S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంసెట్ లీకేజిపై ఖమ్మంలోసిఐడి విచారణ

ఖమ్మం, జూలై 29: ఎంసెట్ మెడికల్ పరీక్షాపత్రం లీకేజి వ్యవహారంపై ఖమ్మం జిల్లా వ్యక్తుల పాత్ర కీలకమని తేలడంతో సిబి సిఐడి అధికారులు శుక్రవారం ఖమ్మంలో విచారణ చేపట్టారు. ప్రముఖ కార్పొరేట్ కళాశాల అధినేత కూతురుకు వందలోపు ర్యాంకు రావడం, లీకేజిలో వారిపాత్ర ఉన్నదనే ఆరోపణలు వచ్చాయనే కారణంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం రూరల్, ఖమ్మం గాంధీచౌక్, కొణిజర్ల మండల ప్రాంతాల్లోని విద్యార్థుల వివరాలపై కూడా విచారణ చేపట్టారు. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజి ద్వారా మెరుగైన ఫలితాలను సాధించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తుల బ్యాంకు అకౌంట్లు, ఫోన్ వివరాలు తదితర వాటిని తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రముఖ కళాశాల యజమాని ఇంటిపై సిఐడి దాడులు జరుపుతున్నారని ప్రచారం జిల్లాలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా జిల్లాలో సిఐడి విచారణ జరపడం, అది కూడా ఓ ప్రధాన విద్యాసంస్థ యజమాని ఇంటిపై జరపడంతో కొన్ని సంఘాలు ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేశాయి. లీకేజి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఎంసెట్ కన్వీనర్ రమణరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఆందోళనలు చేసిన విద్యార్థి సంఘాలు మరో రెండురోజుల్లో రాష్టవ్య్రాప్త ఆందోళనకు పిలుపు ఇవ్వనున్నట్లు సమాచారం.
భక్తులకు సకల ఏర్పాట్లు: పీవో
* అంత్యపుష్కర ఆహ్వాన గోడపత్రికలు ఆవిష్కరణ
భద్రాచలం, జూలై 29: ఈనెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరిగే గోదావరి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐటిడిఎ పీవో, ఇంఛార్జ్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఐటీడీఏలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముద్రించిన అంత్య పుష్కరాలు-2016 శుభ ఆహ్వాన గోడ పత్రికలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరదల వల్ల గోదావరి వద్ద పుష్కరఘాట్లపై పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తొలగించి భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గోదావరి లోతుకు వెళ్లి స్నానాలు చేయకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, అలాగే నీటి పారుదల, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను, రిస్య్వూ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పీవో తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 24 గంటలు భక్తులు బస చేసే ప్రాంతాల్లో, ముఖ్య కూడళ్లలో గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో టి.రమేష్‌బాబు, తహసిల్దార్ రామకృష్ణ, ఆర్‌టీసీ డిఎం నరసింహం, దేవస్థానం డిప్యూటీ ఈఈ రవీందర్, ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిస్టుల వల్లే అభివృద్ధి
* సీతారామ ప్రాజెక్టు డిపిఆర్‌ను ప్రకటించి పనులు ప్రారంభించాలి
* భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారాన్ని చెల్లించాలి
* రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ఖమ్మం (కల్చరల్), జూలై 29: రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి జరిగిందంటే అది కమ్యూనిస్టుల వల్లేనని ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై శుక్రవారం ఖమ్మంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ మొదలుకొని నేడు జిల్లాలో శంకుస్ధాపనలు చేసిన ప్రాజెక్టుల వరకు కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల క్రింద భూములు, ఇళ్ళు కోల్పోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల అభివృద్ధి నిరోధకులమైనామా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రకటించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. డిపిఆర్ ప్రకటించకుండానే టెండర్ల దాక వెళ్ళడం