S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు

నిజామాబాద్, ఆగస్టు 1: గడిచిన నాలుగు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు జిల్లాను తడిసిముద్దయ్యేలా చేస్తున్నాయి. వరుసగా మూడు రోజుల నుండి రాత్రి సమయాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎటు చూసినా లోతట్టు కాలనీల్లోని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పంట పొలాలు, మైదానాలన్నీ జలమయంగా మారి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల పుణ్యమా అని చాలావరకు చెరువులు, కుంటల్లోకి కొత్త నీటి చేరిక ప్రారంభం కావడంతో అవి జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల నివాస గృహాలు ధ్వంసమవగా, మరికొన్ని చోట్ల బి.టి రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రధానంగా మోర్తాడ్ మండలంలో మునుపెన్నడూ లేనివిధంగా 155మి.మీలకు పైగా భారీ వర్షం కురియడంతో నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జితో పాటు తారు రోడ్డు వర్షం ధాటికి కొట్టుకుపోయాయి. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో కంది మల్లయ్య అనే వ్యక్తికి చెందిన నివాస గృహం పూర్తిగా ధ్వంసమైంది. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ - బోధన్ మార్గంలో మాలపల్లి వద్ద ప్రధాన రహదారిపై మూడు అడుగుల ఎత్తుతో వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు ఒకింత అంతరాయం ఏర్పడింది. సరస్వతినగర్, కంఠేశ్వర్ కమాన్, మహ్మదీయ కాలనీ, హాష్మీకాలనీ ఖిల్లారోడ్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కెనాల్‌కట్ట, మాలపల్లి, అర్సపల్లి, అశోక్‌నగర్ తదితర స్లమ్ ఏరియాల్లో నివాస గృహాలను వరద జలాలు ముంచెత్తగా, గడిచిన మూడు రోజుల నుండి బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖిల్లా ప్రాంతంలోని రఘునాథ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు పనులు చేపడుతుండడంతో ప్రస్తుతం ఈ చెరువులో చేరాల్సిన నీరంతా దిగువన గల ఆనంద్‌నగర్ తదితర కాలనీల్లోని నివాస గృహాల్లోకి చొచ్చుకెళ్లి ఇళ్లను ముంచెత్తింది. కాగా, ఆదివారం రాత్రి నుండి సోమవారం తెల్లవారుజాము వరకు జిల్లాలో సగటున 49.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా మోర్తాడ్ మండలంలో 156.6మి.మీ వర్షం కురియగా, బాల్కొండలో 144మి.మీ, కమ్మర్‌పల్లిలో 136.6మి.మీల వర్షపాతం నమోదైంది. సిరికొండ మండలంలో 32.6మి.మీ, నవీపేటలో 53.0, నందిపేటలో 80.0, మాచారెడ్డిలో 60.4, జక్రాన్‌పల్లిలో 63.8, రెంజల్‌లో 74.2, దోమకొండలో 22.2, ఆర్మూర్‌లో 80.0, బిచ్కుందలో 21.6, వర్నిలో 41.8, నిజామాబాద్‌లో 72.0, వేల్పూర్‌లో 85.4, సదాశివనగర్‌లో 36.8,బోధన్‌లో 58.0, కోటగిరిలో 45.4, బీర్కూర్‌లో 35.4, దర్పల్లిలో 75.0, భీమ్‌గల్‌లో 60.2, మాక్లూర్‌లో 50.6, కామారెడ్డిలో 32.2, డిచ్‌పల్లిలో 76.8, బాన్సువాడలో 32.4, ఎడపల్లిలో 34.2, గాంధారిలో 15.2, మద్నూర్‌లో 20.8, లింగంపేటలో 14.2, తాడ్వాయిలో 30.0మి.మీ వర్షం కురిసింది.
ఈ భారీ వర్షాలతో ఒక్క తాడ్వాయి మండలం మినహా జిల్లాలోని మిగతా అన్ని మండలాలు సాధారణ వర్షపాతం జాబితాలో చేరాయి. పైపెచ్చు 17మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం విశేషం. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వాగులు, వంకలు జలకళను సంతరించుకుంటుండగా, ఎగువన మహారాష్టల్రోనూ వర్షాల తాకిడి కొనసాగుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి పెద్దఎత్తున వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. స్థానిక వర్షాలకు తోడు విష్ణుపురి ప్రాజెక్టు మిగులు జలాలు దిగువ గోదావరి ద్వారా పరుగులు తీస్తూ ఎస్సారెస్పీలోకి చేరుతుండడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి 50వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో, 1091.00 అడుగులు, 90టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీ రిజర్వాయర్‌లో సోమవారం సాయంత్రం నాటికి 1076.50 అడుగులు, 43.45టిఎంసిలకు నీటిమట్టం చేరుకుంది. ఇప్పటికే లక్ష్మి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తున్న ప్రాజెక్టు అధికారులు, మరో రెండు ప్రధాన కాల్వలైన కాకతీయ, సరస్వతితో పాటు వరద కాల్వ ద్వారా కూడా నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజాంసాగర్ మినహా కౌలాస్‌నాలా, సింగీతం తదితర జలాశయాల్లోనూ వరద నీటి చేరికతో నీటి నిల్వలను సంతరించుకుంటున్నాయి.

