S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్షేమ పథకాలతో బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి

పర్చూరు, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకుని బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలని ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చెంగవల్లి వెంకట్ అన్నారు. మండల కేంద్రమైన పర్చూరులోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. బ్రాహ్మణ సమాజంలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, ఆర్థిక పరిపుష్టి ఉన్నవారు పేద బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మనకు ఏ పార్టీ లేదని, బ్రాహ్మణ పార్టీయేనన్నారు. 2005లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కోరిక మేరకు రాష్ట్రంలో 108 ఆంబులెన్సు రూపకల్పన చేశానని వెంకట్ చెప్పారు. తన స్వగ్రామం కారంచేడు మండలం ఆదిపూడి అని, 54 సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని, బంధువులను, బ్రాహ్మణులను, మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ బ్రాహ్మణులకు కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. భారతీ విద్యా పథకం ద్వారా అల్పాదాయ బ్రాహ్మణ పిల్లలకు 1వ తరగతి నుంచి పిజి వరకు చదువుకునేందుకు ఆర్థిక సహాయం కార్పొరేషన్ ద్వారా ఇస్తామన్నారు. అలాగే వశిష్ట పోటీ పరీక్షల శిక్షణా పథకం ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులకు మంచి విద్యాసంస్థల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. అలాగే చరక ఆరోగ్య బీమా పథకం కింద 50 సంవత్సరాలు పైబడిన బ్రాహ్మణులకు బీమా సౌకర్యం కార్పొరేషన్ ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. గరుడ అంత్యక్రియల సహాయ పథకంలో చనిపోయిన బ్రాహ్మణుల వారికి అంత్యక్రియల కోసం తక్షణం రూ. 10వేలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. గాయత్రి విద్యా ప్రశస్థు పధకం ద్వారా విద్యా సంస్థల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్‌గా నిలిచే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ద్రోణాచార్య నైపుణ్య అభివృద్ధి పధకం ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులకు వృత్తి నైపుణ్యం సాధించడానికి గుర్తింపు పొందిన సంస్థల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్పొరేషన్ కల్పించే అన్ని రకాల పధకాలు అర్హులైన బ్రాహ్మణులకు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో కె కుసుమకుమారి, ఎస్ శ్రీ వెంకటరమణ, అనంతశేషాచారి, సిహెచ్ సుబ్బారావు, లక్ష్మీనరసింహశాస్ర్తీ, రెండు నియోజకవర్గాల్లోని బ్రాహ్మణులు, మహిళలు పాల్గొన్నారు.

ప్రత్యేకహోదా కోసం
2న వైకాపా జిల్లా బంద్
ఆందోళనబాట పట్టనున్న
కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,జూలై 30:రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 2న రాష్టవ్య్రాప్త బంద్‌కు వైకాపా రాష్ట్రఅధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలో కూడా బంద్ జరగనుంది. ఆ మేరకు రాష్టప్రార్టీ నుండి జిల్లాకు సమాచారం అందటంతో పార్టీశ్రేణులు బంద్‌ను విజయవంతం చేసేందుకు సమాయత్తవౌతున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలోనే వెనుకబడి జిల్లా అయిన ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందనుందని వైకాపా నేతలు పేర్కొంటున్నారు. వచ్చేనెల 2న జరిగే జిల్లాబంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా వచ్చేవరకు తమపోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రత్యేకహోదా కల్పించాలని కాంగ్రెస్‌పార్టీ నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాకోసం ఆందోళన బాటపట్టనున్నామని కాంగ్రెస్‌నాయకులు శ్రీపతి ప్రకాశంతో పాటు మరికొంతమంది నాయకులు పేర్కొన్నారు. సిపిఎం,సిపిఐ నాయకులు సైతం పోరుబాట పట్టేందుకు సిద్దవౌతున్నారు. మొత్తంమీద ప్రత్యేక హోదాపై వచ్చేనెల రెండవతేదీన వైకాపా ఆధ్వర్యంలో జిల్లాబంద్ జరగనుంది.

