S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇసి చేతికే కత్తి

హైదరాబాద్, జులై 31: ఆయారాం గయారాంల సంస్కృతి నిరోధించాలంటే పార్టీ ఫిరాయింపుదారులపై చర్య తీసుకునే అధికారాన్ని సభాపతులకు కాకుండా ఎన్నికల సంఘానికే అప్పగించాలని న్యాయకోవిదులు, రాజకీయ సీనియర్లు అభిప్రాయపడ్డారు. ‘పార్టీల ఫిరాయింపులు- స్పీకర్ల పాత్ర’ అంశంపై జన చైతన్య వేదిక ఆదివారం నిర్వహించిన సదస్సుకు పలువురు మాజీ న్యాయమూర్తులు, రాజకీయ సీనియర్ నేతలు హాజరయ్యారు. సదస్సులో లా కమిషన్ మాజీ చైర్మన్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిపి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుదారులపై చర్య తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కే అప్పగించడం వల్ల వ్యత్యాసాలు ఉత్పన్నమయ్యాయన్నారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోవడంలో ఎనలేని జాప్యం జరుగుతోందని, కొన్ని సందర్భాల్లో సభ కాలపరిమితి ముగిసిపోతోందని అన్నారు. స్పీకర్ నిర్ణయాలపై కోర్టు జోక్యం చేసుకుంటోందన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, 1980 వరకూ స్పీకర్ ఆఫీసుకు గౌరవం ఉండేదని, తరువాతి పరిణామాలే దెబ్బతీశాయన్నారు. స్పీకర్ కూడా సభలోని సభ్యుడే కాబట్టి సభ్యులందరినీ పార్టీలకు అతీతంగా సమానంగా, సమగ్రతతో చూడాలని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపు సంస్కృతి 1957 నుంచీ ఆరంభమైందంటూ, ఎమ్మెల్యేల కొనుగోలు, ధనబలం రాజకీయాల్లో రావడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపుదారులపై చర్య తీసుకునే అధికారం రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ఉందని జస్టిస్ జీవన్ రెడ్డి తెలిపారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు భూతంలాంటివన్నారు. దేశంలో జరుగుతున్న ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్లు తీసుకునే తప్పుడు నిర్ణయాలపై రాజ్యాంగ పద్ధతుల్లోనే పరిష్కారం వెతకాలన్నారు. ఫిరాయింపుదారులపై దాఖలైన పిటీషన్లపై స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా కాలాయాపన చేస్తే, గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేందుకు కోర్టులకు అవకాశం లేకుండా పోయిందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరంగా సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపుదారులపై దాఖలైన పిటీషన్లపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న గడువు విధిస్తూ ప్రస్తుత చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సూచించారు. 1985లో రాజీవ్ గాంధీ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినపుడు ప్రతిపక్షంలో ఉన్న తాను అభినందిస్తూనే, చట్టంలో లోపాలను ప్రస్తావించానన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కే ఉండాలన్న జస్టిస్ జీవన్‌రెడ్డి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. 103(2) క్లాజ్ ప్రకారం సిఇసికి ఆ అధికారం ఉందని, ఫిరాయింపులు నిలిపేందుకు ప్రయత్నించాలన్నారు. లేనిపక్షంలో స్పీకర్లకు ఉండే మర్యాద పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడేవారు ఎవరైనా ముందు తమ పదవులకు రాజీనామా చేయాలని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. ఒకరు ఫిరాయిస్తే తప్పు, సామూహిక ఫిరాయింపులు ఒప్పని, అది విలీనమవుతుందని చెప్పడం భావ్యం కాదన్నారు. హర్యానాలో 1982లో భజన్‌లాల్ నేతృత్వంలో మొత్తం పార్టీ ఫిరాయించిన అంశాన్ని గుర్తు చేస్తూ, అధికార పార్టీలోకి ఫిరాయించిన వారెవ్వరిపైనా దేశ చరిత్రలో ఇప్పటి వరకు అనర్హత వేటు పడలేదని గుర్తు చేశారు. సిఎంను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానం మంచిదన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, జస్టిస్ బి శేషశయనా రెడ్డి, పత్రికా సంపాదకులు కె రామచంద్రమూర్తి మాట్లాడారు.

సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్ జీవన్‌రెడ్డి