S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

2019లో రాష్ట్రంలో మనదే అధికారం

వరంగల్, జూలై 30: రాష్ట్రంలో 2019లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషితో ముందుకు పోవాలని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని అభిరాం గార్డెన్‌లో జరిగిన బూత్ కమిటీ సమ్మేళన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30వేల పోలింగ్ బూత్‌లకు గాను ఇప్పటికే 20వేల పోలింగ్ బూత్‌లకు కమిటీలు పూర్తి చేసుకున్నామని, పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలని అన్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రతి పల్లెకు బిజెపి, ఇంటింటికీ మోదీ పథకాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 7న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు. మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే పోలింగ్ బూత్ కమిటీ మహా సమ్మేళనంలో ప్రతి బూత్ కమిటీ సభ్యుడు పాల్గొనాలని, కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన దినోత్సవమని, ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు దారి మళ్లకుండా బిజెపి కాపలా కుక్కలా ఉంటుందని అన్నారు. బిజెపి కేంద్ర పార్టీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టిందని, అస్సోం స్ఫూర్తిగా తెలంగాణలో అధికారం వచ్చే విధంగా ప్రతి కార్యకర్త చెమటోడ్చాల్సిన అవసరం ఉందన్నారు. 2019లో తెలంగాణలో మనం సాధించబోయే అద్భుతమైన విజయానికి బాటలు వేసేందుకు సాక్షాత్తు ప్రధాని మోదీ మన మధ్యకు వస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపి చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములు, నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, విజయచందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
కల్చరల్ (వరంగల్), జూలై 30: తెలంగాణ రాష్ట్రంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవాలయ క్షేత్రాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి వరంగల్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పి.నవీన్‌రావు దర్శించారు. ఉదయం 6 గంటలకు జరిగిన అభిషేచనా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ఈవో కట్టా అంజనీదేవి, ఆలయ చైర్మన్ భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ ఆయనను ఘనంగా పూర్ణకుంభస్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించి అమ్మవారికి జరిగిన అభిషేకంలో పాల్గొన్నారు. పూజానంతరం వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చెప్పల సోమసుందర శర్మ, యల్లంభట్ల రమేష్ శర్మలు ఆలయ మండపంలో ఆయనకు మహదాశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించారు. తదుపరి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయాని విచ్చేసిన నవీన్ రావు వెంట జిల్లా న్యాయమూర్తి యం లక్ష్మణ్, ఏసిపి సురేద్రనాధ్, మట్వాడ సిఐ జూపల్లి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.
హౌసింగ్ డిఇ మృతి, భార్య, పిల్లలు ఆత్మహత్య
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూలై 30: హౌసింగ్ డిఇగా పని చేస్తున్న సత్యనారాయణ అనారోగ్యానికి ఆయన కుటుంబ తగాదాలే కారణమేనని తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా హౌసింగ్ డిఇగా ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనారాయణ భార్యభర్తల తగాదాలతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. వరంగల్ నగరంలోని టీచర్స్ కాలనీలో సత్యనారాయణ భార్య, పిల్లలు ఉంటున్నారు. మృతుడు సత్యనారాయణ మాత్రం నెలనెలా జీతం ఇంటికి పంపించేవాడని తెలిసింది. అయితే సత్యనారాయణ, ఆయన భార్యకు మధ్య కుటుంబ తగాదా ఉన్నట్లు చెపుతున్నారు. ఆయన ఇద్దరు బిడ్డలు కూడా బిటెక్, ఎంటెక్‌లు పూర్తి చేసి ఉన్నారు. పెద్ద కూతురు 33 