S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు

తొగుట,జూలై 30: కృష్ణా పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి అన్నారు. శనివారం మండలంలోని తొగుట రాంపూర్ శారదాక్షేత్రం ఫీఠాధిపతి మాధవానందస్వామికి పుష్కరాల ఆహ్వాన పత్రికను కమిటి సభ్యులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా స్వామి ఆశీస్సులు పొందారు. ఆగస్టు 12నుంచి 23వరకు జరిగే పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు హాజరైతారని, ఇందుకోసం రాష్ట్రంలో 81పుష్కరఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్గొండలో 28 స్నానవాటికలను ఏర్పాటు చేశామన్నారు. గోదావరి పుష్కరాలు విజయవంతమైనట్లుగానే కృష్టా పుష్కరాలను కూడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆలయ కమిటి ఆధ్వర్యంలో రమణాచారి బృందానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు చేసి ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వం కృష్ణాపుష్కరాలను ఆర్భాటంగా కాకుండా ఆధ్యాత్మికత పెంచి వైదిక కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాసపత్రి ఏడిటర్ అష్టకాల రాంమోహన్‌శర్మ, సిద్దాంతి చంద్రశేఖరశర్మ, మృత్యుంజయశర్మ, హరినాథశర్మ తదితరులు పాల్గొన్నారు.

మోదీ తెలంగాణ పర్యటన
రాజకీయ మలుపునకు నాంది

సిద్దిపేట, జూలై 30: ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన తెలంగాణలో రాజకీయ మలుపుకు నాంది పలుకుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలోని విఏఆర్ గార్డెన్‌లో శనివారం జిల్లాస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకపోయేందుకే ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త 2019ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న పంచ పాండవులురాష్ట్రంలో బిజెపిని 2019లో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. సర్కార్ నియంతృత్వ పోకడలను ఎదుర్కొనేందుకు సిద్దిపేట నుంచే ఉద్యమం ఆరంభం కావాలన్నారు. కేంద్రం అమలు చేసే సంక్షేమ పలాలు అర్హులకు అందేలా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పని చేయాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను పేదల అభ్యున్నతికి కేంధ్రం పథకాలు అమలు చేస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలు బాగుపడుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతోనే ప్రధాని ముందుకు పోతున్నారన్నారు. కేంద్ర సర్కార్ రాష్ట్భ్రావృద్ధికి కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు. సిఎం ఇతర పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారని, ఇది మంచిది కాదన్నారు. అది బలం కాదు వాపు అని విమర్శించారు. అక్రమ మార్గాలను సర్కార్ ఇప్పటికైనా మానుకోవాలన్నారు. బిజెపి పై నాయకులు, కార్యకర్తల పై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తే చూస్తు ఊరుకోమన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామిలన్నీ నీటిమీది రాతలుగా మారాయని, ప్రజలు ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతున్నారని విమర్శించారు. డబుల్‌బెడ్ రూం మాట లేదని, అధికార పార్టీ అరాచకాలు ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్దం కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల వారీగా కమిటిలు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. విమోచన దినం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందన్నారు. విమోచన దినంను అధికారికంగా నిర్వహించకుండా ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందన్నారు. మతతత్వ పార్టీల అడుగులకు ప్రభుత్వం మడుగులొత్తడం శోచనీయమన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.
భారీ బైక్ ర్యాలీ
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మెదక్ జిల్లా సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా బిజెపి నేతలు, కార్యకర్తలు, బిజెవైఎం నేతలు పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఎంపిడిఓ కార్యాలయం నుంచి హైద్రాబాద్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, విఏఆర్ గార్డెన్ వరకు ర్యాలీ తీశారు. బిజెపి శ్రేణులు పార్టీ నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు మహా సమ్మేళనం వాల్‌ఫోస్టర్లను లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నేతలు రఘునందన్‌రావు, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, రాంచంద్రారెడ్డి,విద్యాసాగర్, బుచ్చిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్, అంబడిపల్లి శ్రీనివాస్, లక్కరసు రవి, సురేష్, నరేష్, సత్యనారాయణ, వెంకటేశ్ పాల్గొన్నారు.

