S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి నిఘా!

కడప,ఆగస్టు 1: జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఏసిబి అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన దరిమిలా సోమవారం నుంచి ఏసిబి అధికారులు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిఘా వుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పొలాలు, స్థలాలు, రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే రిజిస్టర్ కార్యాలయం అధికారులు రెవెన్యూ కార్యాలయాలకు సమాచారం అందించిన తర్వాత సంబంధిత హక్కుదారునికి రెవెన్యూ అధికారుల్లో మిటేషన్ చేయాల్సివుంది. ఈ మిటేషన్ కోసం రిజిస్టర్ కార్యాలయాల చుట్టు రైతులు, వ్యాపారులు, రియల్డర్లు తాకిడి ఎక్కువకావడంతో భూముల విలువలు లేకపోయినా పలు రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రజలను ముక్కుపిండి భారీ ఎత్తున వసూలు చేస్తున్నారు. పలు రిజిస్టర్ కార్యాలయాల్లో కొంతమంది డాక్యుమెంటరీ రైటర్లు ఈ లావాదేవీలు జరిపి మధ్యవర్తులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దళారులు కూడా రిజిస్టర్ కార్యాలయ అధికారులను, సిబ్బందిని నియామకం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై ఏసిబి అధికారులకు ఫిర్యాదులు అందడం, ఏసిబి అధికారులు వారి జాబితాను తయారుచేసి దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా విజిలెన్స్‌శాఖకు అప్పగించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయాల్లో కూడా కొంతమంది గ్రామవిస్తరణాధికారి మొదలుకుని తహశీల్దార్ వరకు చేతులు తడిపితే తప్ప వన్‌బి అడంగల్, సన్న, చిన్నకారు రైతుల ధృవీకరణ పత్రాలు, పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులు సరిదిద్దడం వంటి వాటికి కూడా వేలాది రూపాయలు దండుకుంటున్నారని బహాటంగా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ పక్క రెవెన్యూ, మరో పక్క సబ్ రిజిస్టార్ కార్యాలయల్లో అధికారులు, సిబ్బంది ప్రజలను జలగల్లాగా పట్టిపీడిస్తుండటంతో ఏసిబి అధికారులు వలపనే్నందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత సంబంధితశాఖల అధికారులు, శాఖలో పనిచేసే సిబ్బంది ఆస్తుల వివరాలు సేకరించి ఏకకాలంలో దాడులు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది.

గాలిలో దీపం.. మాతా శిశు సంరక్షణ?