సంవత్సరాలు దాటినా ఇంత వరకు పెళ్లి కాలేదు. అయితే కూతుళ్ల పెళ్లిళ్ల విషయంలోనే భార్యభర్తల మధ్య తగువు నడుస్తున్నట్లు తెలుస్తుంది. సత్యనారాయణ తన కూతుర్లకు ఏ సంబంధం తీసుకొచ్చినా భార్యకు నచ్చేది కాదని, ఆ కారణంగానే వారిద్దరిమధ్య దూరం పెరిగిందని చెపుతున్నారు. పెళ్లీడు దాటిన కూతుర్లకు ఇంకా పెళ్లి చేయకపోవడంతో సత్యనారాయణ గత కొన్ని సంవత్సరాలుగా మానసిక సంఘరణ ఎదుర్కొంటున్నాడు. ఆస్తులు, అంతస్థులు, ఆర్థికంగా ఉన్నప్పటికి కూతుళ్ల పెళ్లి చేయకపోవడం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో సత్యనారాయణ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను హుటాహుటీన వరంగల్ నుండి హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆ డెడ్‌బాడీని కారులో వెనక్కి తీసుకొస్తూ మార్గమధ్యంలో ఘట్‌కేసర్ వద్ద ఆగి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఘట్‌కేసర్ ఘటనతో.. జిల్లాలో విషాదం
* ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
* యజమాని మృతితో రైలు కింద పడి నలుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన సంఘటనతో జిల్లాలో విషాధఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో కుటుంబ యజమాని కళ్లెదుటే చనిపోవడాన్ని తట్టుకోలేక ఆయన భార్య, ముగ్గురు పిల్లలు శుక్రవారం తెల్లవారు జామున రైలు కిందపడి చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అంషాపూర్ రైల్వేట్రాక్ వద్ద జరిగింది. కుటుంబ యజమాని మృతిని జీర్ణించుకోలేక ఆయన భార్య మీరా, కూతుర్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామ్‌కృష్ణ కారులోనే మృతదేహాన్ని ఉంచి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా కుటుంబ తగాదాల వల్ల సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించిందని వారి బంధువుల్లో చులకనవుతామనే అనుమానంతో కుటుంబ సభ్యులంతా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంత గ్రామమైన లద్దునూరుకు తరలించారు. కాగా మృతి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులకు పారుపల్లి సత్యనారాయణ తండ్రి పారుపల్లి ప్రకాశం తలకొరివి పెట్టారు. అంత్యక్రియలను స్వగ్రామమైన లద్నూర్‌లో నిర్వహించారు.

కానిస్టేబుల్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

బాలసముద్రం, జూలై 30: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న వ్రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. ఎక్సైజ్, రవాణా శాఖలలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు వరంగల్‌లో 48 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రతి కేంద్రంకు జిల్లా యంత్రాంగం నుండి లైజన్ అధికారిని, సహాయ లైజన్ అధికారిని నియమించినట్లు ఆమె తెలిపారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ఈ రాత పరీక్షకు అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలను కలెక్టర్ వివరించారు. హాల్‌టికెట్‌తో పాటు తమతో పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి వెరిఫికేషన్ సందర్భంగా చూపించాలని, అది తప్పనిసరిగా ఒరిజినల్ అయి ఉండాలని, అలాగే తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరాకూడదని, వాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని, అలాగే పరీక్ష రోజు ఉదయం 8:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు తెరచి ఉదయం 9:30గంటలకు మూసివేస్తారని, అలాగే అభ్యర్థులు షూస్ మరియు వాచీలు ధరించి రావద్దని ఆ ప్రకటనలో కలెక్టర్ సూచించారు. పరీక్షకు బ్లూ లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలని, తమకిచ్చిన ఓయంఆర్ షీట్‌పై వైటెనర్‌ను వినియోగించితే వారు పరీక్షకు అనర్హులవుతారని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి నిబంధనలు తప్పనిసరిగా అభ్యర్థులు పాటించాలని కలెక్టర్ కోరారు.
