S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఇందూర్, జూలై 30: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. శనివారం వర్ని ఎంపిడిఓ కార్యాలయంలో సర్పంచ్‌లు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఐసిడిఎస్, ఆరోగ్య శాఖ సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఐకెపి ఎపిఎంలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో వ్యాధులను నివారించడంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వాంతులు, విరోచనాలను నిర్లక్ష్యం చేయవద్దని, అలాంటి వారికి వెంటనే ప్రాథమిక వైద్య సేవలు సూచించారు. వాంతులు, విరోచనాలు ఎక్కువ అయితే శరీరంలో నీటిశాతం తగ్గటం వల్ల గుండెకు అవసరమయ్యే పొటాషియం సరఫరా తగ్గి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ఎంల వద్ద గ్రామాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్యం పట్ల జరిగే చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల దోమలు, ఈగల వ్యాప్తి పెరిగి అంటువ్యాధులు ప్రబలుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించి, నీటి పాత్రలను, ట్యాంకులను ఎండబెట్టాలన్నారు. వర్షాకాలం మొత్తం క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 31వ తేదీ ఆదివారం అన్ని గ్రామ పంచాయతీల్లో మహిళా సంఘాలు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఐకెపి ఎపిఎంలను ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రాథమిక అవగాహన లేకుండా 25సంవత్సరాల సర్వీస్ కలిగిన వర్ని పిహెచ్‌సి హెల్త్ సూపర్‌వైజర్ సావిత్రిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. డ్రై డే, ఐరన్ పోలిక్ మాత్రల ప్రాధాన్యతపై కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు ఇచ్చిన హెల్త్ సూపర్‌వైజర్ సావిత్రికి సంబంధించిన జూలై నెల టూర్ డైరీని తనిఖీ చేసి నివేదించాలని ఐకెపి ఎపిఎంను ఆదేశించారు. పై అంశాలపై ఎఎన్‌ఎంలకు ఉన్న అవగాహన సూపర్‌వైజర్‌కు లేకపోవడం ఏమిటని కలెక్టర్ మండిపడ్డారు.

తెలంగాణకు ఆగర్భశత్రువు చంద్రబాబు
ఎంపి కవిత విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఆగర్భ శత్రువులా మారారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయినప్పటికీ తెలంగాణ ప్రాంతంపై ఆయన విషం చిమ్ముతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం దర్పల్లి, రెంజల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపి కవిత పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశానని నమ్మబలికిన చంద్రబాబు, ప్రస్తుతం తెలంగాణను విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేశారని వాపోతుండడం ఆయన వైఖరిని చాటుతోందన్నారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయమై చర్చ సందర్భంగా తెలంగాణ పట్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరి మరోమారు బట్టబయలైందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఇదివరకు ఏమాత్రం స్పందించని కాంగ్రెస్ జాతీయ నాయకులంతా ప్రస్తుతం ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు కూడా సమైక్య రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రాకు అన్యాయం చేశారంటూ తెలంగాణ ప్రాంతం పట్ల తన వివక్షతను చాటుకుంటున్నారని విమర్శించారు. ఎంసెట్-2 రద్దు చేసిన విషయమై కవిత స్పందిస్తూ, విద్యార్థుల ప్రయోజనాలు, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ఎస్పీ క్యాంప్ ఆఫీసు పక్కనే వరుస చోరీలు!
రెండు నెలల వ్యవధిలోనే వరుసగా ఇది రెండవసారి
విషయం బయటకు పొక్కకుండా గోప్యం పాటిస్తున్న పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జూలై 30: సాక్షాత్తూ జిల్లా పోలీసు బాస్ బస చేసే క్యాంపు కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓ వస్త్ర దుకాణంలో వరుస చోరీలు జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అనుక్షణం పోలీసు నిఘా కొనసాగే ఎస్పీ బంగళాకు అత్యంత చేరువలో ఉన్న వస్త్ర షోరూమ్‌లో దొంగలు చొరబడి తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించడం పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపినట్లయ్యింది. రెండు నెలల వ్యవధిలోనే రెండు సార్లు ఇదే దుకాణంలో దొంగలు చోరీలకు పాల్పడి నగదుతో పాటు విలువైన వస్త్రాలను ఎత్తుకెళ్లారు. గత రంజాన్ నెల ప్రారంభానికి కొద్ది రోజుల ముందు చోరీకి తెగబడిన దుండగులు ఆ సమయంలో కౌంటర్‌లో దాచి ఉంచిన సుమారు 30వేల వరకు నగదు, వస్త్రాలను అపహరించుకుపోయారు.