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 1: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం సురక్షితమని, పేదలకు ఆసరాగా నిలుస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నినాదాలు చేస్తున్నాయే తప్ప ఆచరణలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మాత శిశువులను కాపాడేందుకు కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు సురక్షితమనే నినాదం తప్ప కాన్పుల వ్యవహారంలో ప్రభుత్వాసుపత్రులకే పురిటినొప్పులుగా మారాయి. రాష్టవ్య్రాప్తంగా ప్రతి లక్ష ప్రసవాల్లో వందమంది పైబడి గర్భవతులు, ప్రతి వెయ్యిమంది శిశువుల జననాల్లో 40 మంది మృత్యువాతకు గురౌతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా 800 మంది పసిపిల్లలు, 50మంది పైబడి గర్భవతులు మృతి చెందుతున్నారు. జాతీయ ఆరోగ్య కమిషన్ ద్వారా తల్లిబిడ్డను సంరక్షించేందుకు కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈనేపధ్యంలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది వెళ్లి గర్భవతుల పేర్లు నమోదు, ప్రసవం ముందు ఆరోగ్య తనిఖీలు, గర్భవతులకు పౌష్టికాహారం, హైరిస్క్ ఉన్న గర్భవతులకు తగిన వైద్యసేవలు, పుట్టిన ప్రతి బిడ్డకు పాలు పట్టడం తదితర చర్యలను తీసుకోవాల్సి వుంది. అధికారులు ఈ వ్యవహారంలో కాకిలెక్కలు చెబుతున్నారు తప్ప వాస్తవంగా అంతకుమించే మృత్యువాతకు గురౌతున్నారు. అధికారులకు అందిన సమాచార మేరకు జిల్లాలో ఏటా 60వేల కాన్పులు జరుగుతుండగా 2వేల మంది పైబడి శిశువులు, 100 మంది పైబడి మాతలు మరణిస్తున్నారు. ప్రభుత్వం వీరి సంరక్షణ నిమిత్తం 14 పోషణ కేంద్రాలు, 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు 34, గర్భవతులు, శిశువుల అత్యవసర చికిత్సలకు 6 సీమాగ్ ఆసుపత్రులు, వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో 24 గంటలు పనిచేసే రాయచోటి, జమ్మలమడుగు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, కడప, ప్రొద్దుటూరు ప్రధాన ఆసుపత్రుల్లో ఉన్నా మరణాలు సంఖ్యతగ్గడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 75 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలున్నా వైద్యుల కొరత, సిబ్బంది కొరత వెంటాడుతోంది. సమయపాలన పాటించకపోవడంతోపాటు చాలా మంది మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తూ పలువురు ప్రైవేట్ ఆసుపత్రులు స్థాపించుకుని తమ ఆసుపత్రులకు రోగులను ఆకర్షించేందుకు ఆసుపత్రులకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఈ ఏడాది 3వేలలోపు ప్రసవాలు జరగాల్సివుండగా ఇప్పటి వరకు 50శాతం పైబడి జరగ లేదు. 50శాతం మందిలో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడం, మరికొంతమంది ఆర్థికస్తోమత లేక ఇళ్లవద్దనే కాన్పులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం, జిల్లా అధికారులు ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే సురక్షితమని ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలోప్రచారం లేని కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మారుమూల ప్రాంతాల ఆసుపత్రుల్లో మాతలు, శిశువుల మరణాలు అధికంగా ఉన్నాయి. అధికారుల కాకిలెక్కల ప్రకారం 2015-16లో వెయ్యిమంది పైబడి శిశువులు, 55 మంది మాతలు, 2016లో ఇప్పటి వరకు 300 మంది శిశువులు, 15 మంది గర్భవతులు మృత్యువాతపడినట్లు సమాచారం. వారిని సంరక్షించేందుకు రాష్ట్రీయ బాలసదన్, జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ తదితరాలను ఏర్పాటుచేసినా ఇంతవరకు ప్రభుత్వం లక్ష్యం నేరవేరకపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వవైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి మాతాశిశువులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సివుంది. అలాగే మేధావులు, ప్రజాప్రతినిధులు, యువకులు ,విద్యావంతులు, మాతాశిశుమరణాలు అరికట్టేందుకు సామాజిక బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 1: ఆగస్టు 15వ తేదీన నిర్వహించే 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్య్రవేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్యాతంత్య్రవేడుకలు యధావిధిగా స్థానిక పోలీసు పేరేడ్ మైదానంలో నిర్వహిస్తామన్నారు. మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ఇందుకు పోలీసుశాఖ, కడప మున్సిపల్ కార్పొరేషన్, రోడ్లు భవనాలుశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రముఖులు, ఆహుతులు ఆసీనులు అయ్యేందుకు అవసరమైన షామియాన, కుర్చీలు, సోఫాలు ఏర్పాటుకు కడప, సికెదినె్న తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జెండా వందన తదనంతరం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు దేశ భక్తి ఉట్టిపడేలా ఉండాలని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లావిద్యాశాఖాధికారి స్వయంగా పర్యవేక్షించాలన్నారు. డిఆర్‌డిఏ, డ్వామా, సర్వశిక్ష అభియాన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, హార్టికల్చర్, ట్రాన్స్‌కో, స్ర్తి శిశుసంక్షేమశాఖ, వ్యవసాయశాఖ, అటవీశాఖ, గృహనిర్మాణశాఖ, గ్రామీణ నీటి పారుదలశాఖ, జలవనరులశాఖ అధికారులు తమ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలపై ఆహుతులను ఆకట్టుకునే విధంగా శకటాలు ఏర్పాటుచేసి ప్రదర్శించాలన్నారు. అందుకు సంబంధించి నమూనాలను రూపొందించి కలెక్టర్ ఆమోదం తీసుకోవాలన్నారు. అలాగే అదేరోజు సాయంత్రం కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని డిఇఓను ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి శే్వత తెవతియ, డిఆర్వో సులోచన, ఆర్డీఓ చిన్నరాముడుతోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

