S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేడు బంద్ హోదా సాధనే ధ్యేయం

విశాఖపట్నం, ఆగస్టు 1: ఎపికి ప్రత్యేక హోదా తక్షణమే ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సహా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు బంద్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రసంగం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించలేమన్న భావన కల్పించారని అధికార టిడిపితో సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో కేంద్రం బేషరతుగా ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశా రు. అయితే కేంద్రం మొండిగా ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాల్లేవం టూ ప్రకటించడాన్ని విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇప్పటికే వైకాపా, వామపక్షాలు బంద్‌కు మద్ద తు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. బంద్‌కు మద్దతుగా సోమవారం నగరంలో ర్యాలీలు నిర్వహించారు. ఇది లా ఉండగా విపక్షాలు ఇచ్చిన బంద్ కు అధికార టిడిపి, బిజెపిలు దూరం గా ఉన్నాయి. బిజెపి తీరును తప్పుపడుతున్నప్పటికీ రాష్ట్రం లో అధికార తెలుగుదేశం బంద్‌కు దూరంగా ఉన్నట్టు ప్రకటించింది. అయితే కేంద్రం వైఖరిపై తాము కూడా వేర్వేరు రూపాల్లో తమ నిరసన తెలుపుతామని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర బంద్ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాల, కళాశాలలకు సెలవు ప్రకటించాయి. విద్యార్థి సమాఖ్య బంద్ దృష్ట్యా ఇప్పటికే సోమవారం అన్ని ప్రైవేటు పాఠశాలలు మూతబడ్డాయి. తాజాగా రాష్ట్ర బంద్‌ను పురస్కరించుకుని మంగళవారం కూడా సెలవు ప్రకటించాయి. ఈ సెలవులను వచ్చే ఆదివారాల్లో పాఠశాలలు తెరవడం ద్వారా భర్తీ చేస్తామని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యా లు స్పష్టం చేశాయి. ఇక బంద్ దృష్ట్యా నగరంలో ఆర్టీసీ సర్వీసుల నిర్వహణపై అధికారులు స్పందిస్తూ పరిస్థితులను బట్టి బస్‌లు నడుపుతామని తెలిపారు. పోలీసులు భద్రత కల్పిస్తే సర్వీసులు నడిపేందుకు తమకు అభ్యంతరం లేదని, పరిస్థితులు విషమిస్తే సర్వీసులు నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.

గిరిజన భూ సమస్యలు పరిష్కరిస్తాం
* ఎమ్మెల్యే కిడారి
అనంతగిరి, ఆగస్టు 1: గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరిస్తామని అరకులోయ శాసనసభ్యు డు కిడారి సర్వేశ్వరరావు హామీ ఇచ్చా రు. అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ చిట్టంపల్లి, గుమ్మకోట, భీమవరం గ్రామాలలో ఆయన సోమవారం పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్న తీరును ఆయన పరిశీలించారు. తమ భూములను బడాబాబులు దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటున్నారని, తీవ్ర మంచినీటి ఎద్దడితో బాధపడుతున్నామని, రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీ సొమ్ము చెల్లించడం లేదని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చిట్టంపల్లి గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు వ్యసనాలకు బానిసై తమ భూములను బడాబాబులకు దారాదత్తం చేస్తుండడంతో భూమి యజమానులుగా ఉండేవారు కూలీలు గా మారుతున్నారని అన్నారు. అయితే గిరిజనుల భూములను అన్యాయంగా ఎవరైనా ఆక్రమించుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. గిరిజను లు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. గిరిజనులు ఎవరికైనా ఫించన్లు మంజూరు కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని సర్వేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కె.అప్పారావు, దేశం నాయకులు కొండమ్మ, ఎం. జోగులు, జన్ని అప్పారావు, దేముడు, దొన్ను, శివ, పుష్పానందం తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో వైద్యం అందక బాలింత మృతి
* వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆందోళన
నర్సీపట్నం(రూరల్), ఆగస్టు 1: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో బాలింత మృతి చెందడంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండ లం తూటిపాల గ్రామానికిచెందిన బాలేపల్లి రాజేశ్వరి(25) అనే గర్భిణిని ప్రసవం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి ఆదివారం రాత్రి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యులు సహజ ప్రసవం అవుతుందని భావించినప్పటికీ ప్రససం కాలేదు. దీంతో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హెచ్.వి. దొర సోమవారం ఉదయం 10 గంటల సమయంలో రాజేశ్వరికి శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రసవం అనంతరం రాజేశ్వరికి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ఏరియా ఆసుపత్రి వైద్యులు రాజేశ్వరిని అంబులెన్స్‌లో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉన్న రాజేశ్వరి మార్గ మధ్యలో మృతి చెందింది. దీంతో బంధువులు రాజేశ్వరి మృత దేహాన్ని ఆంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ బంధువులు వైద్యులతో ఘర్షణకు దిగారు. పరిస్థితి విషమించడంతో పట్టణ సిఐ ఆర్.వి. ఆర్.కె.చౌదరి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వైద్యులు, పోలీసులతో మృతిచెందిన రాజేశ్వరి కుటుంబీకులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజేశ్వరి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో శస్త్ర చికిత్స నిర్వహించిన సూపరింటెండెంట్ వివరణ ఇస్తూ శస్త్ర చికిత్స అనంతరం రాజేశ్వరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కె.జి.హెచ్.కు తరలించామన్నారు. ఇటువంటి పరిస్థితులు వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని తమ తప్పు ఏమీ లేదని వివరణ ఇచ్చారు. ఏమైనా అనుమానాలుంటే పోస్టుమార్టం ద్వారా అనుమానాలు నివృత్తి అవుతాయని ఆయన అన్నారు. దీంతో కుటుంబీకులు సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో రాజేశ్వరి మృత దేహాన్ని స్వగ్రామమైన తూటిపాలకు తీసుకువెళ్లారు. దీంతో ఏరియా ఆసుపత్రి పరిస్థితి సర్దుమణిగింది.

విద్యార్థి సంఘాల
బంద్ విజయవంతం
అనకాపల్లి(నెహ్రూచౌక్), ఆగస్టు 1: ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించేందుకు తీవ్రంగా కృషిచేస్తుందని ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప పాఠశాలలు, వసతిగృహాల్లోను కనీస వసతులు మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని నిరశిస్తూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం బంద్ నిర్వహించారు. పట్టణంలో ఉన్న విద్యాసంస్థలన్నీ బంద్‌కు సహకరించాయి. విద్యార్థులతో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్‌లో మానవహారం చేశారు. రాష్ట్ర విద్యార్థి సంఘాలు ఎఐఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌వో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బంద్‌నుద్దేశించి ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరు రవీంద్ర మాట్లాడుతూ నేడు పాఠశాలల్లో కనీస వౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెంచాలని, అలాగే శిథిలమైన వసతిగృహాలను తొలగించి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, పాఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, కార్పొరేట్ విద్యాసంస్థలు అవలంభిస్తున్న ఫీజు దోపిడీలను అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించని యెడల మరింత ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వై. అప్పలరాజు, పిడిఎస్‌వో నాయకులు ఎన్. శంకర్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు హరికృష్ణ, మొల్లి సాయి, దివ్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తెనుగుపూడిలో
ఇరు వర్గాల ఘర్షణ
* విద్యా కమిటీ ఎన్నికలో ఘటన
* పోలీసుల రంగప్రవేశంతో నిర్వహణ
* మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు
దేవరాపల్లి, ఆగస్టు 1: విద్యా కమిటీ ఎన్నికలు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మండలంలోని 61 పాఠశాలలో ఎన్నికలు సోమవారం విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అందులో తెనుగుపూడి హైస్కూల్ కమిటీ ఎన్నికలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉదృతమైంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల వారిని సముదాయించడంతో సాయంత్రం 5 గంటలకు ఎన్నిక జరిగింది.తామరబ్బ పాఠశాలలో స్వల్ప ఘర్షణకు దిగగా మిగతా పాఠశాలలో ఈ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. తెనుగుపూడిలో హైస్కూల్‌లో టిడిపి, వైయస్‌ఆర్ పార్టీల మధ్య స్వల్ప ఘర్షణకు దారితీసింది. స్థానిక ఎస్‌ఐ డి.ఈశ్వరరావు, ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాసరావు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియవలసిన ఎన్నిక సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఎంఈఓ సిహెచ్ రవీంద్రబాబు తన సిబ్బందితో నిబంధనలు ప్రకారం ఎన్నిక జరిపించారు. దీంతో వైయస్‌ఆర్ పార్టీకి చెందిన చామంతుల చిన్నను చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా కొట్యాడ రామలక్ష్మిని ఎన్నుకున్నారు. మండల కేంద్రమైన దేవరాపల్లి ఉన్నత పాఠశాలకు చైర్మన్‌గా టిడిపికి చెందిని శిరపరపు అచ్చింనాయుడు, వైస్ చైర్మన్‌గా దాసరి దేముడమ్మ ఎన్నికయ్యారు. బీతపూడి కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలకు మొట్టమొదటి సారిగా జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా దుక్క రమణమ్మ, వైస్ చైర్మన్‌గా సిమ్మ అప్పన్నను ఎన్నుకున్నారు. వీరిని ఎన్నుకున్న మరుక్షణంలో పాఠశాలకు టివి ఇస్తున్నట్లు ప్రకటించారు. డైరక్టర్‌గా ఎన్నికైన బి.దేముడమ్మ స్పోర్ట్స్ దుస్తులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో పాఠశాల విద్యార్ధినిలు అభినందనలు తెలిపారు. ముషిడిపల్లిలోని ప్రైమరీ పాఠశాలలో వైయస్‌ఆర్‌పార్టీకి చెందిన రావాడ అప్పలనాయుడు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఇనపచప్ప మణి ఎన్నికయ్యారు. అలాగే హైస్కూల్‌కి కూడా వైయస్‌ఆర్ పార్టీకి చెందిన చైర్మన్‌గా ఆదిరెడ్డి సత్యవతి, వైస్ చైర్మన్‌గా మట్టా దేముడు ఎన్నికయ్మాయరు. ఎం.అలమండలో హైస్కూల్ చైర్మన్‌గా కర్రి శ్రీను, వైస్ చైర్మన్‌గా రాజేశ్వరి ఎన్నికయ్యారు. గెలుపొందిన వారికి ప్రమాణస్వీకారం చేయించి అనంతరం పత్రాలను ఎంఈఓ సిహెచ్ రవీంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఈర్‌పిలు ఆదిరెడ్డి ఈశ్వరరావు, వివి రమణ తదితరులు పాల్గొన్నారు.

మలేరియా ఓకే... అతిసారతోనే సమస్య!
* మృతుల కుటుంబాలకు పరిహారం కష్టమే!