తాజాగా శనివారం తెల్లవారుజామున ఇదే తరహాలో మరోమారు చోరీకి తెగబడ్డారు. క్యాష్ కౌంటర్‌లో దాచి ఉంచిన సుమారు 50వేల రూపాయల నగదుతో పాటు విలువైన చీరలు, జీన్స్ ప్యాంట్లు, ఇతర వస్త్రాలను ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. ఉదయం దుకాణం తెరిచిన యజమాని చోరీ జరిగిన విషయాన్ని గమనించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసు అధికారులు ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించినట్టు సమాచారం. ఆగంతకుల ఆచూకీ తెలుసుకునేందుకు వీలుగా షోరూమ్‌లోని సి.సి కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు వెనుక భాగం నుండి లోనికి చొరబడి ఎంతో తాపీగా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించినట్టు తేటతెల్లమైంది. ముందుగా దొంగలు క్యాష్‌కౌంటర్‌ను ధ్వంసం చేసి అందులోని నగదును తస్కరించారని, అనంతరం జీన్స్ ప్యాంట్లను ట్రయల్ రూమ్‌లో వేసుకుని కూడా చూసినట్టు వెల్లడైంది. నగదుతో పాటు విలువైన వస్త్రాలను చేతబట్టుకుని వచ్చిన మార్గం గుండానే తాపీగా వెళ్లిపోయినట్టు సి.సి కెమెరాలలో నిక్షిప్తమైంది. గత రెండు మాసాల క్రితం కూడా సదరు దొంగలే చోరీకి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయానికి ఆనుకునే ఈ చోరీలు జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎలాగైనా నిందితులను పట్టుకోవాలనే పట్టుదలతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వేటను మొదలు పెట్టారు. జిల్లా పోలీసు బాస్ నివాసం సమీపంలోనే చోరీ జరిగిన ఉదంతం గురించి బయటకు పొక్కితే తమ శాఖ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందనే ఉద్దేశ్యంతో పోలీసు అధికారులు ఈ సంఘటనలను గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. చోరీ జరిగిన విషయమై నగర సిఐ నర్సింగ్ యాదయ్యను వివరణ కోరగా, తమ దృష్టికి రాలేదని దాటవేత వైఖరిని అవలంబించడం గమనార్హం.

ఐక్యమత్యంతో ముందుకు సాగాలి
పార్టీ శ్రేణులకు
ఎంపి కవిత పిలుపు
డిచ్‌పల్లి, జూలై 30: టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఐక్యమత్యంతో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందజేయాలని ఎంపి కవిత పిలుపునిచ్చారు. శనివారం దర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ పార్టీలోని సర్పంచ్, ఎంపిటిసి స్థాయి నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి వరకు ప్రజాప్రతినిధులంతా కలిసి పని చేయాలని, గ్రూపు రాజకీయాలకు పాల్పడితే ప్రజలు క్షమించరని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, నిజామాబాద్ రూరల్ నియోజవకర్గంలో గ్రూపు రాజకీయాలు కొట్టొచ్చినట్లు కనబడటం విచారకమన్నారు. వ్యక్తిగత వైశమ్యాలను పక్కనపెట్టి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఇకనైనా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి పని చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలే పునాదులని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పార్టీ ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎంపి సర్పంచ్ దృష్టికి తెచ్చారు. రామడుగు ప్రాజెక్టులోకి ఇప్పటికీ నీరు చేరలేదని, వర్షాలు ఆశించిన స్థాయిలో కురియకపోవడం వల్ల ప్రాజెక్టు బోసిపోయి ఉందని ఎంపిటిసి మురళీగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రామడుగు ప్రాజెక్టులో నీరు వచ్చే ప్రాంతాల ఆధునీకరణకు నిధులు మంజూరీ చేయాలని ఆయన ఎంపిని కోరారు. గౌరారం రెవెన్యూ శివారులో అటవీ శాఖ అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని సర్పంచ్ లక్ష్మి సమావేశం దృష్టికి