మల్లన్నసాగర్‌కు కాదు..
సింగూర్‌కు రా తేల్చుకుందాం
* మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌కు
ఎమ్మెల్యే బాబుమోహన్ సవాల్
చేగుంట, జూలై 30: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడం కాదు, సింగూర్‌కు రావాలని అందోల్ శాసనసభ్యులు బాబుమోహన్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహకు సవాల్ విసిరారు. శనివారం జోగిపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, రైతుల కోసం ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుంటే దామోదర్ వంటి నాయకులు అడ్డుతగలడం సిగ్గుచేటన్నారు. అందోల్ నియోజకవర్గ పరిధిలోని సింగూర్ కాలువల కోసం వంద కోట్ల రుపాయల నిధులు కేటాయించి డ్రా చేసినా ఆ పనులు నేటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సింగూర్ కాలువలే సరిగా నిర్మించలేని మీరు మల్లన్నసాగర్‌పై ఏ విధంగా మాట్లాడుతారని ప్రశ్నించారు. అందోల్ నియోజకవర్గంలో మాట్లాడకుండా పక్క నియోజకవర్గంలో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాలని ఆయన కోరారు.

పేట ఆర్టీఏ కార్యాలయంలో ఎసిబి తనిఖీలు
సిద్దిపేట, జూలై 30: సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో శనివారం విజిలెన్స్, ఏసిబి అధికారులు దాడులు చేశారు. సెంట్రల్ ఇంటలిజెన్స్ యూనిట్ డిఎస్పీ సునిత, ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో ఆర్టీఏ కార్యాలయంలో పనిచేసే దళారుల నుంచి రూ.93వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో దళారుల వ్యవస్థ జోరుగా సాగుతుందని తమకు ఫిర్యాదు రావడంతో కార్యాలయం పై దృష్టి పెట్టామన్నారు. ఈ కార్యాలయంలో దళారులుగా పనిచేస్తున్న వారి నుంచి 93వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో 7గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. దాడుల పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని, అధికారులు లంచం అడిగితే 9440446149నంబర్‌కు ఫోన్ చేయాలని, ఫోన్ చేసిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఏసిబి సిఐ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