* ఆసుపత్రుల్లో మందుల కొరత వాస్తవం
* వారపు సంతల్లో నిల్వ మాంసాల విక్రయం నియంత్రణకు బృందాలు
* ఐటిడిఎ ఇన్‌చార్జి పిఒ శివశంకర్
పాడేరు, ఆగస్టు 1: విశాఖ మన్యం లో మలేరియా అదుపులోనే ఉన్నప్పటికీ అతిసార వ్యాధి అధికమైనట్టు పాడేరు ఐటిడిఎ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ చెప్పా రు. స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో లోపించిన పారిశుద్ధ్యం, నీటి వనరులు, నిల్వ మాంసాహారం వంటి కారణాల వలన ఇటీవల కాలంలో అతిసార వ్యాధి విజృంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏజెన్సీలో గత నెలలో అతిసార వ్యాధితో ఐదుగురు గిరిజను లు మృతి చెందారని, హుకుంపేట మండలంలో ముగ్గురు, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధితో మరణించారని ఆయన వివరించారు. అయితే అతిసారతో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాధితో మృతి చెందిన కుటుంబాలకు బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.అతిసార వ్యాధికి కారణవౌతున్న పారిశుద్ధ్యం లోపం, కలుషిత నీటి వనరులపై పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు దృష్టి సారించి ఈ సమస్యలను పరిష్కరించేందుకు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉందని ఆయన సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, నీటి వనరులు సురక్షితంగా ఉండేందుకు సర్పంచ్‌లు చొరవ తీసుకోవాలని, వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. వారపు సంతల్లో నిల్వ మాం సాలను విక్రయాన్ని నిరోధించేందుకు కమిటీలను నియమిస్తున్నట్టు ప్రాజెక్టు అధికారి తెలిపారు. అతిసార వ్యాధితో బాధపడుతూ ఆరోగ్య కేంద్రాలలో చేరుతున్న రోగులకు అవసరమైన మందులు లేనిపక్షంలో పక్కన ఉన్న ఆరోగ్య కేంద్రాల నుంచి సర్దుబాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏజెన్సీలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందు ల కొరత ఉన్న విషయం వాస్తవమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అంగీకరించారు. ఏజెన్సీ వ్యాప్తంగా గత నెల మూడో వారం నాటికి 2 వేల 862 మలేరియా కేసులు నమోదయ్యాయని, వీరంతా ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని ఆయన చెప్పారు. దోమల నివారణకు ఏజెన్సీలోని 2 వేల 475 గ్రామాలలో రెండో విడత స్ప్రేయింగ్ పనులు చేపడుతుండగా ఇంతవరకు 877 గ్రామాల్లో స్ప్రేయింగ్ పూర్తయినట్టు ఆయన చెప్పారు. ఈ నెలాఖరునాటికి అన్ని గ్రామాలలో స్ప్రేయింగ్ పనులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు.

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోత్వరలో సెక్యూరిటీ సెల్
పరవాడ, ఆగస్టు 1: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్యూర్టీ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ యోగానంద తెలిపారు. సోమవారం పరవాడ వద్ద గల జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల రాంకీ కమర్షియల్ హబ్‌లో ఆయన ఔషధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. నగర కమిషనర్‌గా బాధ్యతులను స్వీకరించిన తరువాత ఆయన తొలిసారిగా ఔషధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ భద్రతను దృష్టిలో పెట్టుకుని నగర కమిషనర్‌రేట్ పరిధిలో సెక్యూర్టీ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యల జటిలంగా మాఠినప్పుడు ఈ సెక్యూర్టీ సెల్ నుండి అన్ని పరిశ్రమలకు అలెర్ట్ మెసేజ్‌లు వస్తాయన్నారు. ఈ మెసేజ్‌లు అనుగుణంగా పారిశ్రామిక వేత్తలు ముందస్తు ప్రణాళికలను రూపొందించుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు సంబంధించి ఫార్మాసిటీలో ఎటువంటి సమస్య ఉన్న పోలీసులు సహాయ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. ఫార్మాసిటీలో గల పోలీస్ అవుట్ పోస్టును పూర్తి స్థాయిలో పని చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం రాంకీ సర్వీస్ ఏరియాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కమీషనర్ యోగానంద చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎసిపి రామ్మోహనరావు, రాంకీ సిఇవో లాల్‌కృష్ణ, బల్క్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎన్.నాగరాజు, ఔషధ కంపెనీల ప్రతినిధులు సిఎన్ రావు, బి.లక్ష్మణరావు, కిరణ్‌వర్మ, కృష్ణమూర్తి, బి.దేముడుబాబు, హర్షవర్థన్, రాంకీ ప్రతినిధులు ఎర్రయ్య, విజయ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆగిపోయిన మనోజ్ సినిమా షూటింగ్