నత్తనడకన ప్రజాసాధికార సర్వే

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 1: గత 20రోజులుగా జిల్లాలో ప్రజాసాధికార సర్వే చేపట్టిన పలువురు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సర్వే నత్తనడకలో జరగడం, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సోమవారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో నత్తనడకలో జరుగుతున్న సర్వేపై కలెక్టర్లను ప్రశ్నించడం కలెక్టర్ కెసి సత్యనారాయణ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా టీమ్‌లు ఏర్పాటుచేసి నాలుగుశాఖలకు చెందిన అధికారులను, సిబ్బందిని నియామకం చేశారు. జిల్లా వ్యాప్తంగా 28,85,000 జనాభా కలిగివుండగా ఈ 20రోజుల్లో కేవలం 3లక్షల 21వేల 474 మందిని సర్వేచేసి వారి వివరాలు ట్యాబ్‌లలో భద్రపరిచారు. ఈ సర్వేకు కేవలం ఒక నెల మాత్రమే గడువు ఉంది. ఆర్డీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వెలుగు, రెవెన్యూ, డిఆర్‌డిఏ తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది కావాల్సినంత మందిని నియామకం చేసినా సర్వేకు కొంతమంది అందుబాటులో ఉండటం, మరికొంతమంది అందుబాటులో లేకపోవడంతో సర్వే నత్తనడకలో జరుగుతోందనేది జగమెరిగిన సత్యం. రకరకాల వివరాలు సర్వేలో వెలుగుచూడటం, ఆ వివరాలు కనబరిస్తే తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు అందుతాయో లేదోనని చాలా మంది నోరుమెదపడం లేదు. ఉద్యోగస్తులు సైతం తప్పుడు సమాచారం అందివ్వడం, దారిద్య్రకు దిగువన ఉన్నట్లే కొంతమంది సమాచారం ఇస్తున్నారు. సొంత వాహనదారులు, ఆస్తిపాస్తులు అధికంగా ఉండేవారు వారి స్థిరచారస్తులపై కూడా ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందిస్తుండటంతో సిబ్బంది కూడా ఏమీ నోరుమెదపడం లేదు. ముఖ్యంగా ట్యాబ్‌లు, ఆన్‌లైన్, తదితర సాంకేతిక పరమైన సమస్యలు అధికంగా ఉత్పన్నం కావడంతో సర్వేలో పూర్తివివరాలు ఖచ్చితంగా డేటా నమోదు చేసుకోలేకపోతున్నారు. వివరాలు కూడా సంపూర్తిగా లభించడం లేదు. ఇక జిల్లాలో చంద్రన్న బీమా పథకం కింద లక్షా 8వేల 63 మంది బీమా కింద నమోదుకు అంగీకరించారు. మిగిలిన వారు బీమా కింద వర్తించే వారు ఉన్నా వారు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి ఆర్డీవోలు, జిల్లా ఉన్నతాధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పలు సంక్షేమకార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలులో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నా ఈసర్వే ముందంజలో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ అధికారులపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీ నేతలు సర్వే విజయవంతం చేయాలని మరీ ఫోజులు ఇచ్చి ఫోటోలు తీయించుకుని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి సర్వేకు సహకరించడం లేదనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు ఈసర్వేముందుకు సాగేందుకు సహకరిస్తూ, ప్రజలు కూడా సర్వే బృందం వాస్తవ వివరాలు తెలియజేస్తే సర్వే కూడా రాష్ట్రంలోనే గుర్తింపుతీసుకుని రాగలదు.

ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉద్యమాలు..