ఉపాధి కల్పనకే ఈత చెట్ల పెంపకం
అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి
డిచ్‌పల్లి రూరల్, ఆగస్టు 1: గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకే ప్రభుత్వం ఈత, ఖర్జూర చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టిందని అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి పేర్కొన్నారు. సోమవారం డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామ చెరువుగట్టుపై నాటిన ఈత, ఖర్జూర మొక్కలను కలెక్టర్ యోగితారాణాతో కలిసి పరిశీలించడంతో పాటు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాంతకుమారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో కంటే భిన్నంగా ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గీత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు చెరువుగట్లు, గీత కార్మికుల సొసైటీ భూముల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 6.70లక్షల ఈత, ఖర్జూర మొక్కలను నాటించడం జరిగిందన్నారు. అయితే నాటిన ప్రతి మొక్కను రక్షించుకునేందుకు గీత కార్మికులు పాటుపడాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ యోగితారాణా, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు కలెక్టర్‌తో పాటు జిల్లా ప్రజలను ఆమె అభినందించారు.

భక్తిశ్రద్ధలతో పుష్కర స్నానాలు
తడ్‌పాకల్ పుష్కర ఘాట్‌లో 200మంది పుష్కర స్నానాలు
మోర్తాడ్, ఆగస్టు 1: మోర్తాడ్ మండలంలోని తడ్‌పాకల్, దోంచంద, గుమ్మిర్యాల పుష్కర ఘాట్లలో సోమవారం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. తడ్‌పాకల్‌లో 200మంది భక్తులు పుణ్య స్నానాలు చేయగా, దోంచంద, గుమ్మిర్యాల ఘాట్లలో స్వల్ప సంఖ్యలోనే భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఇటు పెద్దవాగుతో పాటు తడ్‌పాకల్ గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గోదావరి నదిలో వరద ప్రవాహం నిండుగా కనిపిస్తోంది. వరద ఉద్ధృతికి 80మీటర్ల పొడవు ఉన్న ఘాట్ సగానికిపైగా నీట మునిగింది. నది మధ్యలో ఉన్న శివాలయం వరకు కూడా వరదనీరు వచ్చి చేరింది. దీంతో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులను నది లోపలికి వెళ్లనీయలేదు. పుష్కర ఘాట్ చివరి భాగం పూర్తిగా నీటిలో ముగిపోవడంతో భక్తులను మెట్ల వద్దనే స్నానాలు ఆచరించారు. పలువురు నదిలో దిగి పుణ్య స్నానాలు ఆచరించి, ఘాట్‌పై పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. మహిళలు పుష్కరఘాట్ మెట్లపైనే పసుపుతో గౌరీమాత విగ్రహాన్ని చేసి లక్ష వత్తుల నోము నిర్వహించుకున్నారు.
గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వత్తులను వెలిగించడమే కాకుండా దీపపు ప్రమిదలను గోదావరిలో వదిలారు. గోదావరిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో మత్స్య పారిశ్రామిక సంస్థ ఆధ్వర్యంలో ఐదుగురు గజ ఈతగాళ్లను నియమించారు. రెవెన్యూ అధికారులు కూడా విఆర్‌ఎలను పుష్కరఘాట్‌పైనే విధులు కేటాయించి, భక్తులకు చేయూతను అందిస్తున్నారు. పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు రామాలయంలోనూ, ఆంజనేయస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి, నది ఒడ్డునే వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.

అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ
బాల్కొండ, ఆగస్టు 1: ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శం, అభివృద్ధిలో దేశంలోనే ముందుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ పూల రవీందర్, టిఆర్‌ఎస్ నాయకుడు చింతల రాజేశ్వర్‌తో కలిసి ఆయన ఎస్సారెస్సీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిషన్ కాకతీయ పనులు చేపట్టడంతో వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురియడంతో రాష్ట్రంలోని చెరువులకు జలకళ సంతరించుకుందన్నారు. దీంతో తెలంగాణలోని రైతులంతా ఆనందంలో మునిపోయి, ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారని అన్నారు. హరితహారంలో నాటిన కోట్లాది మొక్కలతో రాష్ట్రంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, మొక్కలు నాటడం వల్ల వర్షాలు పడి ప్రాజెక్టులు నిండుతాయని, దీంతో నీటి కొరత ఉండదని అన్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులను ప్రాజెక్టులోని నీటి నిల్వలను, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఆయన అడిగిత తెలుసుకున్నారు.

