S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంత్య పుష్కరం..పరమ పావనం!

భద్రాచలం, జూలై 30: ఏ నదికీ లేని వైభవం ఒక్క గోదావరి మాతకు మాత్రమే ఉంది. గోదావరి నదికి ఆది పుష్కరాలతో పాటుగా అంత్య పుష్కరాలు కూడా ఉన్నాయి. నేటి నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. 12 రాశుల్లో సింహరాశి ఐదవది. గురువు సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు వచ్చే నదుల్లో ఐదోది గోదావరి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యవంశానికి చెందిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఈ స్వామి కొలువు తీరిన భద్రాచల క్షేత్రంలో గోదావరి పుష్కర స్నానం చేస్తే పంచమహాపాతకాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. గత ఏడాది జూలై 14 నుంచి జరిగిన ఆది పుష్కరాల్లో గోదావరి స్నానం ఆచరించని భక్తులు అంత్యపుష్కరాల్లో గోదావరి నదిలో స్నానం చేస్తే అంతే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. అందుకే వచ్చే భక్తుల కోసం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం సకల ఏర్పాట్లను చేస్తోంది. అంత్య పుష్కరాలకు నేడు దేవస్థానం అర్చకులు అంకురార్పణ చేయనున్నారు. ద్వాదశి ఆర్ధ్ర నక్షత్రం ఆదివారం ఉదయం 5.30 గంటలకు రామాలయం నుంచి శ్రీస్వామి వారి ప్రచారమూర్తులు, చక్ర పెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీ భగవద్రామానుజాచార్య స్వామి వారలతో ఊరేగింపుగా గోదావరి నదికి వెళ్తారు. ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు సంకల్పం, నదీపూజ, చక్ర పెరుమాళ్లకు, శ్రీపాదుకలకు, శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో భాగంగా మాస నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరామానుజాచార్య వారికి అభిషేకం చేసి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పునర్వసు మండపంలో పుష్కరజలాలతో స్వామి వారికి స్నపన తిరుమంజనం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి 6.15 గంటల వరకు గోదావరి నదికి 12 రోజులపాటు హారతులు నిర్వహిస్తారు. దేవాలయంలో 12 రోజులు కూడా ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు సహస్రనామార్చన, 9.30 గంటల నుంచి 10 గంటల వరకు క్షేత్ర మహత్యం ప్రవచనం, 10 గంటల నుంచి 11.30 గంటల వరకు నిత్యకల్యాణోత్సవం, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రభుత్వ సేవ నిర్వహించనున్నారు.

అధికారుల తీరుపై ఐటిడిఎ పిఓ అసంతృప్తి

మరి కొద్ది గంటల్లో అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. స్నానఘట్టాలపై పేరుకుపోయిన ఒండ్రు మట్టి బురద, చెత్తా చెదారం అలాగే ఉన్నాయి. వాటిని శుభ్రం చేయించాల్సిన బాధ్యత భద్రాచలం మేజర్ పంచాయతీదే. కానీ శనివారం సాయంత్రం ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు స్నానఘట్టాలను తనిఖీ చేసే సమయానికి అక్కడి దుస్థితిని మేటలు వేసిన బురదను చూసి ఆయనే నిర్ఘాంతపోయారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అయినటికీ అంగుళం పనికూడా ముందుకు కదల్లేదు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా కొందరు న్యాయమూర్తురులు కూడా అంత్యపుష్కరాల ప్రారంభోత్సవానికి ఆదివారం ఉదయం భద్రాచలం వస్తున్నారు. డిఎల్‌పిఓ, గ్రామపంయతీ ఈఓలు ఎక్కడ అంటూ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆరా తీయగా పంచాయితీలో సర్పంచి, ఈఓల మధ్య బిల్లుల పంచాయితీ తీర్చుకునేందుకు ఖమ్మం వెళ్లారని తెలుసుకుని ఆయన ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. అంత్యపుష్కరాల ఏర్పాట్లు మరిచి బిల్లుల పంచాయితీకి వెళ్లడం ఏంటీ? అంటూ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరో వైపు దేవస్థానం పునర్వసు మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దుతోంది. లాంచీని అలంకరిస్తున్నారు. ఇటువంటి సమయంలో స్నానఘట్టాల్లో మేటలు వేసిన ఒండ్రును చూసి పీఓ ఆగ్రహించారు. వెంటనే జేసీబిని తెప్పించి ఒండ్రును తవ్వించారు. పంచాయితీ సిబ్బందితో ట్రాక్టర్ల ద్వారా తరలించారు. తహశీల్దారు రామకృష్ణ, దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, నీటిపారుదల శాఖ ఈఈ ప్రసాద్‌ల, ఆలయ ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులతో కలిసి ఆదివారం అనుసరించాల్సిన విధానం, వైదిక పద్ధతిపై ఆయన చర్చించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండగా చూడాలని ఆయన వారిని ఆదేశించారు.
పాలేరు నియోజకవర్గ
అభివృద్ధే ద్యేయం

* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 30: పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ అధ్యక్షతన పాలేరు నియోజకవర్గ కూసుమంచి మండల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. ప్రతి గ్రామానికి, తండాకు సిసి రోడ్లు, ఇంటింటికీ మంచినీరు, రహదారుల సౌకర్యం, సాగునీటిని అందించడమే ప్రధాన లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. కరువు నియోజకవర్గంగా ఉన్న పాలేరులోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పరంగా అందరూ సమష్టిగా కృషిచేసి అభివృద్ధిలో మండలాన్ని ముందుంచాలన్నారు. ప్రజాప్రతినిధులంతా 15 రోజులకు ఒకసారి సమావేశమై మండలంలోని సమస్యలపై చర్చించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మండలంలోని అర్హులందరికీ అందేలా స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జడ్పిటిసీ వాదిత్య రామచందర్, ఎంపిపి రామసహాంయ వెంకటరెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

దూకుడు పెంచిన మావోయిస్టులు
భద్రాచలం, జూలై 30: పోలీస్ ఇన్‌ఫార్మర్లంతా ప్రజా ద్రోహులేనని మావోయిస్టులు విరుచుకుపడుతున్నారు. ఈ కోణంలో మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో దూకుడు మరింత పెంచారు. ప్రజలు పీడించుకు తింటూ అక్రమాలకు పాల్పడుతూ ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారంటూ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ శనివారం ఓ లేఖను విడుదల చేసింది. భద్రాచలం సరిహద్దున ఉన్న పోలవరం ముంపు మండలం చింతూరులోని లచ్చగూడెం పాస్టర్ మారయ్యను ఇన్‌ఫార్మర్ పేరుతో హత్య చేసిన మావోయిస్టులు అక్కడ ఇన్‌ఫార్మర్లను హెచ్చరిస్తూ లేఖ వదిలి వెళ్లారు. మారయ్య సోదరుడు ఉయికా కన్నయ్య కూడా పాస్టర్‌గా నెల్లిపాక మండలం లక్ష్మీపురంలో ఉంటూ మత ప్రచారం చేస్తున్నారు. కన్నయ్య అమాయక ప్రజలను మతం మత్తులో ముంచి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నాడని పేర్కొన్నారు. వాహనాలు, బ్యాంకు బ్యాలెన్స్, బంగారు ఆభరణాలు కూడ బెట్టుకుంటున్నాడని ధ్వజమెత్తారు. గత ఏడాది లక్ష్మీపురంలోని కన్నయ్య ఇంటిపై దాడి చేసి అతని కుమారుడు ఇస్సాక్‌ను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. కన్నయ్య వస్తే ఇస్సాక్‌ను వదిలేస్తామని షరతు పెట్టారు. కానీ మతపెద్దలు వెళ్లి చర్చలు జరపడంతో కన్నయ్య కుమారుడు ఇస్సాక్‌ను వారం తర్వాత వదిలి పెట్టారు. తాజాగా కన్నయ్య సోదరుడు మారయ్యను హతమార్చారు. చింతూరు మండలం పేగా గ్రామం కేంద్రంగా పోలీస్ ఇన్‌ఫార్మర్లు ప్రజలను హింసిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన పలువురు పేర్లను ఆ లేఖలో ప్రస్తావించారు. ఖమ్మం జిల్లా మావోయిస్టు కమిటీ పేరుతో లేఖ విడుదల కావడంతో భద్రాచలం మన్యంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా మావోయిస్టుల దృష్టిలో ఉన్న కొందరు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. ఇన్‌ఫార్మర్ల కోసం మావోయిస్టు దళాలు గ్రామాల్లో గాలిస్తుండడంతో అలజడి మొదలైంది. మరో వైపు సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గచ్చనాపల్లి అటవీప్రాంతంలో 208 కోబ్రా బలగాలకు, మావోయిస్టుల మధ్య భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు గచ్చనాపల్లి ప్రాంతంలో ఉండగా 208 కోబ్రా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దీంతో మావోయిస్టులు కాల్పులకు తెగపడ్డారు. కాల్పుల్లో జవాను మృతి చెందగా, మరో జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి.
రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం
* ఆర్టీసీ డాక్టర్ గిరిసింహారావు
ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 30: రక్తాన్ని ఏ ప్రయోగశాలలోనూ కృత్రిమంగా తయారు చేయలేమని, ప్రమాదంలో ఉన్న మనిషికి సాటి మనిషి మాత్రమే రక్తాన్ని ఇచ్చి కాపాడగలడని ఆర్టీసీ సీనియర్ వైద్యాధికారి గిరిసింహారావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం ఆర్టీసి బస్టాండ్‌లోని ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు, తలసీమియా లాంటి జన్యుపరమైన వ్యాధులు, రక్తహీనత, శస్తచ్రికిత్సలలో రక్తం అత్యవసరం అన్నారు. రక్తదాన శిబిరాల్లో యువకులు, సేవాపరులు తమ రక్తాన్ని దానం చేసి అపదలో ఉన్నవారికి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసి ఆసుపత్రిలో ప్రతి నెల రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాతలు ముందుకు వచ్చి ఈ శిబిరంలో రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్‌ఎం జానిరెడ్డి, డెప్యూటీ సిటిఎం రామ్మూర్తి, డిపో మేనేజర్ జె సుగుణాకర్, యూనియన్ నాయకులు వీరభద్రం, శంకర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ శిబిరంలో 40 మంది దాతలు తమ రక్తాన్ని దానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్‌బ్యాంక్ సిబ్బంది ఈ రక్తాన్ని సేకరించారు.