తెచ్చారు. రామడుగు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి 10లక్షలు మంజూరీ చేస్తున్నట్లు ఎంపి సమావేశంలో ప్రకటించారు. దర్పల్లి మండలంలోని ప్రధాన సమస్యల ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎంపి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తాగు, సాగునీటి పనులను సత్వరం పూర్తయ్యే విధంగా ఉన్నతాధికారులను ఆదేశించాలని ఆయన ఎంపిని కోరారు. ప్రజాప్రతినిధులతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. సిర్నాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాంసాగర్‌తండాకు బిటి రోడ్డు ఏర్పాటు చేయాలని సర్పంచ్ బాయి, ఎంపి కవితకు విన్నవించారు. మండలంలోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపి కవిత హామీ ఇచ్చారు. ఎంపిపి ఇమ్మడి గోపి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ విజి.గౌడ్, తహశీల్దార్ సూర్యప్రకాష్, ఎంపిడిఓ గణపతిరావు, సూపరింటెండెంట్ విజయ, ఆయా శాఖల అధికారులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దర్పల్లి మండల పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి కల్వకుంట్ల కవితను ఎంపిపి ఇమ్మడి గోపి, జడ్పీటిసి గడ్డం సుమనారెడ్డి, దర్పల్లి సర్పంచ్ కర్క గంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మహిపాల్‌యాదవ్, వైఎస్ ఎంపిపి విజయ, స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు.

ఎంసెట్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి
ఉద్రిక్తతలకు దారితీసిన
ఎబివిపి కలెక్టరేట్ ముట్టడి
వినాయక్‌నగర్, జూలై 30: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఎంసెట్-2 పేపర్‌ను లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎబివిపి ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఎబివిపి నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎబివిపి నాయకుడు రాకేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మళ్లీ ఎంసెట్ నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందన్నారు.
అందువల్ల విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భవిష్యత్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవకతవలకు పాల్పడుతున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు రవి, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాంసాగర్‌లో
పెరుగుతున్న వరదనీరు
బాల్కొండ, జూలై 30: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. మహారాష్టల్రోని విష్ణుపురి మిగులు జలాలతో పాటు గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాల కారణంగా 33,723క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని, దీంతో శనివారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1074.00అడుగులు 37.45టిఎంసిలకు చేరుకుందన్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 90టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1052.00అడుగులు 7.42టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఎఇ మహేందర్ తెలిపారు. కాగా, వరదనీరు వచ్చి చేరడంతో నీటిమట్టం వరద కెనాల్‌కు చేరువు కావడంతో ఎఇ మహేందర్ వరదకాల్వ జీరో పాయింట్ వద్ద గల గేట్ల ఆపరేటింగ్ సిస్టమ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనరేటర్, రూఫ్ మెయింటెనెన్స్ తదితర వాటిని పరిశీలించారు. రిజర్వాయర్‌లోకి వరదనీరు వచ్చే అవకాశం ఉండటంతో వరదకాల్వ ద్వారా మానేరు డ్యామ్‌కు నీళ్లు వదిలే సూచనలు ఉండగా, ముందస్తు చర్యగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరిశీలించినట్లు ఎఇ తెలిపారు.