సెకండ్ ఎఎన్‌ఎంల రాస్తారోకో
కంఠేశ్వర్, ఆగస్టు 1: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెకండ్ ఎఎన్‌ఎంలు సోమవారం నగరంలోని ధర్నాచౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో చేపట్టడంతో రోడ్డుకు మూడువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ, గత 15రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం సెకండ్ ఎఎన్‌ఎంలు సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గడిచిన దశాబ్దకాలంగా సెకండ్ ఎఎన్‌ఎంలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నందున వీరిని వెంటనే రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ఎఎన్‌ఎంలతో సమానంగా వేతనాలు అందించాలని, ప్రసూతి సెలవులు, అనారోగ్యంతో మృతి చెందితే 10లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. అదే విధంగా టిఎ, డిఎలను అందిస్తూ అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూర్చాలన్నారు. అంతకు ముందు డిఎంహెచ్‌ఓ వెంకట్ దీక్షా శిబిరానికి చేరుకుని, ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి సుముఖంగా ఉందని, సమ్మె విరమించాలని కోరినా సెకండ్ ఎఎన్‌ఎంలు ససేమీరా అన్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో చేసేదేమీలేక డిఎంహెచ్‌ఓ అక్కడి నుండి వెనుదిరి వెళ్లిపోయారు. ఈ రాస్తారోకోలో శ్రామిక శక్తి మహిళా నాయకులు నూర్జహాన్, సెకండ్ ఎఎన్‌ఎంలు శ్రీవాణి, రుక్మిణి, వనజ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాంసాగర్‌లోకి వరదనీరు
బాల్కొండ, ఆగస్టు 1: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైనా బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 70వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ఎఇ మహేందర్ తెలిపారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన మహా ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా 70వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో సోమవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1076.50అడుగులు 43.45టిఎంసిలకు చేరుకుందన్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 90టిఎంసిలు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1051.40అడుగులు.

కిసాన్‌నగర్‌లో కూలిన ఇల్లు
బాల్కొండ, ఆగస్టు 1: బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్ గ్రామంలోని దుబ్బ ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కంది మల్లయ్య అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలిపోయింది. రాత్రంతా ఏకధాటిగా వర్షం కురియడం వల్ల అర్ధరాత్రి సమయంలో ఇల్లుకూలిపోయిందని, ఎలాంటి ప్రాణనష్టం వాటిళ్లలేదని బాధితులు తెలిపారు. రోడ్డున పడిన తమ కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆదివారం రాత్రి నుండి సోమవారం తెల్లవారుజామున వరకు కురిసిన వర్షం కారణంగా మండల కేంద్రంలోని బాల్కొండలోని అప్తర్‌గల్లీ కాలనీలో గల ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ఏమి చేయాలో పాలుపోకా, కొందరు సజ్జలపై కూర్చోగా, మరికొంతమంది మంచాలపై కూర్చోని రాత్రి వెళ్లదీసుకున్నారు. రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని సావెల్, ఎల్కటూర్ వద్ద గల గుండెవాగు, సావెల్-కొడిచెర మధ్య గల ఒర్రెవాగులు పొంగిపొర్లడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రామడుగు ప్రాజెక్టులోకి వరదనీరు
డిచ్‌పల్లి: దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టులోకి సోమవారం తెల్లవారుజామున నుండి వరద ప్రవాహం ప్రారంభమైంది. నిన్నమొన్నటి వరకు చుక్కనీరు లేని రామడుగు ప్రాజెక్టులోకి సోమవారం నుండి వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదివారం రాత్రి నుండి సోమవారం తెల్లవారుజామున వరకు ఏకధాటిగా భారీ వర్షం కురియడంతో వరద జలాలు ప్రాజెక్టులోకి మళ్లుతున్నాయి. ముఖ్యంగా సిర్నాపల్లి ఊరచెరువు పూర్తిస్థాయిలో నిండటంతో ఆ చెరువు అలుగు నుండి లింగాపూర్ వాగు ద్వారా వరదనీరు రామడుగు ప్రాజెక్టులోకి చేరుతున్నాయ.