దళితవాడలకు శ్మశానవాటికలు నిర్మించాలి
గార్ల, జూలై 30: దళితవాడలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షను వీడి దళితవాడలకు శ్మశానవాటికలు నిర్మించాలని కులవివక్షత పోరాట సమితి డివిజన్ కార్యదర్శి మనె్నం మోహన్‌రావు డిమాండ్ చేశారు. కులవివక్ష పోరాట సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం గార్ల మండల పరిధిలోని దళితవాడల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని దళితులనుద్దేశించి ప్రసంగిస్తూ స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా దళితులు, దళితవాడలు అభివృద్ధి చెందకపోవడానికి పాలక విధానాలే కారణమన్నారు. దళితవాడల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని, వీధిలైట్లు, తాగునీటి సదుపాయం, స్మశాన వాటికలు తదితర వసతులు లేక దళితులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వాలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దళితవాడల ఆభివృద్ధికి నిధుల కేటాయింపు చేస్తున్నామన్న పాలకుల మాటలు కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రతి దళితవాడకు విధిగా స్మశాన వాటిక నిర్మించాలని లేనిపక్షంలో కులవివక్షత పోరాట సమితి ఆధ్యర్యంలో ఆందోళన నిర్వహిస్తామని మోహన్‌రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమితి మండల కన్వీనర్ చింత ఎల్లయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వెంకన్న, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

దేహదారుఢ్య పరీక్షలకు రెండురోజులు విరామం

ఖమ్మం(జమ్మిబండ), జూలై 30: తెలంగాణ రాష్టస్థ్రాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్ళ శరీర దేహదారుఢ్య పరీక్షల ఎంపికలకు ఈ నెల 31, ఆగస్టు 1 రెండురోజులు విరామం ఉంటుందని ఎస్పీ షానవాజ్‌ఖాసీం తెలిపారు. ఆగస్టు 2వ తేదీ యధావిధిగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్లు కొనసాగుతాయని వివరించారు. గతంలో పోలీస్ కానిస్టేబుళ్ళ శరీర దారుఢ్య పరీక్షకు హాజరై ఎత్తు, చాతీ కొలతల్లో అనర్హులై తిరిగి ఫీజుకట్టి అపీల్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7న పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఎస్పీ షానవాజ్ పర్యవేక్షణలో జరుగుతున్న పోలీసుల రిక్రూట్‌మెంట్ పరీక్షలకు 15వ రోజు శనివారం 1200 మంది అభ్యర్థులకు 950మంది హాజరయ్యారు. పురుష అభ్యర్థులకు మొదట 800మీటర్ల పరుగు నిర్వహించి ఉత్తీర్ణులైన వారి సర్ట్ఫికెట్లు, చాతి, ఎత్తు కొలతలను పరిశీలించారు. వీరికి ఆగస్టు 2న ఈవెంట్లను నిర్వహించనున్నారు. మహిళా అభ్యర్థులకు బయోమెట్రిక్, అభ్యర్థుల ఆధార్‌కార్డు సర్ట్ఫికెట్లను వెరిఫికేషన్ అనంతరం ఎత్తులో అర్హత సాధించిన వారికి వందమీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ నిర్వహించారు. ప్రతి ఈవెంట్ వద్ద డిఎస్పీలు అభ్యర్థుల రికార్డును నమోదు చేశారు. ఈవెంట్లలో అవకతవకలు జరగకుండా అదనపు ఎస్పీ సాయికృష్ణ ఆధ్వర్యంలో ఐటికోర్ సిబ్బంది అప్రమత్తంగా నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ అశోక్‌కుమార్, డిఎస్పీలు రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, ఏఆర్‌డిఎస్పీలు సంజీవ్, మాణిఖ్యరాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పిఇటిలు, వైద్యులు పాల్గొన్నారు.

నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి

* ఎంపిపి పద్మావతి
కారేపల్లి, జూలై 30: నాటిన ప్రతి మొక్కనూ బతికించే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి ఎంపిపి బాణోత్ పద్మావతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో హరితహారం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను బతికించాల్సిన బాధ్యత ఆయా గ్రామ సర్పంచులపై ఉందన్నారు. తహశీల్దార్ మంగీలాల్ మాట్లాడుతూ హరితహారం కాలక్షేపానికి కాదని, నాటిన ప్రతి మొక్కకు లెక్క ఉందన్నారు. గ్రామ పంచాయతీలో నాటిన మొక్క చనిపోయిన చోట మరొక మొక్క నాటాలని సూచించారు. గ్రామాలలో సర్పంచ్‌లు మొక్కలను రక్షించేందుకు వనసేవకుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. నాటిన మొక్కలకు సంబంధించిన రిజిష్టరు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. కలెక్టర్, అదనపుజిల్లా కలెక్టర్ అకస్మిక తనిఖీలు చేయనున్నారని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఎన్ శాంతాదేవి, ఎవో భట్టు అశోక్‌కుమార్, ఏపిఎం హరినారాయణ, ఏపివో రంగనాయకమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఇ నరేందర్, ఏఇ టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎంసెట్-2 లీకేజిపై సిబిఐ విచారణ జరిపించాలి

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 30: ఎంసెట్-2 లీకేజిపై సిఐడితోపాటు సిబిఐ విచారణ కూడా చేయించి, అక్రమార్కుల పని పట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం లేకుండా రాష్ట్రంలో ఏ పని జరగదన్నారు. ఎంసెట్-2 లీకేజితో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతోందన్నారు. విద్య, వైద్య శాఖల మంత్రులతో పాటు విద్యామండలి చైర్మన్‌లు తక్షణమే పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. లీకేజితో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు సంబంధాలు ఉన్నట్లు అనుమామానాలు వ్యక్తమవుతున్నాయని, వెంటనే నిజానిజాల నిగ్గుతెల్చాలని డిమాండ్ చేశారు. అనుభవరాహిత్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో పార్టీ ప్రచార కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గొల్లపుడి హరికృష్ణ, రాయపుడి జయకర్, ప్రేమ్‌కుమార్, తాళ్ళూరి జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అంత్య పుష్కరాలకు పర్ణశాల సిద్ధం

దుమ్ముగూడెం, జూలై 30: గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా పర్ణశాల పుణ్యక్షేత్రంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం నుంచి 11వ తేదీ వరకు 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు జరగనున్న సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవోఆర్డీ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఇంఛార్జ్ నిరంజన్ విలేఖర్లకు తెలిపారు. పర్ణశాలలో గోదావరి వద్ద పుష్కరఘాట్లను శుభ్రం చేశారు. ఘాట్ల వద్ద విద్యుత్‌దీపాలు, దేవాలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు, తాగునీరు ఏర్పాటు చేసినట్లు సర్పంచి వాగె లక్ష్మీదేవి తెలిపారు. 31వ తేదీన ఉదయం 6 గంటల నుంచి శ్రీచక్రకాళ్వార్, శ్రీవారి పాదుకలకు గోదావరికి ఊరేగింపుగా వెళ్లి గోదావరి నదీ పూజ, సంకల్పం, పుష్కరపూజ, చక్రస్నానం, పాదుకాభిషేకాలు నిర్వహించి స్వామి ఉత్సవ మూర్తులను గోదావరి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పుష్కరాల 12 రోజులు సాయంత్రం 6 గంటల నుంచి 6.15 వరకు గోదావరి నదీ హారతి నిర్వహిస్తామన్నారు. దేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించి స్వామిదర్శనం భక్తులకు కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఇంఛార్జ్ తెలిపారు. పర్ణశాలకు వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేసినట్లు పంచాయతీ సర్పంచి తెలిపారు.