S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జెఎన్‌టియుకె రిజిస్ట్రార్‌గా సాయిబాబు

కాకినాడ, జూలై 30: కాకినాడ జెఎన్‌టియు రిజిస్ట్రార్‌గా ఆచార్య సిహెచ్ సాయిబాబు నియమితులయ్యారు. వర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఎస్‌సిడి)గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబుకు రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన ఆచార్య జివిఆర్ ప్రసాదరాజును ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్‌డి)గా నియమించారు. గతంలో వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా పనిచేసిన సాయిబాబు గత రెండేళ్ళుగా ఎపి ఎంసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య సాయిబాబు మాట్లాడుతూ తనపై విశ్వాసం, నమ్మకంతో కీలకమైన రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సలర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్సిటీలో ఏ విధమైన సమస్య వచ్చినా దాని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ వర్గాల సహాయ సహకారాలతో వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిబాబాను వర్సిటీకి చెందిన అధికారులు, ఉద్యోగులు అభినందించారు.

60 అడుగుల లిఫ్ట్ ఎక్కిన చింతమనేని
పెదవేగి, జూలై 30: సంచలనాలకు మారుపేరుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శనివారం సాహసోపేత విన్యాసాలు చేసి అందరిలో ఉత్కంఠ రేపారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామం వద్ద గుండేరు వాగు నుంచి పలు గ్రామాలకు పోలవరం కుడికాలువ నుండి సేద్యపునీరు, తాగునీరు మళ్లించే కార్యక్రమానికి శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా చింతమనేని గోదావరి జలాలకు పూజలు చేసి హఠాత్తుగా 60 అడుగుల ఎత్తులో వున్న లిఫ్ట్ పైకి ఎక్కి సంచలనం సృష్టించారు. నీటిని విడుదల చేసే మోటారు 60 అడుగుల పైభాగంలో ఉండడంతో దానిపైకి ఎక్కడానికి ఎటువంటి మెట్లు లేకపోయినా చింతమనేని ప్రాజెక్టు గట్టుకు ఉన్న ఐరన్ చువ్వలను పట్టుకుని పైకి ఎక్కడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో, పొరపాటున కాలుజారి కిందపడతారేమోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఏలూరు ఎంపి మాగంటి బాబు కూడా సంచలనం ఎందుకు? కింద నుండి నీటిని విడుదల చేద్దాం.. అంటున్నా చింతమనేని లెక్కచేయకుండా రెట్టింపు ఉత్సాహంతో 60 అడుగుల ఎత్తుకు క్షణాల్లో ఎగబాకి రైతుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించారు. అభిమానుల కేరింతల మధ్య ప్రభాకర్ నీటిని విడుదల చేసి కిందకు దిగారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడడానికి తాను ఏడాది నుండి ఎంతో కష్టపడ్డానని, ఆ కష్ట్ఫలితంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువకు నీటిని విడుదల చేశామని, ఆ నీరంతా మెట్ట ప్రాంతంలోని ప్రతీ పల్లెలో పరుగులు తీయించినప్పుడే తాను ఆనందిస్తానని చింతమనేని చెప్పారు. ఇన్నాళ్లు కేవలం భూగర్భజలాలపై ఆధారపడి సేద్యం చేసే రైతులు నేడు డెల్టా ప్రాంత రైతులతో సమానంగా సుస్థిర సేద్యం చేసే స్థాయికి ఎదిగారన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి డెల్టాతో రైతులు సేద్యంలో పోటీపడేలా తీర్చిదిద్దుతానని, అప్పుడే తాను నిజమైన ఆనందం పొందుతానన్నారు.
మరో కాటన్ చంద్రబాబు
పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా కృష్ణా డెల్టాతోపాటు రాయలసీమ రైతాంగాన్ని కూడా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో మరో కాటన్‌గా నిలుస్తారని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో శనివారం పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గుండేరు దిగువ కాలువకు ఎంపి మాగంటి బాబుతో కలిసి ఆయన సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గుండేరు ఎస్కేప్ నుంచి దెందులూరు మండలంలోని 3426 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి శ్రీనివాసయాదవ్, ఎంపిపి బక్కయ్య, జడ్పీటిసి సక్కుకుమారి, గ్రామ సర్పంచ్ అరుణ, ఎంపిటిసి బుల్లెమ్మ, సొసైటీ ఛైర్మన్ వెంకట్రావు, నీటి సంఘం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గోపాలపురం మండలంలో భారీ వర్షం
గోపాలపురం, జూలై 30: గోపాలపురం మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. సాయంత్రం 3 గంటల నుండి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోపాలపురం మార్కెట్ వద్ద చిట్యాల రహదారి పూర్తిగాజలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగన్నాథపురం నుండి గుడ్డిగూడె, భీమోలు మీదుగా గజ్జరం వెళ్లే రహదారి గోతులమయం కావడంతో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

చోరుల ముఠా అరెస్టు
భారీగా బైక్‌లు స్వాధీనం
దేవరపల్లి, జూలై 30: దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, పలు చోరీల కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంతోబాటు తొమ్మిది మోటారు సైకిళ్లు, కంప్యూటర్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు శనివారం తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గౌరీపట్నం ఆంధ్రాబ్యాంకు సమీపంలో గల ఒక కిళ్లీ షాపులో షట్టర్‌ను తొలగించి కంప్యూటర్, ప్రింటర్‌ను యర్రంపేట గ్రామానికి చెందిన చండ్ర వెంకటేష్ అపహరించాడు. అతనికి మాదేటి పవన్‌కుమార్ సహకరించాడు. తనిఖీల్లో భాగంగా కొవ్వూరు సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ సిహెచ్ ఆంజనేయులు ఈ నెల 29న చండ్ర వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా వెంకటేష్ దొంగిలించిన తొమ్మిది మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన మారిశెట్టి సురేష్ నుండి 3 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ తెలిపారు. తొమ్మిది మోటారు సైకిళ్లలో దేవరపల్లి స్టేషన్‌కు సంబంధించి 6, తాళ్లపూడి 1, కామవరపుకోట 1, టి నర్సాపురం 1 కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితులు కనుమూరి రామరాజు, పి శంకర్, మల్లిపూడి మురళి, ఎం సోమరాజులను అరెస్టు చేసినట్టు డిఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కొవ్వూరు రూరల్ సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ ఆంజనేయులుకు రివార్డుకోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
దేవరపల్లి, జూలై 30: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపి మురళీమోహన్ పిలుపునిచ్చారు. దేవరపల్లి మండలం గాంధీనగరంలో శనివారం వనం - మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అంతకుముందు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో, గ్రామంలోను మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపిపి శ్రీకాకుళపు వెంకట నరసింహారావు, ఎఎంసి ఛైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, మాజీ ఎంపిపి గెడా మురళీ అజిత్‌కుమార్, టిడిపి నాయకులు ముళ్లపూడి దొరాజీ చౌదరి, ఇమ్మణ్ణి సూర్యనారాయణ, ఆచంట గోపాలకృష్ణ, ఎంపిడిఒ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయురాలు బసవ లింగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.