలకు ఒక మాత్ర ఇవ్వాలని ఆమె తెలిపారు. దీని వల్ల రక్తహీనతను నియంత్రణ చేయడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని పిల్లలకు ఏకాగ్రత, నేర్చుకోవాలనే సామర్థ్యం పెరుగుతుందని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు వేయించాలని కోరారు. జిల్లాలో 1నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు దాదాపు 2లక్షల 56వేల మంది ఉన్నారని 6 నుండి 19 సంవత్సరాల్లోపు 3లక్షల 47వేల మంది ఉన్నారని 10 నుండి 19 సంవత్సరాలలోపు 7లక్షల మంది ఉన్నారని వీటికి తోడు 55వేల మంది పిల్లలు బడిబయట ఉన్నారని మొత్తం 15లక్షల 42వేల 820 మంది పిల్లలు ఉన్నారని వీరందరికి అల్బెండజోల్ మాత్ర వేయించాలని కోరారు. నులిపురుగుల నిర్మూలనపై విస్తృత ప్రచారం కల్పించాలని ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అందరు కృషిచేయాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు అందరు కృషి చేయాలని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఐసిడిఎస్ డిఇఓలదే ముఖ్యపాత్ర అని అన్నారు. ఈ మాత్రలను అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు జూనియర్ కళాశాలల్లో కూడా అందుబాటు ఉంచాలని కోరారు. మాత్రలు వేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎజెసి బాలాజి రంజిత్ ప్రసాద్, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ నాగారం, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి కృష్ణ, డిఆర్‌ఓ భాస్కర్, టిబి అధికారి మల్లికార్జునప్ప, నటరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను అడ్డుకోవడం భావ్యం కాదు
* ఎమ్మెల్యేలు అరుణ, చిన్నారెడ్డి
శాంతినగర్, జూలై 30: అయిజ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో నిర్మిస్తున్న చర్చిని శుక్రవారం సందర్శించుటకు వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను అడ్డుకోవడం భావ్యంకాదని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లురవి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఓబుదుల్లాకోత్వాల్ అన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు మంచిదికాదన్నారు. శుక్రవారం జరిగిన సంఘటన గురించి తెలుసుకొనుటకై శనివారం వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలోని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ క్యాంప్ కార్యాలయంకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని లేనిచో కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుందని హెచ్చరించారు. అనంతరం మధ్యాహ్నం శాంతినగర్ నుంచి ఉత్తనూరు గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటి ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న కారణంగా శనివారం శాంతినగర్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార సంస్థలు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసి, ప్రైవేటు వాహనాలు దాదాపు గంటన్నర పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఉద్యమ కార్యక్రమంలో వడ్డేపల్లి సూరి, పైపాడు రామకృష్ణారెడ్డి, కొంకల భీమన్న, పచ్చర్ల కుమార్, దేవేంద్ర, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

మానవాళికి మొక్కలే జీవనాధారం
ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి
వనపర్తి, జూలై 30: మానవాళికి మొక్కలే జీవనాధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి నిరంజన్ రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాలలో మొక్కలు నాటడంతో పాటు వారి తల్లిదండ్రుల చేత కూడా మొక్కలను నాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలోమున్సిపల్ ఛైర్మన్ రమేష్ గౌడ్, ఆ వార్డు కౌన్సిలర్ ప్రమీల, కౌన్సిలర్లు గట్టు యాదవ్, వాకిటి శ్రీ్ధర్, లక్ష్మి నారాయణ, కృష్ణ, తిలకేశ్వర్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. అంతక ముందు చిన్నారులచే పూలమొక్కలను నాటించారు.

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారు
* మంత్రులను విమర్శించే స్థాయి మీకు ఉందా..? * ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కోయిలకొండ, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు అహర్నిశలు ప్రజల అభృవృద్ధ్దికొసం పని చేస్తుంటే జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు పని లేక నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ అభివృద్ద్ధిని అడ్డుకుంటున్నారని, పాదయాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలే తగిన బుద్ధ్ది చెబుతారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉపయోగకరమైన అభివృద్ది చేస్తుంటే ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయన్నారు.
పాలమూరు జిల్లా అభివృద్దిని చూసి ఓర్వలేక అన్నీ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ప్రజలకు ఆగ్రహన్ని తెప్పిస్తుందన్నారు. మండలంలోని ఎడు గ్రామాలకు గొండ్యాల వాగు ద్వారా సాగునీరు అందించే పధకానికి అన్నీ అనుమతులు రావడం జరిగిందన్నారు. చంద్రాస్‌పల్లి, పల్గుతాండాల వద్ద సబ్‌స్టేషన్ మంజూరీ జరిగిందన్నారు. కోయిలకొండ సివిల్ ఆసుపత్రి నిర్మాణపు పనులు త్వరలోప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకంలో కోయిలకొండ మండలంతో పాటు నారాయణపేట, ధన్వాడ, కొస్గి, మద్దూర్, హన్వాడ మండలాలకు మొదటి విడతలో సాగునీరు రావడం జరగుతుందన్నారు. ఎవ్వరు ఊహించని విదంగా కర్వేన రిజర్వాయర్ ద్వారా మొదటి విడతలో సాగునీరు అందుతుందన్నారు. కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం జిఓనంబర్ 69 అమలు చేయాలని టిడిడి, బిజేపి, కాంగ్రెస్, సిపిఎం పార్టీల నాయకులు పాదయాద్ర చేపట్టడం అవగాహన రాహిత్యం అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను పక్కద్రోవ పట్టించడం జరుగుతుందన్నారు. జిఓ 69 ద్వారా నారాయణపేట , కొడంగల్ నియోజక వర్గాలకు ఎలాంటి లాభం లేదన్నారు. చుక్కనీరు రాని జిఓను పట్టుకుని పాదయాత్ర చేయడం విడ్డూర మన్నారు. కోడంగల్ ఎమ్మేల్యే రెవంత్‌రెడ్డికి అన్నీ తెలుసని అందకే పాదయాత్రకు రావడంలేదన్నారు. కోయిలకొండ మండలాన్ని మరోమారు ముంచడానికి పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు. సిపిఎం నాయకులు తమ్మినేని వీరభద్రం కనీస అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తెలంగాణా ఎర్పాటు అడ్డుపడ్డ సిపిఎం పార్టీ ఇప్పుడు పాదయాత్ర చేస్తే ప్రజలు సహించరని అన్నారు. సమావేశంలో ఎంపిపి స్వప్న, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వై.గోపాల్‌గౌడ్, సింగల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణయ్య, భీంరెడ్డి, నారాయణ, వివిద గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలు తీరు మార్చుకోవాలి

* పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరుకు ప్రతి ఎకరానికి సాగునీరు
కొత్తకోట, జూలై 30: మల్లన్నసాగర్, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి అయితే తమకు రాజకీయ మనుగడ ఉండదనే దృష్టితో ప్రతిపక్షాలు కుట్ర పన్ని భూములు కోల్పోతున్న రైతులను ఉసిగొల్పి భూములు ఇవ్వకుండా కుట్ర పన్నుతున్నారని ప్రతిపక్షాలు తమ భావాలను మార్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని వడ్డెవాట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు అండగా ఉంటున్న కెసి ఆర్ ప్రభుత్వం ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని సియం కెసి ఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. ప్రతిపక్షాలు తమ మనుగడ లేకనే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, రెండేళ్లలో జరిగిన అబివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. గతంలో నీళ్లు లేకపోవడం వల్ల వలసలు వెళ్లారని ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకొని వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నారన్నారు. అంతక ముందు ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జూరాల ఉధృత్తి ఉన్నప్పుడే దిగువ ఉన్న రామన్‌పాడుతో పాటు శంకర్ సముద్రం రిజర్వాయర్‌ను నింపుకొని చెరువులు, కుంటలు కూడా నింపుకోవాలన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సమస్యలను తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సాగు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గుంత వౌనిక, నాయకులు చెన్నకేశవరెడ్డి, బాబురెడ్డి, బీంరెడ్డి, కొండారెడ్డి, కృష్ణయ్య, నాగేష్, జగన్, విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్, కటికె శ్రీను, వంశీచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌లో చేరిన
టిడిపి సర్పంచ్
వడ్డెవాట గ్రామానికి చెందిన పాత్లావత్ లక్ష్మి, ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి సమాక్షంలో శనివారం టి ఆర్ ఎస్‌లో చేరారు. ఆమెతో పాటు ఆ గ్రామానికి చెందిన 200 మంది గిరిజనులు కాంగ్రెస్, టిడిపి నుండి టి ఆర్ ఎస్‌లో చేరారు.

ఎఎన్‌ఎంల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 30: రెండవ ఎఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శనివారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు ఆధ్వర్యంలో రెండవ ఎఎన్‌ఎంలు ర్యాలీగా తెలంగాణ చౌరస్తాకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఎఎన్‌ఎంలకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం కలెక్టరేట్ వైపు దుసుకెళ్తున్న వారిని పోలీసులు ఆరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ ఎఎన్‌ఎంలకు కనీస వేతనాలు ఆమలు చేయాలని గత 13 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. దినిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేపట్టాలని నిర్ణయించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రేగ్యూలరైజ్ చేస్తామని కెసిఆర్ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా 10వ పి ఆర్‌సిని ఆమలు చేయాలని పని భారం పెరిగినందున కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైన స్పందించకపోతే పోరాటలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి ఐటియు నాయకులు చంద్రకాంత్, రమేష్, విజయవర్థన్‌రాజు, సుగుణ, కృష్ణవేణి, తారదేవి, అనంతలక్ష్మీ, అరుణ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిది
కొత్తకోట, జూలై 30: మొక్కలు నాటే బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని పంచాయతి రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని సంకిరెడ్డిపల్లిలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరీరక్షించాలని, రాష్ట్రంలో 5కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా ఎంచుకున్నామని ఇప్పటి వరకు కోటి 50లక్షల మొక్కలను నాటామని రాబోయే మూడేళ్లలో దాన్ని అధిగమిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపిపి గుంత వౌనిక, నాయకులు చెన్నకేశవరెడ్డి, బీంరెడ్డి, కొండారెడ్డి, మోహన్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, జగన్, కటికె శ్రీను, వంశీచందర్ రెడ్డి, చంద్రకళ, బీసన్న, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.