ఖాజీపేట,ఆగస్టు 1: కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించేవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని టిడిపి రాష్టక్రార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి హెచ్చరించారు. స్థానిక బస్టాండు కూడలిలో టిడిపి శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కేం ద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బిజెపిలు ఏపికి అన్యాయం చేశాయన్నారు. 16వేల కోట్లరూపాయలు లోటు బడ్జెట్ ఉన్నా ఆదుకుంటామని చెప్పి, ప్రధాని మోడీ, అరుణ్‌జైట్లీలు ఏపికి అన్యాయం చేస్తున్నారన్నారు. టిడిపి రాజ్యసభ సభ్యు లు తమ బాణిని విన్పిస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులాంటి నిధులు చెప్పి అన్నింటినీ తుంగలో తొక్కాయని విమర్శించారు. కెవిపి పెట్టిన బిల్లుకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారన్నారు. వైఎస్ జగన్ మాత్రం ప్రత్యేకహోదా అంటూకేంద్రంతో పోరాడకుండా రాష్ట్రంలో బంద్‌లు, రాస్తారోకోలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కెసి కాలువల ప్రాజెక్టు వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖరరెడ్డి, మైదుకూరు కెసి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ శ్రీరాములయాదవ్, రాష్టమ్రైనార్టీ నాయకులు సిద్దారం ఖదీరుల్లా, మండల టిడిపికార్యదర్శి ఓబయ్య, ముద్ర సలహామండలి చైర్మన్ పుల్లయ్య నాయు డు, మాజీ సర్పంచ్‌లు లక్ష్మిరెడ్డి, అంకిరెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లాకార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

పట్టా-డీకేటీ భూములకు ఒకే విలువ..

సంబేపల్లె, ఆగస్టు 1: హంద్రీనీవా శ్రీనివాసపురం రిజర్వాయర్ ప్రాజెక్టుల కాల్వలు తవ్వకాలలో భూములు కోల్పోయిన రైతుల పట్టా భూములకు, డీకేటీ పట్టా భూములకు రెండింటికీ సమాన మొత్తంలో నష్ట పరిహారం చెల్లించుచున్నట్లు వెలిగల్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, వీఆర్‌వోలు సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. హంద్రీనీవా, శ్రీనివాసపురం రిజర్వాయర్ ప్రాజెక్టు భూములు సంబంధించి రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె మండలాల్లో 1,100 ఎకరాల భూమి ఉందని ఇందులో 150 ఎకరాలు ప్రభుత్వ భూమి, 950 ఎకరాల డీకేటీ భూమి ఉందన్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద 225 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. అలాగే సంబేపల్లె మండలంలో 448 ఎకరాల డీకేటీ భూమి 500 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. జిల్లాలో పది ప్రాజెక్టులకు సంబంధించి 1.44 లక్షల ఎకరాల భూమిని గుర్తించామన్నారు. ఇందుకు గాను నష్టపరిహారం కింద ప్రభుత్వం రూ.10.321 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. సంబేపల్లె మండలంలో భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించి సంబంధిత గ్రామాల్లో వీఆర్‌వోలు పర్యటించి రైతులు కోల్పోయిన భూములకు సంబంధించిన నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రమ్మ, డిప్యూటీ తహశీల్దార్ ఉస్మాన్‌సాబ్, వీఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన సతీష్‌కుమార్‌రెడ్డి
పులివెందుల, ఆగస్టు 1: స్థానిక మార్కెట్‌యార్డులో సోమవారం శాసనమండలి ఉపాధ్యక్షుడు ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాను హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ చేయిచేరుూ కలిపి తమ వంతు బాధ్యతగా మొక్క లు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మెన్ తూగుట్ల రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

పాఠశాలల బంద్ విజయవంతం

కమలాపురం, ఆగస్టు 1: కమలాపురం మండలంలో సోమవారం ఏఐ ఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. అ సంఘాల నేతలు శివకుమార్, మహేశ్, సురేశ్, మల్లి, జనార్థన్, ఉదయ్ ఆధ్వర్యంలో విద్యార్థినేతలు పాఠశాలల వద్దకు వెళ్లి పాఠశాలలు మూయించి విద్యార్థులను బయటికి పంపి బంద్ చేపట్టారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ విద్యారంగాన్ని విచ్చిన్నం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులు తక్కువ ఉన్నారన్న సాకుతో హాస్టళ్లను మూసివేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారన్నారు. ఉపాధ్యా య, పోస్టులను భర్తీ చేయాలని, స్కూళ్లలో వౌలిక వసతులు కల్పించాలని, పెరిగిన ఫీజులకనుగుణంగా స్కాలర్‌షిప్‌లు పెంచాలని డిమాండ్ చేసారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి రెవిన్యూ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.

వైఎస్ మరణం రాష్ట్రానికి శాపం..