కరవు జిల్లాపై కనక వర్షం
నారాయణఖేడ్, జూలై 30: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రాజెక్టుల్లో చెరువులు, కుంటల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరుతుంది. కల్హేర్ మండలంలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన నల్లవాగు ప్రాజెక్టులో వరద చేరుకుని నీటి సామర్థ్యనికి కొద్దిగా తక్కువగా ఉందని ఇరిగేషన్ శాఖ ఎఇ సూర్యకాంత్ శనివారంనాడు తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1493.746.13 మిలియన్ల క్యూబిక్ అడుగులు కాగా శుక్రవారంనాటికి ప్రాజెక్టులో 1490.7 అడుగుల నీరు చేరుకుందని అయన తెలిపారు. ఇంక 2.3 అడుగుల నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు సామర్థ్యం పూర్తియినట్లు ఉంటుందని ఎఇ చెప్పారు. ప్రాజెక్టులో సామర్థ్యంకు మించి నీరు చేరితే పొంగి పొర్లుతుందని అయన అన్నారు. ప్రాజెక్టు కింద సుమారు 4560 ఎకరాల సాగు భూమిని రైతులు వరినాటు వేసుకుంటారని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేని కారణంగా ప్రాజెక్టులోనీరు చేరలేక రైతుల పంటలకు నీరు వదలేదని అన్నారు. ప్రాజెక్టుకు ఎడుమ కుడి కాల్వలు రెండు నిర్మించి ఉన్నాయని అయన తెలిపారు. రైతులకు ఈసంవత్సరం వరి పొలం పండించేందుకు సాగునీరు వదులుతామని జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యేతో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కంగ్టి మండలంలో భారీ వర్షాలు కురువడంతో నల్లవాగులోనికి వరద నీరు వచ్చి చేరుతుందని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో పాటు గంగాపూర్, జూకల్ చేరువు, లింగాపూర్ సంజీవన్‌రావుపేట, ర్యాకల్ చిన్నచెరువు ర్యాలమడుగు, చిన్నచిన్న కుంటలకు వరద నీరు వచ్చి నిండుతున్నాయని తెలిపారు. వచ్చిన వరద నీరు యాథావిధంగా నిల్వ ఉండకుండా ఇంకిపోవడంతో అలస్యంగా నిండుతునట్లు చెప్పారు. వర్షాలు కురిసే సమయం ఇంకా ఉందని, భారీ వర్షాలు కురిస్తే అన్ని చెరువులూ, కుంటలు సంపూర్ణంగా నిండుతాయని ఆయన తెలిపారు.
వర్షాలతో నిండిన బొల్లారం మత్తడి
మెదక్: కురుస్తున్న వర్షాలతో బొల్లారం మత్తడి నిండింది. మెదక్ డివిజన్‌లో 2162 చెరువులకుగాను 28 చెరువులు నిండినట్లు ఇరిగేషన్ శాఖ మెదక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివనాగరాజు శనివారం నాడు ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. సింగూర్ ప్రాజెక్ట్‌కు 2.6 టిఎంసీ నీళ్లు చేరాయని కూడా ఆయన తెలిపారు. వర్షాలతో మిగిలిన చెరువులు కూడా నిండే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. మెదక్ డివిజన్‌లో అత్యధిక వర్షపాతం చిన్నశంకరంపేటలో నమోదు కాగా టేక్మాల్, చేగుంట, కౌడిపల్లిలో వర్షపాతం నమోదు కాలేదని ఆర్డీఓ కార్యాలయం ఎఓ దేవకరుణ మాట్లాడుతూ తెలిపారు. పుల్కల్‌లో 2.5, జిన్నారంలో 12.6, హత్నురలో 2.4, రామాయంపేటలో 4.2, చిన్నశంకరంపేట 20.0, పెద్దశంకరంపేటలో 8.6, నర్సాపూర్‌లో 13.4, కొల్చారంలో 11.0, మెదక్‌లో 6.2, రేగోడ్‌లో 6, శివ్వంపేటలో 11.2, వెల్దుర్తిలో 4.1, అందోల్ 0.6, అల్లాదుర్గంలో 5.2 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైనట్లు ఆమె తెలిపారు. మెదక్ డివిజన్‌లో శనివారం నాడు 108.0 మిల్లీమీటర్ల వర్షంపాతం మొత్తంలో నమోదైనట్లు దేవకరుణ తెలిపారు.

డెంగీతో వ్యక్తి మృతి
సంగారెడ్డి టౌన్, జూలై 30: తీవ్ర జ్వరంతో బాధపడుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి పట్టణంలోని మంజీరనగర్‌కు చెందిన బాల్‌రాజ్ (37) గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ గురువారం సాయంత్రం సంగారెడ్డి మండలం కందిలోని బాలాజీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైదులు హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అక్కడ చికిత్సలు నిర్వహించి డెంగీ సోకిందని వైద్యులు తెలిపి, చికిత్సలు ప్రారంభించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ బాలాజీ శనివారం సాయంత్రం మృతి చెందాడు. జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యాస్తంగా ఉండడం వల్లే దోమలు, ఈగలు ప్రబలి భయంకర వ్యాధులు వ్యాపిస్తున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురవుతున్నారు. మృతుడి భార్య, కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఒడ్డె కమ్మరి వృత్తిపై కుటుంబాన్ని పోషిస్తున్న బాలాజీ మృతితో కుటుంబ సభ్యులు దిక్కులేని వారయ్యారు. ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
10లక్షల మొక్కలు నాటే లక్ష్యం
* వ్యవసాయ, మార్కెటింగ్
ప్రిన్సిపల్ సెక్రటరీ పార్ధసారధి
ములుగు, జూలై 30 : తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్‌లు సబ్ మార్కెట్లలో 10 రోజులలో 10 లక్షల మొక్కలు నాటి హరితహారానికి ఊతమిస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెకరెట్రీ పార్ధసారధి పేర్కొన్నారు. శనివారం వంటిమామిడి మార్కెట్ కమిటీ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వంటిమామిడి మార్కెట్ సమీపంలో 10 ఎకరాల స్థలంలో 8.30 కోట్లతో శీల గిడ్డంగిని నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర నిధులతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 17 లక్షల టన్నుల సామర్ధ్యం గల 330 గోదాంలను వెయ్యి 24 కోట్లతో 2 నెలల్లో అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు. హార్టికల్చర్ కమిషనర్ వెంకట్‌రాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్‌లు కరుణాకర్, శంకర్‌గౌడ్, మర్కెట్ కమిటీ సెకరెట్రీ ప్రవీణ్‌రెడ్డి, జహంగీర్‌రెడ్డి, సాయిరెడ్డి, మల్లాగౌడ్, మల్లారెడ్డిలు పాల్గొన్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే

ఆసుపత్రులు, డయోగ్నాస్టిక్ సెంటర్లు సీజ్

* ఎజెసి వెంకటేశ్వర్లు
సంగారెడ్డి టౌన్, జూలై 30: లింగానిర్దారణ పరీక్షలు చేయడం చట్ట ప్రకారం నేరమని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పిసి అండ్ పిఎన్‌డిటి జిల్లా అడ్వయజయిరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెసి మాట్లాడుతూ ప్రీ కాన్‌సెప్షన్ అండ్ ఫీనటల్ డయోగ్నొస్టిక్ టెక్నిక్స్ (పిసి, పిఎన్‌డిటి ) యాక్టు-1994 ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్ష చేయడం నిషేదమని, ఈ దృష్ట్యా యాక్టులోని అంశాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహాన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను కరపత్రాలను ప్రచారం చేపట్టాలని, ప్రతి ఆరోగ్య కేంద్రానికి 2వేల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. ఫ్లెక్సిలపై యాక్టు వివరాలు ప్రదర్శించాలని, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతే కాకుండా మెదక్, సిద్ధిపేటలో అవగాహాన సదస్సులు నిర్వహించాలన్నారు. చట్టవ్యతిరేకంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రులు, డయోగ్నొస్టిక్ సెంటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇందులో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా తల్లిదండ్రులు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు సులభతరమవుతుందన్నారు. జిల్లాలో పిసి అండ్ పిఎన్‌డిటి యాక్టు కింద 109 ప్రైవేట్ ఆసుపత్రులు, 7 ప్రభుత్వ సంస్థలు మొత్తం 116 రిజిష్టర్ అయినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రాంసింగ్‌నాయక్, డిసిహెచ్ సంగారెడ్డి, రెడ్‌క్రాస్ సంస్థ కార్యదర్శి వనజారెడ్డి, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

మరో జలియన్‌వాలాబాగ్‌లా మల్లన్నసాగర్
మల్లన్నసాగర్ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ హరీషే * సిపిఎం రాష్టక్రమిటీ నేతలు
సిద్దిపేట టౌన్, జూలై 30: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను మరో జలియన్‌వాలాబాగ్‌లా ప్రభుత్వం మార్చుతోందని సిపిఎం రాష్ట్ర నేతలు మండిపడ్డారు. శనివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బి.వెంకట్, రాష్టక్రమిటీ సభ్యులు సాగర్, జంగారెడ్డి, వెంకటేశ్‌లు మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో అప్రజాస్వామికంగా వ్యవహిస్తుందన్నారు. మంత్రి హరీష్‌రావు హిట్లర్ వారసత్వాన్ని అవలంభిస్తున్నారన్నారు. హిట్లర్‌లా వ్యవహరించిన వారు ఎంతోకాలం ఉండలేదని, కాలగర్భంలో కలిశారన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన కారకుడు మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సినిమాలో కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అన్నీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో చట్టాలను ధిక్కరించవద్దన్నారు. సిపిఎం ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. సిపిఎం ప్రాజెక్టులకు, పరిశ్రమలకు వ్యతిరేకం కాదన్నారు. స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారని అంటున్నారు. స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చినట్లైతే బహిరంగ చర్చ జరిపించాలని డిమాండ్ చేశారు. వందల మంది పోలీసులను పెట్టుకొని, భయభ్రాంతులకు గురిచేస్త్తూ బలవంతంగా భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. 2013 కంటే 123 విధ్వంస అభివృద్ధికర జిఓ కాదన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని అనడం సరికాదన్నారు. భూ నిర్వాసితులు చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని నిర్వాసితుల పోరాటం అన్నారు. ప్రజలపైన పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలన్నారు. లేదంటే ఆదివారం నుంచి రాష్టవ్య్రాప్తం చర్చావేదికలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పురుషోత్తం, రేవంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.