S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చేజారుతున్న అవకాశం

ఏలూరు, జూలై 31: ఎటువంటి విలువైన పనిచేస్తున్నా బీమా ఉందా, లేదా అని ఆరా తీసుకోవటం, లేకుంటే వెంటనే ఆ పని చేయటం సర్వసాధారణం. ఇక ఎక్కువగా నష్టాల బారినపడుతున్న వ్యవసాయంలో బీమా అవకాశం చేతికందే దూరంలో ఉన్నా అవగాహన, తగిన ప్రచారం కరువవటంతో ఇలాంటి బంగారంలాంటి అవకాశం కూడా మరో 48గంటల్లో రైతాంగం చేజారే పరిస్దితి కన్పిస్తోంది. వ్యవసాయ ప్రధానమైన పశ్చిమగోదావరి వంటి జిల్లాలో 90శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడే కొనసాగుతున్నారు. వీరిలో సింహాభాగం కౌలురైతులే అనటంలో సందేహం లేదు. ఇలాంటి జిల్లాలో కనీసం సగం మంది రైతులు కూడా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తున్న పరిస్దితి కన్పించటం లేదు. కేంద్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి, చెరకు, ఇతర పంటల బీమాకు ఎంతో అరుదైన అవకాశం లభించింది. అయితే ఈ బీమాలో నమోదు చేయించుకునే గడువు ఆదివారంతో ముగుస్తున్నా చివరిరోజు శెలవురోజు కావటంతో ఈ గడువును మరో రెండురోజులు అంటే మంగళవారం వరకు పొడిగించారు. అవకాశం ఉన్న రైతులు ఈలోగా బీమా చేయించుకునే సౌకర్యాన్ని కల్పించారు. అయితే జిల్లాలో ఈ యోజన అమలవుతున్న తీరును చూస్తే మాత్రం నిస్పృహ కలగకమానదు. ఉన్న రైతాంగానికి, బీమా పరిధిలోకి వచ్చిన రైతాంగం గణాంకాలను పరిశీలిస్తే హస్తి మశకాంతరం తేడా ఉన్నట్లే కన్పిస్తుంది. లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి ముందుకెళుతుంటే ఈ బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య చూస్తే వేల సంఖ్య మించటం లేదు. అంతకుమించి జిల్లాలో సొంతదారులు చేస్తున్న వ్యవసాయం కన్నా అధికభాగం కౌలురైతుల ఆధ్వర్యంలోనే వ్యవసాయం ముందుకు సాగటం బహిరంగరహస్యమే. ఒక అంచనా ప్రకారం జిల్లాలో కౌలురైతులు రెండులక్షలకు పైగా ఉంటారని తెలుస్తోంది. అలాంటిది ఈ రైతులకు ప్రయోజనకరంగా ఉండే ఎల్‌ఇసి కార్డులు పొందినవారి సంఖ్య తక్కువగా ఉండగా దానిలో బీమా పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య మరింత తక్కువగా కన్పిస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన ప్రొఫెసర్ రామకృష్ణ కమిటీ ముందు ఇదే అంశం చర్చకు రావటం గమనార్హం. జిల్లాలో ఉన్న కౌలురైతుల సంఖ్యతో పోలిస్తే ఈ ఎల్‌ఇసి కార్డులు పొందినవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఈవిషయంలో క్షేత్రస్ధాయిలో అయా ప్రాంతాల్లో ఉన్న అధికారయంత్రాంగం చురుగ్గా వ్యవహరించకపోవటమే కారణమన్న అంశం కూడా చర్చకు వచ్చింది. అ అంశాన్ని అలాఉంచితే ఈవిధంగా కార్డులు పొందినవారిలో బీమా పొందిన వారి సంఖ్య మరింత తక్కువగా కన్పిస్తోంది. వాస్తవానికి ఎల్‌ఇసి కార్డులు పొందిన కౌలురైతులకు అధికశాతం ప్రాంతాల్లో పంటరుణాలు ఇవ్వలేదన్న వాస్తవం కూడా ఈ సందర్భంగానే వెలుగుచూసింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ఎల్‌ఇసి కార్డుదారులు సహజంగానే రుణనిబంధనల్లో భాగంగా బీమా పరిధిలోకి చేరుకుంటారు. అరకంగా చూస్తే ఈ కార్డులు ఉన్నవారిలో రుణాలు అందుకోగలిగినవారి సంఖ్య అతితక్కువనే చెప్పుకోవాలి. మరోవైపు కేవలం రుణాలు పొందినవారే కాకుండా రుణాలు పొందని రైతులు కూడా ఈ బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి పూర్తిస్దాయి ప్రచారం లేకపోవటంతో అవిధంగా బీమా పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య మరింత తక్కువగా కన్పిస్తోంది. వాస్తవానికి ఈపధకంలో రైతులకు సంబంధించి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వ రాయితీపై ఎటువంటి గరిష్టపరిమితి లేకపోవటంతోపాటు ప్రీమియం 90శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వమే అంతా భరించే నిబంధన అమలవుతుంది. ఇక ప్రకృతి వైపరీత్యాల వల్ల పొలంలో ఉన్న పంటలకు నష్టం జరిగితే సహజంగానే ఈపరిహారం అందుబాటులోకి వస్తుంది. అంతకుమించి పంట కోత తర్వాత ప్రకృతి వైపరీత్యాల్లో దిగుబడి దెబ్బతిన్నా ఆ నష్టాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది. నారుపైనా పెట్టుబడి పెట్టినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా విత్తు నాటడం, నాట్లు ముందుకు సాగకుండా పంట నష్టం జరిగినా బీమా మొత్తంలో 25శాతం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. అవిధంగా గతంతో పోలిస్తే బీమా పధకంలో ఎక్కువ ప్రయోజనాలు ప్రధానమంత్రి ఫసల్ యోజన ద్వారా రైతాంగానికి అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి పధకం పరిధిలోకి వెళ్లగలిగే అవకాశం మరో 48గంటలే మిగిలి ఉంది.