ప్రొద్దుటూరు, ఆగస్టు 1: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణం రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఆర్ అండ్‌బి అతిథిగృహం ఆవరణలో వైకాపా, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఈ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. హోదాను తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. టిడిపి కేంద్రమంత్రులు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసగించేలా ప్రయత్నాలు చేస్తున్నారని, వారు ఆడుతున్న డ్రామాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి హోదా, ప్రత్యేక ప్యాకేజీలు ఎంతో అవసరమని, వాటిని సకాలంలో తీసుకురాకుండా బిజెపి, టిడిపి పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్‌పార్టీ నిండా ముంచుతే ప్రస్తుతం సిఎం చంద్రబాబునాయుడు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తూ రాష్ట్రానికి శని లా దాపురించాడని ఆయన విమర్శించారు. ఉద్యమాల ద్వారా హోదాను సాధించలేరని చంద్రబాబు అనడం హాశ్యాస్పదంగా వుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు, మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడేందుకు, బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం ఉధ్యమాల ద్వారానే వచ్చాయనే విషయాన్ని చంద్రబాబు మరిచారా అని ప్రశ్నించారు. మాటకొస్తే 30 యాక్టు అమలులో పెడతారని, పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పెట్లో వుంచుకొని చంద్రబాబు అణచివేత చర్యలు చేపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హోదా తీసుకురావడానికి వైకాపా, మిత్రపక్షాల ఆద్వర్యంలో మంగళవారం జరిగే రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలతోపాటు విద్యాసంస్థలు, వ్యాపారవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. బంద్‌లో నాయకులు ఎటువంటి ఉద్రేకాలకు పోరాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎటువంటి నష్టం కలిగించరాదని, శాంతియుతంగా బంద్‌ను నిర్వహించాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే ద్విచక్ర వాహనం నడుపుతూ మైదుకూరు రోడ్డు, గాంధీరోడ్డు వరకు నడిపారు. కార్యక్రమంలో వైకాపా పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, సర్పంచ్ దేవీప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముగిసిన పాఠశాలల కమిటీ ఎన్నికలు