వెనుక ఏమున్నదో తెలియజేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లాకు ఉన్న జల వనరులు ఏ జిల్లాకు లేవన్నారు. కానీ వాటిని వినియోగించుకొని సాగునీరు అందించడంలో ప్రభుత్వాధికారులు పూర్తిగా విఫలమైనారని ఆరోపించారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై అఖిలపక్షభేటీని ఏర్పాటు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు ప్రభుత్వానికి సరైంది కాదన్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నిర్వాసితులు ఎంత భూమిని కోల్పోతున్నారు, ఎన్ని ఎకరాల భూమి సాగులోకి వస్తుందో, నిర్వాసితులకు ఎంత పరిహారం ఇస్తున్నారో తెలిజేయాలన్నారు. ప్రాజెకుల నిర్మాణంలో ఆయా ప్రాంతాల రైతులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలి తప్ప, మెజార్టీ ఉందని ఏకపక్షనిర్ణయం తీసుకోవడం సరైందికాదన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులను వృధా చేసి రీడిజైన్ పేరుతో ప్రజాధనాన్ని వృధా చేసే అధికారాన్ని ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, భూ నిర్వాసితుల జిల్లా కన్వీనర్ నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపియం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శనరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు రాయల చంద్రశేఖర్, టిడిపి జిల్లా నాయకులు తాళ్ళూరి జీవన్, తోటకూరి శివయ్య, రైతు కూలీ సంఘం నాయకులు కె నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, తాతా భాస్కర్‌రావు, బొంతురాంబాబు, దుగ్గి కృష్ణ, మెరుగు సత్యనారాయణ, రామనాధం, వేదగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో
దండకారణ్యంలో ఉద్రిక్తత
భద్రాచలం, జూలై 29: మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు దండకారణ్యంలో ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను భద్రతా బలగాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. వారి ఆధిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇరు వర్గాలు దూసుకువస్తుండటంతో తీవ్ర అలజడి మొదలైంది. ఒడిషాలోని జయ్‌పూర్ నుంచి నక్సల్స్‌కు చేరవేస్తున్న జెలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్లు తదితర పేలుడు పదార్ధాలను శుక్రవారం భారీ మొత్తంలో బస్తర్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చింతూరు-్భద్రాచలం జాతీయ రహదారిపై పేగ వద్ద మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను వదిలి వెళ్లారు. పత్రాలను దారిపొడవునా చల్లారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా మాన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔంధీ గ్రామ అటవీప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని 20 కిలోల మందుపాతరను అమర్చారు. దాన్ని సకాలంలో గుర్తించి భద్రతాబలగాలు నిర్వీర్యం చేశాయి. సుక్మా జిల్లా పోలంపల్లి-పాలమడుగు అటవీప్రాంతంలో మావోయిస్టులు నిర్మించిన అమరవీరుల స్మారక స్తూపాన్ని ఎస్టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు కూల్చివేశాయి. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ఎదుట జిల్లా కమిటీ సభ్యుడు సుఖ్‌దేవ్‌తో సహా 5గురు నక్సల్స్ లొంగిపోయారు. మావోయిస్టుల చర్యలకు భద్రతాబలగాలు ప్రతిచర్యలు వెంటనే చూపుతున్నారు. ఈసారి మావోయిస్టుల ఉత్సవాలను ఎక్కడికక్కడే పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రధానంగా దండకారణ్యం విప్లవకారిడార్‌పై నిఘా వర్గాలు మొత్తం కనే్నశాయి. అక్కడ అణువణువూ వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దళాల కదలికలను పసిగట్టి భద్రతా బలగాల సాయంతో వారిని నియంత్రిస్తున్నారు. దీంతో ఈసారి సరిహద్దుల్లో మావోయిస్టుల హింస తగ్గింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని నిఘా వర్గాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతో పాటుగా సంయుక్తంగా దాడులు చేస్తుండటంతో సరిహద్దుల్లో విజయాలు సాధిస్తున్నారు. ఎక్కడికక్కడే ఇన్‌ఫార్మర్ వ్యవస్థను బలోపేతం చేసుకున్న నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఇదే తరహాలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