సెజ్ ఓవర్‌సిస్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బాలసముద్రం, జూలై 30: వరంగల్ నగరంలోని హన్మకొండలో మొదటి సారిగా ఏర్పాటు చేసిన సెజ్ ఓవర్‌సిస్ సెంటర్‌ను వరంగల్‌పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా శిక్షణ పొంది విదేశాలకు సులువుగా వెళ్లవచ్చునన్నారు. ఈ సదావకాశాన్ని విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మధుతో పాటు కొటక్ బ్యాంకు మేనేజర్ వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట
2వ ఎఎన్‌ఎంల ధర్నా
వడ్డేపల్లి, జూలై 30: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రెండవ ఎఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారిని వెంటనే క్రమబద్దీకరించాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జె.సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రెండవ ఎఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జయశంకర్ స్మృతి వనం నుండి అదాలత్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లోని చొచ్చుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఎఎన్‌ఎంలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీంతో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆగ్రహం చెందిన ఎఎన్‌ఎంలు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 4000 మంది ఒప్పంద ఎఎన్‌ఎంలను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా 2007 నియమించారని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న వారికి పిఎఫ్, ఇఎస్‌ఐ, టిఎ, డిఎ, యూనిఫాం అలవెన్సులు లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగుల జీతభత్యాల కోసం జిఒ నెంబర్ 14ను జారీ చేసిందని, వీరికి మాత్రం ఎన్‌ఆర్‌ఎచ్‌ఎం నిబంధనల ప్రకారం ఐదు శాతం జీత భత్యాలు పెంచి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఎన్‌ఎంలు అందరూ మహిళా ఉద్యోగులైనప్పటికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు లేకపోవడంతో నాలుగు నెలలు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికి వీరి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18 నుండి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 10వ పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం 21,300 చెల్లించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, విధినిర్వహణలో మరణించిన వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఒప్పంద కార్మికులందరిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సరోజ, పద్మ, సుశీల, సి ఐటియు నాయకులు రాజు, చక్రపాణి, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.
మంత్రుల రాజీనామా చేయాల్సిందే
* కలెక్టరేట్ ముట్టడించిన విద్యార్థి సంఘాలు *ఉద్రిక్తత, అడ్డుకున్న పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూలై 30: ఎంసెట్-2 లీక్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంసెట్-2 రద్దు చేసే యోచనలో ఉండడంతో అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎంసెట్ రాసిన విద్యార్థులు మూడో సారి ఎంసెట్ రాసేందుకు జంకుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్ధత వల్ల ఎంసెట్-2 లీక్ అయిందని, అందుకు తక్షణమే మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను మంత్రి పదవుల నుండి బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఏబివిపి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. మరోవైపు లోక్‌సత్తా అనుబంధ సంఘం అయిన విద్యార్థిసత్తా నాయకులు కలెక్టర్ ముందు ఆందోళన చేపట్టారు. ఎంసెట్-2 లీక్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మరోసారి ఎంసెట్ నిర్వహిస్తే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అన్యాయం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. లీక్‌కు సంబంధించిన మూలాలను కనుగొని ప్రభుత్వం లోతుగా విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
*మంత్రులను బర్తరఫ్ చేయాలి
-- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
ఎంసెట్-2 లీక్‌కు నైతిక బాధ్యతగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డిని తక్షణమే మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్‌కు పరిపాలన అనుభవం లేక ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఎంసెట్-2 లీక్‌కు సంబంధించిన మూలాలను కనుగొని దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
*కెజి టు పిజి అంటే ఇదేనా
-- కాంగ్రెస్ నేత ఇనగాల
డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ఇంతవరకు ఏనాడు కూడా రెండు మూడు సార్లు ఎంసెట్ రాసిన దాఖలాలు లేవని, అది కేవలం తెలంగాణ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఇప్పటికే విసిల నియామకం ఓ వైపు, ఎంసెట్-2 లీక్ మరోవైపు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడకముందుకు కెజి టు పిజి ఉచిత విద్య అమలు చేస్తామన్న ప్రభుత్వం కెజి టు పిజి అటుంచితే ఉన్న విద్యను కూడా విద్యార్థులకు సక్రమంగా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎంసెట్-2 లీక్‌కు నైతిక బాధ్యతగా మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి తక్షణమే పదవుల నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా టిడిపి, సిపిఐ, ఇతర పార్టీలు ఎంసెట్-2 లీక్‌పై ప్రభుత్వంపై మండిపడుతున్నారు.