పెండ్లిమర్రి,ఆగస్టు 1: రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికోసం స్కూల్ కమిటీ ఎన్నికలు ప్రవేశపెట్టిందని ఎంఇఓ సుజాత పేర్కొన్నారు. అందులో భాగంగా మండల పరిధిలోని 76స్కూళ్లకుగాను 72స్కూళ్లకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన నాలుగు రేపల్లె, గంగనపల్లె హరిజనవాడ, పాతసంగటిపల్లె హరిజనవాడ, శ్రీనివాసపురం గ్రామాల్లోని స్కూళ్లలో ఎన్నికలు కొన్ని కారణాల వల్ల వాయిదాపడ్డాయని త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో అధికారపార్టీ నాయకులు సూచించిన వారికే చైర్మన్లు దక్కాయని విమర్శలున్నాయి. మండల పరిధిలోని హైస్కూల్స్‌లో చౌటపల్లె స్కూల్ చైర్మన్‌గా సుభాన్‌బాషా, ఎగువపల్లె చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి, ఇసుకపల్లె చైర్మన్‌గా రాజా, పెండ్లిమర్రికి ఈశ్వరమ్మ, గుర్రాచింతలపల్లెకు లక్ష్మీదేవమ్మ, ఎల్లటూరుకు సుబ్బమ్మ, గంగనపల్లెకు ఖాదర్‌బాషా, నందిమండలం సుధా వీరాంజనేయులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వీరితోపాటు మిగిలిన స్కూల్స్‌లో ఎన్నికైన చైర్మన్లకు సోమవారం ప్రమాణస్వీకారం చేయించి అనంతరం వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగిందని ఆమె పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు అయినా స్కూల్స్‌ను అభివృద్ధిబాటలో నడుపుతారని ఆమె ఆకాంక్షించారు.
చింతకొమ్మదినె్నలో...
చింతకొమ్మదినె్న: మండలపరిధిలోని ప్రభుత్వపాఠశాల కమిటీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. 56పాఠశాలల్లో ఏకగ్రీవంగా అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగిందని మండల విద్యాశాఖాధికారి హిదయతుల్లా పేర్కొన్నారు. తొమ్మిది పాఠశాలల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయని ఐదుపాఠశాలలు కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికలు ఆగిపోయాయని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సికెదినె్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఖాజీపేటలో...
ఖాజీపేట: మండలంలోని 78పాఠశాలలకు గాను 76 పాఠశాలలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు మండల విద్యాధికారి ప్రసాద్ తెలిపారు. ఆదర్శపాఠశాలలో ఉత్కంఠత రేపిన ఎన్నికలు రియాజ్ అహ్మద్ అధ్యక్షుడు, వెంకటరమణాదేవి ఉపాధ్యాక్షులుగా ఎట్టకేలకు ఎన్నికయ్యారు. బాలుర పాఠశాలో వెంకటరమణ, గౌసియాబేగం, బాలికల పాఠశాలలో లక్ష్మిదేవి, గంగావతిలో, ఉర్దూపాఠశాలలో అన్వనర్‌బాషా, బీబీలు , అప్పనపల్లె హైస్కూల్‌లో పుల్లమ్మ, దేవరాజు, కొత్తపేట హైస్కూల్‌లో కృష్ణదేవరాయలు, గుర్రమ్మ, కస్తూరిబా పాఠశాలలలో రమాదేవి, వెంకటసుబ్బమ్మలు ఎన్నికయ్యారు. ఎన్నికైన అధ్యక్షులు అందరూ తమ గెలుపుకోసం కృషి చేసిన తల్లిదండ్రులకు, పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సిద్దవటంలో...
సిద్దవటం: మండల పరిధిలోని 53 ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సిద్దవటం, టక్కోలు జెడ్పి ఉన్నతపాఠశాలలో ఫోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొత్తపల్లె జెడ్పి ఉన్నతపాఠశాలలో ఎంఇఓ పి.నారాయణ హాజరై ఎన్నికలు పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 46 ప్రాథమిక పాఠశాలలు, 4ప్రాథమికోన్నత పాఠశాలలు, 3 జెడ్పి ఉన్నతపాఠశాలలు ఎస్‌ఎంసి ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కో పాఠశాలలో చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోగా ప్రాథమికోన్నత పాఠశాలలో 21 మంది, జెడ్పిపాఠశాలలో 9 మందిని ఎన్నుకున్నామన్నారు. సిద్దవటం, టక్కోలు ఉన్నతపాఠశాలల్లో ఎన్నికకు తల్లిదండ్రులు తక్కువ సంఖ్యలో హాజరుకావడంతో ఫోరం లేక ఎన్నికలు వాయిదాపడ్డాయన్నారు. భాకరాపేట సమీపంలోని ఏపిఎస్‌పి 11వ బెటాలియన్‌లోని జెడ్పి ఉన్నతపాఠశాలలో నూతన కమిటీ మొదటి సమావేశం సోమవారం నిర్వహించగా కమిటీ చైర్మన్ షామీర్ పాఠశాలకు రూ.5వేలు వితరణ చేశారు. వైస్ చైర్మన్ కదీరున్నీసా రెండు ఇనుము డెస్కులు , సభ్యులు రూ.10,116లు వితరణ చేశారన్నారు.

పాఠశాల ఎన్నికల ఉత్కంఠకు తెర!