పరవాడ, ఆగస్టు 1: ఎల్‌టిటిఇ ప్రధా న కథాంశంగా మంచు మనోజ్ కథానాయకుడుగా ముత్యాలమ్మపాలెం సము ద్ర తీరంలో గత 15 రోజుల నుండి జరుగుతున్న సినిమా షూటింగ్ సోమవారం నిలిచి పోయింది. నిర్మాతలకు, జూనియర్ ఆరిస్టులను సప్లయ్ చేసే ఏజెంట్లు మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఈ షూటింగ్ నిలిచి పోయింది. దీనిపై పరవాడ పోలీసులకు సోమవారం రాత్రి చిత్రం యూనిట్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ముత్యాలమ్మపాలెం జరుగుతున్న షూటింగ్‌కు విశాఖపట్నానికి చెందిన జూనియర్ ఆరిస్టుల ఏజెం ట్లు ఆరిస్టులను సప్లయ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా నిర్మాతలు ఏజెంట్లుకు కొంత సొమ్ము బకాయి పడ్డారని వారు చెబుతున్నారు. అయితే షూటింగ్ ఆల స్యం కావడం కారణంగా సొమ్ము చెల్లింపులో కాస్త ఆల్యసం అయిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ తరుణంలో గత నెల 26వ తేదీన చిత్రం నిర్మాతలపై జూనియర్ ఆరిస్టులు, ఏజెంట్లు విశాఖపట్నం దౌర్జ న్యం చేశారని చిత్రం యూ నిట్ల ప్రతినిధులు తెలిపారు. ఈ తరుణంలో సోమవారం చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. దీంతో ఏజెంట్లు ముత్యాలమ్మపాలెం చేరుకున్నారు. అనంతరం మనోజ్ ఏజెంట్లుతో మాట్లాడారు. అయితే జూనియర్ ఆరిస్టులు సరఫరా చేసే వారికి రిజిస్ట్రేషన్ లేదని యూనిట్ ప్రతినిధులు తెలిపారు. దీంట్లో భాగం గా సినీ రంగంలో అన్ని యూనియనులకు యూనిట్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు నిర్మాతలపై దురుసుగా ప్రవర్తించిన ఏజెంట్లు, జూనియర్ ఆరిస్టులపై కూడా ఫిర్యాదు చేసినట్లు యూనిట్ ప్రతినిధులు తెలిపారు. వీరి మధ్య జరుగుతున్న వివాదం పరవాడ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. దీనిపై పోలీసులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఏజెన్సీలో ప్రత్యేక డ్రైవ్
* సీజనల్ వ్యాధుల నియంత్రణకు మూడు నెలలపాటు నిర్వహణ
* మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు
* 2011 పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలి
* దోమల నివారణకు మలాథియాన్ పిచికారీ చేయాలి
* కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 1: జిల్లాలో ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మూడు మాసాలపాటు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం డయల్ యువర్ కలెక్టర్ అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ గత రెండు వారాల నుండి ఏజెన్సీ ప్రాంతం లో అతిసార ప్రబలుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు. 2011 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. దోమల బెడదను నివారించేందుకు, బ్రీడింగ్ స్టేజ్‌లోనే నాశనం చేసేందుకు మారుమూల గ్రామాల్లో సైతం ప్రణాళికబద్ధంగా మలాథియాన్ పిచికారి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల వారీగా వైద్య బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సరోజనిని ఆయన ఆదేశించారు. మందులు కొరత లేకుం డా ముందస్తుగానే అన్ని ఆరోగ్య కేంద్రా ల్లో తగినన్ని మందుల నిల్వలను ఉంచుకోవాలని సూచించారు. గ్రామా ల్లో ఎటువంటి పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా అన్ని వనరులను బ్లీచింగ్, క్లోరినేట్ చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అదికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఎండిపిడిఓలు, ఇఓఆర్‌డిలు విస్తృతంగా అన్ని గ్రామా ల్లో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఎటువంటి సీజనల్ వ్యాధుల సమస్య తలెత్తకుండా తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జివిఎంసి, పురపాలక సంస్థల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జెసి-2 డివి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.