ప్రజాసమస్యల పరిష్కారంలో
రాజకీయాలు మానండి
* అధికారులకు ఎంపి వైవి సుబ్బారెడ్డి సూచన
పిసిపల్లి, జూలై 30: ప్రజాసమస్యల పరిష్కారంలో రాజకీయాలకు తావు వుండకూడదని ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంసద్ ఆదర్శ యోజన పథకం కింద తాను మూడు పంచాయతీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో పిసిపల్లిని తాను దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తొలుత పిసిపల్లిలోని 11 గ్రామాలను తాను సందర్శించానని, గ్రామాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సిసి రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కొన్నిచోట్ల విద్యుత్ సమస్య కూడా అధికంగా ఉందన్నారు. పిసిపల్లిలో చెరువును కొందరు ఆక్రమించుకున్నారని ఎంపి దృష్టికి తీసుకురాగా, అక్కడే ఉన్న ఆర్డీఓ జి మల్లికార్జునకు సమస్య పరిష్కరించాలని కోరగా తహశీల్దార్‌ను సమస్య పరిష్కరించాలని ఆర్డీవో ఆదేశించారు. అనంతరం జూనియర్ కళాశాలకు విద్యుత్ సౌకర్యం లేదని తెలపడంతో వెంటనే ఏఇతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పశువైద్యశాలను పెదఇర్లపాడులో ఏర్పాటు చేయాలని కోరడంతో పశువైద్యశాల ఏడిని ఆయన దానిపై చర్యలు తీసుకోవాలన్నారు. కెజిబివికి ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నట్లు ఎంపి దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామాలభివృద్ధే తన లక్ష్యం అని ఆయన అన్నారు. పిసిపల్లి వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయని స్థానికులు తెలపడంతో ఆ సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి -2 ప్రకాష్‌కుమార్, పిడి పోలప్ప, ఆర్డీఓ జి మల్లికార్జున, జడ్‌పి సిఇఓ బాపిరెడ్డి, పిసిపల్లి సర్పంచ్ డి సుమ, ఎంపిడిఓ సురేష్, తహశీల్దార్ ఎస్‌కె వౌలాలాసాహెబ్, ఎంపిపి బి అంజయ్య, అన్ని శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కందుకూరులో విషాద ఛాయలు
* మిన్నంటిన మృతుల కుటుంబ సభ్యుల రోదనలు
* మృతుల కుటుంబాలను పరామర్శించిన నేతలు
కందుకూరు, జూలై 30: జిల్లాలోని మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుకూరు మండలం శామీర్‌పాలెంకు చెందిన టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పువ్వాడి యేహోన్‌బాబు, అదే గ్రామానికి చెందిన టిడిపి మండల కమిటీ సభ్యులు ఎస్‌కె షబ్బీర్, దూబగుంట గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకులు ముల్లూరి మురళి మృతిచెందగా, వెంకటరావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తమ బిడ్డలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయాన్ని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
కాగా, మృతుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఎఎంసి చైర్మన్ తల్లపనేని వెంకటేశ్వర్లు, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు బెజవాడ ప్రసాద్, నాయకులు చిలకపాటి మధు, ఎం మల్లికార్జున, జడ్‌పిటిసి కె శ్రీకాంత్ తదితరులు ఓదార్చారు. మృతుల కుటుంబాలను టిడిపి ఆదుకుంటుందని, తమ శక్తిమేరకు చేయూతనందిస్తామని శివరాం అన్నారు.
యేహోన్ మృతి పట్ల టిఎన్‌ఎస్‌ఎఫ్ దిగ్భ్రాంతి
టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పువ్వాడి యేహోన్‌బాబు రోడ్డు ప్రమాదంలో మరణించడం టిఎన్‌ఎస్‌ఎఫ్‌కు తీరని లోటు అని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్యచౌదరి, నాయకులు భానుచందర్, శ్యాంసన్ తదితరులు పేర్కొన్నారు. యేహోన్ టిఎన్‌ఎస్‌ఎఫ్‌కు చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి
చీరాల, జూలై 30: ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కడవకుదురు - చింతకుంపల రోడ్డుపై శనివారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు చినగంజాం మండలం చింతకుంపల గ్రామానికి చెందిన బెజ్జం రాంబాబు (47) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను శనివారం కడవకుదురు వెళ్లి సొంతూరు చింతకుంపలకు బైకుపై వెళ్తున్నాడు. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టరు అతని బైకును వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ సెల్‌ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంతో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆరోపించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చినగంజాం ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.