శంకరవ్వను డిగ్రీలో చేర్పిస్తా
కలెక్టర్ హామీ
బీర్కూర్, జూలై 30: బీర్కూర్ మండల కేంద్రంలో పోలియో వ్యాధితో రెండు కాళ్లు చచ్చుబడిపోయి చేతులపై నడుస్తున్న వికలాంగురాలు శంకరవ్వను చూసిన కలెక్టర్ డాక్టర్ యోగితారాణా చలించిపోయారు. శనివారం బీర్కూర్ కెజిబివిని సందర్శించేందుకు వెళ్లిన కలెక్టర్ వాహనాన్ని ఆపిన శంకరవ్వ తనకు ఆర్థిక సహాయం గానీ, ఉద్యోగం గానీ ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకుంది. రెండు చేతులపై నడుస్తున్న శంకరవ్వను చూసిన కలెక్టర్ వాహనం నుండి కిందకు దిగి, ఆమె యోగ క్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీంతో తనకు వికలాంగుల పెన్షన్ వస్తోందని కలెక్టర్‌కు తెలిపారు. అయితే ఉన్నత విద్యను అభ్యసిస్తే జీవితంలో మంచిగా స్థిరపడవచ్చని, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కలెక్టర్ అన్నారు. శంకరవ్వ ఇంటర్ పూర్తి చేసినందున హాస్టల్ వసతి కల్పించి, డిగ్రీలో చేర్పిస్తానని భరోసా ఇప్పించారు. హాస్టల్ నుండి కళాశాలకు వెళ్లేందుకు 70వేల రూపాయల విలువైన మూడు చక్రాల మోటార్ వాహనాన్ని మంజూరీ చేస్తానని భరోసా కల్పించారు. అనంతరం శంకరవ్వ ఫోన్ నెంబర్, ఆధార్‌కార్డు నెంబర్‌ను కలెక్టర్ నమోదు చేసుకున్నారు.

నేటితో ముగియనున్న పిఎం ఫసల్ బీమా
నందిపేట, జూలై 30: భారత ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన బీమా పథకం జూలై 31తో గడువు ముగియనుంది. ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ ఖరీఫ్ 2016నుండి దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద ఆహార, నూనె గింజల పంటలన్నింటికి వర్తిస్తాయి. జిల్లాలో వరి ప్రధాన పంటగా గ్రామం ఒక యూనిట్‌గా తీసుకుని అమలు చేయడం జరుగుతుంది. అలాగే మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, సోయ చిక్కుడు, పసుపు పంటలకు మండల యూనిట్‌గా అమలు చేయబడుతుంది. ఎంపిక చేసుకున్న పంటను సాగు చేస్తూ బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వరికి 420రూపాయలు, మొక్కజొన్నకు 400, జొన్న, పెసర, మినుములు, కందులకు 200రూపాయలు, సోయా చిక్కుడుకు 260, పసుపు పంటకు 2,750రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే యూనిఫైడ్ ప్యాకేజీ ఇన్సురెన్స్ పథకం జిల్లాలో పైలెట్ పథకంగా అగ్రికల్చరల్ ఇన్సురెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారిచే బ్యాంకు రుణం పొందిన, పొందని రైతులు అర్హులని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జీవిత బీమా, విద్యార్థి రక్షణ బీమా, నివాస గృహ బీమా, వ్యవసాయ పంపుసెట్టు బీమా, వ్యవసాయ ట్రాక్టర్ బీమా తదితర వాటిని కూడా పై పథకం కింద చేసుకోవచ్చు. నేటితో పంటల బీమా ప్రీమియం చెల్లించే గడువు ముగియనుందని, అందువల్ల రైతులు మండల వ్యవసాయ అధికారి, బ్యాంకు మేనేజర్, ఐకెపి, డిఆర్‌డిఎ అధికారులను సంప్రదించి బీమా పథకం చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మోదీ బహిరంగ సభను జయప్రదం చేయండి
బిజెపి ఎమ్మెల్యే చింతల రాంచందర్
వినాయక్‌నగర్, జూలై 30: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆగస్టు 7వ తేదీన రాష్ట్రానికి మొట్టమొదటిసారి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆ పార్టీ ఉపపక్ష నేత ఎమ్మెల్యే చింతల రాంచందర్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకులను ఎన్నుకుంటారని, కానీ తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలనే కొనసాగుతోందన్నారు. కేంద్రం తెలంగాణకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నా, టిఆర్‌ఎస్ పార్టీ ఎన్డీయే సర్కార్‌ను అబాసుపాలు చేసేందుకు అసత్య ప్రచారం చేయడం శోచనీయమన్నారు.