రెండేళ్ళలో హరిత మణుగూరు

మణుగూరు, జూలై 29: ప్రజల సహకారంతోనే హరితహారం కార్యక్రమం విజయవంతమైందని, ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలన్న ఆకాంక్ష మొదలైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా సింగరేణి సంస్థ శుక్రవారం మణుగూరులో ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొన్న ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులు ఉంటేనే వర్షాలు కురుస్తాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అడవులను ఇష్టారాజ్యంగా నరికివేయడంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావం నెలకొందన్నారు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ముఖ్యంగా సింగరేణి సంస్థ ఓసీల పేరుతో అడవులు నరికేస్తుందని, అందుకు ప్రత్యామ్నయంగా వారు ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. నేడు నాటిన మొక్క ఇంతింతై వతుడింతై అన్న చందంగా ఎదిగి మణుగూరు హరితశోభతో కళకళలాడాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, చెరువులు తవ్వించినా వర్షాలు ఉంటేనే వాటితో ఉపయోగమని, అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో మొదలు పెట్టిన బృహత్తర కార్యక్రమమే ఈ హరితహారం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో 240 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, దీనిపై కేంద్రం ఎలా సాధ్య పడుతుందంటూ విమర్శించిందని, దాన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా ఇప్పటికే 2 కోట్ల మొక్కలు నాటడం పూర్తయిందన్నారు. ఏ కార్యక్రమమైనా ప్రజల సహకారం ఉంటేనే 100 శాతం పూర్తవుతుందని, అందుకు ఉదాహరణ ఈ హరితహారం అని అన్నారు. మొక్కలు నాటడంతోనే లక్ష్యం పూర్తయినట్లు కాదని, వాటి సంరక్షించే బాధ్యతను కూడా చేపట్టాలని సూచించారు. ఆర్థిక సంపత్తి కలిగిన సింగరేణి సంస్థ నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని, రెండేళ్లలో హరిత మణుగూరును చూడాలని సూచించారు. సింగరేణి సంస్థ ఒక్క రోజు 15 వేల మొక్కలు నాటే కార్యక్రమం అభినందనీయమని, అందుకు కృషి చేసిన అధికారులకు, ఆదుకున్న విద్యాసంస్థల యాజమాన్యాలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సింగరేణి ప్రాజెక్టు ఫ్లానింగ్ డైరక్టర్ మనోహర్‌రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆర్డీవో రవీంద్రనాథ్, మణుగూరు ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, ఎంపీపీ చిడెం అంజమ్మ, జడ్పీటీసీ పాల్వంచ దుర్గ, తహసిల్దార్ తిరుమలాచారి, ఎస్‌వోటూ జీఎం కె.నారాయణ, ప్రాజెక్టు ఆఫీసర్ టీవీ రావు, ఎల్వీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి జనదీక్ష
ఖమ్మం(జమ్మిబండ), జూలై 29: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగాల రవికుమార్ శుక్రవారం ఖమ్మంలో జనదీక్షను చేపట్టారు. దీక్షను సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వాలు గాలికొదిలేశాయన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపర్చి హామీనిచ్చినట్లుగా, కెజిటుపిజి ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ వసతీ గృహాల్లో మెరుగైన వసతీ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రజా అవసరాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. లింగాల రవికుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాల్సిన పాలకులు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని కొందరు ప్రజాప్రతినిధులు అవినీతిని ప్రోత్సహిస్తూ రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షను ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణారావు సాయంత్రం విరమింపజేశారు. ఈ కార్యక్రమానికి అనేక ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి.

మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి
* ఏఎస్పీ సాయికృష్ణ
ఖమ్మం(జమ్మిబండ), జూలై 29: హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వాటి పూర్తి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఏఎస్పీ సాయికృష్ణ అన్నారు. శుక్రవారం కృష్ణప్రసాద్ పోలీస్ వెల్ఫేర్ స్కూల్ మైదానంలో 550మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం ఆదేశాల మేరకు జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీస్ కార్యాలయం, పోలీస్ శిక్షణా కేంద్రం, జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటినట్లు వివరించారు. వాటిని రక్షించే విధంగా వాటర్ ట్యాంక్ వాహనాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొక్కలు ఎదిగేంత వరకు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సురేష్‌కుమార్, ఏఆర్‌డిఎస్పీలు సంజీవ్, మాణిఖ్యరాజ్, సిఐలు వెంకటనర్సయ్య, రమేష్, మొగిలి, రూరల్ సిఐ ఆంజనేయులు, అర్బన్ సిఐ శ్రీ్ధర్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
గ్రానైట్ ట్రాక్టర్ డ్రైవర్ల వేతనాల పెంపుకోసం సమ్మె
* లేబర్ అధికారికి నోటీస్
ఖమ్మం(కల్చరల్), జూలై 29: ట్రాక్టర్ డ్రైవర్లకు వేతనాల పెంపుకై ఆగస్టు 1వ తేది తరువాత సమ్మెబాట పట్టనున్నట్లు సిఐటియు ఖమ్మం డివిజన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ తెలిపారు. శుక్రవారం సిఐటియు ఆద్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి సమ్మె నోటీస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమల్లో ట్రాక్టర్ డ్రైవర్లకు వేతనాలు పెంచాలని కోరుతూ అనేక సార్లు యజమానులకు లేఖలు అందించినప్పటికి ప్రయోజనం లేకపోవడంతో డ్రైవర్లు సమ్మెబాట పట్టాల్సివచ్చిందని తెలిపారు. గ్రానైట్ ట్రాక్టర్ డ్రైవర్లకు, యజమానులకు మధ్య గత రెండేళ్ళ క్రింతం జరిగిన వేతన ఒప్పందం పూర్తి అయి నెలలు గడుస్తున్నప్పటికి యజమానులు వేతనాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 5650 రూపాయలు పెరిగిన నిత్యావసర వస్తువులతో ఎటు సరిపోక అనేక అవస్ధలు పడుతున్నారన్నారు. అనివార్య పరిస్ధితుల కారణంగా సమ్మె చేయాల్సి వస్తుందని తెలిపారు.
వల్లభిలో తలసీమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ

ముదిగొండ, జూలై 29: తలసీమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వల్లభి యువకులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు, సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సంకల్ప సభ్యురాలు అనిత మాట్లాడుతూ జిల్లాలో తలసీమియా వ్యాధితో అనేక మంది పిల్లలు బాదపడుతున్నారని, వారికి రక్తహీనత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ వ్యాధిపై అవగాహన లేక పలువురు దీనిని అశ్రద్ధ చేస్తున్నారని, దీంతో పిల్లలు తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారన్నారు. చిన్న పిల్లల్లో రక్తహీనత ఏర్పడితే వెంటనే పరీక్షలు చేయించాలని, వైద్యులను సంప్రదించాలని సూచించారు. తలసీమియా వ్యాధిగ్రస్థ పిల్లలకు ప్రతి 20 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. ప్రధానంగా మేనరిక వివాహాల వల్ల వచ్చే ఈ వ్యాధిని నివారించాలంటే ప్రజల్లో అవగాహన తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈ నెల 31వ తేదీన వల్లభి యువకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేందుకు గ్రామంలోని యువకులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిచ్చాల భిక్షం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, గ్రామస్థులు బి అనే్వష్, పరికపల్లి(పులుసు) ఉపేందర్, సంకల్ప సభ్యులు రవిచందర్, మరికంటి నాగేశ్వరరావు, ఎం నరేష్, హన్మంతరావు, బాను పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం
సత్తుపల్లి, జూలై 29: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్-2 లీకేజి వ్యవహారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి రామిశెట్టి మనోహర్‌నాయుడు అన్నారు. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఎంసెట్ లీకేజి వ్యవహారంలో పట్టుబడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, ఖమ్మం పట్టణంలోని మరికొన్ని కళాశాలలతో వీరికి సంబంధాలున్నాయని అట్టి కోణంలో కూడా సిబిఐతో విచారణ జరిపించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి, ఆరోగ్యశాఖామంత్రి ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరలా పరీక్షలు నిర్వహించడం అంటే విద్యార్థులు మానసికంగా వత్తిడికి గురై వారు కుంగిపోతారని, పరీక్షలు నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సత్తుపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బి.శివ కుమార్ నాయక్ మాట్లాడుతూ కెజి నుండి పిజి వరకు ఉచితంగా విద్యనందిస్తానని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల పట్ల, విద్యావ్యవస్థ పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ కనీసం పరీక్షలు సరిగా నిర్వహించలేని అసమర్థ స్థితిలో ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్.నాగేశ్వరరావు. బి. సునీత, సిహెచ్. గోపాలరావు, మాళోతు హుస్సేన్ నాయక్, బి. కార్తీక్, జి. నరేష్, రాకేష్, సానిక శివ,సాయిలోహిత్, దార్ల నాగరాజు పాల్గొన్నారు.