S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నామమాత్రంగా ఐటిడిఏ పాలకవర్గ సమావేశం

ఉట్నూరు, జూలై 31: ఐటిడిఏ పాలకవర్గ సమావేశం ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు దిశా దశ చూపిస్తారని అనుకున్న అడవిబిడ్డలకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రజా ప్రతినిధులు నిరాశ మిగిల్చారు. ఆదివారం ఐటిడిఏ చైర్మెన్ హోదాలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన ఐటిడిఏ 69వ పాలకవర్గ సమావేశం నిర్వహించగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ నాయక్, అటవీ శాఖ మంత్రి జోగురామన్న, ఆదిలాబాద్ ఎంపి గెడం నగేష్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ లక్ష్మణ్, ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్‌తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, సింగిల్‌విండో చైర్మెన్ దామోదర్ రావు, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఎంపి ఎమ్మెల్యేలు, హాజరైన సభ్యులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా ప్రశ్నించే వారే కరువయ్యారు. అన్ని శాఖల వారీగా లోతుగా చర్చించాల్సిన సమయంలో కేవలం విద్య, వైద్య, గ్రామీణ నీటి పారుదల శాఖలపై చర్చించి మమ అనిపించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఏజెన్సీలో విషజ్వరాలు, వ్యాధులు, డయేరియా, మలేరియా విజృంభిస్తున్నప్పటికీ సంబంధిత వైద్యశాఖాధికారులు నివారణ చర్యలు చేపట్టడం లేదని, ఎమెల్యేల నుండి ఎంపిపిల వరకు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల నార్నూర్ మండలం మేడిగూడలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారని, కావున గాధిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని, జైనూర్ పిహెచ్‌సిలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో తాను పర్యటించానని, అక్కడ బెడ్‌షిట్లు లేవని, అధికారులు ఏమి చేస్తున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నిధులు మంజూరి చేసినప్పటికీ బెడ్‌షిట్‌లు, బెడ్‌లు ఎందుకు కొనుగోలు చేయలేదని జిల్లా వైద్యాధికారి జలపతి నాయక్‌పై మండిపడ్డారు. జైనూర్, నార్నూర్, సిర్పూర్ మండలాల్లో వైద్యులు స్థానికంగా ఉండకపోవడంతో గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ జగన్మోహన్ స్పందిస్తూ వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాకాలంలో ఆసుపత్రులన్నీ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చందులాల్ నాయక్ సూచించారు. ప్రభుత్వం ఎన్నో కోట్ల నిధులు కేటాయిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టకుండా గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అటవీ శాఖ మంత్రి జోగురామన్న సైతం మండిపడ్డారు. ఆసిఫాబాద్ పిహెచ్‌సిలో ఐదుగురు వైద్యులకు గాను ఒక్కరు బెల్లంపెల్లికి డిప్యూటేషన్‌పై వెళ్లిపోగా, మరొక్కరు కాగజ్‌నగర్‌లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారని ఆసిఫాబాద్ జడ్పీటీసీ ఏమాజీ నిలదీస్తుండగా మంత్రి జోగురామన్న కల్గజేసుకొని కలెక్టర్ అనుమతితో మాట్లాడాలని సూచించడంతో వారిద్దరి మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఏజెన్సీలోని సిర్పూర్‌యు, లింగాపూర్, గాధిగూడ తదితర పిహెచ్‌సిలను 24 గంటల పిహెచ్‌సిలుగా మార్చాలని ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ మంత్రుల దృష్టికి తీసుకవెళ్లారు. ఖరీఫ్ సీజన్‌లో గిరిజనులు చేనుల్లోకి పనులకు వెళ్తున్నారని, ఆనారోగ్యం భారిన పడి ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే వైద్యులు 10 గంటల తర్వాత వస్తున్నారని, ఈ రెండు నెలలు వైద్యులు 8 గంటలకు వచ్చేలా చూడాలని ఉట్నూరు జడ్పీటీసీ జగజీవన్ పేర్కొన్నారు. దీంతో పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ మాట్లాడుతూ ఏజెన్సీలోని వైద్యులు రెండు గంటల ముందు విధులకు వచ్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సిర్పూర్‌టి నియోజకవర్గంలో పర్యటించలేదని, కనీసం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించలేదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడ్డారు. సిర్పూర్‌టి పిహెచ్‌సి వైద్యుడిని వికారబాద్‌కు డిప్యూటేషన్‌పై పంపించి రెండేళ్లు అవుతున్నా ఆయన స్థానంలో మరో వైద్యున్ని నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెజ్జూర్‌లో విధులు నిర్వర్తించే వైద్యున్ని నెల్లెల మండలానికి ఎలా డిప్యూటేషన్‌పై పంపారని ప్రశ్నించారు. పలుమార్లు ఈ విషయమై జిల్లా వైద్యాధికారి చెప్పినా స్పందించడం లేదని, నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ మండిపడ్డారు. నార్నూర్ మండలంలో ప్రజలు నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్లకు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ బిల్లులు మంజూరు చేయలేదని అక్కడి జడ్పీటీసీ ప్రశ్నించగా జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆగస్టు నెలఖారులోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని మంత్రి జోగు రామన్న ఆదేశించారు. కొమరంభీం సురక్షిత నీటి పథకం ద్వారా 229 గిరిజన గ్రామాలకు ఎల్‌ఆండ్‌టి సంస్థవారు తాగునీరు అందించాల్సి ఉండగా గడవు ముగిసినా ఇప్పటి వరకు నీరందించలేదని కెరమెరి ఎంపిపి అబ్దుల్ కలాం నిలదీయగా ఎల్‌ఆండ్‌టి కంపెనీ వారు అధికారుల మాటలు వినడం లేదని, వారితో పనిచేయించడం తనవల్ల కాదంటూ ఎస్‌ఈ సమాధానం ఇవ్వడంతో చేతకాని వారు సెలవు పెట్టి వెళ్ళిపోవాలని మంత్రులు మండిపడ్డారు. గత పాలకవర్గ సమావేశంలో ఏప్రిల్ నెలాఖరు వరకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అందించలేదంటూ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ ఎల్ ఆండ్‌టి అధికారులపై మండిపడ్డారు. దీంతో ఆక్టోబర్ నెలాఖరులోగా నీరందిస్తామని అన్నారు. వాటర్‌గ్రిడ్ పనులు ఖానాపూర్ నియోజకవర్గంలో ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం నిలదీశారు. సిర్పూర్‌టి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సోలార్ పంప్‌సెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అధికారులు సబ్‌స్టేషన్ పక్కనే నిర్మించారని అధికారులపై ఎమ్మెల్యే కోనప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. నెనె్నల మండలం చిత్తపూర్ ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని, బాలిక ఆశ్రమ పాఠశాల కావడంతో మహిళ సిబ్బందిని నియమించాలని బెల్లంపెల్లి ఎమ్మెల్యే చిన్నయ్య వాపోయారు. మావ నాటే మావసాడ పాఠశాలల విద్యార్థులు, గిరిజన పాఠశాలల విద్యార్థులు ఒకటేనని, దీనిపై విచారణ నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఎంపి నగేష్ పివోను ఆదేశించారు. గిరిజన బి ఈడి కళాశాలలో బోదన సిబ్బందిని నియమించేలా చర్యలు చేపట్టాలని సభ్యులు కోరారు. అనంతరం ఎంపి గెడం నగేష్ 15 తీర్మానాలు ప్రవేశపెట్టి ఒకే తీర్మానం చదివి వినిపించారు. ఈ సమావేశంలో డిడి రాంమూర్తి, ఈఈ రమేష్‌బాబు, ఏపివో జనరల్ నాగోరావు, ఏవో పెందూర్‌భీం, ఏజెన్సీ వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.