S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అర్జీలు తీసుకునే నాథుడేడి?

మచిలీపట్నం, ఆగస్టు 1: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ అపహాస్యానికి గురవుతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ‘మీకోసం’ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి ఉన్నతాధికారులు సైతం గైర్హాజరవుతుండటంతో అర్జీలుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా కృష్ణా పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విజయవాడలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి, బందరు ఆర్డీవో సాయిబాబులు ‘మీకోసం’కు హాజరై ప్రజల నుండి వచ్చే అర్జీలను స్వీకరిస్తున్నారు. అయితే ఈ సోమవారం వీరు ఇరువురూ ‘మీకోసం’కు రాకపోవటంతో అర్జీలు తీసుకునే నాధుడే కరువయ్యారు. ఉదయం 11.30ని.లకు ప్రారంభం కావల్సిన ‘మీకోసం’కు ఇరువురు అధికారులు రాకపోవటంతో మిగిలిన అధికారులు సమావేశ మందిరంలో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ గడిపారు. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన అర్జీదారులు మాత్రం మీటింగ్ హాలు గేట్ వద్ద పడిగాపులు పడ్డారు. కూలీ నాలీ పోగొట్టుకుని తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళేందుకు సుదూర ప్రాంతాల నుండి అష్టకష్టాలు పడి వచ్చిన అర్జీదారులకు మొండి చెయ్యే ఎదురైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారుల కోసం వేచి చూసిన అర్జీదారులు విసుగు చెంది చేసేది లేక వెనుతిరగాల్సి వచ్చింది. అర్జీదారులు వెళ్ళిపోయిన మరుక్షణం ‘మీకోసం’కు వచ్చిన వివిధ శాఖల అధికారులు ఉన్నతాధికారులు రాకుండానే అక్కడి నుండి వెళ్ళిపోవడం గమనార్హం.