వీరబల్లి, ఆగస్టు 1: మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల ఎన్నికలు ఉత్కంఠతకు సోమవారం తెరపడింది. మండల వ్యాప్తంగా 76 పాఠశాలలకు గాను రెండు పాఠశాలలు మినహా మిగిలిన 74 పాఠశాలల్లో ఎన్నికలు విజయవంతమైనట్లు మండల విద్యాశాఖాధికారి గిరివరదయ్య తెలిపారు. మట్లి గ్రామ పంచాయతీలోని పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో యుద్ధ వాతావరణం నెలకొనగా స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ సహకారంతో ఎన్నికలు విజయవంతంగా ముగించినట్లు ఆయన తెలిపారు. వేల్పులమిట్టలోని ప్రాథమిక పాఠశాలలు, ఓటర్లు ఇరు పార్టీలకు సమానంగా రావడంతో ఛైర్మన్ పదవి మాకే కావాలి అంటూ ఇరుపార్టీలు పట్టుబట్టడంతో 2వ తేదీకి వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా సానిపాయిలోని లగిశెట్టివారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓటర్లు తక్కువగా పాల్గొనడంతో ఎన్నికను 4వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. వంగిమళ్ల పెద్దమాదిగపల్లె ప్రాథమిక పాఠశాలలో ఘర్షణ తలెత్తడంతో ఎస్‌ఐ చొరవ తీసుకొని ఎన్నికను సజావుగా జరిపించామని ఎంఈవో గిరివరదయ్య తెలిపారు.
కమలాపురంలో...
కమలాపురం: మండలంలో సోమవారం జరిగిన ఎస్‌ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పి వెంకటాపురం,యర్రగుడిపాడు పాఠశాలల్లో సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించడంతో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. పెద్దచెప్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ఎన్నికలను జిల్లా సర్వశిక్షాఅభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటసుబ్బయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులకు ఎన్నికల నిర్వహణపై తగు సూచనలు చేసారు. కాగా మండలంలోని 74 పాఠశాలలకు గాను 68పాఠశాలల్లో ఎన్నికలు జరుగగా, పాచికలపాడు, లేటపల్లె ( ఉర్దూ), పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతోను, లేటపల్లె తెలుగు, ఈడిగపల్లె,నడింపల్లె,కె అప్పాయపల్లె తెలుగు పాఠశాలల్లో కోరం లేకపోవడంతొ ఎన్నికలు వాయిదా వేసారు. స్థానిక గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. వీటన్నింటిలో కూడా బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎమీవో జాపర్‌సాదిక్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా ఎస్‌ఎంసి ఎన్నికలు కూడా చాలా చోట్ల అధికార తెలుగు దేశం, వైసిపి వర్గాలకు చెందిన నేతలు తమ పరువుగా భావించి అభ్యర్థులను గెలిపించుకున్నారు.

ఏడుగురిపై అదనపు వరకట్నం కేసు నమోదు
మైదుకూరు, ఆగస్టు 1: పట్టణంలోని వినాయకనగర్‌లో నివాసముంటున్న విజయ తన అత్తమామలు, భర్త, ఆడబిడ్డ, ఆడబిడ్డ భర్త అదనపు వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తూ ఆడపిల్ల పుట్టిందనే వివక్షతో మానసిక వేదనకు గురిచేస్తున్నారని మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏడుమందిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై చలపతి సోమవారం తెలిపారు. దువ్వూరుకు చెందిన పత్తి విజయను మైదుకూరుకు చెందిన పత్తి నరసింహులు, గోపాలమ్మల రెండవ కుమారుడు మనోహర్‌తో 2015 మే 29న పెద్దలు వివాహం జరిపించారు. కట్నకానుకల కింద ఐదులక్షలు విలువ చేసే బంగారు నగలతోపాటు రెండులక్షల నగదు, భర్తకు పెళ్లి కానుకల కింద బంగారు చైన్, ఉంగరంతోపాటు ప్రిజ్‌ను అందజేసినట్లు ఆమె తెలిపింది. వివాహమైన మూడునెలల నుంచే అత్తమామలైన నరసింహులు, గోపాలమ్మతోపాటు ఆడబిడ్డ భర్త దువ్వూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్, బావ సురేష్, అతని భార్య చెన్నమ్మ అదనపు కట్నంకోసం వేధించేవారని, వేధింపులు భరించలేక తాను పలుమార్లు పుట్టింటికి వెళ్లానని ఆమె తెలిపింది. పెద్దమనుషుల పంచాయతీ మేరకు తిరిగి తాను సంసారానికి వచ్చినప్పటికీ వారి వేధింపులు అధికమయ్యాయని ఆమె వాపోయింది. తాను నిండు గర్భవతిగా ఉన్నపుడు శ్రీమంతం చేయాలని, అత్తగారి ఇంటిలోని బంగారు నగలు ఇవ్వాలని అడగడంతో నా భర్త మనోహర్, వారి బావ ప్రసాద్ ప్రోత్సాహంతో తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని, అడ్డువచ్చిన తన తల్లిపై చేయి చేసుకున్నాడని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ తాము స్వయంగా జిల్లా కలెక్టర్‌కు విన్నవించామని, జూలై 28న జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యలు విన్నవించామని తెలిపారు. దీంతో మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి భర్త, మామ, అత్త, కానిస్టేబుల్ ప్రసాద్, ఆడబిడ్డలపై మైదుకూరు పోలీసులు కేసు నమోదుచేశారు.