S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

సంగారెడ్డి, ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రణాళిక బద్దంగా చేపట్టిన మిషన్ భగీరత శాశ్వత తాగునీటి పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు మొదటి విడతలో మిషన్ భగీరత పథకం ద్వారా తాగునీటిని అందించనున్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై మిషన్ భగీరత పథకం పనులను పూర్తి చేసారు. గోదావరి జలాలను ఇక్కడి తరలించి మూడు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. మరో ఆరు నెలల్లో సింగూర్ ప్రాజెక్టుకు ఇరువైపుల కొనసాగుతున్న మిషన్ భగీరత పనులను పూర్తి చేసి మరికొన్ని నియోజకవర్గాలకు మంజీర నీటిని అందించనున్నారు. సింగూర్ వద్ద నిర్మిస్తున్న పథకం ద్వారా నిజమాబాద్ జిల్లాలోని 14 మండలాలకు నీటిని సరఫరా చేస్తామని మంత్రి హరీష్‌రావు గతంలో వెల్లడించారు. కాగా ఈ నెల 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోడి కోమటిబండకు రానుండటంతో ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ మొదలుకొని కోమటిబండ వరకు చేరుకునే రవాణా మార్గాన్ని కూడా మంత్రి పర్యవేక్షిస్తున్నారు. డిజిపి అనురాగ్ శర్మ కూడా శాంతిభద్రతలపై ఆదివారం నాడు కోమటిబండకు చేరుకుని పర్యవేక్షించారు. అదే విధంగా హెలిప్యాడ్‌ను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి సారిగా రాష్ట్రానికి ప్రధాని వస్తుండటంతో అధికార టిఆర్‌ఎస్ పార్టీకున్న ప్రజాబలాన్ని నిరూపించుకునే దిశలో టిఆర్‌ఎస్ నాయకులు కసరత్తు చేస్తున్నారు. సుమారు రెండు లక్షల మందిని తరలించి ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేసేలా చర్యలు చేపట్టారు. సోమవారం గజ్వేల్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ కార్యకర్తలతో మంత్రి హరీష్‌రావు సమావేశం నిర్వహించారు. భారీ సంఖ్యలో జనాలను తరలించడంలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కోమటిబండ వద్ద మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించడంతో పాటు మనోహరబాద్ రైల్వేలైను పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం గజ్వేల్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకుగాను వేధికను కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడంలో తెరాస నాయకులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా ప్రధాని రాష్ట్రానికి వస్తుండటంతో టిఆర్‌ఎస్ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లను పూర్తి చేయిస్తున్నారు. మిషన్ భగీరతలో మిగిలిన చిన్నా చితక పనులను అధికారులు యుద్ద ప్రాతిపధికన పూర్తి చేయిస్తున్నారు. మొత్తంమీద ప్రధాని పర్యటన విజయవంతంగా ముగిసేలా ఏర్పాట్లలో లోపాలు రాకుండా మంత్రి హరీష్‌రావు అన్నీతానై దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

వ్యాధుల బాధలు!

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఆగస్టు 1: పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రాణాంతకమైన డెంగీ, అతిసార లాంటి వ్యాధుల ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవలే జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలాజీ అనే ఓ వ్యక్తి డెంగ్యూ వ్యాధితో మృత్యువాతపడినా అధికార యంత్రాంగంలో చలనం లేదు. పిల్లలు, పెద్దలు, వృద్దులు అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు రోగాల భారీన పడుతూ ఆసుపత్రులకు పరుగెత్తుతున్నారు. కౌడిపల్లి మండలం బండపోతుగల్‌లో కలుషితమైన నీటిని సేవించడం వల్ల అతిసారం వ్యాధి భారీన పడిన విషయం తెలిసిందే. వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్య సమస్య తిష్టవేసింది. దీంతో ఈగలు, దోమలు వృద్ది చెంది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. దోమ కాటు వల్ల మలేరియా, టైపాయిడ్ జబ్బులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు జలుబు సోకి నిమోనియా వ్యాధిగా మారుతోంది. ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉన్న గ్రామ పంచాయతీలను వదిలిపెడితే మున్సిపల్ పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం సమస్యను అరికట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. పందులు, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పందుల వల్ల మెదడువాపు, కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధులు సోకుతాయని తెలిసినా అధికారులు వాటిని నివారించడంలో ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. వాతావరణ మార్పులు, వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే దృష్ట్యా తాగే నీటిని కాచి చల్లార్చి వడకట్టి సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులన్ని రోగులతో క్రిక్కిరిసిపోతున్నాయి. దోమలను నివారించేందుకు కనీసం పాగింగ్ కూడా చేయడం లేదంటూ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ పట్టణ వాసులు వాపోతున్నారు. పారిశుద్ధ్యం మెరుగులో మొదటి స్థానంలో ఉందన్న సిద్దిపేట ప్రజలు కూడా రోగాల భారీన పడుతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగైదు డెంగ్యూ కేసులు మాత్రమే నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్‌సింగ్ పేర్కొన్నారు. కాగా అనధికారికంగా డెంగ్యూ కేసులు ఎక్కువగానే ఉంటాయని ప్రైవేట్ వైద్యులు పేర్కొంటున్నారు. జహీరాబాద్, సదాశివపేట, మెదక్, జోగిపేట, గజ్వేల్, దుబ్బాక పట్టణాలతో పాటు నారాయణఖేడ్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, పెద్దశంకరంపేట పట్టణాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వర్షాలు మరిన్ని కురిసే అవకాశం ఉండటంతో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబల వచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి పారిశుద్ధ్య సమస్యను తొలగించి పందులు, కుక్కలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.