S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘పురం’ వైస్ చైర్మన్ మార్పునకు యత్నాలు!

హిందూపురం టౌన్, జూలై 31 : మున్సిపాలిటీలో రెండేళ్ల తర్వాత ఓ భారీ మార్పునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ జెపికె రాము స్థానంలో మరొకరిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మనం చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాతనే అప్పట్లో చైర్మన్ పేరు ముందుగానే ఖరారైనా వైస్ చైర్మన్ పేరును చివరి నిమిషం దాకా ఖరారు చేయలేదు. ఊహించని రీతిలో వైస్ చైర్మన్‌గా రాము పేరు ముందుకొచ్చింది. అధిష్ఠానం ఆదేశాలకు కౌన్సిలర్లు మిన్నకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది. వైస్ చైర్మన్ పదవి కోసం ఐదుగురు పోటీ పడినా అసంతృప్తిని తెలియజేయలేకపోయారు. దీనికితోడు రెండేళ్ల తర్వాత మిగిలిన వారికి అవకాశం కల్పిస్తామని బుజ్జగించడంతో అప్పట్లో అసంతృప్తి సద్దుమణిగింది. స్వయానా ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన రోషన్‌అలీ కౌన్సిల్‌లోనే కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పక్కనే ఉన్న బాలయ్య అలీని ఓదార్చారు. మరో సీనియర్ కౌన్సిలర్ వివిధ మార్గాల్లో ప్రయత్నించి మిన్నకుండిపోయారు. కౌన్సిల్ పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావడంతో మరోసారి ఆశావహులు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు పాలన ఏకపక్షంగా సాగుతోందని, తమకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పోయాయని కొంతమంది కౌన్సిలర్లు కొంత కొంతకాలంగా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వీరందరూ అసంతృప్తిని వెళ్లగక్కడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వైస్ చైర్మన్ మార్పు వారికి ఓ అవకాశంగా దొరుకుతోంది. ఇటీవలే కొందరు మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి తమ వర్గానికి ఏదైనా అవకాశం ఇవ్వాలంటూ కోరారు. దీనికి తోడు కొన్ని నెలల క్రితం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు మున్సిపల్ పాలకవర్గం మార్పుపై నాయకులతో చర్చించారు. ప్రస్తుతం ఆయన మిన్నకుండిపోయినా కౌన్సిలర్లు మాత్రం వైస్ చైర్మన్ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా చాలా ఏళ్లుగా మున్సిపాలిటీ పదవిపై ఆశలు పెట్టుకున్న రోషన్‌అలీ మైనార్టీ నాయకులతోపాటు వివిధ వర్గాల సహకారంతో వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నాయకులు నంజప్ప సైతం కాపు సంఘం నేతల ద్వారా అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే టిడిపిలో కాపులో కీలక స్థానాల్లో ఉండటం, జిల్లాలో కాపులకు పెద్దగా పదవులు లేకపోవడంతో నంజప్పకు అవకాశం కల్పించాలని జిల్లా, రాష్ట్ర కాపు సంఘం నేతలు అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోషన్‌అలీ, నంజప్ప వైస్ గిరి కోసం ప్రయత్నాలు సాగిస్తుండటం, అదే సమయంలో అసంతృప్తి కౌన్సిలర్లు తమకున్న అసంతృప్తిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఈ విషయంపై మరోసారి చర్చిద్దామని ఎమ్మెల్యే చెప్పడం ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం కౌన్సిల్‌లో టిడిపికే బలం ఉంది. ఎన్నికల్లో 19 స్థానాల్లో టిడిపి, 16 స్థానాల్లో వైకాపా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, ఓ సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఇద్దరు స్వతంత్రులతోపాటు ముగ్గురు వైకాపా కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కౌన్సిల్‌లో టిడిపికే స్పష్టమైన బలం ఉంది. అయితే టిడిపిలో అసంతృప్తివాదుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈనేపథ్యంలో ముఖ్య నేత ఒకరు అసంతృప్త కౌన్సిలర్లను పిలిపించుకుని వైస్ చైర్మన్ మార్పుపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఏదిఏమైనా వైస్ చైర్మన్ మార్చుతారా... లేక ప్రస్తుత వైస్ ఛైర్మన్ రామునే కొనసాగిస్తారా అనేది మరోసారి బాలకృష్ణ పర్యటనలో తేలిపోనుంది.