S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెరాసలో భగ్గుమన్న విభేదాలు

నిజామాబాద్, ఆగస్టు 2: అధికార తెరాస పార్టీలో వర్గ విభేదాలు ఒక్కోటిగా బహిర్గతమవుతున్నాయి. ముఖ్య నేతలు వర్గాలుగా విడిపోయి అంతర్గత విభేదాలను రచ్చకీడుస్తుండడం పార్టీ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోంది. జిల్లా అంతటా ఈ విభేదాల పర్వం నెలకొని ఉన్నప్పటికీ, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో మాత్రం తెరాస నేతల విభేదాలు మరింత వేడిని రగిలిస్తున్నాయి. అసంతృప్త వర్గానికి చెందిన వారు ఏకంగా పత్రికలకెక్కుతూ తమ ప్రత్యర్థి వర్గం నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురి కావాల్సి వస్తోంది. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌కు సంబంధించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు, ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డికి మధ్య నెలకొని ఉన్న విభేదాలు కాస్తా ఘర్షణ స్థాయి వరకు చేరుకుని పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైన విషయం విదితమే. తాజాగా నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్‌లోనూ ఈ తరహా విభేదాలు వెలుగు చూడడం చర్చనీయాంశమవుతోంది. తెరాస ఆవిర్భావం నుండి ఆ పార్టీని అంటిపెట్టుకుని అంకితభావంతో పని చేస్తున్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఎఎస్.పోశెట్టి మంగళవారం పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ సొంత పార్టీకి చెందిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాతలపై విరుచుకుపడ్డారు. హరితహారం కార్యక్రమాన్ని తనకు అనుకూలంగా మల్చుకుని ఎమ్మెల్యే బిగాలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అర్బన్ సెగ్మెంట్‌లో విజయవంతం చేసేందుకు కృషి చేయకుండా, అభివృద్ధి పనుల ముసుగులో వాటాలను పంచుకోవడానికే పరిమితం అవుతున్నారంటూ బాహాటంగా ఆక్షేపించారు. హరితహారం అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉంటే, అర్బన్ సెగ్మెంట్ మాత్రం ఆఖరు స్థానంలో నిలుస్తోందని ఎద్దేవా చేశారు. ఫొటోలకు ఫోజులివ్వడం మానుకుని ప్రజోపయోగ కార్యక్రమమైన హరితహారంపై దృష్టిపెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే, మేయర్‌లకు పత్రికాముఖంగా హితవు పలికారు. ప్రజా సంక్షేమానికి పాటుపడకపోతే ప్రజల నుండి తిరుగుబాటును చవిచూడక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న సీనియర్ నాయకుడైన పోశెట్టి, సొంత పార్టీకి చెందిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తీరును తూరారబట్టడం తెరాస వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. రూరల్ సెగ్మెంట్ నేతల నడుమ నెలకొన్న విభేదాలు తెరపైకి వచ్చి తీవ్ర దూమారం రేపగా, తాజాగా అర్బన్ నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి తెరపైకి రావడంతో తెరాస కార్యకర్తలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎఎస్.పోశెట్టి గత చాలాకాలం నుండే అర్బన్ ఎమ్మెల్యే వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కావడానికి ముందు నుండే ఎఎస్.పోశెట్టి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవిని ఆశిస్తూ తనవంతు ప్రయత్నాలు సాగించారు. అయితే చైర్మెన్ పదవి కావాలంటే 50లక్షల రూపాయలు అందించాలంటూ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేత ఆయనను డిమాండ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తాను ఇప్పటికే పార్టీ నిర్వహణ కోసం చాలా వరకు డబ్బులు ఖర్చు చేశానని, మార్కెట్ కమిటీ పదవి కోసం అంతమొత్తంలో తాను ఇచ్చుకోలేనని పోశెట్టి తెలియజేస్తూ పక్కకు తప్పుకున్నారు. ఆయన బి.సి సామాజిక వర్గానికి(లింగాయత్)కు చెందిన వారు కాగా, అదే సామాజిక వర్గంలోని మహిళకు మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవిని తదనంతరం రిజర్వ్ చేశారు. ఈ పరిణామం తరువాత నియోజకవర్గ స్థాయి నేతకు, ఎఎస్.పోశెట్టికి మధ్య మరింత అగాథం ఏర్పడినట్లయ్యింది. ఫలితంగా ఆయన ఏకంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ సొంత పార్టీ ఎమ్మెల్యేపై విమర్శనాస్త్రాలు సంధించినట్టు తెరాస వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా నేతల నడుమ నెలకొన్న విభేదాలు రచ్చకెక్కుతున్న విషయమై అధిష్ఠానం తక్షణమే దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు కోరుతున్నాయ.